మహారాష్ట్ర: ఠాణే ఆస్పత్రిలో ఒకే రాత్రి 17 మంది మృతి... అసలేం జరిగింది?

మహారాష్ట్ర

మహారాష్ట్రలోని ఠాణే మునిసిపల్ ఆస్పత్రిలో ఒక్క రాత్రిలో 17 మంది పేషెంట్లు మృతి చెందారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, అనూహ్యంగా రోగుల సంఖ్య పెరగడమే రోగుల మరణాలకు కారణమని చెబుతున్నారు.

ఠాణేలోని కల్వాలో ఉన్న ఛత్రపతి శివాజి మహరాజ్ ఆస్పత్రిలో ఒక్క రాత్రి 17 మంది చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, గడిచిన 48 గంటల్లో 18 మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఆస్పత్రి వర్గాలు ఏమంటున్నాయి?

ఆస్పత్రిలో 48 గంటల వ్యవధిలో 18 మంది మరణించారని ఠాణే మునిసిపల్ కమిషనర్ అభిజిత్ బంగర్ ఏఎన్‌ఐకి చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

''ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు చనిపోయారు. వారిలో కొందరు తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, నిమోనియా, పాయిజనింగ్, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో చికిత్స పొందుతున్నారు.''అని ఆయన చెప్పారు.

''ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించాం. ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. సరైన వైద్యం అందకపోవడం వల్లే రోగులు చనిపోయారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలపై కమిటీ విచారణ జరుపుతుంది'' అని ఆయన అన్నారు.

అంతకుముందు ఆస్పత్రి సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ రోగుల మరణాలతో పాటు, ఆస్పత్రిలో సదుపాయాల గురించి చెప్పారు.

''జ్వరం కారణంగా రాత్రి ఐదుగురు రోగులు చనిపోయారు. వాళ్లకి శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. వారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఒక రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య కేవలం 6 వేలు. మరో రోగి కిరోసిన్ తాగారు. గుర్తు తెలియని ఒక రోగికి తలపై గాయమైంది. మరొకరికి బ్రెయిన్ స్ట్రోక్. నలుగురికి అవయవాలు విఫలమయ్యాయి'' అని డాక్టర్ తెలిపారు.

''ఆస్పత్రిలో 500 బెడ్లు ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకుని 600 మందిని అడ్మిట్ చేసుకున్నాం. చాలా మంది పేద గిరిజనులు ఇక్కడకు వస్తుంటారు. వారిని కూడా చేర్చుకున్నాం'' చికిత్స అందిస్తున్నాం అని సూపరింటెండెంట్ చెప్పారు.

''ఆస్పత్రిలో 124 మంది డాక్టర్లున్నారు. మరో 150 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారు. 500 బెడ్లకు వైద్యులు సరిపోతారు. కానీ, పేషెంట్ల రద్దీతో పని ఒత్తిడి పెరిగింది. నిజానికి, ఎక్కువ మంది పేషెంట్లకు ఆస్పత్రిలో స్థలం లేదు. ఇంతమంది రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అకస్మాత్తుగా రోగుల సంఖ్య పెరిగింది.'' అన్నారు.

మహారాష్ట్ర

ఎలా చనిపోయారు?

ఆస్పత్రిలో రోగుల మరణవార్త బయటికి రాగానే రాజకీయ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి వర్గాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీకి చెందిన ఠాణే నాయకుడు అవినాష్ జాదవ్, శివ్ సేన్ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన జిల్లా నేత కేదార్ దిఘే తమ అనుచరులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి అధికారులను ప్రశ్నించారు. ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులతో కూడా వాగ్వాదానికి దిగినట్లు వార్తలొచ్చాయి.

ఠాణేకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జితేంద్ర అవధ్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు.

''కల్వాలోని ఛత్రపతి శివాజీ ఆస్పత్రిలో 17 మంది రోగులు చనిపోయారని జర్నలిస్టులు ఫోన్ చేయడంతో నిద్రలేచాను. ఇది నిజంగా చాలా విషాదకరం. అయినా, ఠాణే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. రెండు రోజుల ముందు జరిగిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు'' అని ఆయన రాశారు.

ఈ మొత్తం విషయానికి సంబంధించి విచారణ జరగాలని, విచారణలో తేలిన విషయాలను బహిర్గతం చేయాలని జితేంద్ర డిమాండ్ చేశారు.

ఐదుగురు చనిపోయినా మేల్కోలేదు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

''ఠాణే మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆస్పత్రిలో జరిగిన ఘటన మనసును కలిచివేసింది'' అని ఆయన ట్వీట్ చేశారు.

''ఇటీవల ఐదుగురు రోగులు చనిపోయినా ఆస్పత్రి వర్గాలు మేల్కోకపోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా'' అని ఆయన రాశారు.

ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

''ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. వైద్యులు లేరు. సిబ్బంది కొరత ఉంది. అందువల్ల సరైన వైద్యం అందించలేకపోతున్నారు. అందుకు సామాన్యులు బలైపోతున్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణించాలి'' అని అన్నారు.

శరద్ పవార్

ఫొటో సోర్స్, FACEBOOK/PAWARSPEAKS

చర్యలు తీసుకుంటాం..

ఈ ఆస్పత్రులు తన శాఖ పరిధిలోకి రావని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ అన్నారు.

ఇంతకుముందు జరిగిన ఐదు మరణాలు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వస్తాయని, తాజా ఘటన జరిగిన ఆస్పత్రి అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కిందకు వస్తుందన్నారు. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు తక్షణమే కమిటీని నియమించామని, నివేదిక రావాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.

ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ రాజకీయాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు.

మూడు రోజుల కిందట..

మూడు రోజుల కిందట ఇదే ఆస్పత్రిలో ఒకే రోజు అయిదుగురు రోగులు చనిపోయారు.

ఈ ఘటనకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే జితేంద్ర అవధ్, ఇతరులు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు.

ఆస్పత్రి పేదలను మోసం చేస్తోందని, వారిని దోచుకుంటోందని ఆరోపించారు. బిల్లులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, వైద్యులు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి స్వస్థలం ఠాణేలో ఈ ఘటన జరగడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది.

కొద్దిరోజుల క్రితం ఠాణేలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఇక్కడ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: