స్పిరిచ్యువల్ హీలర్స్: 'ఆధ్యాత్మిక స్వస్థత' పేరుతో రహస్యంగా సాగుతున్న లైంగిక దోపిడీ... బీబీసీ పరిశోధనలో బయటపడిన అక్రమాలు

- రచయిత, హనన్ రజెక్
- హోదా, బీబీసీ అరబిక్ న్యూస్
"స్పిరిచ్యువల్ హీలర్స్"గా పనిచేస్తున్న పురుషుల లైంగిక వేధింపుల రహస్య ప్రపంచాన్ని బీబీసీ అరబిక్ వెలికితీసింది.
స్పిరిచ్యువల్ హీలింగ్ (ఆధ్యాత్మిక స్వస్థత)ను "ఖురానిక్ హీలింగ్" అని కూడా పిలుస్తారు. ఇది అరబ్, ముస్లిం ప్రపంచంలో బాగా పేరున్న ప్రక్రియ.
ఈ వైద్యుల వద్దకు పురుషులతో పాటు మహిళలు కూడా చాలామంది వెళతారు. జిన్ అనే దుష్టశక్తిని శరీరం నుంచి తరిమేయడానికి ఈ వైద్యులు సహకరిస్తారని, అనారోగ్యాన్ని నయం చేస్తారని పలువురు నమ్ముతారు.
ఏడాది కాలంగా ఈ హీలర్స్ దగ్గరికి వెళ్లిన 85 మంది మహిళల నుంచి బీబీసీ సాక్ష్యాలు సేకరించింది.
మొరాకో, సూడాన్‌లలో స్పిరిచ్యువల్ హీలింగ్ ప్రాచుర్యం పొందింది. ఈ దేశాల్లో 65 మంది హీలర్లు తమ దగ్గరికి వచ్చిన మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
బీబీసీ నెలల తరబడి ఎన్జీవోలు, కోర్టులు, న్యాయవాదులు, మహిళలతో మాట్లాడి, వివరాలు సేకరించి వారి అఘాయిత్యాలను ధ్రువీకరించింది.
ఇలాంటి ఒక హీలర్ వద్దకు చికిత్స పేరిట ఓ రహస్య విలేకరిని కూడా పంపించాం. ఆ విలేకరితో కూడా హీలర్ అనుచితంగా ప్రవర్తించాడు.

అత్తరు పేరుతో మత్తుమందు ఇచ్చి...
దలాల్ (ఆమె అసలు పేరు కాదు) కొన్నేళ్ల క్రితం మొరాకోలోని కాసాబ్లాంకా సమీపంలో గల ఒక పట్టణంలో ఒక ఆధ్యాత్మిక వైద్యుడి దగ్గరికి డిప్రెషన్ చికిత్స కోసం వెళ్లింది. అప్పుడు దలాల్ వయసు 20 సంవత్సరాలు.
'జిన్ ప్రేమికుడి' వల్లనే డిప్రెషన్‌కు గురవుతున్నట్లు దలాల్‌కు ఆ హీలర్ చెప్పాడు. ఒకరోజు ఇద్దరు మాత్రమే ఉన్నపుడు అతను దలాల్‌కు ఒక అత్తరును వాసన చూడమని ఇచ్చారు.
అది వాసన చూసిన అనంతరం ఆమెకు మత్తుగా అనిపించి, స్పృహ కోల్పోయారు. దలాల్‌కు మెలుకువ వచ్చేసరికి ఆమె ఒంటిమీద బట్టలు లేవు. అప్పటివరకు శారీరకంగా ఎలాంటి లైంగిక అనుభవం లేని ఆమె అత్యాచారానికి గురయ్యానని అర్థం చేసుకున్నారు.
వెంటనే దలాల్ అరుస్తూ నన్ను ఏం చేశావని ఆ ఖురానిక్ హీలర్‌ను నిలదీసింది. నీకు సిగ్గు లేదా? నాపై ఇలా ఎందుకు చేశావు? అని అడిగానని, అయితే జిన్ నీ శరీరం విడిచిపెట్టడానికే అలా చేశానన్నాడని గుర్తుచేసుకున్నారు దలాల్.
జరిగిన విషయానికి చాలా సిగ్గుపడ్డానని, ఎవరికీ చెప్పలేదని దలాల్ తెలిపారు. ఎవరికైనా చెబితే తనపై నిందలు మోపడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కొన్నివారాల తర్వాత దలాల్ గర్భవతి అని తెలుసుకుని, భయపడ్డారు. చనిపోవాలనుకున్నారు. తాను గర్భవతినని హీలర్‌కు దలాల్ చెప్పినపుడు, అది జిన్ కారణంగానే గర్భం వచ్చిందని ఆయన చెప్పాడు.
