మదర్స్ డే: తల్లిపాలు బిడ్డలకు ఎప్పుడు, ఎలా మాన్పించాలి?

ఫొటో సోర్స్, Getty Images
‘‘పిల్లలకి ఐరన్ లోపించడం మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఐరన్ లోపం వచ్చిన పిల్లల పరిస్థితి కొన్నిసార్లు విషమంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో వారికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది.’’
పిల్లలకు తల్లి సరైన పద్ధతిలో పాలు మాన్పించకపోవడంతో, చాలా మంది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని దిల్లీలోని ప్రముఖ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రాచీ జైన్ చెప్పారు.
పిల్లలకు రక్త సంబంధిత సమస్యలు, క్యాన్సర్ రోగాలకు చికిత్స చేయడంలో ప్రాచి జైన్ నిపుణురాలు.
తల్లి పాలు మాన్పించేందుకు పిల్లలకి మెల్లమెల్లగా ఘన రూపాల్లో ఆహారాన్ని అందిస్తూ, పాలపై ఆధారపడటాన్ని తగ్గించాలి.
సరైన సమయంలో, సరైన విధానంలో తల్లిపాలు మాన్పించే ప్రక్రియను ప్రారంభించడం చాలా ముఖ్యం.
‘‘ఆరు నెలల పాటు కేవలం పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలి. ఆ తర్వాత, తల్లి పాలు మాన్పించే ప్రక్రియను ప్రారంభించాలి’’ అని ఇండియన్ అకాడమిక్స్ ఆఫ్ పిడియాట్రిక్స్ చెబుతున్నట్లు డాక్టర్ ప్రాచి జైన్ తెలిపారు.
‘‘ఆరు నెలల తర్వాత మెల్లమెల్లగా తల్లిపాలు ఇవ్వడం తగ్గించి, బేబీకి ఘన ఆహారాన్ని ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత పిల్లలు వేగంగా ఎదుగుతారు.
ఈ సమయంలో కేవలం పాలు మాత్రమే ఇస్తే, ఐరన్, ఇతర పోషకాలు వారి శరీరంలో లోపిస్తాయి. దీంతో వారు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని డాక్టర్ ప్రాచి జైన్ చెప్పారు.
తల్లిపాలు మాన్పించే పద్ధతులు
తల్లిపాలను మాన్పించేందుకు రెండు విధానాలున్నాయి. ఒకటి పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయం. దీనిలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులే ఎప్పుడు పిల్లలకు ఘన ఆహారం ఇవ్వాలో నిర్ణయిస్తారు.
ఈ విధానంలో, లిక్విడ్ డైట్ లేదా మెత్తగా వండిన ఆహారాన్ని పిల్లలకు స్పూన్ లేదా చేతితో ఇస్తారు.
ఈ విధానాన్ని ‘పేరెంట్-లెడ్ వీనింగ్’ అంటారు.
తల్లిపాలను మాన్పించే ప్రక్రియలో మరో విధానం ‘బేబీ-లెడ్ వీనింగ్’. ఇది 2000 దశకం ప్రారంభం నుంచి మొదలైంది.
దీనిలో, పిల్లల కోసం ప్రత్యేకంగా వండిన లేదా గ్రైండ్ చేసిన లిక్విడ్ ఆహారాన్ని వారికి ఇవ్వడానికి బదులు.. కుటుంబంలోని మిగతా వారి కోసం ఏదైతే వండుతారో, దాన్నే వారికి పెడతారు.
వీరికి కొంత మొత్తంలో ఆహారాన్ని, మెత్తగా ఉండే ముక్కలు లేదా ముద్దలు పక్కకు తీసి వారికి ఉంచుతారు.
ఆ తర్వాత పిల్లలు తమ చేతులతో తాము తినేలా చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
‘బేబీ-లెడ్ వీనింగ్ లేదా బీఎల్‌డబ్ల్యూ’ అనే విధానాన్ని నర్సు, రచయిత గిల్ రాప్లీ ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత, పిల్లలకు చెందిన పలు పుస్తకాలు, సోషల్ మీడియా ఖాతాలు, పోషకాహార నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాన్ని వాడటం మొదలుపెట్టారు.
