రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాగానే ఎన్టీఆర్‌లా ముఖ్యమంత్రి అయిపోతానని అనుకున్నారా?

రజినీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బద్రి శేషాద్రి
    • హోదా, రాజకీయ విమర్శకులు

రాజకీయాల్లో రజినీకాంత్‌ ఒక ఏనుగుతో సమానం. ఆయన పార్టీ ప్రారంభించినా, ప్రారంభించకపోయినా మీడియా, రాజకీయ పార్టీలు ఆయన కదలికల గురించి చర్చిస్తూనే ఉంటాయి.

ఆయన ఒకవేళ పార్టీ పెట్టి, తమిళనాడు అంతటా ప్రచారం చేసినప్పటికీ, తమిళ రాజకీయాల్లో రజినీకాంత్ గణనీయమైన మార్పు తీసుకురావడం కుదరదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను.

భారత రాజకీయాల్లో పట్టు నిలుపుకోగల లక్షణాలు రజినీకాంత్‌లో లేవు. కమల్‌హాసన్‌లో కూడా అలాంటి లక్షణాలు లేవని గుర్తించడం చాలా ముఖ్యం.

ఎంజీఆర్, ఎన్టీఆర్‌లతో రజినీకాంత్‌ను పోల్చడం ఇక్కడ పనిచేయదు. ఎంజీఆర్ బలమైన భావజాలంతో అప్పటికే జనాదరణ పొందిన రాజకీయ పార్టీలో చేరారు. దాని విజయ కోసం పనిచేసి, ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆ తర్వాతే ఆయన సొంతంగా తన రాజకీయ పార్టీని ప్రారంభించారు. డీఎంకే ద్వారా బలమైన పునాదులు వేసుకున్న ఆయన, తర్వాత తన పార్టీని ముందుకు తెచ్చారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు, ఆంధ్రా రాజకీయాల్లో ఒక బలమైన ప్రతిపక్షం లోటు ఉండేది. రాజీవ్‌గాంధీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, దానిని అడ్డుకుంటానని అప్పుడు ఎన్టీఆర్ చెప్పారు. ప్రజలంతా ఆయనకు మూకుమ్మడిగా మద్దతిచ్చారు.

తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. రజినీకాంత్ ఆరోగ్యం, వయసు ఆయనకు అనుకూలంగా లేవు. ఆయన తన నిర్ణయాలను సొంత అభిమానుల ముందు కూడా పెట్టలేదు.

తమిళనాడు రాజకీయాల్లో సిద్ధాంతాలకు సంబంధించిన గందరగోళం ఉండడం సాధారణం. కానీ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి గందరగోళం ఉండడం అనేది అసాధారణ విషయం. ఏదో సినిమాలో ఒకే పాటలో కోటీశ్వరుడు అయిపోయినట్టు, ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చు అనే ఆలోచనను రజినీకాంత్ చుట్టూ భజన చేసే ఎవరో ఆయన మనసులో నాటేసి ఉండచ్చు. పాపం, ఆయన ఆ ఐడియాను నమ్మేయడమే కాదు, ఆ కలను తన అభిమానులకు కూడా అందించేశారు. ఇప్పుడు అందరూ నిరాశపడిపోయారు.

మోదీతో రజనీకాంత్

పిక్చర్‌లోకి బీజేపీ ఎలా వస్తుంది

ఒక పార్టీ తన సిద్ధాంతాలను, తన బలాన్ని, నేతలను, కార్యకర్తలను కచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది. ఎవరో ఒకరిని అలా ఆకాశం నుంచి దించేసి, వారిని ఎన్నికల్లో విజయం కోసం ఉపయోగించుకోవడం అనేది అంత సులభం కాదు.

ఇలాంటివి భారత రాజకీయాల్లో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. సినీరంగాలకు చెందినవారు జనాలను భారీగా ఆకర్షించగలరు అనేది వాస్తవం. కానీ, రజినీకాంత్ జనాలను మాత్రమే కాదు, ఓట్లు కూడా తీసుకొస్తారని బీజేపీ నమ్మింది. అందుకే, బీజేపీ ఆయన్ను పదే పదే రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది.

కానీ, రజినీకాంత్ ఊగిసలాటలో ఉన్నారు. బీజేపీతో కలిస్తే తనపై కాషాయముద్ర పడుతుందేమోనని ఆయన కంగారు పడుతున్నారు. మరోవైపు, రజనీ చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన బీజేపీ బీ టీమ్‌లో సభ్యుడైపోయారని చాలా మంది అంటున్నారు.

రజినీకాంత్ నేరుగా బీజేపీలో చేరడానికి సిద్ధంగా లేకపోయినా, ఆయన ప్రారంభించే పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు, ఆ కల కూడా చెదిరిపోయింది. అందుకే, ఇప్పుడు తమకు మద్దతైనా ఇవ్వాలని బీజేపీ ఆయన్ను అడుగుతుంది. కమల్‌హాసన్ కూడా రజనీ నుంచి అదే ఆశిస్తారు. అన్నాడీఎంకే కూడా ఆయన్ను మద్దతు అడిగే అవకాశం ఉంది.

రజనీకాంత్

ఫొటో సోర్స్, AFP/GETTYIMAGES

ఇది బీజేపీకి పాఠం లాంటిది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో అది ఒక చిన్న పార్టీ. అలా అనడంలో ఏ తప్పూ లేదు. మిగతా పెద్ద రాజకీయ పార్టీలకంటే బీజేపీ ఎక్కువగా నోటాతోనే పోటీపడుతుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. బీజేపీ ఓటుబ్యాంకు పెరుగుతోంది. నాకు తెలిసి తమిళనాడులో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీనే ఉంది. అయితే, ఒంటరిగా పోటీ చేసి, కొన్ని స్థానాలు గెలుచుకునే స్థాయికి ఈ పార్టీ ఎదగలేదు.

బీజేపీ పార్టీని బలోపేతం చేసుకోవాలి, సభ్యుల సంఖ్యను కూడా పెంచుకోవాలి. రజినీకాంత్ లాంటి వారు దానికి సాయం చేయరు. నా వరకు, రాబోయే ఎన్నికల్లో రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వరనే అనిపిస్తోంది.

1996లో తన గళం వినిపించడానికి రజినీకాంత్‌కు ఎన్నో కారణాలు ఉండుండవచ్చు. ఆ కారణాలు ప్రస్తుతం లేవు. బీజేపీకి ఇది అర్థం కావడం లేదు. తమిళనాడు రాజకీయాలను బీజేపీ ఇంకా అర్థం చేసుకోలేకపోతోంది అనే విషయాన్ని ఇది చెబుతోంది.

డీఎంకే సిద్ధాంతాలకు మేము వ్యతిరేకం అని బీజేపీ చెప్పుకుంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే కూడా అదే విధంగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని డీఎంకేను ఓడించడం అనేది బీజేపీ ఏకైక లక్ష్యం అవుతుంది.

అయితే, బీజేపీకి అలాంటి ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడాన్ని ప్రభావితం చేయడంతోపాటూ, ఆ పార్టీ రకరకాల పద్ధతుల్లో సీఎం ఎడప్పాడి పళనిసామిపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇలాంటి ఒత్తిడి అన్నాడీఎంకేతోపాటూ బీజేపీకి కూడా హానికరమే అని నిరూపితం అవుతుంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)