‘నాకు పెళ్లయి 45 ఏళ్లయింది, నాకెప్పుడూ కోపం రాలేదు’ - రాజ్యసభలో నవ్వులు పూయించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

ఫొటో సోర్స్, Sansad TV
మణిపుర్ హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రోజూ అట్టుడుకుతున్నాయి.
విపక్షాలు ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటుకు వచ్చి సమాధానమివ్వాలని, రూల్ 267 కింద చర్చ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇంత వాడివేడిగా జరుగుతున్నసమావేశాల్లో, గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నవ్వులు పూయించారు.
‘‘సభలో రూల్ 267కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరగాలి’’ అని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘‘ఎందుకు దీన్ని మీరు ‘ప్రెస్టీజ్’ విషయంగా తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. దీన్ని అంగీకరించేందుకు ఒక కారణం ఉండాలని నిన్న మీరే అన్నారు. నిన్న కూడా మిమ్మల్ని నేను అభ్యర్థించాను. కానీ, మీరు కోపగించుకున్నారు’’ అని రాజ్యసభ చైర్మన్‌తో ఖర్గే అన్నారు.
ఖర్గే మాటలను విన్న తర్వాత ధన్కర్ వెంటనే నవ్వుతూ, ‘‘సర్, నాకు పెళ్లయి 45 ఏళ్లు అయింది. నాకెప్పుడూ కోపం రాలేదు. నన్ను నమ్మండి, నాకెప్పుడూ కోపం రాదు’’ అంటూ సభలో నవ్వులు పూయించారు.
‘‘చిదంబరం ఇక్కడే కూర్చుని ఉన్నారు. మాకు కోపం రాదని న్యాయవాదిగా ఆయనకు బాగా తెలుసు. నాకు కోపం రాదు, మీ మాటలను కొంచెం మార్చి అనండి, సర్’’ అంటూ ధన్కర్ స్పందించారు.
ధన్కర్ ఈ మాటలన్నప్పుడు, ఖర్గే కూడా నవ్వారు.
‘‘మీకు కోపం రాదు. మీరు చూపించరు. కానీ, లోపల లోపల మీరు కోపం తెచ్చుకుంటారు’’ అని ఖర్గే బదులిచ్చారు.
రూల్ 267 కింద చర్చకు విపక్షాల డిమాండ్
మణిపుర్ అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలంటూ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష పార్టీలు కోరుతున్నాయి.
ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని కూడా పట్టుబడుతున్నాయి.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఇచ్చాయి విపక్షాలు.
ఆగస్టు 8, 9వ తేదీల్లో ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.
ఈ చర్చ తర్వాత ఆగస్ట్ 10న ప్రధానమంత్రి సమాధానమివ్వనున్నారు.
ఆగస్ట్ 11న వర్షాకాల సమావేశాలు ముగిసి, సభలు నిరవధిక వాయిదా పడనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్ ఘటనపై అంతటా ఆగ్రహావేశాలు
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో వైరల్ అయిన తర్వాత ఇక్కడి మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణపై అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యాంశాల్లో నిలిచింది.
ఈ ఘటనపై భారత్ ఇంటా బయటా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు, మణిపుర్ ఘటనను ప్రస్తావిస్తూ తన హృదయం బాధతో నిండిపోయిందని ప్రధాని మోదీ చెప్పారు. ఇలాంటి చర్యలతో దేశాన్ని అవమానిస్తున్నారని, దోషులను వదిలిపెట్టబోమని తెలిపారు.
మణిపుర్ హింసపై ప్రధాని మోదీ మాట్లాడటం అదే తొలిసారి.
మణిపుర్ ఘటనపై మోదీ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాతే సభలో చర్చ చేపట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విపక్షాలు మణిపుర్ సంఘటనను రూల్ 267 కింద చర్చ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం రూల్ 176 కింద చర్చకు సిద్ధమంటూ చెబుతోంది.
రూల్ 267, రూల్ 176 అనేవి రాజ్యసభలో నిర్దిష్టమైన విధివిధానాలు. రూల్ 267 పరిధి విస్తృతమైనది.
ముఖ్యమైన అంశాలపై చర్చను, డిబేట్‌ను చేపట్టేందుకు ఎంపీలకు అనుమతిచ్చేందుకు ఈ రూల్స్ వీలు కల్పిస్తాయి.
రూల్ 267, రూల్ 176 అంటే ఏమిటి?
రూల్ 267 కింద, ఆ రోజు లిస్ట్ అయిన ఏ అంశానికి సంబంధించిన రూల్‌నైనా తాత్కాలికంగా సస్పెండ్ చేసి, అత్యవసర అంశంపై చర్చ చేపట్టాలని సభలోని ఏ ఎంపీ అయినా చైర్మన్‌ను కోరవచ్చు. చైర్మన్ దీనికి అంగీకరిస్తే చర్చ జరుగుతుంది.
అయితే, ఉదయం 10 గంటల కంటే ముందే రూల్ 267 కింద నోటీసు ఇవ్వాలి.
176 కింద నోటీసు కింద తక్షణమే ప్రజా ప్రాధాన్యానికి సంబంధించిన ఏ అంశంపైనైనా చర్చించాలని కోరుతూ సభలోని ఏ సభ్యుడైనా/సభ్యురాలైనా సెక్రటరీ జనరల్‌కు రాతపూర్వకంగా నోటీసు ఇవ్వవచ్చు.
తక్కువ వ్యవధిపాటు చర్చించేందుకు ఈ రూల్ అనుమతిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- జార్ఖండ్: తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 10 మంది దోషులకు పదేళ్ల జైలు శిక్ష
- హరియాణా ఘర్షణలు: మేవాత్‌లో ఒక ఇమామ్, ఇద్దరు హోంగార్డులు సహా అయిదుగురు మృతి
- ‘నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు’ - చిత్తూరు పోలీసులపై తమిళనాడు మహిళల తీవ్ర ఆరోపణ.. దర్యాప్తు జరుపుతున్నామన్న ఎస్పీ
- ‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’.. భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత
- కోతి పిల్లలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్లో బయపడిన దారుణమైన ఇంటర్నేషనల్ బిజినెస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














