ఇందిరా గాంధీ మిజోరాం రాష్ట్రంపై దాడి చేయించారని ప్రధాని మోదీ ఎందుకన్నారు, చరిత్రలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీ హయాంలో మిజోరాంపై భారత వైమానిక దళం చేసిన బాంబు దాడి గురించి గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రస్తావించారు.
విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చపై జవాబిస్తూ మోదీ ఈ ఘటన గురించి వ్యాఖ్యానించారు.
‘‘1966 మార్చి 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ మిజోరాంలోని నిస్సహాయులపై భారత వైమానిక దళంతో దాడి చేయించింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు నాటి భయానక ఘటనలను తలుచుకొని బాధపడుతుంటారు. కాంగ్రెస్ వాళ్లు అక్కడి ప్రజలను ఓదార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. పైగా ఈ విషయాన్ని దేశ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారు. ఆ సమయంలో దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు’’ అని మోదీ అన్నారు.
ఈశాన్య భారత్‌లోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్, దాని రాజకీయాలే అని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోదీ చెప్పిన మిజోరాం పై దాడి కథ ఏంటి, చరిత్రలో ఏముంది?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
1966 మార్చి 5న ఏం జరిగింది?
దేశంలోని పౌరులు నివసించే ప్రాంతంపై జరిగిన తొలి వైమానిక దాడిగా మిజోరాంలో భారత వైమానిక దళం చేసిన దాడిని పరిగణిస్తారు.
నిజానికి ఈ చర్య, మిజోరాం వేర్పాటువాద సంస్థ ‘మిజో నేషనల్ ఫ్రంట్’కు వ్యతిరేకంగా జరిగింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఐజ్వాల్ నార్త్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లాల్‌జార్మావీ దీని గురించి ఒక కథనంలో పేర్కొన్నారు.
‘‘1966 మార్చి 5న, భారత వైమానిక దళానికి చెందిన అనేక ఫైటర్ జెట్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ‘మిజో నేషనల్ ఫ్రంట్ స్థావరాల’పై బాంబు దాడి చేశాయి.
ఈ వైమానిక దాడులు మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీన కూడా కొనసాగాయి. ఐజ్వాల్ నగరంలో ఉన్న బడా బజార్‌లోని దాదాపు అన్ని దుకాణాలు దగ్ధమయ్యాయి. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఐజ్వాల్ అంతటా ఈ ప్రభావం చాలా కాలం వరకు కనిపించింది" అని ఆయన కథనంలో చెప్పారు.
‘‘ఎంఎన్‌ఎఫ్ ద మిజో అప్‌రైజింగ్’’ అనే డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ జేవీ హలునా ఈ వైమానిక చర్య గురించి మాట్లాడారు.
‘‘1966 మార్చి 5, 6 తేదీలలో ఐజ్వాల్‌పై వైమానిక దాడి జరిగింది. తుఫానీ, హంటర్ అనే రెండు రకాల యుద్ధ విమానాలను ఉపయోగించారు. ఐజ్వాల్ పొరుగు ప్రాంతాలైన ద్వారపూయి, రిపబ్లిక్, ఖాత్లా, ఉఖువాట్లాంగ్ మంటల్లో చిక్కుకున్నాయి’’ అని ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
ఎంఎన్‌ఎఫ్ సైనిక విభాగం అయిన మిజో నేషనల్ ఆర్మీతో సంబంధం ఉన్న కల్నల్ లాల్రోనియానా ఈ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ, ‘‘మాపై జెట్ ఫైటర్లతో దాడి చేశారు. భారత సైనికుల ప్రవర్తన కూడా బాలేదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, DEEPAK KUMAR/INDIAPICTURES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
సాహిత్యం, విద్య రంగాల్లో చేసిన కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న మిజోరాం రచయిత ఖాల్ కుంగీ కూడా ఈ ఘటన గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘మా ప్రార్థనలు ముగిసిన వెంటనే, వైమానిక దాడులు మొదలయ్యాయి. నేను షాకయ్యాను. చాలా వేగంగా ఇదంతా జరిగిపోయింది. బాంబు పడిన ప్రదేశంలో మేం లేం కాబట్టి అక్కడ జరిగిన నష్టం గురించి చెప్పలేను. మేమంతా భయంతో అటూఇటూ పరుగెత్తడం మొదలుపెట్టాం.
