ఆంధ్రప్రదేశ్: తోలుబొమ్మలాట మొగలుల దండయాత్ర వల్లే తెలుగు నేలకు చేరిందా?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
పాత తరానికి రామాయణ, మహారాభారత, భాగవతం లాంటి పురాణ కథలను మనసులో గుర్తుండిపోయేలా చేసిన ఒకే ఒక కళ తోలుబొమ్మలాట. ఇప్పుడు ఈ కళ దాదాపుగా అంతరించిపోయింది.
తోలుబొమ్మలు ఆడించే కుటుంబాలు వేరే ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నాయి. తమ తోలుబొమ్మలతోనే కళాకృతులు తయారు చేస్తూ ప్రస్తుతం జీవనోపాధి పొందుతున్నాయి.
అయితే, ఇప్పటితరానికి తెలియని, అంతగా పరిచయం లేని ఈ తోలుబొమ్మలాట ఎలా పుట్టింది? శతాబ్దాల నాటి ఈ కళను నమ్ముకున్న కుటుంబాలు చివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా స్థిరపపడ్డాయి?
ఈ విషయాలను తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, నిమ్మలకుంటలో నివసిస్తున్న ఆనాటి తోలుబొమ్మల కళాకారుల వారసులతోపాటు, చరిత్రకారులతో బీబీసీ మాట్లాడింది.
తోలుబొమ్మలంటే...
తోలుబొమ్మలను పూర్వం వేటాడి చంపిన జంతువుల చర్మాలు ఉపయోగించి తయారు చేసేవారు. వాటినే ఒక తెర వెనుక కట్టెల మంట వేసి, ఆ మంట ముందు ఆడించేవారు.
పశువుల చర్మాలపై పురాణ పాత్రల చిత్రాలు వేసి, వాటికి రంగులు వేసి కత్తిరించిన తర్వాత వాటికి తాళ్లు కట్టి ఆడించేవారు. వాటినే తోలుబొమ్మల ఆట అనేవారు.
ముఖ్యంగా రామాయణం, మహాభారతానికి సంబంధించిన కథల్లోని పాత్రలతోనే ఈ తోలుబొమ్మలు తయారు చేసేవారు.
తెల్లని తెరపైన దీపపు కాంతిలో వీరు తోలు బొమ్మలను ఆడిస్తూ ఉంటారు. వారు వాటిని కదిలించే తీరు చూస్తే, బొమ్మలే హావభావాలు పలికిస్తున్నట్లు, అవే పాటలు పాడినట్లు అనిపిస్తుంది.
తోలు బొమ్మలకు చేతులు, కాళ్లు, తల ఇలా శరీర భాగాలు విడివిడిగా ఉంటాయి. వాటికి ఉండే కర్రల ద్వారా కళాకారులు ఒక్కో పాత్రనూ ఆడిస్తూ ఆ పాత్ర సంభాషణలు పలుకుతారు. పద్యాలు, పాటలు పాడుతారు.
హార్మోనియం, తబల, గజ్జలు, తాళాలు లాంటి పాతతరం సంగీత వాద్యాలను వాయిస్తూ, రాగయుక్తంగా పాటలు, పద్యాలు, సంభాషణలు చెబుతూ కథను రక్తికట్టించేవారు.
తోలుబొమ్మల చేతులూ కాళ్లూ కదులుతుంటాయి కాబట్టి సన్నివేశాల్లో ఆ బొమ్మ నిజంగా చేతులూ కాళ్లు కదిలించినట్లు కనిపిస్తుంది.
ఇప్పటికీ తోలుబొమ్మలను ఆడిస్తున్నామని, కానీ కాలంతోపాటు తమ పద్ధతులు కాస్త మార్చుకున్నామని నిమ్మలకుంట కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతి చెప్పారు.

