Gen Z: కార్పొరేట్ ప్రపంచంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ‘జెనరేషన్ జీ’ సిద్ధంగా ఉందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పాయల్ భుయాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కార్పొరేట్ ప్రపంచపు వర్క్‌ఫోర్స్‌లో జెన్ Z అడుగు పెడుతోంది. మిలీనియల్స్, జెన్ Zకి చెందిన యువతీ యువకులు కార్పొరేట్ ప్రపంచంలో వేగంగా న్యాయకత్వ స్థానాలకు ఎదుగుతున్నారు.
1980 ప్రారంభ కాలం నుంచి 1990 చివరి వరకు పుట్టిన వారిని మిలీనియల్స్‌గా లేదా జనరేషన్ వై (Gen Y) అని పిలుస్తుంటారు. వీరి వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. దీని తర్వాత జనరేషన్‌ను అంటే 1990ల చివరి నుంచి 2010 తొలినాళ్ళ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళను జెన్ Z అని అంటున్నారు.
దశాబ్దాల అనుభవం లేకున్నప్పటికీ ఈ జెనరేషన్ Z కార్పొరేట్ ప్రపంచ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలదా? ఇప్పుడు ఈ విషయం మీదే చర్చ సాగుతోంది.
నిష్టా యోగేష్ నాలుగేళ్ల క్రితం ‘హునార్ ఆన్‌లైన్ కోర్సస్’ అనే కంపెనీని ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు, వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిష్టా యోగేష్ కంపెనీ వారికి ఆన్‌లైన్ శిక్షణ ఇస్తోంది. 150 మంది వ్యక్తులకు నిష్టా నాయకత్వం వహిస్తున్నారు.
కానీ, ఒక విషయం 30 ఏళ్ల నిష్టా యోగేష్‌ను, మిగతా వారి నుంచి భిన్నంగా కనిపించేలా చేస్తోంది.
అదేమిటంటే, చాలా మంది సీఈవోల కంటే చాలా తక్కువ వయసులోనే నిష్టా యోగేష్ ఈ బాధ్యతలు చేపట్టారు.
‘‘నేను నా కంపెనీని ప్రారంభించిన తర్వాత 18 ఏళ్ల వయసు నుంచే కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం ప్రారంభించాను.
కంపెనీలో ప్రతి రోజూ నేను తీసుకునే నిర్ణయాలు, నా నాయకత్వ నాణ్యత పట్ల మరింత విశ్వాసాన్ని నింపుతున్నాయి’’ అని నిష్టా ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఎక్కువ మంది భావించే విషయం ఏంటంటే, కంపెనీని నిర్వహించేందుకు లేదా ఒక బృందానికి నాయకత్వం వహించేందుకు దశాబ్దాల పాటు అనుభవం కావాలనుకుంటారు.
కానీ, ఇవాళ యువతరం ఎంతో కాలంగా ఉన్న ఈ పోకడను సవాలు చేస్తోంది.
‘మిలీనియల్స్’, ‘జెన్ జెడ్’లు టాప్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే సమయం వచ్చింది. వీరిలో చాలా మంది సొంతంగా కంపెనీలను తెరుస్తున్నారు.
ఈ తరం సరికొత్త ఆలోచనా విధానాలతో, వినూత్నంగా పనిచేస్తూ కంపెనీలకు కొత్త అవుట్‌లుక్‌ను తీసుకొస్తుంది.
ఈ తరం యువత తమదైన శైలిలో నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అనుభవం తక్కువ
కొత్తగా ఎంపికైన ఎస్ అండ్ పీ 500 సీఈవోల్లో మూడు వంతుల మంది 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారేనని మెకెన్సీ అండ్ కంపెనీ జూన్ 2023లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. 2018 డేటా కంటే ఈ సంఖ్య రెండింతలు ఎక్కువ.
సీఈవోల సగటు వయసు సుమారు 54 ఏళ్లుగా అంచనాలున్నాయి.
కానీ, చాలా డేటాలు యువత ఉన్నత స్థానాలను చేపట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలుపుతున్నాయి.
2021లో యెర్నెస్ట్ అండ్ యంగ్(ఈ&వై) చేపట్టిన సర్వేలో, సొంతంగా తమ పనిని ప్రారంభించుకునేందుకు తాము ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లు 45 శాతం మంది చెప్పారు.
కంపెనీని ఎలా నడపాలి, కంపెనీకి నిధులు ఎలా వస్తాయి లేదా ఎలా ఆదాయాలు ఆర్జించాలి వంటి విషయాలను చిన్న వయసులో అర్థం చేసుకునేందుకు ఎవరికైనా కష్టమే.
