దిల్లీ సర్వీస్ బిల్లులో ఏముంది? కేజ్రీవాల్ ముందున్న మార్గం అదొక్కటేనా?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ సర్వీస్ బిల్లు సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి.
రాజ్యసభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదు. ఎన్డీయే మిత్రపక్షాలతో కలిపినప్పటికీ మెజార్టీని చేరుకునే పరిస్థితిలో లేదు.
అయితే, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ సారథ్యంలోని బిజూ జనతా దళ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ బీజేపీకి మద్దతిచ్చాయి.
రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌కు ప్రవేశపెట్టినప్పుడు ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో రాజ్యసభకు హాజరయ్యారు.
90 ఏళ్ల మన్మోహన్ సింగ్ చాలా బలహీనంగా కనిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఫోటోను ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆప్‌కు విపక్షాల మద్దతు
తన రాజకీయ మనుగడ కోసం మన్మోహన్ సింగ్‌ను కేజ్రీవాల్ విమర్శిస్తూనే వచ్చారని, కానీ 90 ఏళ్ల వయసులో, తన ఆరోగ్యం బాగోకపోయినా మన్మోహన్ దిల్లీ ప్రజల కోసం రాజ్యసభకు వచ్చారని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో కేవలం 10 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ దిల్లీ సర్వీసు బిల్లుకు వ్యతిరేకంగా 102 మంది సభ్యుల మద్దతు కూడగట్టింది.
మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరుకావడమనేది బీజేపీపై పోరాటంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముడిపడి ఉంది.
గత నెలలో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా)’ ఈ బిల్లును వ్యతిరేకించే విషయంలో ఏకతాటిపైకి వచ్చింది.
ప్రతిపక్ష కూటమి ఇండియా అలయెన్స్‌లో భాగస్వామ్యం కాని ఇతర పార్టీలు క్రాస్ ఓటింగ్ చేశాయి.
ఇండియా అలయెన్స్ కూటమి కేజ్రీవాల్‌కు పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ, భాగస్వామ్య పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని, ఇప్పుడు దిల్లీ ప్రభుత్వ హక్కులను కేంద్రం బలవంతంగా లాక్కుంటోందని బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. వాళ్లు ఇప్పుడేం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు.
''జమ్మూ కశ్మీర్ విషయంలో తాము ఎవరికి మద్దతు ఇచ్చామో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడైనా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్లే బాధపడాల్సి వస్తోంది. ఈ బిల్లును సమర్థిస్తున్న వారి విధేయత గురించి మాకు తెలుసు. ఎలుక తోకను ఏనుగు పాదంతో తొక్కినప్పుడు, అది విధేయతో లేక బలవంతంగా చేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు'' అని ఝా అన్నారు.
లోక్ సభ, రాజ్య సభలో ఆమోదం పొందిన తర్వాత దిల్లీ సర్వీసు బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. ఈ చట్టం దిల్లీ అధికార యంత్రాంగంపై భారీగా ప్రభావం చూపనుంది.

ఫొటో సోర్స్, Getty Images
లెఫ్టినెంట్ గవర్నర్‌కే అధికారాలు
ఈ కొత్త చట్టంతో దిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర పడడంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు పెరుగుతాయి. కొత్తగా క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటవుతుంది. అధికారులను బదిలీ చేసే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది.
ఈ కమిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, అందులో దిల్లీ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజార్టీ సభ్యుల అంగీకారం మేరకే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ కేంద్రం పరిధిలో ఉండడంతో, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్రం మాట వినే అవకాశం ఉంటుందనే ఆందోళనలు ఉన్నాయి.
కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి.
ఏకతాటిపై ఇండియా అలయెన్స్
ఈ బిల్లు ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హక్కులను తగ్గించేసినా, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అలయెన్స్ ఏకతాటిపై నిలుస్తుందనే సందేశాన్ని పంపగలిగింది.
నెల రోజుల కిందట ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి, దిల్లు సర్వీసు బిల్లుకు వ్యతిరేకంగా అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఏకతాటిపై నిలిచింది.
