ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పులు, రాజద్రోహం నేరం కాదు... ఇంకా ఏమేం మారుతున్నాయి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఉమాంగ్ పోద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత శిక్షాస్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం(ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్)ల స్థానంలో కొత్త శాసనాలను తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టారు.
ది భారతీయ న్యాయ సంహిత-2023, ది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, ది భారతీయ సాక్ష్య బిల్-2023 పేరుతో ఈ మూడింటిని లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు.
ఈ మూడు బిల్లులను పార్లమెంటు స్థాయీసంఘం సమీక్షకు పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేరాల విచారణ ప్రక్రియలు ఇప్పుడు మూడు చట్టాలు అత్యంత ముఖ్యమైనవి. ఏ నేరానికి ఏ శిక్ష విధించాలన్నది భారతీయ శిక్షాస్మృతి చెప్తుంది. అరెస్టులు, విచారణ పద్ధతులు అన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉంటాయి. కేసులో నిజాలను రుజువు చేయడం ఎలా, వాంగ్మూలాలు ఎలా రికార్డ్ చేయాలి, రుజువు చేసుకోవాల్సిన, చూపించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటందనేది సాక్ష్యాధారాల చట్టం చెప్తుంది.
అయితే, ఇప్పుడున్న ఈ మూడు చట్టాలు వలసపాలనకు ఆనవాళ్లని.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వీటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నామని హోం మంత్రి అమిత్ షా సభలో చెప్పారు.
1860 నుంచి ఇప్పటివరకు భారత్‌లోని నేర న్యాయవ్యవస్థ బ్రిటిషర్లు చేసిన చట్టాల ఆధారంగానే పనిచేసిందని, ఆ స్థానంలో ఇప్పుడు భారతీయ ఆత్మతో కూడిన మూడు చట్టాలు అమలులోకి వస్తాయని బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా అన్నారు.
ఇవి చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చిన తరువాత దేశ నేర న్యాయవ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని, చాలా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
‘ఇప్పుడున్న మూడు చట్టాలలో వలస పాలన గుర్తులు ఉన్నాయి. వీటిని అప్పట్లో బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదించారు, ఆ తరువాత భారత్‌లో అమలు చేస్తున్నారు. ఈ చట్టాలలో క్రౌన్, యునైటెడ్ కింగ్‌డమ్, లండన్ గెజిట్ వంటి వలసవాద ఆనవాళ్లు 475 ఇప్పటికీ ఉన్నాయి’ అని అమిత్ షా సభకు చెప్పారు.
కొత్త చట్టాలతో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా ఆయన సభకు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
- న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి, న్యాయ ప్రక్రియను సులభతరం చేయడానికి ‘ది భారతీయ న్యాయ సంహిత బిల్’ ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు.
- దేశం గత కొన్ని దశాబ్దాలలో సాంకేతికంగా సాధించిన ప్రగతికి ప్రస్తుత చట్టం చాలకపోవడంతో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘ది భారతీయ సాక్ష్య బిల్-2023’ ప్రతిపాదిస్తున్న అమిత్ షా చెప్పారు.
- ఇక ఇప్పుడున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ‘ది భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023’ ప్రతిపాదించడానికి న్యాయ విచారణ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశమే కారణమని తెలిపారు.
- కొత్త చట్టంలో కేసు పరిష్కారానికి టైమ్ లైన్ ఉంటుందని, ఫోరెన్సిక్ సైన్స్ నిబంధన కూడా ఉంటుందని తెలిపారు.
- ప్రస్తుతం భారత్‌లో కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉందని.. ఫోరెన్సిక్ సైన్స్ సాయంతో కన్విక్షన్ రేట్ 90 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
- మరోవైపు ప్రస్తుతం ఉన్న చట్టాలలో అనేక మార్పులను ఈ మూడు బిల్లులు సూచిస్తున్నాయి. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే రాజద్రోహాన్ని ఇకపై నేరంగా పరిగణించరు.

ఫొటో సోర్స్, Getty Images
- 2022 మే నెలలో రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వాలు రాజద్రోహం కేసులలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పింది.
- కొత్త చట్టంలోని సెక్షన్ 150 కింద వేరే నేరాన్ని పేర్కొన్నారు. దాని ప్రకారం.. భారత్ నుంచి విడిపోవడం, వేర్పాటువాద భావన కలిగి ఉండడం, దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే పనులను ఇందులో నేరంగా పేర్కొన్నారు.
