ప్రతిద్రవ్యోల్బణం: చైనాలో తగ్గుతున్న వస్తువుల ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనాబెల్ లియాంగ్, నిక్ మార్ష్
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతిద్రవ్యోల్బణంలోకి(Deflation) పడిపోయింది. గత రెండేళ్ల కాలంలో తొలిసారిగా ఈ జులైలో వినియోగదారుల ధరలు (కంజ్యూమర్ ప్రైసెస్) తగ్గడంతో అక్కడ ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడింది.

ద్రవ్యోల్బణానికి(Inflation) కొలమానం అయిన ‘వినియోగదారుల ధరల సూచిక’ గత నెలలో 0.3 శాతం పడిపోయింది.

ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో డిమాండ్‌ను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఇది ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు.

దీనివల్ల ఎగుమతి దిగుమతులు బలహీనంగా మారతాయి. ఈ డిఫ్లేషన్ కరోనా తర్వాత చైనా రికవరీ వేగంపై ప్రశ్నలను లేవలేత్తింది.

దీనితో పాటు స్థానిక ప్రభుత్వాల అప్పులు, హౌసింగ్ మార్కెట్ సవాళ్లను కూడా చైనా ఎదుర్కొంటోంది. రికార్డు స్థాయిలో ఉన్న యువత నిరుద్యోగాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. 1.15 కోట్ల మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఈ ఏడాది చైనా జాబ్ మార్కెట్‌లోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ధరలు పడిపోవడం వల్ల వృద్ధిరేటు నెమ్మదిస్తుంది. దీనివల్ల రుణాలను తగ్గించుకోవడం చైనాకు కష్టతరమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

‘‘ద్రవ్యోల్బణాన్ని పెంచగల రహస్య పదార్థం ఏదీ లేదు’’ అని ఈఎఫ్‌జీ అసెట్ మేనేజ్‌మెంట్ అనే పెట్టుబడి సంస్థకు చెందిన డేనియల్ ముర్రే అన్నారు.

సులభమైన ద్రవ్య పాలసీతో పాటు ఎక్కువ ప్రభుత్వ వ్యయం, తక్కువ పన్ను విధానాల కలయికను దీనికి ఒక పరిష్కారంగా ఆయన సూచించారు.

చైనా

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ధరల తగ్గుదల ఎప్పుడు మొదలైంది?

కరోనా ఆంక్షలు ముగిసిన తర్వాత చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారుల వ్యయం పెరిగింది. డబ్బును ఆదా చేసిన వారంతా అకస్మాత్తుగా ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు. ఈ వైఖరి పెరగడంతో డిమాండ్‌ను అందుకోవడంలో వ్యాపారాలు ఇబ్బంది పడ్డాయి.

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు పెరిగాయి. ఆంక్షల కారణంగా వస్తువుల సరఫరా పరిమితమైంది. ఈ పరిమితమైన వస్తువులకు భారీ డిమాండ్ పెరగడంతో ధరల్లో పెరుగుదల వచ్చింది.

కానీ, చైనాలో ఇలా జరగలేదు. ప్రపంచంలోనే అత్యంత కఠిన కరోనా నిబంధనలను పాటించిన చైనాలో ధరలు పెరగలేదు. వినియోగదారుల ధరలు చివరగా 2021 ఫిబ్రవరిలో పడిపోయాయి.

నిజానికి చైనాలో నెలల పాటు ప్రతిద్రవ్యోల్బణం అంచున నిలిచింది. డిమాండ్ బలహీనంగా ఉన్న కారణంగా ఈ ఏడాది మొదట్లో కూడా ఇదే వైఖరి కొనసాగింది.

‘‘ఫ్యాక్టరీ గేట్ ప్రైజెస్’’ అని పిలిచే చైనా తయారీదారులు నిర్దేశించే ధరలు కూడా పడిపోతున్నాయి.

‘‘ఇది ఆందోళనకరం. ముఖ్యంగా పశ్చిమంతో పాటు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతుండగా, చైనాలో బలహీనపడటం మంచిది కాదు.

చైనాకు ప్రతి ద్రవ్యోల్బణం సహాయపడదు. రుణాలు మరింత భారంగా మారతాయి’’ అని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అలీసియా గార్సియా హెరెరో చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో కంటికి కనిపించకుండా సాగుతున్న మరో యుద్ధం

ప్రతిద్రవ్యోల్బణంతో సమస్య ఏంటి?

చైనా ఉత్పత్తి చేస్తోన్న వస్తువుల్లో ఎక్కువ భాగం ప్రపంచం అంతటా విక్రయిస్తుంది.

చైనాలో ప్రతిద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగితే దాని సానుకూల ప్రభావం యూకేతో పాటు ప్రపంచంలోని ఇతర భాగాల్లో ధరల పెరుగుదలకు కళ్లెం వేయడంలో ఉపయోగపడొచ్చు.

అయితే, తక్కువ ధర గల చైనీస్ వస్తువులు గ్లోబల్ మార్కెట్లను ముంచెత్తితే ఇతర దేశాల్లోని స్థానిక తయారీదారులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పెట్టుబడులను, ఉపాధిని దెబ్బతీస్తుంది.

చైనాలో ధరల తగ్గుదల.. కంపెనీల లాభాలపై, వినియోగదారుల వ్యయంపై కూడా ప్రభావం చూపగలదు. ఇది అధిక నిరుద్యోగానికి దారి తీయొచ్చు.

ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో శక్తి, ముడి సరుకులు, ఆహార డిమాండ్లు పతనం కావొచ్చు. ఇది గ్లోబల్ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది.

చైానా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ఎగుమతులు, దిగుమతులు భారీగా పడిపోయాయి

చైనా ఆర్థికవ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇతర అడ్డంకులను ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న చైనా అనుకున్నదాని కంటే తక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తోంది.

నిరుడితో పోలిస్తే ఈ ఏడాది జులైలో చైనా ఎగుమతులు 14.5 శాతం, దిగుమతులు 12.4 శాతం పడిపోయినట్లు మంగళవారం నాటి అధికారిక గణాంకాలు చూపించాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మరింత నెమ్మదిస్తుందనే ఆందోళనలను ఈ డేటా బలపరుస్తోంది.

చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ‘ఎవర్‌గ్రాండే’ పతనం తర్వాత కొనసాగుతున్న ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభాన్ని కూడా చైనా ఎదుర్కొంటోంది.

అంతా నియంత్రణలోనే ఉందని చైనా ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎలాంటి పెద్ద చర్యలను మాత్రం తీసుకోలేదు.

చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో పెట్టుబడిదారులు, వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడం చాలా కీలకమని కార్నెల్ యూనివర్సిటీలో ట్రేడ్ పాలసీ, ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఈశ్వర్ ప్రసాద్ అన్నారు.

‘‘ప్రైవేట్ రంగంపై మళ్లీ నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించగలదా? అనేది ఇక్కడ అసలు సమస్య. అలా చేస్తే ప్రజలు పొదుపుకు బదులుగా ఖర్చు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడం మొదలవుతుంది. ఇది ఇప్పటివరకు జరగలేదు’’ అని ప్రసాద్ చెప్పారు.

‘‘రాబోయే రోజుల్లో పన్నుల కోతలు వంటి గణనీయ ఉద్దీపన చర్యలను మనం చూడాల్సి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ప్రతి ద్రవ్యోల్బణంతో చైనాలో తగ్గుతున్న ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)