రోబోలన్నీ ఆడవే, మగ రోబోలు ఎందుకు కనిపించవు... ఆడ రోబోలను భవిష్యత్తులో సెక్స్ అవసరాలకు వాడుతారా?

ఎరికా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎరికా

ప్రపంచంలోని తొలి అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘‘ఐడా’’. ప్రపంచంలోని తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’.

ఐడా, గ్రేస్‌లతో పాటు సోఫియా, నాడిన్, మికా, డెస్డెమోనా (రాక్‌స్టార్ రోబో)లు కూడా ఉన్నాయి.

ఈ రోబోలు అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న.

లింగ వివక్ష కారణంగానే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాయిస్ సిస్టమ్’ రోబోలకు మహిళా రూపం ఇస్తారనే వాదన తరచుగా వినిపిస్తుంది.

అయితే, దీనికి మరో కారణం కూడా ఉంది. డిజైనర్లు తమను పోలి ఉండే రోబోలను తయారు చేస్తుండడం. ఆడవాళ్ళయితే ఆడ రోబోనే చేస్తున్నారని కూడా చెబుతుంటారు.

నాడిన్ రోబో గురించి మాట్లాడుకుంటే, దాని రూపకర్త ఒక మహిళ. ఆమె పేరు నాడియా మాగ్నెనాట్ థల్మాన్. తనను తాను ఒక ‘రోబో సెల్ఫీ’గా నాడియా చెప్పుకుంటారు.

డెస్డెమోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెనీవా సమ్మేళనంలో పాల్గొన్న డెస్డెమోనా రోబో

‘‘ప్రపంచ సమస్యల పరిష్కారంలో ఏఐ సహకారాన్ని ప్రోత్సహించడం’’ పేరుతో జెనీవా వేదికగా జులైలో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సును నిర్వహించింది.

ఈ సదస్సుకు హ్యుమనాయిడ్ రోబోలను హాజరుపర్చారు. అతిపెద్ద హ్యుమనాయిడ్ రోబోల సమ్మేళనంగా ఈ సమావేశాన్ని అభివర్ణించారు.

ఇందులో పైన పేర్కొన్న ఆడ రోబోలతో పాటు జెమినాయిడ్ అనే మగ రోబో కూడా పాల్గొంది. దీని డిజైనర్ పురుషుడు. ఆయన పేరు హిరోషి ఇషిగురో.

సదస్సులో కీలక ప్రసంగం వెలువరించిన వారిలో ‘ఐడా’ ఒకరు. ఐడా రోబో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక కళాకారిణి. అంటే బొమ్మలు గీయడం, పెయింటింగ్ వేయడం, శిల్పాలు చెక్కడంతో పాటు ఇది ప్రదర్శనలు కూడా ఇస్తుంది.

ఐడా రోబోకు మహిళా రూపం ఇవ్వడం గురించి బీబీసీతో ఐడా ప్రాజెక్ట్ ఆపరేషన్స్ హెడ్ లీసా జెవీ మాట్లాడారు.

‘‘కళ, సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. అణగారిన (underrepresented) వర్గాల గొంతును సమర్థంగా వినిపించాలని మేం కోరుకున్నాం’’ అని ఆమె చెప్పారు.

హిరోషి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెమినాయిడ్ రోబోతో రూపకర్త హిరోసి ఇషిగురో

రోబోలకు స్త్రీ రూపం ఇవ్వడం వెనుక మరో కారణాన్ని కూడా చెబుతున్నారు. మహిళల గొంతులకు సాధారణంగానే అధిక ప్రాధాన్యం ఉండటమే దీనికి కారణమని అంటున్నారు.

మహిళా డిజైనర్లు ఎక్కువగా మహిళల గొంతులనే ఇష్టపడతారని, పురుషులకు ఈ విషయంలో ఎలాంటి ప్రాధాన్యతలు ఉండవని తాను చేసిన పరిశోధనలో తెలిసినట్లు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్, హ్యుమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ నిపుణుడు కర్ల్ మెక్‌డోర్మన్ చెప్పారు.