పిల్లలకు తల్లిపాలను మాన్పించేందుకు ఈ విధానాన్ని సపోర్ట్ చేసే వారు దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.
ఉదాహరణకు, పిల్లలు తమ ఆకలి వేసినప్పుడు తినడం అలవాటు చేసుకుంటారు. అంతేకాక, వివిధ రకాల ఆహార పదార్థాలని తింటూ ఉంటారు.
కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెబుతోంది? ముఖ్యంగా, బేబీ-లెడ్ వీనింగ్ లేదా బీఎల్‌డబ్ల్యూ సురక్షితమేనా?
పిల్లలకు తల్లి పాలను మాన్పించు విధానాలను, వాటి ప్రయోజనాలను లేదా అప్రయోజనాలను చెప్పడం అంత తేలికైన విషయం కాదు.
బేబీ-లెడ్ వీనింగ్ ప్రయోజనాలు, ముప్పుపై కేవలం 13 అధ్యయనాలు మాత్రమే ప్రచురితమైనట్లు న్యూట్రిషియన్ ఆఫ్ ది ఫ్రెంచ్ సొసైటీ ఆఫ్ పిడియాట్రిక్స్ కమిటీ 2022లో గుర్తించింది.
బేబీ-లెడ్ వీనింగ్ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని చాలా మంది తల్లిదండ్రులు చెప్పినట్లు పరిశోధనలు తెలిపాయి.
కానీ, చాలా మందికి దీని గురించి సరైన సమాచారం తెలియదు.
‘‘తల్లిదండ్రుల్లో 26 శాతం మంది వారి పిల్లలకు బేబీ-లెడ్ వీనింగ్‌నే అనుసరిస్తున్నారు. కానీ, లిక్విడ్ రూపంలో ఆహారాన్ని చెంచాతో తినేలా చేస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు’’ అని ఫ్రెంచ్ అసోసియేషన్ ఫర్ అంబులేటరీ పిడియాట్రిక్స్ నిర్వహించిన అధ్యయనం తెలిపింది.
కేవలం 7 శాతం మంది మాత్రమే సరైన విధానంలో పిల్లలకి ఆహారాన్ని పెడుతున్నారని చెప్పింది.
కానీ, ఈ అంశంపై ఇప్పటి వరకు చేపట్టిన పరిశోధనలతో మనం ఒక ముగింపుకు రావొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రయోజనాలేంటి?
బేబీ-లెడ్ వీనింగ్‌ను చేపట్టే కుటుంబాల్లో అందరూ కలిసే తరచూ భోజనం చేస్తూ ఉంటారని పరిశోధనలు చెప్పాయి.
అంతేకాక, తినే సమయాల్లో ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణం ఉంటుంది.
సంప్రదాయ విధానంలో తల్లిపాలు మాన్పించు విధానాన్ని చేపట్టే వారి కంటే తక్కువ ఒత్తిడి, ఆందోళన ఉంటుందని తమపై ఉంటుందని ఈ విధానాన్ని అనుసరించే తల్లులు చెబుతున్నారు.
అయితే, ఇవన్ని కూడా కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటాయి.
బేబీ-లెడ్ వీనింగ్ వల్ల పిల్లలకి కూడా చాలా రకాల ప్రయోజనాలుంటాయి.
ఎప్పుడైతే పిల్లలు తమకు తాము తినడం నేర్చుకుంటారో, అప్పుడు వారు తమ కడుపు నిండిన విషయాన్ని, ఇక తినలేం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు.
సిద్ధాంతపరంగా చూసుకుంటే, దీనివల్ల ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కొన్ని పరిశోధనలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి.
బేబీ-లెడ్ వీనింగ్ విధానంలో తినే పిల్లలు వారికి కడుపు నిండిన విషయం తెలుస్తుందని, దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయని ఒక పరిశోధన గుర్తించింది.
అయితే, తల్లిపాలు మాన్పించేందుకు చేపట్టే వివిధ రకాల విధానాల్లో బరువు పెరగడానికి, ఆకలికి మధ్య ఎలాంటి తేడా లేదని న్యూజీలాండ్‌లో 206 శిశువులపై చేపట్టిన మరో పరిశోధన తేల్చింది.
