బిహార్‌లో కుల సర్వే ఎలా జరుగుతోంది? ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

- రచయిత, చందన్ కుమార్ జాజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లో కొద్దిరోజులుగా కుల గణన జరుగుతోంది.
అయితే, రాజధాని పట్నాలోని కంకర్‌బాగ్‌లో నివసిస్తున్న బీకే సింగ్, రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే ఎందుకు చేస్తోందంటూ తప్పుబడుతున్నారు. అంతేకాదు, కుల సర్వే బృందంతో ఆయన గొడవ పడ్డారు. అధికారులు ఇంటికి చేరుకోగానే వారిపై విరుచుకుపడ్డారు.
“ఆర్థిక పరిస్థితి ఏంటని అధికారులు అడుగుతున్నారు? అగ్రవర్ణాల్లో పేదలు లేరా? నాకు పట్నంతో పాటు ఊరిలోనూ ఇల్లు ఉంది. నితీశ్ కుమార్ ఏం చేసినా తన కులం కోసమే చేశారు'' అని వాదించారు బీకే సింగ్.
క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి డేటాను సేకరించే పనిని బీబీసీ నిశితంగా పరిశీలించింది.
కొన్ని ‘అగ్ర కులాల’కు చెందిన ప్రజలు అలాంటి జనాభా గణనను కోరుకోవడం లేదని కనిపిస్తోంది. అందుకే కొన్ని కుటుంబాలు సర్వే బృందానికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా పంపించేస్తున్నాయి.
బిహార్‌లో తమ కులానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి జనాల నుంచి ఎక్కువగా అభ్యంతరం రానప్పటికీ, కుల సర్వే పేరుతో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై మాత్రం అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఇంతకూ ఏయే ప్రశ్నలు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి? ఎలాంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెబుతున్నారు? - ఈ విషయాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

కుల సర్వేపై సుప్రీంకోర్టులో పిల్
ప్రజల కోసం సర్వే బృందం కంకర్‌బాగ్‌లోని కోఠి ఎదుటకు చేరుకుంది. అయితే కుల సర్వే కోసం సిద్ధం చేసిన ప్రశ్నలపై అక్కడి వారు మండిపడ్డారు.
ఓ వ్యక్తి ప్రభుత్వంతో ఆయన సమాచారాన్ని పంచుకోలేదు. అంతేకాదు ఆయన మాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని, అధికారుల సర్వేను ఆయన తప్పుబట్టారు.
యాదృచ్ఛికంగా ఆయన ఒక ‘అగ్రవర్ణ’ కుటుంబ సభ్యుడు. అయితే కుల సర్వే టీం మాత్రం తమ బాధ్యత తాము నిర్వర్తిస్తున్నామని, తమకు ఇచ్చిన ప్రశ్నల జాబితా ప్రకారమే అడుగుతున్నామని చెప్పింది.
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో జరిగిన తొలిదశ కుల సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లకు నంబర్లు ఇచ్చారు.
ఇందులో ఇంటి పెద్ద పేరు నమోదు చేసి ఇంటికి లేదా భవనానికి నంబర్ ఇచ్చారు. ఇలా దాదాపు రెండు కోట్ల 59 లక్షల కుటుంబాల జాబితాను సిద్ధం చేశారు.
రెండో దశలో కుల సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమై మే 15న ముగియాల్సి ఉండగా, మే మొదటి వారంలో దీనిపై పట్నా హైకోర్టు స్టే విధించింది. ఆగస్టు 1న స్టే ఎత్తివేసింది. దీంతో సర్వే మళ్లీ ఊపందుకుంది.
రెండో దశలో అడగడానికి 17 ప్రశ్నలను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ ప్రశ్నలతోనే సర్వే బృందం గ్రౌండ్‌లోకి దిగింది.
ఇప్పటికైతే రాష్ట్రవ్యాప్తంగా కులాల సర్వే కోసం డేటా సేకరణ పూర్తయింది. చట్టపరమైన ఆంక్షలు తొలగితే ఈ ఆగస్టులో కుల సర్వే నివేదికను సిద్ధం చేసే వీలుంది.
అయితే కుల సర్వేపై సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలైంది. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లను ఆగస్టు 14న విచారిస్తామని సుప్రీంకోర్టు ఆగస్టు 7న తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

కుల సర్వేలో ప్రశ్నలేంటి?
బిహార్‌లో కుల సర్వే డేటాను సేకరించడానికి ప్రజలను అడుగుతున్న ప్రధాన ప్రశ్నలు ఇవే..
- కుటుంబ సభ్యుల పేర్లేంటి?
- ప్రతి సభ్యుని వయస్సు, లింగం, మతం, కులం
- కుటుంబంలోని ఏ సభ్యుడు/సభ్యురాలు ఎంత వరకు చదువుకున్నారు?
- కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? వ్యాపారం, ఉద్యోగం లేదా చదువులు మొదలైనవి.
- నగరంలో ఎవరి పేరు మీదనైనా ఇల్లు ఉందా?
- వ్యవసాయ భూమి ఉందా? లేదా?
- భూమి లేదా ఇల్లు ఉంటే, దాని పూర్తి సమాచారం ఏమిటి?
- కుటుంబ సభ్యులకు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉందా?
- ఇంటి యజమాని టూ వీలర్, త్రీ వీలర్ లేదా ఫోర్ వీలర్ కలిగి ఉన్నారా?
- కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వచ్చే మొత్తం ఆదాయం ఎంత?
ఈ ప్రశ్నలన్నీ కుల సమాచారం సేకరించడానికి మాత్రమేనని నితీశ్ కుమార్ ప్రభుత్వం చెబుతోంది.
ఆర్థిక, విద్య తదితర సమాచారం ఇస్తే ఏదైనా విధానాన్ని రూపొందించడంలో తమకు సహాయపడుతుందని ప్రభుత్వ ఉద్దేశం.
రాష్ట్ర ప్రజల గురించిన పూర్తి సమాచారం ఉంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అవసరమైన వారికి చేరవేయడంలో సహాయపడుతుందని చెబుతోంది.
అయితే, ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ గణాంకాలను కుల ఆధారిత సమీకరణకు ఉపయోగిస్తుందని కూడా అంటున్నారు.
అందుకే వాళ్లు అడిగే ప్రశ్నలపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
బిహార్ ఎన్నికల రాజకీయాల్లో కుల గుర్తింపు ఇప్పటికీ చాలా బలంగా ఉంది.