కానీ, యువ తరానికి పెద్ద ఎత్తున పనిచేయు సామర్థ్యం ఉందని, కొన్ని విషయాలపై వారు శ్రద్ధ పెట్టాల్సి ఉందని, వాటి అవసరం ఉందని కార్పొరేట్ ప్రపంచంలో 40 ఏళ్ల అనుభవం కలిగి వివిధ రంగాల్లోని కంపెనీల్లో హెచ్‌ఆర్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించిన దీపక్ బరారా చెప్పారు.
ఆయన ప్రస్తుతం పీపుల్ ఏ2జెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు.
‘‘ఈ తరం చాలా అసహనంతో ఉంటుంది. వీరికి వెంటనే ఫలితాలు కావాలి. కానీ, జీవితంలో అలాంటివి జరగవు. చాలా విషయాలకు సమయం పడుతుంది. కొన్ని సార్లు కష్టమైనా నిజాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది.
కంపెనీ ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు, వ్యాపారాలు సరిగ్గా సాగని సమయంలో వాటిని ఎలా తట్టుకోవాలో చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సహనమనేది చాలా అవసరం’’ అని ఆయన తెలిపారు.
ఈ యువతరంలో ఉన్న ఉన్నతమైన విషయం వారు టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవడమని మార్కెట్ నిపుణులు చెప్పారు. కానీ, వారిలో పర్సనల్ టచ్ లోపించింది.

ఫొటో సోర్స్, NISHTHA YOGESH
‘మాకెంత తెలియదో మాకు తెలుసు’
‘‘మా తరానికి చెందిన వ్యక్తులు పనిచేసేటప్పుడు, వారు దీన్ని ఒక సేవలాగా చూసేవారు. కానీ, నేటి తరం వారిని వారు పారిశ్రామికవేత్తగా చూసుకుంటున్నారు. వారి పని కోసం బాధ్యతలు తీసుకుంటున్నారు.
ఈ యువతరం ఎక్కువ టెక్ శావీగా ఉంది. ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా కలవాలి, సోషల్ మీడియాను ఎంత బాగా వాడుకోవాలి అనే విషయాలు వారికి బాగా అర్థమవుతున్నాయి’’ అని హెచ్‌ఆర్ నిపుణుడు దీపక్ బరారా చెప్పారు.
యవతలో ‘టీమ్ స్పిరిట్’ అనేది చాలా బలంగా ఉందని చాలా అధ్యయనాలు చెప్పాయి.
వారితో పాటు ప్రతి ఒక్కర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వైవిధ్యత, ఇంక్లూజిన్ వారి మంత్రగా మారిందని దీపక్ తెలిపారు.
జనరేషన్ వై, జనరేషన్ జెడ్‌లకు ఉన్న నైపుణ్యాలపై మాట్లాడిన హునార్ సీఈవో నిష్టా యోగేష్.. ‘‘కార్పొరేట్ ప్రపంచంలో నాయకత్వ శైలి, యువ భారతంలో నాయకత్వ శైలి రెండూ కూడా భిన్నమైనవి’’ అని తెలిపారు.
‘‘మా శైలి చాలా సాధారణంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. పని పూర్తి చేసేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తోన్న టీమ్‌ని మరో కోణంలో నుంచి అర్థం చేసుకునేందుకు మేం నిజంగా ప్రయత్నిస్తాం. వారికేం ముఖ్యమో చూస్తాం.
మీ ముందున్న వ్యక్తులకు ఏం కావాలి, వారెలా ఎదుగుతారనే విషయాలను అర్థం చేసుకున్నప్పుడు, టీమ్ సభ్యులు ఎవరైనా కూడా మీకోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఎంత వారికి తెలియదో యంగ్ లీడర్లకు తెలుసని నేను చెప్పగలను’’ అని నిష్టా యోగేష్ అన్నారు.
యువతరం ప్రస్తుతం ‘‘నేను చెప్పాను, అప్పుడు చెప్పాను’’ అనే వైఖరి కాకుండా, విషయాలను అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని నిష్టా చెప్పారు.
ఇంగ్లీష్‌లో దీన్ని ఎంపథెటిక్ లీడర్‌షిప్ అంటే సానుభూతి కల నాయకత్వం అంటారని అన్నారు.
‘నేను సొంతంగా వ్యాపారం పెడతానని నాకు తెలుసు’
సంప్రదాయ నాయకత్వ లక్షణాలు యువ నాయకత్వానికి లేవని వారు అర్థం చేసుకున్నారు.
కానీ, వారు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.
పదేళ్ల క్రితం 19 ఏళ్ల త్రిష్‌నీత్ అరోరా ‘టెక్ సెక్యూరిటీ’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు.
నేడు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తోన్న త్రిష్‌నీత్ అరోరా, ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
‘‘సొంతంగా కంపెనీని ప్రారంభిస్తానని నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఎప్పుడైతే మేం తొలిసారి కంప్యూటర్ కొన్నామో, అప్పుడే నాకు టెక్నాలజీ ప్రపంచంపై ఆసక్తి పెరిగింది’’ అని తెలిపారు.
