ఆలియా భట్ ఫ్యాషన్ బ్రాండ్‌ను రిలయన్స్ రూ. 300 కోట్లకు కొనుగోలు చేస్తోందా... సినిమా తారల స్టార్టప్‌ల సంగతేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్, షెరిలన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
బాలీవుడ్ నటి అలియా భట్ మూడేళ్ల కిందట ‘ఎడమామా’ పేరుతో దుస్తుల బ్రాండ్ లాంచ్ చేశారు. ఈ వ్యాపారంలో ఆమెకు లాభాలొస్తున్నాయని చెప్తున్నారు. రూ. 300 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘ఎడమామా’ను కొనుగోలు చేయనుందని పత్రికలలో కథనాలు చెప్తున్నాయి.
ఈ డీల్ కనుక కుదిరితే బాలీవుడ్ స్టార్‌ల స్టార్ట్‌అప్‌లలో పెట్టుబడులు పెట్టడం, కన్స్యూమర్ బ్రాండ్‌లు సొంతం చేసుకోవడం మరింత ఎక్కువ కావొచ్చని ఇన్వెస్టర్ భాస్కర్ మజుందార్ అన్నారు.
స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో జోరు మీదున్న బాలీవుడ్ తారలలో అలియా భట్ కూడా ఒకరు. మరో బాలీవుడ్ నటి దీపిక పదుకోణ్ నిరుడు స్కిన్ కేర్ బ్రాండ్ ‘82°E’ లాంచ్ చేశారు.
ఆమె భర్త రణవీర్ సింగ్ బ్యూటీ బ్రాండ్ ‘సుగర్ కాస్మొటిక్స్’లో వాటా కొనుగోలు చేశారు.
అయితే, ఇలాంటి ట్రెండ్ కొత్తేమీ కాదని.. 2010ల ప్రారంభంలో ఇండియాలో స్టార్టప్ ట్రెండ్ ప్రారంభమైనప్పుడే బాలీవుడ్ నటులు పెట్టుబడులు పెట్టడం మొదలైందని చెప్తున్నారు.
ఆ టైంలో పెట్టుబడులు పెట్టినవారిలో బాలీవుడ్ టాప్ నటుల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. 2012లో ఆయన ట్రావెల్ పోర్టల్ ‘యాత్ర’లో కొంత వాటా కొనుగోలు చేశారు.
ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించడంతో ఈ ధోరణి మరింత పెరిగింది.
ఒక్క 2022లోనే 14 మంది భారతీయ నటులు 18 స్టార్టప్‌లలో డబ్బులు పెట్టారు. అందులో ఎక్కువ భాగం కన్స్యూమర్‌కు నేరుగా విక్రయించే బ్రాండ్స్(డీ2సీ) ఉన్నాయి. మిగిలినవి ఎడ్ టెక్, ఈ-కామర్స్, ఫుడ్ టెక్ సంస్థలు.
‘‘సినిమా నటులు ఇప్పుడు కేవలం యాక్టర్స్ మాత్రమే కాదు తెలివైన పెట్టుబడిదారులు కూడా’’ అని వ్యాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ ‘క్రోల్’ ఎండీ అవిరళ్ జైన్ చెప్పారు.
‘స్వదేశీ బ్రాండ్, ఎకో ఫ్రెండ్లీ బ్రాండ్‌ను విజయవంతమైన వ్యాపారంగా మార్చడానికి తన స్టార్‌డమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చేసి చూపించిన నటి అలియా భట్’’ అన్నారు జైన్.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ నటీనటులు ఒకప్పుడు పెట్టుబడులు పెట్టే పద్ధతికి ఇప్పటికి పూర్తిగా మార్పు వచ్చింది. చాలామంది నటీనటులు తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ వంటివారు రిస్క్ ఎక్కువగా ఉండే సినీ నిర్మాణ వ్యాపారం ఒక్క దాంట్లోనే డబ్బంతా పెట్టి తీవ్ర నష్టాలు ఎదుర్కోగా షారుక్ ఖాన్ వంటి వారు క్రీడల సంబంధిత వ్యాపారాలు, రెస్టారెంట్లలో పెట్టుబడులు పెట్టి విజయం సాధించారు.
‘ఈ తరం నటులు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని.. పబ్లిక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంప్రదాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వైవిధ్యం కోసం స్టార్టప్‌లలోనూ డబ్బులు పెడుతున్నారని ఎపిక్ క్యాపిటల్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసే నవజ్యోత్ కౌర్ అన్నారు.
చాలామంది సినీ నటులు తమ పెట్టుబడులను ప్రొఫెషనల్‌గా నిర్వహించడానికి కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని అవిరళ్ జైన్ చెప్పారు.
