బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా

బీర్ తాగడం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేశ్ మాడకన్
    • హోదా, బీబీసీ తమిళ్ ప్రతినిధి

మద్యంలో ‘బీర్’కున్న ప్రాధాన్యమే వేరు.

విస్కీ, రమ్, బ్రాందీ, వోడ్కా, వైన్‌ వంటి ఇతర మద్యాలతో పోలిస్తే బీర్‌లో ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు.

దీంతో ఇది శరీరానికి తక్కువ హాని కలిగిస్తుందని భావిస్తారు.

అయితే, ప్రజలు తాగే బీర్‌పై ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాలు ఇప్పుడు చూద్దాం..

బీర్ ఒంటికి చల్లదనాన్ని ఇస్తుందా?

వేడి వాతావరణంలో బీర్ తాగితే, శరీరం చల్లబడుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు.

బీర్ శరీరానికి చలువ చేస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది తప్పు అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎస్.అరుల్ ప్రకాశ్ తెలిపారు.

‘‘బీర్‌తో కలిపి అన్ని ఆల్కహాల్ బెవరేజెస్‌లో ఆల్కహాల్ ఉంటుంది. వేడి వాతావరణంలో లేదా చల్లటి వాతావరణంలో దేనిలో తీసుకున్న వాటి ప్రభావం ఒకే విధంగా ఉంటుంది.

బీర్ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు’’ అని ఆయన చెప్పారు.

బీర్ గ్లాసులు

ఫొటో సోర్స్, Getty Images

గుండెకు మంచిదా?

చాలా మంది ప్రజలు పరిమితంగా బీర్ తాగడం గుండెకు మంచిదేనని విశ్వసిస్తూ ఉంటారు. కానీ, ఇది నిజం కాదు అని కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ రాజా చెప్పారు.

‘‘కేవలం బీర్ మాత్రమే కాకుండా అన్ని ఆల్కహాలిక్ డ్రింక్‌లు.. అవి ఏ రకానికి చెందినవైనా శరీరానికి హాని చేస్తాయి. కొంత మొత్తంలో ఆల్కహాల్ గుండెకు మంచిదేననని అంతకుముందు కొన్ని పరిశోధనలు సూచించాయి.

కానీ, అప్పటి నుంచి వచ్చిన అన్ని అధ్యయనాలు కూడా, మీరు ఎంత మొత్తంలో తాగుతున్నారన్న దానితో సంబంధం లేకుండా, ఆల్కహాల్ గుండెకు హానికరమేనని చెప్పాయి’’ అని ఆయన తెలిపారు.

బీర్‌తో పాటు ఏ ఆల్కహాల్ తాగినా కూడా అది గుండెకు చెడు చేస్తుందన్నారు.

‘‘ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగినప్పుడు, హార్ట్ రేటు పెరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. అప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆల్కహాల్ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి’’ అని డాక్టర్ నవీన్ రాజా చెప్పారు.

అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు లేదా వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు.

ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు చోటు చేసుకుంటాయి. గుండె దడ, మూర్ఛ వంటివి వస్తూ ఉంటాయి. వీటిని ‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు.

దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ తాగడం వల్ల ఆల్కహాలిక్ కార్డియోమయోపతికి కారణమవుతుంది.

ఇది గుండెపై ప్రభావం చూపి, హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తుందని నవీన్ రాజా చెప్పారు.

బీర్

ఫొటో సోర్స్, Getty Images

బీర్ తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయా?

కిడ్నీలకు సంబంధించి భారతీయ ప్రజల్లో ఉన్న నమ్మకాలపై గుర్గావ్‌కు చెందిన ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రిస్టైన్ కేర్ ఒక సర్వే చేపట్టింది.

వెయ్యి మందికి పైగా చేపట్టిన ఈ సర్వేలో ప్రతి ముగ్గురిలో ఒకరు బీర్ తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు తగ్గుతాయని నమ్ముతున్నట్లు చెప్పారు.

కానీ, ఇది నిజం కాదని నెఫ్రోలాజిస్ట్‌లు చెప్పారు. ఆల్కాహాల్ తాగడమనేది నేరుగా కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

ఇదేమీ కిడ్నీలకు ప్రయోజనకరం కాదని తెలిపారు.

బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారా?

బీర్ తాగడం వల్ల బక్కపల్చగా ఉన్న వారు బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

ఇది నిజమే. బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారు. కానీ, ఇది ఆరోగ్యకరమైన బరువు కాదని పోషకాహార నిపుణురాలు మీనాక్షి బజాజ్ చెప్పారు.

‘‘ఒక గ్రాము ఆల్కాహాల్ 7 కేలరీలను అందిస్తుంది. దీంతో బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారు. కానీ, ఇది ఆరోగ్యకరమైన బరువు కాదు.

మీరు ఎక్కువ కాలం పాటు ఆల్కాహాల్ తాగితే, శారీరకంగా పలు రకాల అనారోగ్యాలకు గురవుతారు’’ అని తెలిపారు.

బీర్

ఫొటో సోర్స్, Getty Images

బీర్ రాసుకుంటే జుట్టు పెరుగుతుందా?

షాంపులాగా బీర్‌ను కూడా తలకు మర్దన చేసుకుని కడిగేసుకుంటే జుట్టు పెరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

ఇలా చెప్పిన చాలా వీడియోలను మీరు చూసి కూడా ఉండొచ్చు.

కానీ ఇది ఎంత వరకు నిజమనే విషయంపై మేం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనెరోలజిస్ట్స్, లెప్రోలజిస్ట్స్ సెక్రటరీ జనరల్ డాక్టర్ దినేశ్ కుమార్‌తో మాట్లాడాం.

‘‘జుట్టు మృత కణాల చేత తయారవుతుంది. అందుకే, మనం జుట్టు కత్తిరించుకున్న మనకు నొప్పి ఉండదు.

ఈ మృతకణాలకు ఏది అప్లయి చేసినా అంటే బీర్ లేదా షాంపు ఏది రాసినా కూడా, జుట్టు పెరుగుదలకు ఎలాంటి సహకారం ఉండదు’’ అని తెలిపారు.

‘‘కొంత మంది జుట్టుకు నిమ్మ, గుడ్డు సొన రాస్తూ ఉంటారు. కానీ ఇది కూడా ప్రయోజనం కాదు.

జుట్టు మొదళ్ల నుంచే బలంగా ఉండాలి. జుట్టుకు ఏదైనా రాసుకుంటే పెరుగుతుందనే దాన్ని సైన్స్ చెప్పడం లేదు.

ఆయిల్‌ను తీసుకుంటే, నూనె రాసుకోవడం వల్ల జుట్టు మెరుస్తుందే తప్ప, బలంగా, జుట్టు పెరుగుదలకు సహకరించదు’’ అని డాక్టర్ దినేశ్ కుమార్ వివరించారు.

అంతేకాక, ఎక్కువగా ఆల్కాహాల్ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని, విటమిన్ల లోపం వచ్చి, జుట్టు ఊడిపోతుందన్నారు.

బీర్

ఫొటో సోర్స్, Getty Images

బీర్ తాగడం శరీరానికి హానికరమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరిలో విడుదల చేసిన రిపోర్ట్‌లో, ఏ మొత్తంలో ఆల్కాహాల్ తీసుకున్నా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది.

ఆల్కాహాల్ ఏడు రకాల క్యాన్సర్‌కి కారణమవుతుందని తెలిపింది.

‘‘ఎంత విషం తీసుకున్నావన్న దానితో సంబంధం లేదు. విషం, విషమే. అలాగే ఆల్కాహాల్ కూడా. కొంత మంది ప్రజలు తక్కువ మొత్తంలో బీర్ తాగడం వల్ల శరీరానికి ఏదీ కాదని నమ్ముతూ ఉంటారు.

కానీ, ఏ స్థాయిలో ఆల్కాహాల్ తీసుకున్నా కూడా అది ప్రమాదకరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. బీర్ కాకుండా ఇతర రకాల ఆల్కాహాల్ తీసుకునే వారికి కాలేయం ఐదేళ్లలో దెబ్బతింటే, బీర్ తాగే వారికి పదేళ్లలో దెబ్బతింటుంది’’ అని డాక్టర్ అరుల్ ప్రకాశ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)