సగం ధరకే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
గతంతో పోలిస్తే వ్యవసాయ ఆధునీకరణ, టెక్నాలజీ కారణంగా సాగుబడిలో యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగింది.
రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ప్రధానమైనది ట్రాక్టర్. కానీ, దీని కొనుగోలు ఇప్పటికీ రైతులకు చాలా భారంగానే ఉంది.
పేద రైతులు తమకున్న చిన్న కమతాల్లో పనులు చేసుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ కొనలేని పరిస్థితి.
అలాంటి రైతులు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్రసేవ పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంత్రలక్ష్మీ పేరిట ఈ పథకాలను అమలు చేస్తుంటే మిగిలిన రాష్ట్రాలు వివిధ పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి
ఈ ట్రాక్టర్ పథకం విధి విధానాలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేమి పత్రాలు అవసరమవుతాయి? ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ట్రాక్టర్ యోజన
రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు అందించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకం ఇది.
రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం 50 శాతం వరకు సబ్బిడీ ఇస్తున్నాయి.
ఎవరు అర్హులు?
ప్రతి సన్నకారు, చిన్నకారు రైతు ఈ పథకానికి అర్హుడే.
వయోపరిమితి ఎంత?
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లోపు ఉండాలి.
సొంత పొలం ఉండాలా?
సొంత పొలం ఉన్న రైతులకు, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతులు పొలం యజమాని నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది.
రైతు కుటుంబ వార్షికాదాయ పరిమితి ఎంత ఉండాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలకు దాటకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
సగం ధరకే ట్రాక్టర్ ఎలా ఇస్తారు?
దరఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే ఆ రైతులకు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
ట్రాక్టర్ ధరలో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని రైతుకు రుణంగా బ్యాంకులు ఇస్తాయి.
కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ రాయితీ తక్కువ ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉండొచ్చు.
రైతుకు ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి ఏ బ్యాంకు అయితే రుణమిస్తుందో ఆ బ్యాంకు వారికి ఈ సబ్సిడీ మొత్తాన్నిప్రభుత్వం బదలాయిస్తుంది.
రైతు ట్రాక్టర్ కొన్న తరువాత తాను తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తే చాలు.
ఇప్పటికే ట్రాక్టర్ ఉన్న రైతుకు మళ్లీ రుణమిస్తారా?
గత 7 సంవత్సరాల్లో ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్‌ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమేమి పత్రాలు సమర్పించాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఈ పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డు
- ఓటరు ఐడీ లేదా పాన్ కార్డు లేదా పాసుపోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్సు
- తన పొలానికి సంబంధించిన అడంగల్ పత్రాలు
- తనపేరిట ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు
- వార్షికాదాయ ధృవీకరణ పత్రం
- ఇటీవల తీసిన పాసుపోర్టు సైజు ఫోటో
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సాధారణంగా అయితే ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీలు కల్పిస్తున్నాయి.
ఉదాహరణకు తెలంగాణలో - కామన్ సర్వీస్ సెంటర్ (మీసేవా కేంద్రాల) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో - రైతు తాను ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
ట్రాక్టర్ కొనడానికి పరిమితులున్నాయా?
లేవు. రైతు తనకు ఇష్టమొచ్చిన ట్రాక్టర్, తనకు ఇష్టమైన ధరలో, తనకు ఇష్టమైన కంపెనీ ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.
తన అవసరాలకు తగ్టట్లు ఏ ట్రాక్టర్ కొనాలనేది రైతు ఇష్టం.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో..
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవ పథకం పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇక్కడ రైతులకు ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లు రోటోవేటర్, డిస్క్, టిల్లర్ తదితర పరికరాలు కూడా ఇస్తున్నారు.
ఇక్కడ రైతులకు వ్యక్తిగతంగా కాకుండా రైతు సంఘాలకు ట్రాక్టర్ ఇస్తున్నారు.
కనీసం ఐదుగురు రైతులకు ఒక బృందంగా ఏర్పడాలి.
ఈ రైతులు తమ సంఘం పేరిట బ్యాంకులో ఖాతా తెరవాలి.
రైతు బృందాలు 10 శాతం పెట్టుబడి భరించాలి. ప్రభుత్వం 40 శాతం సబ్సీడీ ఇస్తుంది. మిగిలిన 50 శాతం రైతులకు రుణాలుగా ఇస్తారు.
ఈ రుణాలను సులభ వాయిదా పద్దతుల్లో రైతులు తిరిగి చెల్లించాలి.
తమ సంఘం తరఫున తమ గ్రామంలోని గ్రామ సచివాలయంలో అధికారులను సంప్రదించి ట్రాక్టర్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు అర్హులైన వారికి రైతు బృందాలకు ట్రాక్టర్‌ను ఇస్తారు.
తెలంగాణలో...
తెలంగాణ ప్రభుత్వం కూడా యంత్ర లక్ష్మీ పేరిట 50 శాతం రాయితీతో రైతులు ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకునే పథకం అమలు చేస్తోంది.
తెలంగాణ రైతులు వ్యక్తిగతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేసుకునే వెలుసుబాటు ఉంది.
అలాగే రైతులు బృందాలుగా, సహకార సంఘాలుగా కూడా ఏర్పడి ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు.
దళిత రైతులకైతే పూర్తి ఉచితంగా వంద శాతం రాయితీతో ట్రాక్టర్లను ఇస్తోంది.
తెలంగాణ పౌరుడైన ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులే.
పెద్ద ట్రాక్టర్ కొనాలంటే రైతులకు కనీసం 2.50 ఎకరాల సాగు భూమి ఉండాలి.
చిన్న ట్రాక్టర్ కొనాలంటే కనీసం ఎకరా సాగు భూమి ఉండాలి.
ఎక్కడ సంప్రదించాలి?
ట్రాక్టర్ కొనాలనుకునే రైతులు తమ ప్రాంతంలోని జోన్ అధికారిని సంప్రదించాలి.
అక్కడ దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలి.
అర్హతలున్న వారిని ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
మిగిలిన రాష్ట్రాల్లోనూ....
మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పథకాలు వివిధ పేర్లతో అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలా సబ్సీడీపై రైతులకు ట్రాక్టర్, పనిముట్లు అందజేస్తోంది.
గమనిక: ఈ కథనం తొలుత ప్రచురించినప్పుడు దీన్ని కేంద్ర పథకంగా పేర్కొన్నాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్న పథకం ఇది. పొరపాటుకు చింతిస్తున్నాం.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- గల్వాన్: దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబం అంతులేని నిరీక్షణ
- ‘10 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి కోటి రూపాయలు వస్తుందన్నారు.. నగలు తాకట్టుపెట్టి ఇచ్చాను’
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ యువతుల ఆవేదన
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....














