మిలా: ‘‘సవతి తండ్రి కంటే ముందు నుంచే ఒక అంకుల్ ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు’’

మిలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, విలియమ డి ఓల్మో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మిలా వయస్సు 11 ఏళ్లు. ఆమె ప్రెగ్నెంట్. తాజాగా ఆమెకు అబార్షన్ చేశారు.

సవతి తండ్రి తనను ఏడేళ్ల వయస్సున్నప్పటి నుంచే లైంగికంగా వేధించినట్లు జులైలో ఆమె పోలీసులకు చెప్పారు.

అయితే, అంతకంటే ముందు నుంచే తమ బంధువుల్లో అంకుల్ వరుసయ్యే వ్యక్తి నుంచి తాను వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఉత్తర పెరూలోని లొరెటోలోని ఓ పేద కుటుంబంలో మిలా పెరిగారు. పెరూలోని చట్టాల ప్రకారం, ఆమెకు గర్భం తొలగించేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆమె వార్తల్లో నిలిచారు.

అయితే, పెరూలోని నేషనల్ మెటర్నల్ పెరినాటల్ ఇన్‌స్టిట్యూట్ ఆమెకు అధికారికంగా గర్భస్రావం చేయడానికి అనుమతించింది.

శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే తీవ్రమైన లేదా శాశ్వత నష్టాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్ట్ 12న అంటే శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నేషనల్ మెటర్నల్ పెరినాటల్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

‘‘ఫలితంగా, ఆమెకు చేయాల్సిన వైద్య చికిత్సను ప్రారంభించారు. పేషెంట్‌ను కఠిన పర్యవేక్షణలో ఉంచారు’’ అని తెలిపారు.

ఈ కేసును పరిశీలించిన నిపుణులతో కూడిన కమిటీ ఆమెకు అబార్షన్ చేయాలని సిఫార్సు చేసినట్లు కూడా వెల్లడించారు.

తండ్రి చేతిలో ఏళ్ల పాటు లైంగిక వేధింపులకు గురై గర్భం దాల్చిన ఒక బాలికకు చట్టపరమైన సహాయం, సురక్షిత అబార్షన్‌కు సంబంధించిన సమాచారం అందించకుండా పెరూ ప్రభుత్వం పిల్లల హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి ఇటీవలే తీర్పు ఇచ్చింది.

కామిలా (పేరు మార్చాం) అనే మరో బాలిక విషయంలో ఐక్యరాజ్య సమితి ఈ తీర్పు ఇచ్చింది.

కామిలా, మిలా కేసులు బాధిత బాలికల రక్షణ పట్ల పెరూ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలను లేవనెత్తాయి. గర్భస్రావాన్ని నియంత్రించే చట్టాలపై చర్చకు తావిచ్చాయి.

పెరూ

ఫొటో సోర్స్, JAIME RAZURI/GETTY

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మిలా కేసు ఏంటి?

తనపై ఏళ్లుగా సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నారన్నదాంట్లో నిజం లేదని జులై 3న మిలా చెప్పారు. పెరూ జాతీయ పోలీస్ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఆమె, తన సవతి తండ్రి కంటే ముందు నుంచే బంధువుల్లో ఒకరు తనను లైంగికంగా వేధించారని స్పష్టం చేశారు.

బాలిక సవతి తండ్రి లుకాస్ పీఏను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

లుకాస్‌కు ప్రివెంటివ్ డిటెన్షన్‌ ఇవ్వాలంటూ ప్రాసిక్యూటర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అయితే, ఫిఫ్త్ మేనాస్ ప్రిపరేటరీ ఇన్వెస్టిగేషన్ కోర్టు న్యాయమూర్తి బెర్నల్ ఎస్పిరిటు దీనికి తిరస్కరించారు.

బాలికపై నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలో వీర్యం తాలూకూ ఆనవాళ్లు కనిపించలేదని కోర్టు పేర్కొంది. ఆమెకు జరిగిన పాత గాయాలు మాత్రమే పరీక్షలో గుర్తించడంతో అతన్ని ఖైదు చేయడానికి తగిన సాక్ష్యం లేదంటూ షరతు మీద లుకాస్‌ను విడుదల చేసింది.

ప్రతీ 15 రోజులకు ఒకసారి ప్రాసిక్యూటర్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు షరతు పెట్టింది.

ఆగస్టు 2న లొరెటోలోని ఒక ప్రాంతీయ ఆసుపత్రిలోని మెడికల్ బోర్డు, మిలాకు అబార్షన్ చేసేందుకు నిరాకరించింది.

దీన్ని బాలికల, మహిళా హక్కుల సంస్థలు ఖండించాయి. ఇది స్థానిక మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ కేసుపై అందరూ స్పందిస్తూ తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు.

ఆసుపత్రి నిర్ణయాన్ని గురువారం జస్టిస్ కమిషన్ అధ్యక్షుడు, జడ్జ్ జానెట్ టెలో తిరస్కరించారు. అత్యాచారం ద్వారా కలిగిన బలవంతపు ప్రసూతి అనేది ఒక రకమైన హింస అని నొక్కి చెప్పారు.

అంబుడ్స్‌మన్ కార్యాలయం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మిలా గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆమెను లిమాలోని నేషనల్ మెటర్నల్ పెరినాటల్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించినట్లు అందులో పేర్కొంది.

‘‘నేషనల్ మెటర్నల్ పెరినాటల్ ఇన్‌స్టిట్యూట్ ఆనేది లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద సంస్థ. అక్కడ మిలాకు అవసరమైన పరీక్షలు, వైద్య సహాయం, మానసిక ఆరోగ్య సహాయం అందుతుంది’’ అని ప్రకటనలో తెలిపింది.