ఆ పరిస్థితికి చాలా బాధపడ్డానన్నారు దలాల్. తనకు బిడ్డ పుట్టినపుడు, బేబీని కనీసం చూడకుండా దత్తత ఇచ్చానని దలాల్ తెలిపారు. తనకు అలా జరిగిందని తెలిస్తే కుటుంబ సభ్యులు చంపేస్తారని దలాల్ భావించారు.
భర్త దూరమవుతున్నాడని వెళితే..
మేం కలిసిన చాలామంది బాధిత మహిళల్లో తమపై జరిగిన వేధింపుల గురించి ఎవరికైనా చెబితే అందరూ తమనే నిందిస్తారని భయపడ్డారు.
కొందరు మాత్రమే వారి కుటుంబాలకు జరిగిన విషయం చెప్పారు. ఒకవేళ చెప్పినా తమపై జిన్ ప్రతీకారం తీర్చుకుంటోందని వారు ఆరోపిస్తారని మరికొంతమంది ఆవేదన చెందారు.
సూడాన్‌లో సావ్సన్ అనే మహిళ బీబీసీతో మాట్లాడారు. తన భర్త రెండో భార్యతో ఉండటానికి నిర్ణయించుకున్నాడని, తమ కుటుంబాన్ని వదిలేయాలనుకున్నాడని చెప్పారు. దీంతో ఆమె హీలర్‌ను సంప్రదించారు.
తన భర్త తన దగ్గరే ఉండేలా చేసే ఏదైనా ఔషధం (మందు) ఇస్తారని ఆమె భావించారు. అయితే ఆమె అనుకున్నట్లు జరగలేదు.
''అతను నాతో సెక్స్ చేస్తానన్నాడు. అప్పుడు వచ్చే శరీర ద్రవాలతో కషాయం చేసి నా భర్తతో తాగించాలని సూచించాడు. అతను ఏ మాత్రం భయం లేకుండా చెప్పాడు. నేను ఈ విషయం పోలీసులకు గానీ, నా భర్తకు గానీ చెప్పనని అతను అనుకున్నాడు'' అని గుర్తుచేసుకున్నారు సావ్సన్.

రహస్య విలేకరితో ఆపరేషన్...
దీంతో సావ్సన్ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. అయితే ఆ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు సావ్సన్.
మేం సూడాన్‌లో వేధింపులకు గురైన 50 మంది మహిళలతో మాట్లాడాం. వారిలో ముగ్గురు ఒకే మత నాయకుడి పేరు చెప్పారు. ఆయనే షేక్ ఇబ్రహీం.
ఇబ్రహీం తనను మాయమాటలతో లోబర్చుకుని లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మహిళ తెలిపారు.
మరొక బాధితురాలు అఫాఫ్. తనతో సెక్స్ చేయమని ఇబ్రహీం అడిగినప్పుడు ఆమె అతన్ని నెట్టివేసింది. ఆ సమయంలో తాను శక్తిహీనురాలిగా భావించానని చెప్పారామె.
"షేక్ ఇలా అంటున్నాడు. ఇలా చేస్తున్నాడు అని చెబితే ప్రజలెవరూ నమ్మరు. నేను సాక్షులను ఎలా చూపించాలి? అతనితో పాటు గదిలో నన్ను ఎవరూ చూడలేదు" అని అఫాఫ్ అంటున్నారు.
దీంతో మరిన్ని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నంలో భాగంగా షేక్ ఇబ్రహీం దగ్గరికి వెళ్లడానికి మా బృందంతో పని చేస్తున్న రహస్య విలేఖరి అంగీకరించారు.
రీమ్ అని పిలిచే లేడీ రిపోర్టర్, సంతానలేమితో బాధపడుతున్న వ్యక్తిగా ఇబ్రహీం దగ్గరికి వెళ్లారు.
షేక్ ఇబ్రహీం ఆమె కోసం ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఇంటికి తీసుకెళ్లి తాగడానికి "మహయ్య" అని పిలిచే "హీలింగ్ వాటర్" బాటిల్ సిద్ధం చేస్తానని ఆమెకు చెప్పారు.
రీమ్‌కు చాలా దగ్గరగా కూర్చుని, ఆమె కడుపుపై చేయి వేశాడు షేక్. దీంతో చేయి తీయాలంటూ ఆమె కోరారు. అయితే షేక్ ఆమె జననాంగాల వద్దకు చేయిని తీసుకెళ్లాడు. దీంతో ఆమె వెంటనే గది నుంచి బయటికి పరిగెత్తారు.