ఏఐ ప్రారంభ వెర్షన్లు అయిన ‘సిరి’, ‘అలెక్సా’లకు కూడా మహిళల స్వరమే ఉండటం మెక్‌డోర్మన్ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

‘‘సర్వీస్‌లో నాణ్యత విషయానికొస్తే లేదా కస్టమర్ సర్వీస్ పాత్రల వరకు వచ్చేసరికి అవి పురుషుల కంటే ఎక్కువగా మహిళలతో ముడిపడి ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇలా ఏఐలకు మహిళా గొంతును ఇవ్వడం పాపులర్‌గా మారినకొద్దీ ఈ స్టీరియోటైప్‌ రాన్రాను బలపడుతుంది’’ అని మెక్‌డోర్మన్ అంటారు.

దీన్ని సెక్సిస్ట్‌గా పరిగణించవచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే, రోబోలు సాధారణంగా నిర్వహించే కస్టమర్ సర్వీస్ పాత్రలు ఒక రకంగా బానిసత్వానికి దగ్గరగా ఉంటాయని ఆయన వివరించారు.

హ్యుమనాయిడ్ రోబోలు స్త్రీ రూపాన్ని తీసుకోనప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు కథ్లీన్ రిచర్డ్‌సన్. యూకేలోని డీ మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీలో ఎథిక్స్, కల్చర్ ఆఫ్ రోబోట్స్ అండ్ ఏఐ ప్రొఫెసర్ ఆమె.

‘’15 ఏళ్ల క్రితం రోబోలను ఎక్కువగా చిన్నపిల్లల తరహాలో తయారు చేసేవారు. చిన్నపిల్లల్లా ఉంటే వాటిని సొంతం చేసుకోవడంలో ప్రజలు మరింత ఎక్కువగా సౌకర్యంగా భావిస్తారనే ఉద్దేశంతో అప్పట్లో వాటిని పిల్లల్లా తయారు చేశారు’’ అని ఆమె వివరించారు.

ఐడా

ఫొటో సోర్స్, Ai-Da Project

ఫొటో క్యాప్షన్, ఐడా రోబో

ఆండ్రాయిడ్లను మరింత తక్కువ ముప్పుగా చూపే ప్రయత్నంలో భాగంగానే నేడు మనం చూస్తున్న మహిళా రోబోల ఆవిష్కరణ జరిగిందని ఆమె చెప్పారు.

మన జీవితాల్లోకి, ముఖ్యంగా వ్యక్తిగత రంగాల్లోకి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని చొప్పించడం ద్వారా జరిగే డీపర్సనలైజేషన్, డీహ్యుమనైజేషన్‌ల భయాన్ని ప్రజల్లో తొలగించేందుకే ఈ మార్పులు జరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు.

రోబో రూపకల్పనలో ఈ భయాలకు కూడా కొంత ప్రాధాన్యత ఉందని మెక్‌డోర్మన్ అన్నారు.

‘‘ఒక మహిళా రోబోను సొంతంగా భావించడం చాలా సులభం. ముఖ్యంగా పిల్లలకు. కాబట్టి రోబోలకు ఈ రూపాన్నే ఉత్తమంగా పరిగణించారు’’ అని ఆయన వివరించారు.

2003-2005 మధ్య జపాన్‌లో రోబోలపై మెక్‌డోర్మన్ పనిచేశారు. పిల్లలతో చేసిన అనేక ప్రయోగాలతో పాటు ఆయన పనిచేసిన బృందం మహిళా రోబోలు తక్కుత ప్రమాదకరమని నమ్మినట్లుగా ఆయన వెల్లడించారు.

అధునాతన రోబోల రూపకల్పనలో వేరే ఉద్దేశం కూడా ఉండొచ్చని కథ్లీన్ రిచర్డ్‌సన్ అనుమానం వ్యక్తం చేశారు.

ఆమె రోబోలను కళతో పోలుస్తారు. ఆధునిక కళా విమర్శకులు, చారిత్రక పేయింటింగ్‌ల ఖరీదును అంచనా వేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అలాంటి సమస్యలే రోబో డిజైనింగ్‌లోనూ ఉంటాయని ఆమె నమ్ముతారు.