కుల సర్వేలో ఇన్ని ప్రశ్నలు ఎందుకు?
ఒక కుటుంబానికి ఎంత ఆస్తి ఉంది? వారి ఆదాయం ఎంత? వంటి సమాచారం ఇవ్వడానికి కొంత మంది ఇష్టపడటం లేదని బీబీసీ గుర్తించింది.
అంతేకాకుండా చాలా సందర్భాల్లో ప్రజలు తమ విద్యకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు.
పట్నాకు చెందిన నంద్ శ్యామ్ శర్మ ఫిర్యాదు ఏమిటంటే, కుల సర్వేలో ఇన్ని ప్రశ్నలు ఎందుకు?
పట్నాలో ఓ పెద్ద ఇంటిలో ఉంటున్నారు నంద్ శ్యామ్. సర్వే బృందం చాలాసేపు బతిమలాడటంతో ఆయన మొదటి అంతస్తు నుంచి కిందికి వచ్చారు.
వీరికి ఇంటి అద్దె ద్వారా కూడా కొంత ఆదాయం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రశ్నలను వినడానికి ఆయన కంగారుపడలేదు. కానీ, విద్యార్హత, ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలపై శ్యామ్ కొంచెం అసౌకర్యంగా కనిపించారు.
కులం గురించిన సమాచారం సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్నప్పుడు మిగిలిన ప్రశ్నల అవసరం ఏంటని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.

మాకైతే ఏ ప్రశ్నతోనూ సమస్య లేదు: మహిళ
కుల సర్వే పట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నట్లు బీబీసీ తెలుసుకుంది. ఒక బృందం పట్నాకు చెందిన సుధాకుమారి ఇంటికి చేరుకుంది.
ఈ బృందం ఇంతకు ముందే ఆమె ఇంటికి వెళ్లింది. కానీ, ఇంట్లో వాళ్లు ఉద్యోగం, ఇతర పనుల కారణంగా బయటికి వెళ్లారు. దీంతో సర్వే కోసం మళ్లీ వెళ్లారు అధికారులు. వారు తిరిగి రావడంపై ఆ ఇంటి వాళ్లు కూడా సంతోషం వ్యక్తంచేశారు.
అంతేకాదు ఉద్యోగులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కుటుంబ సభ్యులు. సుధాకుమారి దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లు సర్వే బృందానికి తెలిపారు. ఆమె సంపాదన విషయాలు కూడా పంచుకున్నారు.
“మాకు ఏ ప్రశ్నతో సమస్య లేదు. అడిగే ప్రశ్నలన్నీ సమంజసమే. కులం గురించి సమాచారం ఇవ్వడంలో మాకు ఇబ్బంది లేదు. మనం ఎవరో అందరికీ తెలుసు. ఇరుగుపొరుగుకు, బంధువులకు తెలిస్తే వచ్చే నష్టం ఏమిటి” అని సుధాకుమారి అన్నారు.
పట్నాకు చెందిన ప్రభాత్ కుమార్ కూడా ఈ సర్వేను సమర్థిస్తున్నారు.
“మాకు ఏ ప్రశ్నతోనూ ఇబ్బంది లేదు. దేశంలో ఏ కుల జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, సంపాదన ఇలా ఏది అడిగినా వాటన్నింటికీ సమాధానం చెప్పాను'' అని అన్నారు ప్రభాత్.
సర్వేలో ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే అది వారికే నష్టమని కుల గణనలో నిమగ్నమైన ఒక ఉద్యోగి బీబీసీకి తెలిపారు.
ప్రభుత్వం వద్ద ప్రజల తరగతి, కులానికి సంబంధించిన సరైన గణాంకాలు ఉంటే, ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి సులభం అవుతుందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ బెర్రీ: ఈ పండ్లు తింటే గుండె జబ్బు, క్యాన్సర్ దూరమవుతాయా?
- రోబోలన్నీ ఆడవే, మగ రోబోలు ఎందుకు కనిపించవు... ఆడ రోబోలను భవిష్యత్తులో సెక్స్ అవసరాలకు వాడుతారా?
- ధందో ఇన్వెస్ట్మెంట్: బొమ్మాబొరుసు సూత్రంతో మదుపు లాభదాయకమా... వారెన్ బఫెట్ ఏకలవ్య శిష్యుడు ఏం చెబుతున్నారు?
- ‘‘స్నైపర్ అంటే చావుతో ఆట ఆడినట్లే... నువ్వు ఆడా, మగా అన్న సంగతి మిసైల్‌కు తెలియదు’’- యుక్రెయిన్ మహిళా సైనికుల అనుభవాలు
- పోలవరం: సీఎం జగన్ మాటలు నీటి మూటలేనా, నిర్వాసితుల గురించి ఏం చెప్పారు, ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














