సెక్స్ స్కాండల్: జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీ, చరణ్ సింగ్ రాజకీయ జీవితాలను మలుపు తిప్పిన కుంభకోణం

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1977 ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి షాక్ నుంచి ఇందిరాగాంధీ నాలుగు నెలల్లోనే బయటపడ్డారు. జనతా ప్రభుత్వానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. వారు దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు.
అయితే, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్ వేర్వేరు దారుల్లో ముందుకెళ్లడం ద్వారా ఇందిరా గాంధీ అధికారం మళ్లీ చేజిక్కించుకునేందుకు అవకాశం ఇచ్చారు.
1977 మే నెలలో బిహార్‌లోని బేల్చీ గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములు పది మంది దళితులను చంపేశారు. ఈ ఘటనతో రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఇందిరా గాంధీకి అవకాశం వచ్చింది.
ఈ ఘటనను మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జులైలో, ఆ దళితుల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించాలని ఇందిరా గాంధీ నిర్ణయించుకున్నారు.
ఇటీవల ప్రచురితమైన నీరజా చౌదరి పుస్తకం ''హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్''లో ఇలా రాశారు. బిహార్‌లో అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. బేల్చి గ్రామానికి వెళ్లే రోడ్డు బురద, వరద నీళ్లతో నిండిపోయింది.''
''ఇందిరా దారిలోనే తన వాహనం దిగి తన ప్రయాణం ప్రారంభించారు. బేల్చి గ్రామానికి వెళ్లేందుకు ఆమె ఏనుగు ఎక్కారు. ఏనుగుపై కూర్చున్న ఇందిరా గాంధీ ఫొటో వార్తా పత్రికల్లో వచ్చింది. ఆమె రాజకీయంగా యాక్టివ్ అయ్యారనేందుకు ఆ ఫొటో నిదర్శనంగా నిలిచింది''

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL LIBRARY
ఏనుగుపై మూడున్నర గంటల ప్రయాణం
బేల్చి దళితులను ఇందిర కలిశారు. వారితో కలిసి కూర్చుని వారి బాధలు విన్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు.
ప్రముఖ జర్నలిస్ట్ జనార్ధన్ ఠాకూర్ రాసిన పుస్తకం ''ఇందిరా గాంధీ అండ్ ది పవర్ గేమ్''లో బేల్చి పర్యటన గురించి ఆయన ప్రస్తవించారు.
కేదార్ పాండే, ప్రతిభా సింగ్, సరోజ్ ఖపార్డే, జగన్నాధ్ మిశ్రా ఇందిరతో వెళ్లిన వారిలో ఉన్నారని ఠాకూర్ అందులో రాశారు.
బేల్చి గ్రామానికి కారులో వెళ్లలేమని కాంగ్రెస్ నేత కేదార్ పాండే చెప్పారు. అప్పుడు నడుచుకుంటూ వెళ్దామని ఇందిర అన్నారు. అలా వెళ్లాలంటే రాత్రంతా నడవాల్సి ఉంటుంది.
అనుకున్నట్టే ఇందిరా గాంధీ జీపు బురదలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు లాగేందుకు వచ్చిన ట్రాక్టర్ కూడా బురదలో కూరుకుపోయింది.
ఇందిరా గాంధీ తన చీరను పైకి సర్దుకుని నీళ్లతో నిండిపోయిన ఆ దారిలో నడవడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతానికి చెందిన వారే ఏనుగును పంపించారు.
ఆ తర్వాత ఆమె ఏనుగుపైకి ఎక్కారు. ప్రతిభా సింగ్ కూడా భయపడుతూనే ఏనుగు ఎక్కారు. ఆమె వెనక నుంచి ఇందిరా గాంధీని గట్టిగా పట్టుకున్నారు.
ఏనుగుపై మూడున్నర గంటల పాటు ప్రయాణించి ఇందిర బేల్చి చేరుకున్నారు. తిరిగి ప్రయాణమయ్యేసరికి అర్ధరాత్రి అయింది. వచ్చే దారిలో రోడ్డు పక్కన ఒక స్కూల్ వద్ద ఇందిరా గాంధీ ప్రసంగించారు కూడా.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జయప్రకాష్ నారాయణ్‌తో భేటీ
ఆ మరుసటి రోజు జయప్రకాష్ నారాయణ్‌ను కలిసేందుకు పట్నాలోని కదంక్వాన్‌లో ఉన్న ఆయన నివాసానికి ఇందిరా గాంధీ వెళ్లారు. ఆ సమయంలో ఆమె బోర్డర్ ఉన్న తెలుపు రంగు చీర కట్టుకున్నారు.
ఆమెతో పాటు సర్వోదయ నేత నిర్మల దేశ్‌పాండే ఉన్నారు. జేపీ వారిని ఒక బెడ్, రెండు కుర్చీలు ఉన్న తన చిన్న గదిలోకి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఇందిరా గాంధీ రాజకీయాల గురించి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి జేపీతో మాట్లాడలేదు.
అయితే, ఇందిరా గాంధీ కలవడానికి ముందు సంజయ్ గాంధీ భార్య మనేకా గాంధీ జేపీని కలిశారు. తమ ఫోన్లు, మెయిల్స్ ట్యాప్ చేస్తున్నారని, తమకు వచ్చిన సందేశాలను చదువుతున్నారని ఆమె జేపీకి ఫిర్యాదు చేశారు.
అది విన్న తర్వాత జేపీ ఆగ్రహానికి గురయ్యారు. మనేకా వెళ్లిపోయిన తర్వాత, జేపీ సహచరుడొకరు ఇందిరా గాంధీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల విషయంలో అలాగే ప్రవర్తించారని అన్నారు. అందుకు ''కానీ ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం తిరిగొచ్చింది'' అని జేపీ అన్నారు.
జేపీ, ఇందిర భేటీ సుమారు 50 నిమిషాల పాటు సాగింది. ''ఇందిరా గాంధీని సాగనంపేందుకు జేపీ మెట్ల దాకా వచ్చారు'' అని నీరజా చౌదరి చెప్పారు.
భేటీలో ఏం మాట్లాడుకున్నారని బయట ఉన్న జర్నలిస్టులు అడిగినప్పుడు ఇందిరాగాంధీ చిరునవ్వు నవ్వి, ఇదొక ప్రైవేట్ మీటింగ్ అని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జర్నలిస్టులు జేపీని అడిగినప్పుడు ''నీ గతంలాగే, భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నానని ఇందిరాగాంధీకి చెప్పాను'' అని అన్నారు.
ఆ వార్త బయటకు రాగానే జనతా పార్టీ నేతలు ఒకింత అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంతో ఉన్న కుల్దీప్ నయ్యర్ జేపీ అనుచరుడు కుమార్ ప్రశాంత్‌ను అడిగేశారు కూడా. ''ఇందిర గురించి జేపీ అలా ఎలా మాట్లాడతారు? ఆమె గతమొక చీకటి అధ్యాయం. అంత మంచిగా ఏం లేదు'' అని.
కుల్దీప్ మాటలను కుమార్ ప్రశాంత్ జేపీకి చేరవేశారు. అందుకు ఆయన ''మన ఇంటికి వచ్చిన వాళ్లని తిడతామా? ఆశీర్వదిస్తామా?'' అని అన్నారు.
''అప్పటికే జనతా పార్టీ నేతలతో విసుగుచెందిన జేపీ ఈ వ్యాఖ్యలు చేయడం, ఇందిరా గాంధీ కంటే ఆయనపైనే ఎక్కువ కోపం తెప్పించింది'' అని నీరజా చౌదరి చెప్పారు.

ఫొటో సోర్స్, DHARMENDRA SINGH
రాజ్‌నారాయణ్, సంజయ్ గాంధీ వరుస భేటీలు
ఇందిరాగాంధీని ఎన్నికల్లో ఓడించిన రాజ్‌నారాయణ్ తనకు జనతా పార్టీ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో రగిలిపోవడం ఆమెకు కలిసొచ్చింది.
మొరార్జీ దేశాయ్ తనను బర్తరఫ్ చేయడాన్ని రాజ్‌నారాయణ్ జీర్ణించుకోలేకపోయారు.
ఆయన ఇందిరా గాంధీని కలవాలనుకున్నారు. అయితే, ఇందిర ఆయన్ను నేరుగా కలవలేదు. తన కుమారుడు సంజయ్ గాంధీని పంపించారు.
పుసా రోడ్డులోని మోహన్ మీకెన్స్ యజమాని కపిల్ మోహన్ నివాసంలో వాళ్లిద్దరూ సమావేశమయ్యారు.
రాజ్‌నారాయణ్‌తో భేటీకి అక్బర్ అహ్మద్ లేదా కమల్ నాథ్‌లలో ఒకరు సంజయ్ గాంధీని తమ కారులో తీసుకెళ్లారు.
ఈ భేటీల్లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి చౌదరి చరణ్ సింగ్‌ను ప్రధాన మంత్రిని చేసేందుకు వ్యూహరచన చేశారు.
చరణ్ సింగ్‌ను ప్రధానిని చేయాలంటే జనతా పార్టీని ముక్కలు చేయాల్సి ఉంటుందని వారిద్దరికీ తెలుసు.
''ఒకదశలో రాజ్‌నారాయణ్‌ను సంతోషపెట్టేందుకు మీరు కూడా ప్రధానమంత్రి కావచ్చని సంజయ్ గాంధీ అన్నారు. అందుకు రాజ్‌నారాయణ్ నవ్వి ఊరుకున్నారు తప్ప సంజయ్ మాయలో పడలేదు. అది నిజమే అయినా, ప్రస్తుతానికి చౌదరి సాహబ్‌ను ప్రధానిని కానివ్వండి'' అని అన్నారని నీరజా చౌదరి రాశారు.

ఫొటో సోర్స్, BABU JAGJIVANRAM FOUNDATION
జగ్జీవన్ రామ్ కొడుకు సెక్స్ స్కాండల్
1978 చివర్లో ఇందిరా గాంధీకి మరోసారి అదృష్టం కలిసొచ్చింది. 1978 ఆగస్టు 21న ఘజియాబాద్, మోహన్ నగర్‌లోని మోహన్ మీకెన్స్ ఫ్యాక్టరీ బయట ఒక కారు ప్రమాదం జరిగింది.
మెర్సిడెస్ కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు.
జనం తనపై దాడిపై చేస్తారని భయపడిన కారులోని వ్యక్తి తన కారును మోహన్ మీకెన్స్ ఫ్యాక్టరీ లోపలికి పోనిచ్చారు. గేట్ దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే తన పైవారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారు లోపలికి వచ్చిందని తెలియజేశారు.
వెంటనే కపిల్ మోహన్ మేనల్లుడు అనిల్ బాలి బయటకు వచ్చారు. కారులో ఉన్న వ్యక్తిని ఆయన గుర్తుపట్టారు.
ఆ కారులో ఉన్న వ్యక్తి సురేష్ రామ్, రక్షణ శాఖ మంత్రి జగ్జీవన్ రామ్ కుమారుడు. తన కారును ఎవరో వెంబడిస్తున్నారని బాలికి సురేష్ రామ్ చెప్పారు.
ఆ కారును వెంబడిస్తోంది రాజ్‌నారాయణ్ శిష్యులు, జనతా పార్టీ కార్యకర్తలైన కేసీ త్యాగి, ఓంపాల్ సింగ్.
మరుసటి రోజు కశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్‌లో సురేష్ రామ్ ఫిర్యాదు చేశారు. అయితే, బాలికి చెప్పింది కాకుండా పూర్తిగా వేరే కథతో అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఆగస్టు 20న ఒక డజను మంది తనను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బలవంతంగా మోదీ నగర్‌కు తీసుకెళ్లారని, కొన్ని పత్రాలపై సంతకాలు చేయమని ఒత్తిడి చేశారని తెలిపారు. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను కొట్టారని, స్పృహ తప్పిపడిపోయానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్పృహ వచ్చి చూసేప్పటికి, కారులో ఒక మహిళతో అసభ్యకర రీతిలో ఉన్నట్లు ఫొటోలు తీశారని సురేష్ రామ్ ఫిర్యాదులో రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రాజ్‌నారాయణ్ చేతికి ఫొటోలు
''ఓంపాల్ సింగ్, కేసీ త్యాగి కొద్దిరోజులుగా సురేష్ రామ్‌ను అనుసరిస్తున్నారు. దిల్లీ కాలేజీలో చదువుతున్న ఒక యువతితో సురేష్ రామ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వాళ్లు తెలుసుకున్నారు'' అని నీరజా చౌదరి చెప్పారు.
''పోలరాయిడ్ కెమెరాలతో యువతి నగ్న ఫొటోలు తీయాలనుకున్నారు. సురేష్ రామ్, అతని ప్రియురాలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సేకరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.''
అయితే, సురేష్ రామ్ కారులోనే వారికి ఆ ఫొటోలు దొరికాయి.
ఆ ఫొటోలు చేతికి అందిన వెంటనే వాటిని రాజ్‌నారాయణకు అప్పగించారు. అదే రోజు రాత్రి రాజ్‌నారాయణను కలిసేందుకు జగ్జీవన్ రామ్ కపిల్ మోహన్ ఇంటికి వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో రాత్రి 11.45 గంటల సమయంలో జగ్జీవన్ రామ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత, ''ఇప్పుడు అతను మన కంట్రోల్‌లో ఉన్నాడు'' అని కపిల్ మోహన్‌తో రాజ్‌నారాయణ్ అన్నారు.
మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజ్‌నారాయణ్ పూర్తి వివరాలు బయటపెట్టారు.
1978 సెప్టెంబర్ 15న జర్నలిస్ట్ ఫర్జాద్ అహ్మద్, అరుల్ లూయిస్ ఇండియా టుడేలో ఒక కథనం రాశారు.
''ఓంపాల్ సింగ్‌కి ఆ ఫొటోలు ఎలా వచ్చాయి? అని అడిగితే, ఓంపాల్ సింగ్ సురేష్ రామ్‌ని సిగరెట్ అడిగాడు. అప్పుడు సురేష్ రామ్ సిగరెట్ కోసం అతని కారులోని బాక్స్ ఓపెన్ చేశాడు. ఆ సమయంలో సిగరెట్ ప్యాకెట్ పెట్టిన బాక్స్‌లో నుంచి ఈ ఫొటోలు కింద పడ్డాయి.
ఓంపాల్ సింగ్ ఆ ఫొటోలను తీసుకున్నాడు. సురేష్ రామ్ డబ్బులు ఇస్తానని ఆశచూపినా ఇవ్వలేదని రాజ్‌నారాయణ్ చెప్పారు'' అని అందులో రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సంజయ్ గాంధీకి చేరిన ఫొటోలు
రాజ్‌నారాయణ్ వద్ద సురేష్ రామ్ అతని ప్రియురాలికి సంబంధించిన సుమారు 40, 50 ఫొటోలు ఉన్నాయి. వాటిలో 15 ఫొటోలను కపిల్ మోహన్‌కి ఇచ్చిన ఆయన, మిగిలిన వాటిని తనవద్దే ఉంచుకున్నారు.
''రాజ్‌నారాయణ్ ఇంటికి వెళ్లిపోగానే, కపిల్ మోహన్ తన మేనల్లుడు అనిల్ బాలిని పిలిచి ఈ ఫొటోలు సంజయ్ గాంధీకి ఇవ్వాలని చెప్పి పంపించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బాలి 12 విల్లింగ్టన్ క్రిసెంట్ రోడ్డుకి చేరుకున్నారు. ఆ సమయంలో సంజయ్ గాంధీ నిద్రపోతున్నారు. ఆ తర్వాత లేచారు'' అని నీరజా చౌదరి ప్రస్తావించారు.
ఎవరైనా ఈ సమయంలో వస్తారా? అని సంజయ్ గాంధీ అన్నారు. ''సురేష్ రామ్ ఫొటోలను సంజయ్ గాంధీకి బాలి అందజేశారు. ఆయన ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఇందిరాగాంధీని నిద్రలేపారు''
ఆ మరుసటి రోజు, ఆగస్టు 22వ తేదీ ఉదయం 9 గంటలకు, టెలిగ్రాఫ్ లైన్‌లోని జనతా పార్టీ ఎంపీ కృష్ణకాంత్ ఇంట్లో ఫోన్ మోగింది.
అవతలి వైపు జగ్జీవన్ రామ్ మాట్లాడుతున్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత, ''ఇంకో కొడుకు తండ్రిని ముంచేశాడు'' అని ఆయన తన కుటుంబ సభ్యులతో అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫొటోలు ప్రచురించిన సంజయ్ భార్య
పది నిమిషాల తర్వాత, కృష్ణకాంత్ ఇంటి ముందు అప్పటి రక్షణ మంత్రి అధికారిక వాహనం వచ్చి ఆగింది.
ఆ కారు ఎక్కి కృష్ణ మేనన్ రోడ్డులోని జగ్జీవన్ రామ్ ఇంటికి కృష్ణకాంత్ వెళ్లారు. అప్పుడు అందరూ గదిలో నుంచి బయటికి వెళ్లాలని జగ్జీవన్ రామ్ కోరారు.
''గదిలో ఇంకెవరూ లేరు. జగ్జీవన్ రామ్ తన సీటులో నుంచి పైకి లేచి తన టోపీని కృష్ణకాంత్ పాదాల వద్ద పెట్టారు. నా గౌరవం మీ చేతుల్లో ఉంది'' అని అన్నారని నీరజా చౌదరి రాశారు.
మీడియాలో తనకు ఉన్న పరిచయాల ద్వారా జగ్జీవన్ రామ్‌కు సాయం చేసేందుకు కృష్ణకాంత్ ప్రయత్నించారు.
సయీద్ నఖ్వీ రాసిన ఒక కథనం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మొదటి పేజీలో ప్రచురితమైంది. అది సురేష్ రామ్‌పై సానుభూతి చూపుతున్నట్లుగా ఉంది.
భారత్‌లోని వార్తాపత్రికలన్నీ ఈ విషయంపై మౌనం వహించాయి. కానీ సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ తన సూర్య మేగజైన్‌లో సురేష్ రామ్ ఫొటోలు ప్రచురించారు.
'రియల్ స్టోరీ' శీర్షికతో ఈ కథనం ప్రచురితమైన సూర్య మేగజైన్ బ్లాక్‌లో అమ్ముడుపోయింది. ప్రధానమంత్రి కావాలన్న జగ్జీవన్ రామ్ ఆశలు చెల్లాచెదురయ్యాయి.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
కుష్వంత్ సింగ్ వద్దకు ఫొటోలు
ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ కూడా ఈ ఘటనను తన ఆటోబయోగ్రఫీ ''ట్రూత్, లవ్ అండ్ లిటిల్ మలైస్''లో ప్రస్తావించారు.
''ఒక రోజు మధ్యాహ్నం ఒక ప్యాకెట్ నా డెస్క్ మీదకు వచ్చింది. అందులో జగ్జీవన్ రామ్ కొడుకు సురేష్ రామ్, ఒక కాలేజీ అమ్మాయి సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. అదే రోజు సాయంత్రం జగ్జీవన్ రామ్ మనిషినంటూ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు'' అని కుశ్వంత్ సింగ్ రాశారు.
''ఆ ఫొటోలు నేషనల్ హెరాల్డ్, సూర్య పత్రికల్లో ప్రచురించకుండా ఉంటే, బాబూజీ మొరార్జీ దేశాయ్ శిబిరం నుంచి ఇందిరా గాంధీ వైపు వచ్చేస్తారు అని ఆయన చెప్పారు. నేను వెంటనే ఆ ఫొటోలతో ఇందిరాగాంధీ వద్దకు వెళ్లాను''
''జగ్జీవన్ రామ్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు చెప్పినప్పుడు, ఆయనపై నాకు ఏమాత్రం నమ్మకం లేదు అని ఇందిరాగాంధీ అన్నారు'' అని ఆయన రాశారు.
''జగ్జీవన్ రామ్ నా కుటుంబానికి మరెవరూ చేయనంత హాని చేశాడు. ముందు ఆయన్ను మనవైపు రమ్మను. అప్పుడు ఫొటోలు ప్రచురించొద్దని మనేకకు చెబుతాను'' అన్నారు.
కానీ, ఆ ఫొటోలు నేషనల్ హెరాల్డ్, సూర్యలో ప్రచురితమయ్యాయి. ఫొటోలపై కొన్నిచోట్ల కనిపించకుండా(బ్లర్ చేసి) నలుపు రంగు వచ్చేలా ప్రచురించారు.
మొరార్జీ దేశాయ్ రాజీనామా చేస్తే, ఆ పదవికి జగ్జీవన్ రామ్ గట్టి పోటీదారు అవుతారని ఇందిరాగాంధీ, చరణ్ సింగ్‌లకు బాగా తెలుసు. అయితే, ఈ సెక్స్ స్కాండల్ బయటికి రావడం ఆయనను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.

ఫొటో సోర్స్, CHARAN SINGH ARCHIVES
చరణ్ సింగ్ ఇంటికి ఇందిర
సభను ధిక్కరించారనే ఆరోపణలతో ఇందిరా గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిగేంత వరకూ ఆమెను తిహార్ జైలుకి పంపించారు.
డిసెంబర్ 23న చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా జైలు నుంచే ఇందిరా గాంధీ ఆయనకు పుష్పగుచ్ఛం పంపించారు. ఆ తర్వాత డిసెంబర్ 27న ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.
ఆమె జైలు నుంచి విడుదల అవుతున్నప్పుడు అక్కడి అధికారులు, జవాన్లు ఆమెపై గౌరవంతో సెల్యూట్ చేశారు. అదే రోజు, చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్‌కి కొడుకు జయంత్ అమెరికాలో పుట్టాడు.
''ఇందిరా గాంధీ మా ఇంట్లో టీ తాగితే, మొరార్జీ కూడా బాగుంటారు'' అని సత్యపాల్ మాలిక్‌తో చరణ్ సింగ్ కబురు పంపించారు.
ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి చరణ్ సింగ్ ఇంటికి వచ్చేందుకు ఇందిరా గాంధీ సమ్మతించారు. ఆమె వచ్చేప్పటికి ఆహ్వానం పలికేందుకు చరణ్ సింగ్ గేటు వద్ద నిల్చుని ఉన్నారు.
ఈ భేటీ ద్వారా తాను అవసరమైతే ఇందిరతో కలుస్తానని మొరార్జీ దేశాయ్‌కి సంకేతాలు పంపాలనుకున్నారు.
మరోవైపు, తాను కూడా జనతా ప్రభుత్వంలోని అసమ్మతి నేతలతో కలిసి ఇబ్బంది పెట్టగలనని ఇందిరా గాంధీ కూడా చెప్పాలనుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోపంతో ఎరుపెక్కిన ఇందిర ముఖం
ఈ పరిణామాల పర్యవసానంగా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, చరణ్ సింగ్ ప్రధాని కావడం జరిగిపోయాయి. ప్రమాణ స్వీకారం తర్వాత, ధన్యవాదాలు తెలిపేందుకు ఇందిరాగాంధీ నివాసం విల్లింగ్టన్ క్రిసెంట్‌కి వస్తున్నట్లు చరణ్ సింగ్ సమాచారం అందించారు.
''రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిజూ పట్నాయక్‌ను పరామర్శించేందుకు ప్రధాని చరణ్ సింగ్ వెళ్తున్నారు. వచ్చే దారిలో ఇందిరా గాంధీ నివాసానికి వెళ్లాలనుకున్నారు. అయితే, ఆయన బంధువులు కొందరు, మీరు ఇందిరను కలవడానికి వెళ్లడమేంటి? మీరు ఇప్పుడు ప్రధానమంత్రి. ఆమే మిమ్మల్ని కలవడానికి రావాలనడంతో ఇందిరా గాంధీ ఇంటికి వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు'' అని నీరజా చౌదరి చెప్పారు.
అప్పుడు అక్కడ సినిమా సీన్ కంటే తక్కువేమీ జరగలేదు.
''ఇంటి పోర్టికోలో చేతిలో పూల బొకేతో ప్రధానమంత్రి చరణ్ సింగ్ రాక కోసం ఇందిరా గాంధీ ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో సత్యపాల్ మాలిక్ కూడా ఇందిర ఇంటి వద్దే ఉన్నారు. సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలు కూడా చరణ్ సింగ్ కోసం అక్కడే వేచి చూస్తున్నారు.''
ఇందిర చూస్తుండగానే, చరణ్ సింగ్ కాన్వాయ్ ఇంటి లోపలికి రాకుండా, ఇంటి ముందు నుంచి వెళ్లిపోయింది. దాంతో ఇందిరాగాంధీ ముఖం కోపంతో ఎరుపెక్కింది'' అని చౌదరి రాశారు.
పూల బొకేను విసిరికొట్టి ఆమె ఇంట్లోకి వెళ్లిపోవడం అక్కడ ఉన్నవారు చూశారు.
''చరణ్ సింగ్ ప్రభుత్వం కూడా కొద్దిరోజులే అని ఆ క్షణమే అనుకున్నా'' అని సత్యపాల్ మాలిక్ చెప్పారు.
ఆ తర్వాత తన తప్పును సరిదిద్దుకునేందుకు చరణ్ సింగ్ ప్రయత్నించినప్పటికీ ''ఇప్పుడు కాదు'' అనే సందేశం పంపించారు ఇందిరా గాంధీ.
సరిగ్గా 22 రోజుల తర్వాత చరణ్ సింగ్ ప్రభుత్వానికి ఇందిరా గాంధీ మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మరో జలియన్‌వాలా బాగ్
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది
- పీసీ సర్కార్: బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- రాహుల్ గాంధీ - బీజేపీ: జిన్నా ముస్లిం లీగ్‌కు, కాంగ్రెస్ మిత్రపక్షం ముస్లిం లీగ్‌కు మధ్య తేడా ఏమిటి?














