ఫిటో: ఈ గ్యాంగ్‌స్టర్‌ను జైలుకు తరలించడానికి వేలమంది సైనికులు, పోలీసులతో భారీ ఆపరేషన్...

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఆంటోనేట్ రాడ్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ న్యూస్
కరడుగట్టిన ఒక గ్యాంగ్ లీడర్‌ను అత్యధిక భద్రత కలిగిన జైలుకు తరలించే ఒక ఆపరేషన్‌లో వేలాదిమంది ఈక్వెడార్ సైనికులు, పోలీసులు పాల్గొన్నారు.
ఆగస్ట్ 9న ఈక్వెడార్ అధ్యక్ష పదవి పోటీ పడుతున్న ఫెర్నాండో విల్లావిసెన్సియో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనక ఉన్న వ్యక్తి ‘ఫిటో’గా సుపరిచితుడైన జోస్ అడొల్ఫో మసియాస్ అనే అనుమానాలున్నాయి.
అనేక వ్యవస్థీకృత నేరాలలో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గ్యాంగ్‌స్టర్ ఫిటో ప్రస్తుతం 34 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
ఫిటో 2011 నుంచి గ్వాయకిల్‌లోని ‘ప్రిజన్ 8’ జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయన్ను ఇక్కడి నుంచి మరొక జైలుకు తరలించడానికి స్థానిక భద్రతాధికారులు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాల్సి వచ్చింది.
ప్రిజన్ 8 జైలుకు సాయుధులైన సైనికులు ఉదయమే చేరకున్నారని అరబ్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో సుమారు 4,000 మంది సైనికులు పాల్గొన్నారని ఈ వెబ్‌సైట్ చెప్పింది.
భద్రతా సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో బాగా గడ్డం పెరిగిన ఫిటో ఒంటి మీద కేవలం నిక్కర్ మాత్రమే ఉండగా, సాయుధులు ఆయన పెడ రెక్కలు పట్టుకుని తీసుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది.
భద్రతా బలగాలు భారీ ఎత్తున ట్యాంకులతో సహా మోహరించి కనిపించాయి. ఒక ట్యాంకులో నుంచి మరొక ట్యాంకులోకి ఫిటోను తరలిస్తున్నట్లుగా ఒక ఫొటోలో కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫిటో పై ఆరోపణలేంటి?
ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్సియో బుధవారం ఒక రాజకీయ ర్యాలీ నిర్వహిస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించారు. తలపై మూడుసార్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
హత్య చేస్తానంటూ ఫెర్నాండోకు బెదిరింపులు పంపినట్లుగా ‘ఫిటో’పై ఆరోపణలు ఉన్నాయి.
తనను ఫిటో బెదిరించినట్లు హత్య జరగడానికి ముందే ఫెర్నాండో చెప్పారు.
‘‘నేను ఆ గ్యాంగ్ గురించి ప్రస్తావిస్తూ పోతే వారు నన్ను చంపేస్తారు’’ అని ఆయన అన్నారు.
ఫెర్నాండో హత్యతో ఈక్వెడార్ షాక్‌కు గురైంది. దశాబ్దాలుగా మాదక ద్రవ్య ముఠాల హింస, కార్టెల్ యుద్ధాలు, అవినీతి నుంచి చాలావరకు ఈక్వెడార్ బయటపడింది.

ఫొటో సోర్స్, REUTERS
అయితే, ఇటీవలి కాలంలో కొలంబియా, మెక్సికో డ్రగ్ కార్టెల్స్ పెరగడంతో వాటికి సంబంధించిన నేరాలు పెరిగాయి.
ఫెర్నాండో స్థానంలో ఆండ్రియా గొంజాలెజ్‌ను తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కన్‌స్ట్రుయే పార్టీ ప్రకటించింది.
ఫెర్నాండో చావుకు ప్రభుత్వమే కారణమని ఆయన భార్య వెరోనికా సరౌజ్ అన్నారు. తన భర్త స్థానాన్ని ఆండ్రియాతో భర్తీ చేయడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు.
ఫెర్నాండో ప్రచారం ఎక్కువగా అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సాగింది.
ఈక్వెడార్ ప్రభుత్వ అధికారులకు, దేశంలోని వ్యవస్థీకృత నేరాలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించే వ్యక్తుల్లో ఫెర్నాండో ఒకరు.

ఫొటో సోర్స్, REUTERS
మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొరియా హయాంలో జరిగిన చమురు ఒప్పందాల్లో అవకతవకల గురించి హత్య జరగడానికి ఒకరోజు ముందే ఫెర్నాండో, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఈ అవకతవకల వల్ల దేశానికి 9 బిలియన్ డాలర్ల ( రూ. 74 వేల కోట్లు) నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
ఫెర్నాండో హత్యకు సంబంధించిన ఆరుగురు కొలంబియన్లను అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి షూటౌట్‌లో చనిపోయారు.
ఈ షూటర్లను ఎవరు నియమించారో, ఎంత చెల్లించారనే విషయాలను అధికారులు వెల్లడించలేదు.
గ్యాంగ్ లీడర్ ఫిటో 2011 నుంచి గ్వాయకిల్‌లోని ‘ప్రిజన్ 8’ జైలులో ఖైదీగా ఉన్నారు.
ఫిటోను అత్యధిక సెక్యూరిటీ ఉండే లా రొకా జైలుకు తరలించినట్లు ఈక్వెడార్ అధ్యక్షుడు గిలెర్మో లాసో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