తనకు ఒళ్లు జలదరించిందని ఆమె బీబీసీతో అన్నారు. అతనలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదని ఆయన చర్యల ద్వారా తెలుస్తోందని రీమ్ చెబుతున్నారు.
వెంటనే రీమ్‌ను ఏం చేశారని షేక్ ఇబ్రహీంను బీబీసీ ప్రశ్నించింది. అయితే తన దగ్గరికి వచ్చిన మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలను షేక్ తిరస్కరిస్తూ, బీబీసీ ఇంటర్వ్యూని అకస్మాత్తుగా ముగించారు.
ఎలాంటి వేధింపులు, దోపిడీకి గురికాకుండా ఆధ్యాత్మిక వైద్యం కోరుకునే వారికి ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్న మహిళ షేఖా ఫాతిమా.
ఖార్టూమ్ సమీపంలో స్త్రీలకు మాత్రమే వైద్యం చేసే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. 30 సంవత్సరాలుగా రుక్యా లేదా వైద్యం అందుకునే కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి.
ఈ ప్రైవేట్ స్థలానికి బీబీసీకి ప్రత్యేకమైన యాక్సెస్ ఇచ్చారు. అయితే, అక్కడ మా చుట్టూ ఉన్న స్త్రీలు తమ పరిసరాల గురించిన అవగాహనను కోల్పోతున్నట్లు కనిపించింది.
ఈ స్థితిలో మహిళలు ఎలా దుర్బలంగా ఉంటారో మాకు షేఖా ఫాతిమా వివరించారు. ఈ పరిస్థితే ఇతర వైద్యులు ఏదైనా చేసేలా అవకాశం ఇస్తుంది.
"షేక్ తమను తాకి దెయ్యాన్ని వెలికితీస్తున్నాడని చాలామంది మహిళలు మాకు చెప్పారు. అది చికిత్సలో భాగమని వారు భావించారు" అని ఫాతిమా అంటున్నారు.
ఈ మహిళల గురించి వింటున్నది షాకింగ్‌గా అనిపిస్తోందని ఆమె తెలిపారు.
అఘాయిత్యాలపై అధికారులు ఏమంటున్నారు?
అయితే, మహిళలపై జరుగుతున్న వేధింపులపై సాక్ష్యాధారాలతో మొరాకో, సుడాన్ దేశాలలోని అధికారులను బీబీసీ సంప్రదించింది.
సూడాన్‌లో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫ్యామిలీ అండ్ సొసైటీ డిపార్ట్‌మెంట్ హెడ్ అలా అబు జైద్. చాలామంది మహిళలు వేధింపులకు గురయ్యారని చెబితే ఆయన మొదట నమ్మలేదు.
కానీ, ఆధ్యాత్మిక స్వస్థత విషయంలో నియంత్రణ లేకపోవడం వల్ల ఆ విధంగా అవుతోందని డాక్టర్ అలా అబు జైద్ అభిప్రాయపడ్డారు. అది ఉద్యోగం లేని వారికి వృత్తిగా ఉందని ఆయన అంగీకరించారు.
గతంలో దాని నియంత్రణ గురించి వివరాలు తెలుసుకున్నానని ఆయన తెలిపారు. అయితే దేశం రాజకీయ అస్థిరత కారణంగా ప్రస్తుతం దీనికి ప్రాధాన్యత లేదని అలా అబు బీబీసీకి చెప్పారు.
ఆధ్యాత్మిక వైద్యులకు సంబంధించి ఏదైనా ప్రత్యేక చట్టం అవసరమని తాను నమ్మడం లేదని మొరాకోలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి అహ్మద్ తౌఫిక్ తెలిపారు.
"ఈ విషయాలలో చట్టబద్ధంగా జోక్యం చేసుకోవడం కష్టం. మతపరమైన విద్య, బోధనలో దీనికి పరిష్కారం ఉంటుంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
మేం సేకరించిన ఆధారాలు ఉన్నప్పటికీ మొరాకో, సూడాన్ అధికారులు చర్య తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
కాబట్టి వైద్యం చేసే వృత్తి వెనుక దాక్కున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడే భారం మహిళలపైనే ఉంటోంది.
ఇవి కూడా చదవండి
- మణిపుర్: ప్రతి 75 మంది పౌరులకు ఒక జవాన్.. అయినా హింస ఎందుకు ఆగట్లేదు?
- యూసీసీ: గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారు ప్రత్యేక గుర్తింపును కోల్పోతారా?
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