- ఈ నేరానికి జీవిత ఖైదు కానీ ఏడేళ్ల శిక్ష కానీ విధించాలని ప్రతిపాదించారు. ఇప్పుడు రాజద్రోహ చట్టంలో జీవిత ఖైదు కానీ మూడేళ్ల జైలు శిక్ష కానీ విధించేలా ఉంది.
- కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులలో కొన్ని నేరాలను జెండర్ న్యూట్రల్ చేశారు. అదేసమయంలో కొత్తగా మరికొన్నిటిని నేరాల జాబితాలో చేర్చారు. సిండికేట్ నేరాలు, బాంబుల తయారీ వంటివి నేరాల పరిథిలోకి తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
- దీంతోపాటు తొలిసారి సమాజ సేవను శిక్షల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాలలో న్యాయమూర్తులు కొందరికి శిక్షగా సమాజ సేవ చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ చట్టంలో అలాంటి నిబంధన ఉండేది కాదని, ఇప్పుడు దాన్ని చట్టంలో పెడుతున్నామని అమిత్ షా చెప్పారు.
- అలాగే కొన్ని నేరాలకు శిక్షల స్థాయి పెంచారు. సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు గరిష్ఠంగా పదేళ్ల శిక్ష ఉండేది, కొత్త చట్టాలలో అది గరిష్ఠంగా 20 ఏళ్లు ఉండొచ్చు.
- సాక్ష్యాధారాల చట్టంలో ఎలక్ట్రానిక్ సమాచారాన్ని కూడా చేర్చారు. అలాగే సాక్షులు, బాధితులు, నిందితులు ఎవరైనా కూడా ఎలక్ట్రానిక్ విధానంలో కోర్టులో హాజరుకావొచ్చు.
- కొత్త చట్టాల ప్రకారం అభియోగ పత్రం నమోదు చేయడం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ వరకు అనేక మార్పులు ఆన్‌లైన్‌లో సాధ్యమవుతాయని అమిత్ షా చెప్పారు.
- కొత్త బిల్లులో ఫోరెన్సిక్ సైన్స్ వినియోగం, విచారణ కోసం టైమ్ లైన్ నిర్దేశిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మూడు బిల్లులను పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించారు.
2020 మే నెలలో మూడు పాత చట్టాలలో మార్పులు సూచించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ జడ్జ్‌లు, సీనియర్ లాయర్లు, రిటైర్డ్ ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది.
ఇప్పుడు కొత్త బిల్లలు పార్లమెంటు స్థాయీసంఘానికి పంపించడంతో ప్రతిపక్షాలు కూడా తమ అభిప్రాయాలు తెలియజేస్తాయి.
అనంతరం కొత్త బిల్లులను లా కమిషన్‌కు పంపిస్తారు.అనంతరం పార్లమెంటులో దీనిపై చర్చిస్తారు.
బిల్లుల తుది ముసాయిదా వెలువడితే పూర్తిగా ఎలాంటి మార్పులు రానున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉండనుందనే స్పష్టత వస్తుంది.
చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేసే లక్ష్యంతో చాలా కేసులను మూడేళ్లలో పరిష్కరించాని లక్ష్యంగా పెట్టుకున్నామని, అలా చేయడం వల్ల పెండింగ్ కేసుల భారం తగ్గుతుందని అమిత్ షా సభలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తల్లిపాలు బిడ్డలకు ఎప్పుడు, ఎలా మాన్పించాలి?
- మగ శరణార్థుల కోసం తీరంలో తేలియాడే నివాసం.. లోపల ఏముంది?
- ఎస్ఎస్ వైతరణ: టైటానిక్ కన్నా 20 ఏళ్ళ ముందు 700 మందితో గుజరాత్ జలాల్లో మునిగిపోయిన భారీ నౌక... అసలేం జరిగిందో చెప్పడానికి ఒక్కరూ మిగల్లేదు
- ఫ్రెండ్స్‌తో ఎక్కువగా గడిపితే ఆరోగ్యంగా ఉంటామా
- రోజూ ఒకే సమయానికి నిద్రపోకపోతే ఏమవుతుంది?














