చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటపడింది

చాక్లెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మబ్రుక్
    • హోదా, బీబీసీ కోసం

ఓ మహిళ తిన్న చాక్లెట్‌లో మనిషి వేలు ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీలంకలోని ఉవా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

స్థానిక మహియాంగనాయ హాస్పిటల్‌లోని 'ఈసీజీ' విభాగంలో పనిచేస్తున్న మహిళ ఆసుపత్రి కెఫెటేరియా (క్యాంటీన్)లో ఈ చాక్లెట్‌ కొనుగోలు చేశారు.

ఈ విషయాన్ని బీబీసీ తమిళ్‌తో మహియాంగనాయ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ సహన్ సమరవీర చెప్పారు.

చాక్లెట్

ఫొటో సోర్స్, Getty Images

నట్స్ అనుకొని తినబోయింది..

”ఆగస్టు 3వ తేదీన స్థానికంగా తయారు చేసిన చాక్లెట్‌ను క్యాంటీన్ నుంచి మహిళ కొన్నారు. అందులో కొంతభాగాన్ని తిని, మిగిలిన భాగాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచారు. ఆ తర్వాత శనివారం (5వ తేదీ) ఆ చాక్లెట్ తినబోయారు.

అప్పుడు ఆమెకు నోటిలో ఏదో తగిలినట్లుగా అనిపించింది. అది చాక్లెట్ లోపల ఉన్న 'నట్స్' అనుకొని అలాగే తింటూ ఉన్నారు ఆ మహిళ. అయితే ఆ పదార్థం మరేదోనని తర్వాత గ్రహించారామె.

నోటిలో నుంచి దాన్ని తీసి చూడగా, మనిషి వేలు కనిపించిందని హెల్త్ ఇన్‌స్పెక్టర్ సల్మాన్ పారిస్ బీబీసీతో చెప్పారు.

దీంతో ఆమె విషయాన్ని మహియాంగనాయ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం ఫిర్యాదు అందుకున్న పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు ఆ ప్రాంతంలోని ఔట్‌లెట్లలో ఉన్న సదరు కంపెనీ చాక్లెట్‌లను, వేలిని స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు సోమవారం (ఆగస్టు 07) స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో రిపోర్టు సమర్పించారు.

అయితే చాక్లెట్‌లోని పదార్థం మనిషి వేలిదా? కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరం ఉన్నందున, దానిని కొలంబో లేబొరేటరీకి పంపనున్నట్లు పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ సల్మాన్ తెలిపారు.

ప్రస్తుతం మానవ వేలుగా భావిస్తున్న ఆ పదార్థాన్ని మహియాంగనాయ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలోని రిఫ్రిజిరేటర్‌లో భద్రంగా ఉంచారు.

ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో కేసు నమోదు చేస్తామని సల్మాన్ చెప్పారు.

పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సల్మాన్
ఫొటో క్యాప్షన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సల్మాన్

తినే పదార్థంలో వేలు రావడం ఇదే తొలిసారి..

"తినే పదార్థంలో మనిషి వేలు ఉండటం తీవ్రమైన విషయం. ఇది చాక్లెట్ కంపెనీ పొరపాటు కావచ్చు. కేసు కోర్టులో ఉంది, దీనిపై అక్కడే తేలనుంది'' డాక్టర్ సహన్ సమరవీర తెలిపారు.

చాక్లెట్‌లో మనిషి వేలు కనిపించిందన్న సమాచారం వెలువడిన రోజే సదరు చాక్లెట్ కంపెనీ సేల్స్ ప్రతినిధులు మహియాంగనాయ హెల్త్ ఆఫీసర్ వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చాక్లెట్ తయారీ కర్మాగారం పూర్తి వివరణ ఇచ్చింది.

దీనిపై పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ సల్మాన్ “శ్రీలంకలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.

ఇంతకుముందు ఆహార పదార్థాలలో కీటకాలు వచ్చేవి. అయితే తినే పదార్థంలో మానవ అవయవం కనిపించడం ఇదే తొలిసారి. అందువల్ల ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ స్థాయిలలో సంప్రదింపులు జరుపుతున్నాం'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)