బేబీ-లెడ్ వీనింగ్ విధానంలో ఆహారాన్ని తీసుకునే పిల్లలు కొత్త కొత్త రకాల ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారని, వారు ప్రారంభ వయసులోనే పలు రకాల అభిరుచులను, ఫ్లేవర్లను తెలుసుకుంటారని మరో వాదన కూడా ఉంది.
న్యూజీలాండ్‌లో చేపట్టిన అధ్యయనం కూడా దీన్ని ధ్రువీకరించింది.
ఇతర పిల్లలతో పోలిస్తే బేబీ-లెడ్ ఆహారాన్ని తీసుకున్న రెండేళ్ల పిల్లలు వివిధ రకాల ఆహారం, కూరగాయాలను రుచి చూసినట్లు గుర్తించింది.
సంప్రదాయ విధానంలో తల్లిపాలను మాన్పించే పిల్లలకి కూడా వివిధ రకాల ఆహారాలను తినిపించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.
‘‘ఆరు నుంచి 12 నెలల వరకు లిక్విడ్ డైట్‌నే ఇవ్వాలని మేం సూచించం. ప్రారంభంలో లిక్విడ్ డైట్‌ను ఇవ్వొచ్చు. ఎనిమిది నెలల తర్వాత, ఘన ఆహారాన్ని చిన్న చిన్న ముక్కల రూపంలో ఇస్తూ ఉండాలి.
వారికి ఏడాది వచ్చే సరికి ఘన ఆహారాన్ని వారు తిని ఉండాలి. దీనికి మీరు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారన్న దానితో సంబంధం లేదు’’ అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ పోషకాహార కమిటీ అధ్యక్షుడు మార్క్ కోర్కిన్స్ అన్నారు.
ప్రమాదాలేంటి?
‘బేబీ-లెడ్ వీనింగ్‌లో పిల్లలు తక్కువగా తింటూ, ఎక్కువగా కింద పడేస్తున్నారని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ, ఇది అంత పెద్ద విషయం కాదు.
మెల్లగా వారు తినడం నేర్చుకుంటారు. పిల్లలు వారికి వారు ప్లేట్‌లోని ఆహారాన్ని తినడం నేర్చుకుంటున్నప్పుడు, ప్లేట్‌ను పట్టుకోవడం, దాన్ని ఎత్తడం, తినడం, చప్పరించడం వంటి విషయాలను తెలుసుకుంటారు.
వారి చేతులు, కళ్లు ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకునేందుకు ఇది సహకరిస్తుంది’’ అని డాక్టర్ ప్రాచి జైన్ వివరించారు.
కానీ, ఈ విధానంలో ముఖ్యంగా భయపడాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి ఆ ఆహారం ఏమన్నా గొంతులో ఇరుక్కుపోతుందా అన్నది తెలుసుకోవాలి.
బేబీ-లెడ్ వీనింగ్ విధానంలో ఆహారాన్ని తీసుకునే పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారా?
అయితే, పిల్లలకు గొంతులో ఆహారం ఇరక్కపోయి, వారికి ఉక్కిరిబిక్కిరి అవ్వడంలో బేబీ-లెడ్ వీనింగ్‌కి, ఇతర విధానాలకు పెద్ద తేడా లేదని ఒక అధ్యయనం గుర్తించింది.
ఆరు నుంచి 8 నెలల పిల్లలకి ఆహారం గొంతులో ఇరక్కపోయి, వాంతులు చేసుకోవడం సాధారణమని, లిక్విడ్ ఫుడ్ ఇచ్చే సమయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుందని న్యూజీలాండ్‌లో చేపట్టిన ఒక అధ్యయనం తెలిపింది.
1151 మంది పిల్లలపై చేపట్టిన మరో పరిశోధన కూడా ఇదే విషయాన్ని గుర్తించింది.
అయితే ఈ విధానంలో మరో ముప్పు ఉంది. బేబీ-లెడ్ వీనింగ్‌లో పిల్లలు కుటుంబమంతా తినే ఆహారాన్ని తింటూ ఉంటారు. దీంతో వారు ఎక్కువ చక్కెర లేదా ఉప్పును తీసుకునే అవకాశం ఉంటుంది.
పిల్లలకి ఆహారం పెట్టే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు సహజంగా ఉప్పు, తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి ఇవి అన్నివేళలా మంచివి కావు.

