పుట్టగొడుగుల ఆహారం తిని చనిపోయిన అత్తామామ, తనకేం తెలియదంటున్న కోడలు.. ఏమిటీ మిస్టరీ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
ఆస్ట్రేలియాలో ఒక చిన్న పట్టణంలో దాదాపు రెండు వారాల క్రితం ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అన్నం తినేందుకు కూర్చున్నారు. ఈ భోజనం చేసిన తర్వాత వారి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది.
వారం వ్యవధిలోనే ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా మారి, చావుతో పోరాడుతున్నారు.
ఐదో వ్యక్తి విచారణను ఎదుర్కొంటున్నారు.
అడవిలో దొరికే పుట్టగొడుగులతో చేసిన ఆహారమే వారికి విషంగా మారినట్టు తెలుస్తోంది.
కానీ, వారి కోసం పుట్టగొడుగులతో భోజనాన్ని సిద్ధం చేసిన ఇంటి కోడలు, 48 ఏళ్ల మహిళ మాత్రం, అసలేం జరిగిందో తనకు తెలియదని చెబుతున్నారు.
తన కుటుంబాన్ని తాను చాలా ప్రేమిస్తున్నానని, వారిని బాధపెట్టనని ఆమె అంటున్నారు.
ఈ కేసు ఆ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
పోలీసులకు కూడా ఈ కేసు అంతుచిక్కడం లేదు.
కుట్రా? ప్రమాదమా?
మెల్‌బోర్న్‌కు ఆగ్నేయంగా రెండు గంటలు ప్రయాణిస్తే లియోంగథా పట్టణం ఉంది. అక్కడ తమ కోడలు ఎరిన్ పటేర్సన్ ఇంట్లో భోజనానికి వచ్చారు గైల్, డాన్ పటేర్సన్.
వారితో పాటు గైల్ సోదరి హీథర్ విల్కిన్సన్, ఆమె భర్త ఇయాన్ కూడా ఈ భోజనానికి అతిథిగా వచ్చారు.
పిల్లలతో సరదాగా భోజనం చేశారు వీరందరూ.
కానీ ఈ ఆహారం తీసుకున్న తర్వాత ఏమైందో ఏమో వీరందరూ అస్వస్థతకు గురయ్యారు.
లియోంగథా పట్టణానికి సమీపంలోని కొరుంబుర్ర పట్టణంలో ఈ నలుగురికి మంచి పేరుంది. ఇయాన్ స్థానిక బాపిస్ట్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు.
భోజనం చేసిన తర్వాత కొన్ని గంటలకు, ఈ నలుగురు అతిథులకు సమస్య మొదలైంది. అతి తీవ్రమైన జీర్ణకోశ సమస్య అని భావించి స్థానిక ఆస్పత్రిలో చేరారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే వీరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వెంటనే వీరిని మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన మెల్‌బోర్న్‌లోని ఆస్పత్రికి తరలించారు.
అయినప్పటికీ, 66 ఏళ్ల హీథర్ విల్కిన్సన్, 70 ఏళ్ల గైల్ పటేర్సన్, 70 ఏళ్ల డాన్ పటేర్సన్ మరణించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 68 ఏళ్ల ఇయాన్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఇయాన్‌కు కాలేయ మార్పిడి చేయాలని చూస్తున్నారు.
చనిపోయిన ఆ నలుగురు ప్రాణాంతకమైన పుట్టగొడుగులు తిన్నట్లు తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పిన పుట్టగొడుగులు చాలా విషపూరితమైనవి.

ఫొటో సోర్స్, SUPPLIED
కోడలు ఏం తిన్నారు?
ఆశ్చర్యకరంగా ఎరిన్, ఆమె ఇద్దరు పిల్లలకు మాత్రం ఏమీ కాలేదు.
పిల్లలు వేరే ఆహారం తిన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్తగా పిల్లల్ని ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్నారు.
అతిథులకు పెట్టిన భోజనాన్నే ఎరిన్ తిన్నారా, లేదా, అతిథులకు వడ్డించిన ఆహారంలోని పుట్టగొడుగులను ఆమె కూడా తిన్నారా, లేదా అనేది అస్పష్టంగా ఉందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
ఎరిన్ తన భర్త, పీటర్సన్ కొడుకుతో విడిపోయి వేరుగా ఉంటున్నారు.
అయితే, తాము మనస్ఫూర్తిగానే విడిపోయినట్లు చెబుతున్నారు.
అయినప్పటికీ, మరణాల వెనక కుట్ర కోణాన్ని పోలీసులు కొట్టిపారేయడం లేదు.
ఈ సమయంలో ఈ మరణాల గురించి వివరించలేమని పోలీసు అధికారి థామస్ చెప్పారు.
అసలేం జరిగిందో తనకేం అర్థం కావడం లేదని ఎరిన్ చెబుతున్నారు.
తన ఇంటి వెలుపల మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
అతిథులకు వడ్డించిన భోజనం ఏంటి, ఈ పుట్టగొడుగులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.
తాను చెప్పేదంతా నిజమేనని, తాను అమాయకురాలినని చెప్పారు.
‘‘నేనేమీ చేయలేదు, వారిని నేనెంతో ప్రేమిస్తాను’’ అని ఆమె తెలిపారు.
స్థానికుల దిగ్భ్రాంతి
ఈ వార్త తెలియగానే స్థానికులు దిగ్భ్రాంతి చెందారు.
‘‘ఇక్కడ ఇది జరుగుతుందని ఎవరూ అనుకోలేదు’’ అని స్థానిక మేయర్ నాథన్ హెర్సే బీబీసీకి చెప్పారు.
స్థానిక ప్రజలు చాలా బాధలో, విచారంలో ఉన్నారు. బాధితుల కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.
ఎరిన్ కూడా చాలా అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, GOOGLE MAPS
‘‘గైల్ నాకు తల్లి లాంటిది. నా పిల్లలు కూడా వారి నాన్నమ్మను కోల్పోయారు’’ అని ఎరిన్ అన్నారు.
‘‘నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో వీరు కొందరు. వీరు మరణించడం నన్ను తీవ్ర వేదనకు గురి చేసింది’’ అని ఆమె చెప్పారు.
విక్టోరియా రాష్ట్రంలో విషపూరితమైన పుట్టగొడుగుల వల్ల ఆస్పత్రిపాలు కావడం లేదా మరణించడం ఇదే తొలిసారి కాదు.
విషపూరిత పుట్టగొడుగులను తినదగ్గ పుట్టగొడుగులుగా ప్రజలు పొరబడటం పెరుగుతోంది.
2020లో విక్టోరియాలో విషపూరిత పుట్టగొడుగులు తినడం వల్ల ఎనిమిది మంది ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరు చనిపోయారు.
అడవుల్లోంచి తీసుకొచ్చే పుట్టగొడుగుల్లో ఏవి పడితే అవి తినొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
సూపర్ మార్కెట్‌లో కొనని పుట్టగొడుగులకు దూరంగా ఉండటమే మేలని పోలీసు అధికారి థామస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