తన అంకుల్ నుంచి కూడా వేధింపులకు గురైనట్లు బాలిక తెలిపారని శుక్రవారం బీబీసీతో ఈ కేసు ప్రాసిక్యూటర్ మరియా తెరెసా వర్గాస్ చెప్పారు.

రెండో నిందితుడి ప్రమేయంపై ఇంకా దర్యాప్తు మొదలుకాలేదని ఆమె తెలిపారు.

బాలిక గర్భం దాల్చి 19 వారాలు గడిచాయి.

పెరూ

ఫొటో సోర్స్, JAIME RAZURI/GETTY

కఠినమైన అబార్షన్ చట్టాలు

మిలా వ్యవహారాన్ని గమనించినప్పుడు, ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన కామిలా కేసు కూడా గుర్తుకు వస్తుంది.

ఈ 13 ఏళ్ల అమ్మాయి కూడా మిలా లాగే తండ్రి చాలా ఏళ్లుగా అత్యాచారం చేయడంతో గర్భవతి అయ్యింది. కానీ, గర్భస్రావం చేసేందుకు పెరూ అధికారులు ఒప్పుకోలేదు.

చివరకు ఆ అమ్మాయికి అబార్షన్ కావడంతో ఇది జరగడానికి ఆమే కారణమంటూ ప్రభుత్వం కేసు పెట్టి విచారణ ప్రారంభించింది.

కామిలా హక్కులను పెరూ ప్రభుత్వం కాలరాసిందని బాలల హక్కులపై ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి కమిటీ గత జూన్ లో ఆరోపించింది. బాలికలు గర్భాన్ని రద్దు చేసుకోవడాన్ని నేరంగా పరిగణించకుండా చట్టాలను మార్చాలని పెరూ ప్రభుత్వాన్ని కోరింది.

అబార్షన్ విషయంలో పెరూ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే, ఒక స్త్రీ ప్రాణానికి కలిగించడం లేదా ఆమె ఆరోగ్యానికి శాశ్వత హాని కలిగే పరిస్థితి ఉన్నప్పుడు అది శిక్షార్హం కాదని పేర్కొంది.

బాల్యంలోనే గర్భాలు ప్రీఎక్లంప్సియా వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇది తల్లీ బిడ్డలు ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. తల్లుల్లో మానసిక సమస్యలు, ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా అవకాశం కలుగుతుంది.

పెరూ

ఫొటో సోర్స్, EITAN ABRAMOVICH/GETTY

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదాని ప్రకారం 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న తల్లులలో కలిగే 55% అవాంఛిత గర్భాలు అబార్షన్‌లకు దారి తీస్తాయి. ఇవి ఒక్కోసారి తల్లుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారతాయి.

‘‘పెరూ సమస్య ఏంటంటే, ఈ దేశం ఒక సంప్రదాయ దేశం. చాలామంది అధికారులు చట్టాలను అమలు చేసే సమయంలో నైతిక, మతపరమైన నియమాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోలేరు’’ అని మిలా న్యాయ సహాయం అందిస్తున్న ప్రోమ్‌సెక్స్ సంస్థకు చెందిన లాయర్ ఇస్బెలియా రూయిజ్ అన్నారు.

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అందించిన సమాచారం ప్రకారం పెరూలో 10-14 సంవత్సరాల వయసున్న తల్లులు ప్రతి రోజూ నలుగురికి జన్మనిస్తున్నారు. ఇలా ప్రతియేటా 50 వేలమంది పిల్లలు పుడుతున్నారు.

మిలా, కామిలా వంటి బాధితుల్లో ఎక్కువమంది పేదరికం, సమాజానికి దూరంగా ఉన్నటువంటి కమ్యూనిటీల నుంచి వచ్చిన వారేనని, వారికి సరైన లైంగిక విద్య అందుబాటులో ఉండదని ఎన్జీవోలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిలా లాయర్ చెప్పిన దాని ప్రకారం, మిలాకు చదవడం, రాయడం రాదు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఆమె మారు తండ్రి, బడికి వెళ్లకుండా మిలాను అడ్డుకున్నాడు.

పెరూలో లైంగిక విద్య గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇక్కడ సంప్రదాయవాదాన్ని గట్టిగా సమర్ధించే ‘డోంట్ మెస్ విత్ మై చిల్డ్రన్’ అనే గ్రూప్‌ క్లాస్ రూముల్లో లైంగిక విద్యను గురించి చర్చించరాదంటూ ఉద్యమించింది.

2021లో పెరూ ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం, పాఠశాలలో ఎలాంటి విద్య ఉండాలన్న అంశంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోచ్చు. ఇలాంటి చట్టాలు క్లాస్‌రూమ్‌లలో లైంగిక విద్య నేర్పడాన్ని అడ్డుకుంటాయని ఆధునిక వాదులు వాదిస్తున్నారు.

మిలా పరిస్థితి ఏంటి?

"మిలా బాల్యాన్ని నాశనం చేశారు’’ అని పెర్డోమో అన్నారు. మిలా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఆమెపై సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి ఇప్పుడు అబార్షన్ బాధ తోడయింది. దీంతో గర్భస్రావం ఆరోపణలపై మిలాను విచారించకుండా చర్యలు తీసుకోవాలని ప్రొమ్‌సెక్స్ సంస్థ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్‌ను ఆశ్రయించింది.

‘‘ఈ వయసులో ఆమె బాగా ఆడుకోవాలి. తల్లి కావాలా వద్దా అని నిర్ణయించుకునే స్థితిలో ఉండాల్సిన పని లేదు.’’ అన్నారు పెర్డోమో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)