‘‘గతంలో వందల సంవత్సరాల కిందట మా పూర్వీకులు తెరవెనక కట్టెల మంట వేసి ఆ వెలుగులో తోలుబొమ్మలాటను ఆడించేవాళ్లు. తర్వాత నూనె, ఆముదపు దీపాలు వచ్చినప్పుడు దీపాల కాంతిలో ఆడించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మేం ఎలక్ట్రికల్ దీపాల వెలుగులో వాటిని ఆడించడం మొదలుపెట్టాం.
ఆ వెలుగు మా తోలుబొమ్మలు ఎలివేట్ అయ్యేలా, తెర అవతల ప్రేక్షకులకు కనిపించే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వెలుగు విషయంలో మాత్రమే మార్పులు చేశారు. తోలుబొమ్మలు ఆడించే, ఆడే విధానం అదే. గతంలోలాగే రామాయణం, మహాభారతంతోనే నడుస్తోంది’’ అని చలపతి అన్నారు.
తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపమని, పూర్వం వర్షాభావ పరిస్థితులు ఉన్న సమయంలో పురాణాలు ప్రదర్శిస్తే వర్షాలు పడతాయనే నమ్మకం ఉండడం వల్ల ఈ కళకు ఎక్కువ ప్రాచుర్యం లభించిందని చరిత్రకారులు తిరుమలరావు చెప్పారు.
‘‘తోలుబొమ్మలాట గానీ, చెక్కబొమ్మలాట గానీ ప్రాచీన కళారూపాలు. చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కొయ్య బొమ్మలు ఉంటాయి. తోలు బొమ్మలు ఉంటాయి. ఇతర పప్పెట్స్ బొమ్మలతో కూడా ఆట ఆడించడం జరుగుతుంది. చర్మంతో తయారు చేసిన బొమ్మలను ఆడిస్తే అది తోలు బొమ్మలు.
కొయ్యతో తయారుచేసి, స్త్రీ పురుషుల ఆకారాలకు చీరలు, డ్రెస్సులు తొడిగించి ఆడిస్తే వాటిని చెక్క బొమ్మలు అంటారు. రామాయణం, భారతం లాంటిది ఎక్కువగా ఆ బొమ్మల్లో ఉంటుంది. వర్షాలు పడకపోతే రామాయణ కథలు చెప్పిస్తే వర్షాలు పడతాయని ఒక నమ్మకం ఉంది.’’

మరాట్వాడా నుంచి తెలుగునేలకు..
శతాబ్దాల క్రితం మహారాష్ట్రలో తోలుబొమ్మల కళాకారులు ఉండేవారని, మొగలుల దాడులతో వారంతా ఆంధ్ర వైపు వలసలు వచ్చారని తోలుబొమ్మల కళాకారుల వారసులు చెబుతున్నారు.
ఏళ్లపాటు సంచార జీవితం గడిపిన తర్వాత, చివరకు అప్పటి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో కొన్ని తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు స్థిరపడ్డాయి.
దాదాపు 80 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నిమ్మలకుంటలో భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ, చుట్టుపక్కల తోలుబొమ్మలు ఆడించుకుంటూ అక్కడే ఉండిపోయారని వారి వారసులు చెబుతున్నారు.
ఆయన వారసత్వం, ఇంకొంత మంది కళాకారులు, అలా పెరిగి దాదాపు 150 కుటుంబాలు ప్రస్తుతం నిమ్మలకుంటలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కూడా తమ కళాకారులు ఉన్నారని కుళ్లాయప్ప చెప్పారు.
‘‘మా కళాకారుల కుటుంబాలు ఎక్కువగా స్థిరపడింది నిమ్మలగుంట, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో. కానీ విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మా కళాకారుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మా కళాకారుల సంఖ్య మొత్తం కలిపినా రాష్ట్రవ్యాప్తంగా పది వేల నుంచి 15 వేలకు మించి ఉండరు’’ అని కుళ్లాయప్ప చెప్పారు.

