కచ్చతీవు: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య తగవుకు కారణమైన ఈ దీవి కథ ఏంటి?

కచ్చతీవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-శ్రీలంకల మధ్య కచ్చతీవు విషయంలో వివాదం ఉంది.

‘‘దేశాన్ని ముక్కలు చేయడం గురించి కాంగ్రెస్ మాట్లాడుతోంది. కచ్చతీవును వాళ్లు ఏం చేశారో అడగండి. అది భారతదేశంలో భాగం కాదా? కచ్చతీవును తిరిగి భారత్‌లో కలపాలని డీఎంకే నేతలు నాకు లేఖలు రాస్తున్నారు. ఇదంతా ఇందిరాగాంధీ హయాంలోనే జరిగింది’’ అని గత ఏడాది తమ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా వ్యాఖ్యానించారు మోదీ.

ఎన్డీయే ప్రభుత్వం భారతమాతను ముక్కలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా, కచ్చతీవు దీవిని విదేశాలకు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెసేనని ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో ఆరోపించారు.

ప్రధాని వ్యాఖ్యల తర్వాత అసలు ఈ కచ్చతీవు దీవి కథ ఏంటి అన్న సందేహం చాలామందిలో కలిగింది.

వీడియో క్యాప్షన్, కచ్చతీవు దీవి ఎక్కడుంది?

కచ్చతీవు ఎక్కడుంది?

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో, భారత, శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు. ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్‌లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వమే ఒక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించింది.

భారత్, శ్రీలంకల మధ్య పాక్ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్‌గా పని చేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు.

వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం. ఇక్కడ పగడపు దిబ్బలు(కోరల్ రీవ్స్), ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించ లేవు.

సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు ద్వీపం ఉంది. రామేశ్వరానికి నుంచి సుమారు 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 285 ఎకరాలు కాగా, గరిష్టంగా 300 మీటర్ల వెడల్పు ఉంటుంది.

మనుషులు ఉండని ఈ ద్వీపంలో సెయింట్ ఆంటోనీ చర్చ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-మార్చి నెలలో ఇక్కడ వారంరోజుల పాటు పూజలు జరుగుతాయి. 1983లో శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో ఇక్కడి ఆరాధనా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.

20 శతాబ్ధపు ప్రారంభంలో రామనాథపురానికి చెందిన సీనికుప్పన్ పడయాచి అనే వ్యక్తి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని ‘ది గెజిటీర్’ చెబుతోంది. తంగాచి మఠానికి చెందిన ఒక పూజారి ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ద్వీపాన్ని బ్రిటీషర్లు ఆక్రమించారు.

కచ్చతీవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రంలో చేపలు పడుతున్న మత్స్య కారుడు

ఈ దీవిపై కంట్రోల్ ఎవరిది?

బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రాంతంలో కచ్చతీవు ఉంటుంది. అయితే, ఈ దీవి గురించి భారత్, శ్రీలంకల వివాదం ఉంది. 1976 వరకు ఈ దీవి తనదేని భారత్ చెప్పుకునేది. అప్పటికి అది శ్రీలంక ఆధీనంలో ఉంది.

1974-76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకెల మధ్య చర్చలు జరిగాయి. సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ఆధీనంలోకి వెళ్లింది. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది.

శ్రీలంక నుంచి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.

కచ్చతీవు
ఫొటో క్యాప్షన్, కచ్చతీవు

కచ్చతీవు కోసం కేంద్రంతో తమిళనాడు తగవు

1991లో తమిళనాడు శాసన సభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, కచ్చతీవును భారత్‌లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేసింది. అయితే, ఇది కేవలం తీర్మానాలతోనే ఆగిపోలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న రెండు ఒప్పందాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

బ్రిటిష్ హయాంలో ఏం జరిగింది?

కచ్చతీవు ఒకప్పుడు రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేదని, 1902లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కచ్చతీవును ఆ రాజు లీజుకు తీసుకున్నారనే వాదనలున్నాయి. బ్రిటీషర్ల నుంచి లీజుకు తీసుకున్న భూభాగాలపై రామనాథపురం రాజు చెల్లించాల్సిన అద్దెల ఖాతాలో కచ్చతీవు ప్రాంతం పేరు కూడా ఉంది. ఆ తర్వాత కచ్చతీవు 1974 వరకు భారతదేశంలో భాగంగా ఉంది.

అంతకుముందు 1880లో మహమ్మద్ అబ్దుల్ కదిర్ మరైకెరె, ముత్తుచామి పిళ్లై, రామనాథపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎడ్వర్డ్ టర్నర్ మధ్య ఒక లీజు ఒప్పందం జరిగింది.

ఈ లీజు కింద 70 గ్రామాలు, 11 దీవులలో రంగుల తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించకునేందుకు లీజు దారులు అధికారం పొందారు. ఆ 11 దీవుల్లో కచ్చతీవు కూడా ఒకటి.

1885లో కూడా ఇదే తరహాలో మరొక లీజు ఒప్పందం జరిగింది. 1913లో రామనాథపురం రాజు, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ లీజులో కచ్చతీవు పేరు కూడా చేర్చారు.

భారత్, శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటీష్ ప్రభుత్వం, కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ చెప్పలేదు.

వీడియో క్యాప్షన్, పిల్లలకు పాలు కొనాలన్నా అనుకూలించని దారుణ పరిస్థితి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)