గల్వాన్: దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబం అంతులేని నిరీక్షణ

- రచయిత, చందన్ జాజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గల్వాన్ లోయలో మూడేళ్ల క్రితం భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘర్షణలో చైనాకు జరిగిన నష్టం గురించి భిన్న వాదనలున్నాయి. అయితే, ఈ ఘటన భారత్‌లోని ఒక సైనికుడి కుటుంబంలో ఎలా మార్పులకు కారణమైందో తెలుసుకోవడానికి మేం ప్రయత్నించాం.
గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల్లో హవల్దార్ సునీల్ కుమార్ ఒకరు. ఆయన మరణించి మూడేళ్లయిన సందర్భంగా బిహార్ రాజధాని పట్నాలోని ఆయన ఇంట్లో వర్ధంతి జరిగింది. జూన్ 16 అంటే మంగళవారం ఆయన మూడో వర్ధంతి జరిగింది.
ఈరోజు సునీల్‌కుమార్ బతికి ఉంటే ఆయన వయసు ఇప్పుడు 40 ఏళ్లు ఉండేది. సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2020 జూన్ 15న ఆయన కూడా గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో మరణించాడు.
అయితే, సునీల్ కుమార్ ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకూ తెలియలేదు.
ఆయన భార్యకు ఉద్యోగం, నష్టపరిహారం ఇప్పించారు, కానీ, అప్పట్లో ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వాటిలో సునీల్ స్మారక చిహ్నం ఒకటి.

'ఒకరోజు రెజిమెంట్ నుంచి కాల్ వచ్చింది'
సునీల్ కుమార్ 'బిహార్ రెజిమెంట్ 16'లో హవల్దార్‌గా నియమితులయ్యారు. 2002లో ఆర్మీలో చేరారు. గల్వాన్‌లో ఘర్షణకు ఏడాది ముందు (2019), ఆయనను తూర్పు లద్ధాఖ్‌లోని మారుమూల ప్రాంతంలో నియమించారు.
నెట్‌వర్క్ సమస్య వల్ల అక్కడి నుంచి ఇంటికి ఫోన్ మాట్లాడటం కష్టంగా ఉంటుంది. సునీల్ పిల్లలు తమ తండ్రి నెట్‌వర్క్ ఉన్న ప్రాంతానికి వచ్చి ఫోన్ చేస్తారని ఎదురుచూసేవారు.
ఎందుకంటే పిల్లలు తండ్రితో మాట్లాడి అప్పటికే నెలరోజులకు పైనే అయింది. ఈసారి (2020 జూన్) ఇంట్లో ఫోన్ మోగినప్పుడు, అవతలి వైపు ఉన్నది వాళ్ల నాన్న కాదు.
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో బిహార్ రెజిమెంట్‌కు చెందిన సునీల్ కుమార్ మరణించారని జూన్ 15న భార్య రితీ దేవికి సమాచారం అందింది.
“మేం కాల్ చేసినప్పుడు, తను పనిచేసే రెజిమెంట్‌లో మరొక సునీల్‌కుమార్ ఉన్నారని ఆయన మాకు చెప్పేవారు. అందుకే నా భర్త బాగానే ఉన్నాడనుకున్నా.
అయితే ఉదయం నా భర్త అన్నయ్య (బావ) ఫోన్ చేసి ఆయన మరణం గురించి చెప్పారు'' అని గుర్తు చేసుకున్నారు రితీదేవీ .
చైనా సరిహద్దుకు వెళ్లే ముందు సునీల్‌కు బిహార్ రాజధాని పట్నాలోని దానాపూర్ కంటోన్మెంట్‌లో డ్యూటీ వేశారు.
పిల్లలను నగరంలోనే ఉంచి వారికి మంచి చదువు చెప్పేందుకు కంటోన్మెంట్‌కు సమీపంలోనే సొంతంగా చిన్న ఇల్లు కూడా నిర్మించుకున్నారు సునీల్.

‘ప్రజలు నాన్నను గుర్తుంచుకున్నందుకు గర్వంగా ఉంది’
సునీల్ కూతురు సోనాలి ఈ ఏడాది పదో తరగతి పాసయింది. సోనాలి 'తన తండ్రిని చూసి గర్వపడుతుంది' కానీ ఆయన లేకపోవడాన్ని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుంది.
“పిల్లలందరూ వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. మేం ఎక్కడికీ వెళ్లలేదు.
మా నాన్న లేకుంటే మమ్మల్ని ఎవరు తీసుకెళతారు? కానీ, మా నాన్న చేసిన పనిని చూసి అందరూ గుర్తు చేసుకుంటుండటం గర్వంగా ఉంటుంది'' అని అంటోంది సోనాలి.
సునీల్ కుమార్ పెద్ద కొడుకు ఆయుష్ వయసు 14 ఏళ్లు. ఇంట్లోనూ, బయటా పని చేస్తున్న తల్లిని చూసి కాస్త కంగారు పడిపోతుంటాడు.
“ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్ధం ఆవహించి ఉంటుంది. నాన్న ఎప్పుడు వచ్చినా నెలరోజులు సెలవు తీసుకుని వచ్చేవాడు.
మేం సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లం. పిక్నిక్‌లకు కూడా వెళ్లేవాళ్లం. ఇప్పుడు అదంతా సాధ్యం కాదు'' అన్నాడు ఆయుష్.
ఆయుష్ తమ్ముడు విరాట్ తన తల్లి ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. విరాట్ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. తనకు నాన్న అంటే కొంచెం భయం ఉండేది.
“అమ్మ ఇంట్లో ఉంటే, తన ఫోన్ దొరికింది. అక్క, అన్నయ్య ఫోన్ ఇవ్వరు. వచ్చేవారం నుంచి స్కూల్ తెరుస్తారు.
తర్వాత తెల్లవారుజామున ఐదింటికి నిద్ర లేవాలి. ఇక చదువుల్లోనే సమయం గడిపేస్తాం'' అని విరాట్ అంటున్నాడు.

