రోజూ ఒకే సమయానికి నిద్రపోకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్
పని ఉన్న రోజుల్లో, పని లేని సమయాల్లో నిద్ర పోయే అలవాట్లలో చిన్న మార్పులొచ్చినా కూడా మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాకు అనారోగ్యం వాటిల్లే అవకాశముందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇది కొంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోని ‘‘సోషల్ జెట్‌లాగ్’’ అనుసరించే వ్యక్తుల్లో సంభవించవచ్చని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు.
వారాంతంతో పోలిస్తే వారంలో నిద్ర పోయే సమయాలు, నిద్ర లేచే సమయాల్లో తేడా ఉండటమే సోషల్ జెట్‌లాగ్.
పని ఉన్న రోజుల్లో ఒకలాగా, పనిలేని రోజుల్లో ఒక రకంగా నిద్రపోతుంటారు కొంత మంది. ఒకే రకమైన నిద్రా సమయాలను పాటించరు.
నిద్రా సమయాలలో బాగా ఆటంకం ఏర్పడే వారికి ముఖ్యంగా షిఫ్ట్ వర్క్‌లలో పనిచేసే వారికి ఆరోగ్యంపై సోషల్ జెట్‌లాగ్ ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది.
నిద్రపోయే సమయం, నిద్రలేచే సమయం ఒకే విధంగా ఉండేలా చూసుకోవడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.
కింగ్స్ కాలేజీ లండన్ సైంటిస్ట్‌లు సుమారు వెయ్యి మందిపై ఈ అధ్యయనం చేపట్టారు.
సాధారణంగా ఒక వారంలో మీరు రాత్రి నిద్ర పోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వచ్చినా పేగుల్లోని బ్యాక్టీరియా ప్రభావితమయ్యే ప్రమాదముందని గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ జెట్‌లాగ్ వల్ల ఏమవుతుంది?
మీ జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల బ్యాక్టీరియాలు ఉండటం అత్యంత అవసరం. పలు రకాల వ్యాధులు రాకుండా శరీరం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన బ్యాక్టీరియాల కలయిక అనేది చాలా ముఖ్యం.
‘‘సోషల్ జెట్‌లాగ్ అనేది మీ ఆరోగ్యానికి అంతగా సహకరించని మైక్రోబయోటా జాతులను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది’’ అని హెల్త్ సైన్స్ కంపెనీ జోయ్ సీనియర్ న్యూట్రిషియన్ సైంటిస్ట్, ఈ అధ్యయన రచయిత కేట్ బెర్మింగ్హం చెప్పారు.
బ్రిటన్‌లో 40 శాతం మందికి పైగా జనాభాపై సోషల్ జెట్‌లాగ్ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనం తెలిపింది. టీనేజర్లు, కాస్త పెద్దవారిలో ఇది సర్వసాధారణంగా మారినట్లు పేర్కొంది. అయితే, వయసు పెరిగే కొద్ది ఇది తగ్గిపోతుంది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్రపోయే సమయాలను, రక్త నమూనాలను పరిశీలించారు.
ఫుడ్ క్వశ్చనీర్‌లో వారు తిన్న ప్రతీది రికార్డు చేశారు. మల నమూనాలను సేకరించారు.
సోషల్ జెట్‌లాగ్‌తో ఉన్న వారు ఎక్కువగా బంగాళదుంపల క్రిస్ప్స్‌ను, చిప్స్‌ను తిన్నారు. షుగరీ డ్రింక్స్‌ను తీసుకున్నారు. అయితే, పండ్లు, నట్స్ ఉన్న ఆహారాన్ని మాత్రం వారు తక్కువగా తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువగా షుగరీ ఫుడ్స్‌ను తినాలనిపిస్తుంది
స్థిరమైన నిద్రా సమయాలను పాటించే వారి కంటే సోషల్ జెట్‌లాగ్ ఉన్న వారు తక్కువ ఫైబర్‌ను తీసుకున్నట్లు అంతకుముందు పరిశోధనలు తెలిపాయి.
సోషల్ జెట్‌లాగ్ వల్ల బరువు పెరగడం, అనారోగ్యం పాలవడం, మానసిక అనారోగ్యం వంటివి తలెత్తుతున్నట్లు ఇతర అధ్యయనాలు గుర్తించాయి.
సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆహార ఎంపికలపై కూడా ప్రభావం పడుతుంది.
ఈ వ్యక్తులకు ఎక్కువగా షుగరీ ఫుడ్స్‌ను తినాలనిపిస్తుందని డాక్టర్ బెర్మింగ్హం చెప్పారు.
దీంతో అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇది పేగులలోని నిర్దిష్టమైన బ్యాక్టీరియా స్థాయులపై ప్రభావం చూపుతుంది.
సోషల్ జెట్‌లాగ్ గ్రూప్ వ్యక్తుల పేగుల్లో ఎక్కువగా ఆరు రకాల మైక్రోబయోటా జాతులు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. వీటిలో మూడు రకాల వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని పరిశోధకులు గుర్తించారు.
నిద్ర, ఆహారం, పేగుల్లోని బ్యాక్టీరియాకు మధ్య సంబంధం చాలా క్లిష్టమైంది. ఇంకా గుర్తించాల్సింది చాలా ఉంది అని పరిశోధకుల బృందం తెలిపింది. ఇదే సమయంలో, స్థిరమైన అలవాట్లను చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
‘‘రెగ్యులర్‌గా ఒకే విధమైన నిద్ర వేళలను అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం అనేది మనందరం చేయగలిగిన తేలికైన జీవనశైలి ప్రక్రియ. గట్ మైక్రోబయోమ్ ద్వారా ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది’’ అని కింగ్స్ కాలేజీ లండన్ డాక్టర్ సారా బెర్రీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యకరమైన ఆహారమంటే ఏమిటి?
బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) వెబ్‌సైట్ ప్రతిపాదించిన సూచనలు..
- రోజూ ఐదు సార్లు వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఆహారంగా తీసుకోవాలి.
- బంగాళదుంపలు, బ్రెడ్, రైస్ లేదా పాస్తా వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను భోజనంలో తినాలి.
- పాలు, పెరుగు వంటి వాటికి ప్రత్యామ్నాయాలను ఆహారంలో తీసుకోవాలి.
- వీలైన ప్రతీసారి తక్కువ ఫ్యాట్ లేదా తక్కువ షుగర్ ఉన్న వాటిని తినాలి.
- బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు, మాంసం, ఇతర ప్రొటీన్లను తినాలి.
- రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.
ఇవి కూడా చదవండి:
- నిద్ర తగ్గితే వచ్చే చిక్కులివే...
- బెడ్షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?
- కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి? నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?
- నిజ జీవితంలో ‘ఇన్సెప్షన్’ ప్రయోగం.. ల్యూసిడ్ డ్రీమ్స్‌తో కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