సెలబ్రిటీలు, బ్రాండ్‌ల మధ్య భాగస్వామ్యాలు ఇద్దరికీ ప్రయోజనం అందిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఎవరైనా సెలబ్రిటీ పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రమోషన్ కూడా చేయడం అనేది స్టార్టప్‌లు లక్షల మంది వినియోగదారులకు చేరువయ్యే అవకాశం కల్పించడంతో పాటు విశ్వసనీయత పొందే అవకాశమూ కల్పిస్తుంది.
సాధారణంగా స్టార్టప్‌లకు పరిమిత వనరులుంటాయి. ‘కాబట్టి వాటా ఇవ్వడం ద్వారా నగదు అందుబాటులో ఉంచుకోవడం తెలివైన పద్ధతి’ అని బ్రీత్ క్యాపిటల్ పార్టనర్ శౌరయా భుటానీ అన్నారు.
‘స్టార్టప్‌లు కూడా తమ బ్రాండ్ ప్రచారానికి సెలబ్రిటీలను ఉపయోగించుకుంటాయి’ అని రాయ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ బెనైఫర్ మలాంద్కర్ చెప్పారు.
పేరున్న సెలబ్రిటీతో అనుబంధం ఉండడమనేది ఆ బ్రాండ్‌కు తక్షణ గుర్తింపునివ్వడమే కాకుండా మార్కెట్లో విశ్వసనీయత పొందడానికి ఉపయోగపడుతుందన్నారు.
ప్లాంట్ బేస్డ్ మీట్ కంపెనీ ‘బ్లూ ట్రైబ్ ఫుడ్స్’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు పెట్టుబడులు పెట్టినప్పుడు ఇదే జరిగింది.
‘‘ప్రస్తుతం మాంసం వ్యాల్యూ చైన్‌తో ఉన్న సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని మేం కోరుకుంటున్నాం, దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం అందించాలనుకుంటున్నాం. విరాట్, అనుష్కల ఎండార్స్‌మెంట్ బ్రాండ్‌ను ప్రోత్సహించడం కంటే దేశ ప్రజలలో అవగాహన కల్పించడానికి దారితీసింది’’ అని ఆ కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సోహిల్ వజీర్ ‘బీబీసీ’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, సెలబ్రిటీల పాపులారిటీపై ఆధారపడడం ఒక్కటే బ్రాండ్ వృద్ధికి చాలదని సీరియల్ ఎంటర్‌ప్రెన్యువర్, ప్రమోటర్ కె.గణేశ్ అంటున్నారు.
సెలబ్రిటీలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ బిజినెస్ రిస్క్ గురించి మాత్రమే కాకుండా ఆ కంపెనీల వల్ల తమ పరపతికి ప్రమాదంలో పడకుండా చూసుకోవాలని గణేశ్ సూచించారు.
హైప్రొఫైల్ స్టార్టప్‌లలో కార్పొరేట్ కుంభకోణలు ఇటీవల కనిపించాయి. దీంతో అలాంటి కొన్ని స్టార్టప్‌ల వ్యాల్యుయేషన్ కూడా తగ్గింది.
పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. 2023 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారతీయ స్టార్టప్‌లు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా అతి తక్కువగా నిధులు సేకరించాయి. అంతకుముందు ఆర్నెల్ల కాలం, అంటే 2022 జులై నుంచి డిసెంబర్ మధ్య సేకరించిన నిధులతో పోల్చితే 36 శాతం తగ్గుదల మొదలైంది.
అయితే దీన్ని ప్రతికూలాంశంగా చూడాల్సిన పనిలేదని ఫిసిస్ క్యాపిటల్ పార్టనర్ మితేశ్ షా అభిప్రాయపడ్డారు. ‘‘ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్‌లతో స్టార్టప్‌లు దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు సంపద సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయి’’ అని బీబీసీతో చెప్పారు మితేశ్.
పాశ్చాత్య దేశాల విషయానికొస్తే ఉబెర్‌లో పెట్టుబడులు పెట్టిన జే జడ్, స్కైప్‌లో పెట్టుబడి పెట్టిన ఆస్టన్ కూడా లాభాలు ఆర్జించారు.
ఇండియాలో కూడా నైకాలో కత్రినా కైఫ్‌లు, అలియా భట్‌లు పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- నిద్ర తగ్గితే వచ్చే చిక్కులివే...
- బెడ్షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?
- కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి? నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?
- నిజ జీవితంలో ‘ఇన్సెప్షన్’ ప్రయోగం.. ల్యూసిడ్ డ్రీమ్స్‌తో కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