ఊరి నుంచి వచ్చేసిన సునీల్ కుటుంబం
సునీల్ కుమార్ మరణించడంతో ఆయన స్వగ్రామం తారాపూర్‌లో నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు పెద్దఎత్తున చేరుకున్నారు. పట్నా జిల్లాలోని బిహ్తా ప్రాంతంలో తారాపూర్ గ్రామం ఉంది.
సునీల్ కుటుంబం ఇప్పుడు పట్నాలో స్థిరపడింది. గ్రామంలోని సునీల్ కుమార్ ఇంట్లో ఆయన చిత్రపటం మాత్రమే ఉంచారు. ఆయన జ్ఞాపకాలు గ్రామ వీధుల్లో కనిపిస్తుంటాయి.
రితీదేవికి పట్నాలో గుమాస్తాగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు.
బిహార్ ప్రభుత్వం రితీదేవికి రూ. 20లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. ఇప్పుడు జీతం, భర్త పెన్షన్‌తో పిల్లలను పెంచుతున్నారు రితీదేవి.
సైన్యం వైపు నుంచి రావాల్సిన ప్రతీ ఒక్కటీ రితీదేవీ అందుకున్నారు.
“నేను గృహిణిని. ఉద్యోగం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది చేయాల్సిన సమయం వచ్చింది. భర్త పెన్షన్, ఉద్యోగంతో పిల్లల బాగోగులు చూసుకుంటున్నా" అని రితీదేవీ అన్నారు.

‘స్మారక చిహ్నం హామీ నెరవేరలేదు’
తన భర్త చనిపోయిన తర్వాత ఇంటికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారని, చాలా వాగ్దానాలు చేశారని, అవి నేటికీ నెరవేర్చలేదని రితీదేవీ అంటున్నారు.
''అప్పట్లో చాలా మంది వచ్చారు. గ్రామంలో స్మారక చిహ్నం నిర్మిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు. మేం ఈ రోజు కూడా అడుగుతున్నాం, కానీ ముందుకు సాగడం లేదు " అని రితీదేవీ చెప్పారు.
రితీదేవికి ఆమె సోదరుడు చందన్ కుమార్ అండగా ఉంటున్నారు. ఉద్యోగంలో కొంత సమయాన్ని వెచ్చించి అక్కకు సాయం చేస్తుంటారు.
గ్రామంలో బావ పేరిట స్మారకం నిర్మించాలంటూ నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు చందన్.
‘‘స్మారకాన్ని నిర్మిస్తామని అప్పట్లో చాలామంది నేతలు హామీ ఇచ్చారు. పిల్లలను మంచి స్కూల్లో చేర్పిస్తామన్నారు, కానీ, ఏమీ చేయలేదు. అందరూ మర్చిపోయారు" అని చందన్ అంటున్నారు.
తన బావ చనిపోయినప్పుడు ప్రజలు, పలు సామాజిక సంస్థల నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారని, కానీ కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీసేందుకు మళ్లీ ఎవరూ రాలేదని చందన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
మరణ ధ్రువీకరణ పత్రంలో కారణం లేదు
పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ప్రతి దాడి వ్యవహారంపై దేశంలో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తుంటాయి. మీడియాలో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. కానీ చైనాకు సంబంధించిన విషయంలో ఇది సాధారణంగా కనిపించదు.
“ఏం జరిగిందో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. సునీల్ కుమార్ మరణ ధ్రువీకరణ పత్రంపై జూన్ 16 తేదీ అని రాసి ఉంది, కానీ దానికి కారణం లేదు'' అని చందన్ తెలిపారు.
సైన్యంలో సునీల్ ప్రయాణానికి గుర్తుగా ఆయన ఇంట్లో చాలా ఫొటోలు ఉన్నాయి.
చైనా సరిహద్దులోని గల్వాన్‌లో ఏదో జరిగిందని సునీల్ భార్యకు టీవీ ద్వారా ప్రాథమిక సమాచారం వచ్చింది'' అని సునీల్ కుమార్ చిన్ననాటి స్నేహితుడు రాజ్‌కుమార్ గుర్తుచేసుకున్నారు.
సెలవుల్లో సునీల్ కుమార్ చాలాసేపు స్వగ్రామంలో గడిపేవారు.
సునీల్ రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలని ఎప్పుడూ అడుగుతుండేవాడని అతని స్నేహితుడు అమర్ గుప్తా అన్నారు .
రిటైరయ్యాక చూద్దామని సునీల్ స్నేహితులు చెప్పేవారు. కానీ సునీల్‌కు మాత్రం ఆ అవకాశం రాలేదు.
చైనాతో పోరాడి ప్రాణాలర్పించిన స్నేహితుడికి గ్రామంలో స్మారక చిహ్నం నిర్మించాలని అతని స్నేహితులు కూడా కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