పార్లమెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి అంత బలం లేకపోయినా మద్దతు సంపాదించగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన(ఉద్దవ్ ఠాక్రే), ఆర్జేడీ, జేడీయూ సహా ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఇతర పార్టీల మద్దతు ఆప్ కూడగట్టింది.
బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో 102 ఓట్లు వచ్చాయంటే, ఇండియా అలయెన్స్ కూటమి మిత్రపక్షాలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా క్రాస్ ఓటింగ్ చేయలేదని అర్థమవుతోంది.
ఆప్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
దిల్లీ సర్వీసు బిల్లుపై చర్చ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ లక్ష్యంగా చేసింది.
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ, దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఎలాంటి సమస్యలూ లేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో చెప్పారు. రెండు సభల్లోనూ ఆయన ఇదే వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. వివాదాల కంటే దిల్లీ అభివృద్ధిపై ఆమె ఎక్కువగా దృష్టి పెట్టారని అమిత్ షా అన్నారు.
ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సవరణ చేయాల్సి వచ్చిందని అమిత్ షా తెలిపారు. ఆప్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు.
దిల్లీ దేశ రాజధాని కూడా అని, అందువల్లే సవరణ అవసరమనే మరో వాదన కూడా హోం మంత్రి చేశారు. అలాగే, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూనే, కేజ్రీవాల్‌ను నమ్మొద్దని ఒక శ్రేయోభిలాషిగా చెబుతున్నానని అమిత్ షా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికార, ప్రతిపక్షాలతో కలవని కొన్ని పార్టీలు
కొన్ని పార్టీలు అటు ఎన్డీయేతో కానీ, ఇటు ప్రతిపక్ష కూటమి ఇండియా అలయెన్స్‌తో కానీ కలిసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో ఆ పార్టీలు ఎలా ముందుకెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది.
వాటిలో బిజూ జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రధానమైనవి. ఈ రెండు పార్టీలు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిపై ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపాయి.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి, హనుమాన్ బేణీవాల్‌కి చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ దిల్లీ బిల్లును వ్యతిరేకించాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో మంచి సంబంధాలు ఉండడమే అందుకు కారణం.
బహుజన్ సమాజ్ పార్టీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. పంజాబ్‌కి చెందిన శిరోమణి అకాలీదళ్ ఈ బిల్లును ఓ తమాషాగా అభివర్ణించింది.
ఈ బిల్లు దిగువసభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో కొంత వ్యతిరేకత ఉంటుందని భావించారు.
అయితే, బీజేడీ, వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఆ ఆశలకు గండిపడింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క ఆశ సుప్రీంకోర్టు మాత్రమే. కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది.
సుప్రీంకోర్టు నిర్ణయం కూడా అనుకూలంగా రాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద డైలమాలో పడిపోయినట్టే.
అయితే, ఇండియా అలయెన్స్ పరంగా చూస్తే ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం విశ్వాసాన్ని పెంచింది.
ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల మధ్య బంధం బలోపేతమైంది. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఇది రిహార్సల్‌గా చెప్పొచ్చు.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య నమ్మకం పెరిగింది. కాంగ్రెస్ తమకు సంపూర్ణంగా మద్దతు తెలిపిందని ఆప్ నేతలు చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రతిపక్షాలు బలంగా తమ గొంతువినిపించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర మంత్రి షెకావత్ ఎందుకు తప్పుబట్టారు? కుళాయి నీళ్ల పథకం అమలులో ఏపీ ఎక్కడుంది?
- తెలంగాణ: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అనే విమర్శలు ఇప్పుడే ఎందుకు జోరుగా వినిపిస్తున్నాయి?
- హిరోషిమా డే: 'మంచి నీళ్ళు తాగగానే చనిపోయారు, ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... వాళ్ళు మనుషుల్లా చనిపోలేదు'
- యుక్రెయిన్ మహిళా సైనికులు: 'ఒక మగవాడు తుపాకీ కాల్చాలా వద్దా అని సంకోచిస్తాడు... కానీ, మహిళ ఎప్పుడూ వెనుకాడదు'
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే














