యూసీసీ: గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారు ప్రత్యేక గుర్తింపును కోల్పోతారా?

అనిల్ జోంకో
ఫొటో క్యాప్షన్, అనిల్ జోంకో
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జార్ఖండ్‌ వాసి అయిన అనిల్ జోంకో జీవితం చాలా ఏళ్లుగా ఒకేలా గడుస్తోంది.

హో గిరిజన తెగ ఆధిపత్యంలో ఉన్న జార్ఖండ్‌లోని చిన్న గ్రామమైన చైబాసాలో ఆయన నివసిస్తున్నారు. అయితే ఆయనిప్పుడు ఒక విషయంలో బాగా ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా తల్లిదండ్రుల సమాధి వద్ద ప్రార్థనలు చేసి జోంకో తన రోజును ప్రారంభిస్తారు.

40 ఏళ్ల జోంకో, స్థానిక గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు వెళుతుంటారు.

అక్కడ ఆయన ఓ భూ వివాదం కేసులో పోరాడుతున్నారు.

దేశంలో గిరిజన సంఘాలకు వారి సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును కాపాడేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి.

ఇక్కడ గిరిజనుల చట్టాలు, ఆచారాల ఆధారంగా వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ సమస్యలపై గిరిజన న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి.

అయితే, అనిల్ జోంకో వెళ్లే కోర్టులో న్యాయవాది లేదా న్యాయమూర్తి ఉండరు.

ఇక్కడ ముగ్గురు గ్రామనాయకులు తీర్పులను చెబుతారు. వారిలో ప్రతివాది తరఫున ఒకరు, ఫిర్యాదుదారు తరఫున ఒకరు, స్థానిక పరిపాలనకు చెందిన వ్యక్తి ఒకరు ఉంటారు.

వారిలో తన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడతానని జోంకో అంటున్నారు. అక్కడి కేసుల విచారణంతా స్థానికి హో భాషలో జరుగుతుందని ఆయన తెలిపారు.

జార్ఖండ్‌లో మాట్లాడే పలు స్థానిక భాషలలో హో ఒకటి. ఇక్కడ జనాభాలో 27 శాతం మంది గిరిజనులు ఉన్నారు. అయితే ఇపుడు తన గ్రామంలోని న్యాయవ్యవస్థ ఉనికి కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

సమానత్వం ఉండాలంటున్న ప్రభుత్వం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండటమే జోంకో భయానికి కారణం.

యూసీసీ అనేది మతం, కులం, లింగం అనే తేడా లేకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతానికి చట్టం ముసాయిదా అధికారికంగా తెలియనందున యూసీసీపై పూర్తి స్పష్టత లేదు.

అయితే, లింగ న్యాయం (జెండర్ జస్టిస్) సాధించడానికి ఉమ్మడి కోడ్ అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది.

వివాహం, విడాకులు, వారసత్వ విషయాలలో ఉండే పర్సనల్ లాస్‌లో సమానత్వం ఉండాలంటోంది.

"భారతదేశం యూనిఫాం సివిల్ కోడ్ ఆమోదించే వరకు లింగ సమానత్వం ఉండదు" అని బీజేపీ అంటోంది.

యూసీసీ కోసం చేసే ఒత్తిడి వల్ల ఆయా వర్గాలు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతిని కోల్పోతాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నందున, యూసీసీ ప్రతిపాదన చాలా వరకు ముస్లింల పర్సనల్‌ లాకు కౌంటర్ అని చాలా మంది భావిస్తున్నారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

జోంకో ఆందోళన ఏమిటి?

ఈ ప్రతిపాదన తమ శతాబ్దాల నాటి పద్ధతులు, ఆచారాలకు ఆటంకం కలిగిస్తుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

"ప్రస్తుతం గిరిజనేతర వ్యక్తి మా గ్రామంలో భూమిని కొనుగోలు చేయలేడు. యూసీసీతో ఎవరైనా కొనేస్తారు" అని జోంకో చెప్పారు.

"సంస్కృతి, గిరిజన పద్ధతులు తుడిచిపెట్టుకుపోతాయి" అని అంటున్నారు జోంకో.

జార్ఖండ్‌లోని 86 లక్షలమంది గిరిజనుల ప్రత్యేక గుర్తింపును రక్షించేందుకు దశాబ్దాలుగా కొన్ని ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయి.

గిరిజనుల భూమిని గిరిజనేతర వర్గాలకు బదిలీ చేయడాన్ని నిషేధించే 1908 చట్టం, జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా సంతాల్ గిరిజన తెగకు చెందని వ్యక్తులు సంతాల్ తెగ వారి భూమి కొనడాన్ని నిషేధించే 1876 చట్టం ఇందులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో ఈ సంతాల్ తెగ ఉంటోంది.

ఇలాంటి చట్టాలు ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇక్కడ గిరిజన వర్గాల భూమి, సంస్కృతిని రక్షించడానికి స్వయంప్రతిపత్తి గల జిల్లా కౌన్సిల్‌లు ఏర్పాటు చేశారు.

హో తెగ గిరిజనులు

గిరిజనుల భయం ఏమిటి?

తమ గుర్తింపును యూసీసీ తుడిచివేస్తుందని గిరిజనులు భయపడుతున్నారని రాంచీలోని జేవియర్స్ కళాశాల ప్రొఫెసర్ సంతోష్ కిడో అంటున్నారు.

"ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, ఆచారాల కారణంగా వారిని గిరిజనులుగా గుర్తిస్తారు. ప్రభుత్వం వీటన్నింటిని ఒకే బుట్టలో వేస్తే వారికి ఏమీ మిగలదు" అని ఆయన ఆరోపించారు.

జార్ఖండ్‌లోని గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్త దయామణి బార్లా దీనితో ఏకీభవించారు.

గిరిజనుల పాలనా వ్యవస్థ వారి ఆచారాలతో లోతుగా ముడిపడి ఉందని, దానిని తొలగించే ఏ ప్రయత్నమైనా వారి స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆమె ఆరోపించారు.

"అంతేకాకుండా భారత్ వంటి విభిన్న దేశానికి ఒకే చట్టం ఎలా?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

యూసీసీకి మద్దతుగా పలువురు మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

యూసీసీ మద్దతుదారులు ఏమంటున్నారు?

స్థానిక సంప్రదాయాలు, ఆచారాలలో ప్రబలంగా ఉన్న వివక్షను అంతం చేయడానికి ఈ సంస్కరణ అవసరమని యూసీసీ మద్దతుదారులు వాదిస్తున్నారు.

ఉదాహరణకు జార్ఖండ్‌లోని చాలా గిరిజన సమాజాలలో కుమార్తెలకు ఆమె తండ్రి లేదా భర్త ఆస్తిలో వాటా ఉండదు.

"ఒకే విధమైన పర్సనల్ లాస్ గిరిజనుల మధ్య లింగ సమానత్వాన్ని తీసుకువస్తాయి" అని రాంచీ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమర్ కుమార్ చౌదరి చెప్పారు. ఈ కమ్యూనిటీలను అందరితో కలిపేందుకు యూసీసీ కూడా సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.

దీనిని సక్రమంగా అమలు చేస్తే అందరికీ మేలు జరుగుతుందని, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.

కొత్త చట్టం ఎప్పుడు వస్తుంది, దీనితో గిరిజనులకు ఎంత వరకు మేలు జరుగుతుంది అనే స్పష్టత ప్రస్తుతం లేదు.

అయితే జార్ఖండ్‌లోని గిరిజనులు మాత్రం తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.

"మాకు పెద్దగా ఏం తెలియదు, మేం టీవీలో మాత్రమే అన్నీ వింటాం. మేం పేదోళ్లం, నిస్సహాయులం. యూసీసీ అమలైతే మేం జరిగేదాన్ని ఆపలేమని మాకూ తెలుసు" అని జోంకో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)