ఫొటో సోర్స్, Getty Images
పోషకాల సమస్యలేంటి?
బేబీ-లెడ్ వీనింగ్‌లో పిల్లలు తక్కువగా తింటూ ఉంటారనే సమస్య ఉంది. దీని వల్ల పోషకాలు లోపిస్తాయనే ఆందోళనలు ఉన్నాయి.
బేబీ-లెడ్ వీనింగ్ విధానంలో ఆహారాన్ని తీసుకునే పిల్లలు చాలా తక్కువ బరువు ఉంటున్నారని మరో రీసెర్చ్ గుర్తించింది.
బేబీ-లెడ్ వీనింగ్, సంప్రదాయ విధానంలో ఆహారాన్ని తీసుకునే పిల్లలకి ఒకే రకమైన ఎనర్జీ ఉంటుందని, కానీ బేబీ-లెడ్ వీనింగ్‌లో పిల్లల డైట్‌లో ఐరన్, జింక్, విటమిన్ బీ12 లోపిస్తున్నాయని 51 మంది పిల్లలపై చేపట్టిన చిన్న అధ్యయనంలో తేలింది.
12 నెలల వయసున్న పిల్లల్లో ఏ రకమైన వీనింగ్ విధానాలలో ఆహారాన్ని తీసుకున్నా ఐరన్ స్థాయిల్లో పెద్ద తేడా కనిపించలేదని న్యూజీలాండ్‌లో ఒక అధ్యయనం తెలిపింది.
సరైన విధానం ఏంటి?
బేబీ-లెడ్ విధానపు ప్రయోజనాలను పిల్లలకి అందించాలి. న్యూజీలాండ్ అధ్యయనాల్లో గుర్తించిన ఇబ్బందుల నుంచి పిల్లల్ని కాపాడాలి.
పోషకాలు, ఎనర్జీ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని పిల్లలకి పెట్టాలి.
కానీ, ఈ విషయంలో మరింత అధ్యయనాన్ని చేపట్టాల్సి ఉంది.
తల్లిపాలను మాన్పించే ప్రక్రియలో చేపట్టే రెండు రకాల విధానాలలో కూడా ప్రయోజనాలు, అప్రయోజనాలున్నాయని డాక్టర్ ప్రాచి చెప్పారు.
అయితే, ఏ విధానం మెరుగైనదో తెలిపేందుకు ఇప్పటి వరకు చేపట్టిన రీసెర్చ్‌లతో ఒక ముగింపుకు రాలేమన్నారు.
‘‘తల్లిపాలను మాన్పించు సమయంలో పిల్లలకి పెట్టే ఆహారం మీ పర్యవేక్షణలోనే ఉండాలి. ఒకవేళ లిక్విడ్ డైట్ చేయకపోతే, ఆహారాన్ని మెత్తగా చేసి పిల్లలకి పెట్టాలి. అలా చేయడం వల్ల వారికి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలుగుతారు.
నట్స్, పాప్‌కార్న్ లేదా దానిమ్మ గింజల్ని నేరుగా పిల్లలకి ఇవ్వకూడదు. అవి పిల్లల గొంతులో ఇరక్కపోతాయి. పిల్లల్ని త్వరగా తినాలని కూడా బలవంతం చేయకూడదు. ఒకవేళ వారు తినని మారం చేస్తే వారిని బలవంతం చేయొద్దు.’’ అని ప్రాచి జైన్ చెప్పారు.
పిల్లలకి తల్లిపాలను మాన్పించడం నుంచి నార్మల్ డైట్‌కి మరలించే ప్రక్రియ మెల్లగా జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో పిల్లలకి అవసరమైన పోషకాలను అందించాలి.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ఆరోగ్యం: జలుబు ఎందుకు వస్తుంది... తగ్గాలంటే ఏం చేయాలి?
- పిల్లల పెంపకానికి 13 సూత్రాలు
- జర్మనీ: లైంగికంగా వేధించారేమోనని 7 నెలల వయసులోనే భారత చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేశారు
- బిడ్డను కనేందుకు ఒంటెపై ప్రయాణం.. ఏడు గంటల పాటు యువతి నరకయాతన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