‘‘లారా ముల్వీ అనే ఒక ప్రసిద్ధ సిద్ధాంతకర్త, కళలో పురుషుల దృష్టి కోణం గురించి, మహిళల పేయింటింగ్‌లకు పురుషులు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారనే అంశం గురించి మాట్లాడారు. వారు సాధారణంగా మహిళలను విధేయులుగా, నగ్నంగా, పురుషుల వాంఛను తీర్చే వస్తువులుగా స్త్రీలను చిత్రించేవారు. ఇలాగే రోబోటిక్స్‌లో కూడా పురుషుల దృష్టి కోణం ప్రతిబింబిస్తోంది’’ అని ఆమె అన్నారు.

గ్రేస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వృద్ధుల సంరక్షణ కోసం నర్సింగ్ రోబో గ్రేస్‌ను రూపొందించారు

జెనీవా సదస్సులో ప్రదర్శనకు ఉంచిన మహిళా రోబోలను చూస్తున్నప్పుడు ‘‘తోలుబొమ్మల గుంపును చూస్తున్నట్లు’’గా అనిపించిందని ఆమె చెప్పారు.

పురుషాధిక్య రంగంలో సాధారణంగానే వ్యతిరేక జెండర్‌పై ఉండే ఆసక్తితో రూపకర్తలు రోబోలకు స్త్రీ రూపాన్ని ఇస్తున్నారని మెక్‌డోర్మన్ అంగీకరించారు.

రోబోల్లో ఈ లింగ వివక్ష ఎప్పుడు ముగుస్తుంది? భవిష్యత్‌లో రోబోలను లైంగిక అవసరాల కోసం సాధారణంగా వాడే రోజులు వస్తాయోమోనని రిచర్డ్‌సన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోబోలను అలాంటి అవసరాల కోసం వాడటం వల్ల నైతిక విలువలకు హాని జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె పోర్న్ రోబోలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.

లైంగిక అవసరాల కోసం రోబోలను వాడే వైఖరి పెరుగుతుండటం గురించి తన పుస్తకం ‘‘మ్యాన్ మేడ్ విమెన్’’లో ఆమె హెచ్చరించారు.

సెక్స్ అవసరాల కోసం రోబోలను ఉపయోగించే వైఖరి సైన్స్ ఫిక్షన్ సినిమాల నుంచి మార్నింగ్ టాక్స్, మ్యూజిక్ వీడియోల వరకు వ్యాపించింది. బార్సిలోనా, బెర్లిన్, మాస్కోలలో ‘‘సెక్స్ డాల్’’ వ్యభిచార గృహాలను తెరిచారు.

ఇలాంటి పనులను సాధారణీకరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు.

సెక్స్ అవసరాల చుట్టూ ఈ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు మెక్‌డోర్మన్ అన్నారు.

రోబో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1982 నాటి బ్లేడ్ రన్నర్ సినిమాలో పోలీస్ హారిసర్ ఫోర్డ్ ఒక ఆండ్రాయిడ్ (సీన్ యంగ్)తో ప్రేమలో పడతారు

‘‘ముఖ్యంగా సెక్స్‌కు సంబంధించి ఏఐతో ఒక ఆందోళన ఉంది. మాములుగానే మానవ సంబంధాలు కష్టంగా ఉంటాయి. ఏ రకమైన సాన్నిహిత్యానికైనా ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఏఐతో అది మరింత క్లిష్టంగా మారుతుంది’’ అని ఆయన వివరించారు.

కొంతమందికి డేటింగ్ కంటే పోర్నోగ్రఫీ సులభంగా అనిపిస్తుందని ఆయన అన్నారు. పైగా ఏఐ వల్ల మరో వ్యక్తితో వ్యవహరించాల్సిన అవసరం తగ్గడంతో పాటు తిరస్కరిస్తారనే భయం కూడా ఉండదు.

ఏఐకి ఉండే బానిస స్వభావం కారణంగా ప్రజల్లో స్వానురక్తి (Narcissism) పెరుగుతుందనే భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

కానీ, అలాంటి రోబోలకు అధిక ధరను నిర్దేశించడం వల్ల వాటిని సొంతం చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేయొచ్చు.

‘‘ఇతర రోబోలతో పోలిస్తే ఆండ్రాయిడ్‌లను రూపొందించడానికి చాలా ఖర్చు అవుతుంది. వాటిని వాస్తవికంగా కనిపించేలా రూపొందించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ, కొందరు విలాసవంతమైన కార్లను కొనుక్కున్నట్లే, హ్యుమనాయిడ్ రోబోలను కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)