పూర్వం సంచార జీవితం గడిపిన తోలుబొమ్మల కళాకారులు, తమ కళ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికే కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారని, అవే ఇప్పుడు ఊళ్లుగా మారాయని తిరులమరావు చెప్పారు.
‘‘ఏ ప్రాంతానికి వచ్చినా ఎక్కడైతే వాళ్లకి బాగా గడుస్తుందో, వాళ్లు అక్కడ సంచారం చేస్తూ బతికే వాళ్లు. ఆ తర్వాత రానురాను సంచారం తగ్గిపోయి కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల భాష, వాళ్ల జీవనం, చర్మాలతో బొమ్మలు తయారు చేసే విధానం అంతా కాస్త ప్రత్యేకంగా ఉంటాయి.
తాము వాటిని తయారు చేసుకోవడం వల్ల వేరే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఊరికి దురంగా కాలనీల్లాగా స్థిరపడిపోయారు. ఇప్పుడు వాళ్లు స్థిరపడిన ప్రాంతాలే పెద్ద ఊళ్లుగా మారాయి. కొన్ని ఊళ్లు పూర్తిగా కుంచించుకుపోయి వేరే వృత్తులకు వెళ్లిన వారు కూడా ఉన్నారు.’’
తోలుబొమ్మలాటలు ఆడించే కుటుంబాలు ప్రస్తుతం తెలంగాణలో కూడా ఉన్నాయని తిరుమలరావు చెప్పారు.
తాండూరు దగ్గర రెండు, మూడు తోలుబొమ్మలాట బృందాలు ఉన్నాయని, వారు ఇప్పటికీ తమ కళను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. నిమ్మలకుంటలో తయారు చేయడం, ఆడించడం రెండూ చేస్తారని ఆయన చెప్పారు.

రాజుల కాలంలో ఆదరణ
రెండు వేల సంవత్సరాల నుంచీ తమ పూర్వీకులు తోలుబొమ్మలు ఆడించే వృత్తిలో ఉంటున్నారని కళాకారులు చెబుతున్నారు.
అప్పట్లో వినోద కళలను రాజులు, జమీందారులు పోషించారని, వారి వల్లే అవి అభివృద్ధి చెందాయని తిరుమలరావు చెప్పారు.
‘‘వినోదం ఏ రూపంలో ఉన్నా రాజులు, జమీందారులు, జాగీర్దారులు వాటిని ఆదరించారు. వాళ్లకి పారితోషికాలు, ఇనాములు కూడా ఇచ్చినట్టుగా తెలుసు. వారితో పాటే అవి కూడా అంతరించిపోయాయి. అలా కొట్టుకుపోయిన కళలు చాలా ఉన్నాయి. అందులో తోలుబొమ్మలాట కళారూపం ఒకటి’’
ఛత్రపతి శివాజీ పాలనా కాలంలో మహారాష్ట్రలో తోలుబొమ్మలాటకు చాలా ప్రాచుర్యం లభించిందని కళాకారులు చెబుతున్నారు. ఆ సమయంలో తమ పూర్వీకులు గ్రామ గ్రామానికీ వెళ్లి తమ కళను ప్రదర్శించేవారని కుళ్లాయప్ప చెప్పారు.
‘‘మా పూర్వీకులు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్లు. ఆ కాలంలో రాజులు, భూస్వాములు, జమీందార్లు కల్చరల్ ప్రోగ్రామ్‌గా పెట్టేవాళ్లు. ఇది ముఖ్యంగా రామాయణం, మహాభారతం ఇతిహాసాలపైన ఆధారపడి ఉండేది. శివాజీ కాలంలో మహారాష్ట్రలో దీనికి మంచి ప్రాచుర్యం ఉండేది. గ్రామ గ్రామానికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడేవాళ్లు.
ఆ తోలుబొమ్మలాట గంట, అరగంట కాకుండా ఉదయం వరకు ఆడేవాళ్లు. అది కూడా పూర్తిగా కాదు. కేవలం ఒక ఘట్టాన్ని మాత్రమే రాత్రంతా ఆడేవాళ్లు. ఆ కాలంలో చదువు లేదు కాబట్టి రామాయణం, మహాభారతం తెలియాలంటే ఎక్కువ ఉత్తమ మార్గం ఈ తోలుబొమ్మలాటే.’’ అని ఆయన వివరించారు.

మొగలుల దండయాత్రతో ఆంధ్ర ప్రాంతానికి...
మహారాష్ట్రలో మొగలుల దండయాత్రతో తమ కళాకారులు ఆంధ్ర వైపు వలస వచ్చారని ఈ కళాకారులు చెబుతున్నారు.
''మహారాష్ట్రపై మొగలుల దండయాత్రతో తోలుబొమ్మలాట ఆడించేవారందరూ రాత్రికి రాత్రి వలసలు వెళ్లారు. అలా మా పూర్వీకుల్లో ఎక్కువ మంది ఆంధ్ర వైపు వచ్చారు. వారు కొన్ని తరాలపాటు ఇక్కడ సంచార జీవితం గడిపారు. ఎద్దుల బండిపై రేకులు కట్టుకొని రెండు, మూడు కుటుంబాలు ఒక జట్టుగా ఏర్పడి గ్రామ గ్రామానికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడించేవారు.
ఒక ఊళ్లో పది రోజులు ఉన్న తర్వాత గ్రామస్థులు ఇచ్చే కానుకలు తీసుకొని మరో గ్రామానికి వెళ్లేవారు. కొన్ని తరాలుగా మా వాళ్లు అలాగే కొనసాగారు. అలా 80 సంవత్సరాల క్రితం తోటి కళాకారులతో మా తాతగారు ఈ నిమ్మలగుంటలో స్థిరపడిపోయారు.’’ అని కుళ్లాయప్ప తెలిపారు.
కానీ, మొగలుల దండయాత్రలతోనే తోలుబొమ్మలాట ఆంధ్ర వైపు వచ్చిందని కచ్చితంగా చెప్పలేమని తిరుమలరావు చెప్పారు.
‘‘మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారనే వాదనలు ఉన్నాయి. కానీ వాళ్లు మహారాష్ట్రకి ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం కచ్చితంగా చెప్పలేం. అలాంటి హిస్టారికల్ రీసెర్చ్ కళారూపాలకి వర్తింపజేయడంలో కొంత సమస్య ఉంటుంది. ఇప్పుడు మనకు లభిస్తున్న కుటుంబాల భాష, వాళ్ల దేవతలు, ఇవన్నీ చూస్తే వాళ్లు మరాఠీ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లుగానే మనకు తెలుస్తుంది. వారు మొగలుల దాడులతో ఈవైపు వచ్చారు అనేదానిపై నేను కామెంట్ చేయలేను.’’
మొగలుల చరిత్రకు పూర్వమే ఇలా కదిలించే బొమ్మల ఆటల ప్రస్తావన ఉందని, ఇది ఎప్పుడు పుట్టిందనే విషయం కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు.
‘‘అయితే, మొగులుల సామ్రాజ్య విస్తరణ కంటే ముందు కూడా, భరతుడి నాట్య శాస్త్రంలో కూడా సూత్ర ఆటల ప్రస్థానం ఉంది. అంటే కొయ్య, తోలు బొమ్మలు కూడా వస్తాయి. అంటే, తాళ్లతో కట్టి, వేళ్లతో ఆడించేవాళ్లు. ఆ కొయ్య బొమ్మలు కూడా అంతే. తాడుతో తయారు చేసే బొమ్మలాట ఎప్పటి నుంచో ఉంది. వీళ్లు ఆ భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు.
ఇది ఎప్పుడు పుట్టిందనే విషయం ఎవరూ చెప్పలేరు. పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ రకంగానే క్షీణిస్తూ కూడా ఉంటాయి. ఒక్కొక్క దశలో ఇప్పుడది బతికే ఉందంటే చిట్టచివరి తరం అయి ఉంటుంది చాలా వరకు’’ అని తిరుమల రావు అన్నారు.

హైదరాబాద్ సంస్థానం కావడం వల్లే..
తోలుబొమ్మలాటతో పాటు నాటకాలు, బుర్రకథ లాంటి కళలన్నీ మహారాష్ట్ర నుంచే తెలుగు నేలకు వచ్చాయని తిరుమలరావు కూడా చెప్పారు. అప్పట్లో మొత్తం హైదరాబాద్ సంస్థానంగా ఉండడమే దానికి కారణమని వివరించారు.
‘‘ఇప్పుడు అది మహారాష్ట్ర. ఒకప్పుడు 1956 కంటే ముందు హైదరాబాద్ సంస్థానంలోనే ఉండేది మహారాష్ట్రలో చాలా భాగం. మరాట్వాడా నుంచి ఈ సాంప్రదాయం ఆంధ్రదేశం అంతటికీ వచ్చింది. తంజావూరులో కనిపించే మహారాష్ట్ర యక్షగాన సంప్రదాయంతో కూడా ఈ తోలుబొమ్మలాటకు సంబంధం ఉంది.
నార్త్ మహారాష్ట్ర కాకుండా సౌత్ మహారాష్ట్ర ఐదు జిల్లాలు మన దగ్గరే ఉండేటివి. చాలా కాలం కిందటే ఈ తోలుబొమ్మలాట ఆంధ్రదేశానికి వచ్చింది. ఇటు తెలంగాణకు కూడా పాకింది. తెలంగాణకి రెండు వైపుల నుంచి వస్తుంది. అటు నిజామాబాద్ ఏరియా నుంచి సరిహద్దు ఉంటుంది. ఇటు గుల్బర్గా. ఈ ప్రాంతం నుంచి కూడా రావడానికి వీలు ఏర్పడింది.’’అని అన్నారు.
పురాణాల మధ్యలో హాస్యపాత్రలు..
రాత్రంతా చూసే తోలుబొమ్మలాట ప్రజలకు విసుగు కలిగించకుండా వారికి మధ్య మధ్యలో హాస్యం అందించేలా తోలుబొమ్మలాటలోనే కేతుగాడు, బంగారక్క అనే పాత్రలను పూర్వీకులు సృష్టించారని కళాకారులు చెబుతున్నారు.
‘‘రాత్రంతా ఒక కథ మాత్రమే చెప్తే చూసే ప్రేక్షకులకు విసుగు వస్తుంది అనే ఉద్దేశంతో కేతుగాడు, బంగారక్క అనే క్యారెక్టర్లతో మధ్యమధ్యలో కామెడీ చేసేవాళ్లు. స్థానిక అంశాలపై, రకరకాల అంశాలపై వాటి ద్వారా మాట్లాడించి వినోదం పండించేవాళ్లం. కేతుగాడు అనే పదం తోలుబొమ్మలాట నుంచే పుట్టింది. తోలుబొమ్మలను అప్పటి రాజులు, భూస్వాములు అందరూ ఇళ్లలో అలంకరణలుగా కూడా ఉపయోగించేవాళ్లు.’’అని కుళ్లాయప్ప చెప్పారు.
శ్రీనాథుడు రాసిన కావ్యాల్లో కూడా తోలుబొమ్మలాట ప్రస్తావన కనిపిస్తుంది.
ఆంధ్రకు వచ్చిన తర్వాత తోలుబొమ్మలాట ప్రముఖ జానపద కళగా ఒక వెలుగు వెలిగిందని, రాయలవారికాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని కళాకారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- యూసీసీ: గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారు ప్రత్యేక గుర్తింపును కోల్పోతారా?
- బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా
- హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్
- తల్లిపాలు: మందులు వాడే తల్లులు బిడ్డకు పాలివ్వకూడదా... 7 అపోహలు, వాస్తవాలు