‘‘నేను కేవలం హాబీ కోసమే ఇలా చేస్తున్నానని తొలుత చాలా మంది అనుకునే వారు. ఇది నా వృత్తిగా మరలుచుకుంటానని ఎవరూ అనుకోలేదు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లాడిలా ఉండేవాడిని. కానీ, పరిస్థితులు మారాయి. అప్పుడు ఎవరైతే అలా అనుకున్నారో వారే నా దగ్గరకి వచ్చి, మాట్లాడటం మొదలు పెట్టారు’’ అని చెప్పారు.
ఎన్నో ఏళ్ల కృషి తర్వాత, తమ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ ఈఎస్‌ఓఎఫ్‌ను అమెరికా ప్రభుత్వ క్లయింట్స్ కొనుగోలు చేయడం ప్రారంభించిన తర్వాత, తాము వెనుతిరిగి చూసుకోలేదన్నారు.

ఫొటో సోర్స్, TRISHNEET ARORA
ముందు తరం నుంచి యువతరం ఏం నేర్చుకోగలదు?
సరికొత్త ఔత్సాహికతతో ఉన్న యువతరాన్ని సరైన పయనంలో నడిపించే బాధ్యత ‘బేబీ బూమర్స్’ లేదా ‘జనరేషన్ వై’గా పిలిచే పాత తరంపై ఉందని దీపక్ బరారా చెప్పారు.
పెద్ద కంపెనీలను, పెద్ద టీమ్‌లను ఎలా హ్యాండిల్ చేయాలో మనం ముందు తరం నుంచి నేర్చుకోవాలని నిష్టా చెప్పారు.
ఎందుకంటే ప్రతిదానికి మనం పర్సనల్ టచ్ ఇవ్వలేమన్నారు.
మనకు అంత అనుభవం లేకపోవడంతో, పాతతరం నుంచి తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉందన్నారు.
‘‘మన ముందు జనరేషన్‌లో చాలా నిశ్చలత్వం ఉండేది. కానీ, మన తరంలో అంత ఉందని నేను అనుకోవడం లేదు. ఇక రెండోది సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం. దీన్ని మనం నేర్చుకోవాలి.
ఇప్పటి వరకు కలుసుకోలేని వారితో కూడా మనం కలిసి పనిచేయడం ప్రారంభిస్తాం. ఇది నిజంగా నష్టమే. పర్సనల్ టచ్‌ను ఎలా పొందాలో మనం పాత తరం నుంచి నేర్చుకోవాలి’’ అని త్రిష్‌నీత్ అరోరా అన్నారు.

ఫొటో సోర్స్, TRISHNEET ARORA
ఏ రంగంలో ఎక్కువ మంది యువనాయకులు?
నిపుణుల అంచనా ప్రకారం, ఐటీ రంగం, మార్కెటింగ్, సోషల్ మీడియా, మీడియా మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ రంగం ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఎక్కువ మంది యువ నాయకులు కనిపిస్తున్నారు.
వీరు ఎక్కువ ఛాలెంజింగ్ పనిని చేసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్, పవర్ సెక్టార్‌లో ఉన్నత స్థానాల్లో యువతరం కనిపించడం లేదు.
‘‘లీడర్ అనే వారు ఎవరంటే, ఎప్పుడు ముందుండి నడిపించాలి, ఎప్పుడు మధ్యలో ఉండాలి, ఎప్పుడూ మూలకు వెళ్లిపోవాలి. ఎప్పుడూ టీమ్ తనకు తాను చేసుకుంటాది అన్నప్పుడు విడిచిపెట్టాలి అన్న విషయాలు తెలిసి ఉండాలి. ఒకవేళ మీ టీమ్‌ని మీరు ప్రోత్సహిస్తే, 200 శాతం మెరుగ్గా వారు పనిచేయగలరు’’ అని దీపక్ బరారా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- లాక్మే బ్రాండ్ ఎలా పుట్టింది... లక్ష్మీదేవికీ ఈ పేరుకూ ఏమిటి సంబంధం?
- భారత్‌లో కొత్త రమ్ వెల్లువెత్తనుందా? రుచి కోసం ఏం చేస్తున్నారు?
- ఈ ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లో విక్రయించే వస్తువులు ప్రమాదకరమని అమెరికా ఎందుకంటోంది? వీగర్ ముస్లింలతో తయారుచేయించినందుకేనా
- ఆస్ట్రేలియాలో చైనాను దాటేసిన ఇండియన్లు, ఎందుకిలా పెరుగుతున్నారంటే...
- రబ్బర్‌ను చెట్ల నుంచి ఎలా తీస్తారో తెలుసా... ఈ పరిశ్రమకు భారత్‌లో మళ్ళీ మంచిరోజులు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