అందర్నీ నేల మీద పడుకోమని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఆకాశం నుంచి పైలట్లకు ఎవరూ కనబడరని అన్నారు. దీంతో బాంబులు పడటం మొదలుకాగానే మేమంతా కింద పడుకున్నాం. బాంబులు ఎక్కడ పడ్డాయో మాకు కచ్చితంగా తెలియలేదు. మేమంతా భయపడ్డాం. ఏమీ ఆలోచించలేకపోయాం’’ అని ఖాల్ కుంగీ వివరించారు.
2015లో ఖాల్ కుంగీ చనిపోయారు.
అస్సాం రైఫిల్స్ సుబేదార్ హేమ్‌లాల్ జాయ్‌సీ, మిజోరాంలో ఉండేవారు. డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పారు.
"ఎయిర్ ఫోర్స్ ఫైటర్లు వచ్చి బాంబులు వేశారు. అప్పుడు నేలపై మిజో నేషనల్ ఆర్మీకి చెందిన 8, 9 మంది వ్యక్తులు లైట్ మెషీన్ గన్‌లతో పొజిషన్లలో ఉన్నారు. బాంబులు పడగానే వారంతా పారిపోయారు’’ అని ఆయన చెప్పారు.
ఆ సమయంలో భారత ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది.
1966 మార్చి 9న ప్రచురించిన ఒక వార్తలో విదేశీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ బదులిస్తూ... ‘‘ఎయిర్‌ఫోర్స్ విమానాలు సైనికులను, సామగ్రిని కిందకు జారవిడిచాయి’’ అని అన్నట్లు ఫిల్మ్స్ డివిజన్ రూపొందించిన డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
మిజోరాంలో పరిస్థితులు మారిన క్రమం
ఆనాటి సంఘటనల వివరాలను డాక్టర్ లాల్‌జార్మావీ తన వ్యాసంలో వివరంగా రాశారు.
- 1966 ఫిబ్రవరి 28న మిజో హిల్స్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. మిజో నేషనల్ ఫ్రంట్ సాయుధ దళాలు ఏకకాలంలో ఐజ్వాల్ సహా పలు ప్రభుత్వ స్థావరాలపై దాడి చేశాయి. లుంగ్లేలోని తహసీల్ కార్యాలయంలో మొదటి దాడి జరిగింది.
- దాదాపు వెయ్యి మంది సాయుధ ఎంఎన్‌ఎఫ్ ఫైటర్లు, లుంగ్లేలోని అస్సాం రైఫిల్స్ స్థావరంపై దాడి చేశారు. 1966 ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీ మధ్య రాత్రి వేళ ఐజ్వాల్‌లోని ట్రెజరీ కార్యాలయంపై దాడి జరిగింది. ఎంఎన్‌ఎఫ్ ఫైటర్లు అక్కడ ఉన్న నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- ఐజ్వాల్‌కు వెళ్లే దారిలో వైరెంగ్టే సమీపంలో రహదారిని బ్లాక్ చేశారు. అస్సాం వైపు నుంచి మిజో హిల్స్‌లోని మొదటి గ్రామం వైరెంగ్టే. చిన్న బ్రిడ్జిలను పేల్చేసి, రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. ఎంఎన్‌ఎఫ్ మార్చి 1న మిజోరాంకు స్వాతంత్ర్యం ప్రకటించింది.
- ఈ ప్రకటనపై లాల్‌డెంగాతో పాటు మరో 60 మంది సంతకాలు చేశారు. మిజోరాం స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని ప్రపంచ దేశాలకు ఎంఎన్‌ఎఫ్ విజ్ఞప్తి చేసింది. మిజోరాంలోని అనేక ప్రాంతాలపై తిరుగుబాటుదారులు పట్టు సంపాదించారు. అయితే, తిరుగుబాటుదారులు పదే పదే దాడులు చేసినప్పటికీ ఐజ్వాల్‌లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం మాత్రం చెక్కు చెదరలేదు.
- అస్సాం ప్రభుత్వం మార్చి 2వ తేదీన మిజో హిల్స్ జిల్లాను డిస్టర్బ్డ్ ఏరియా (అశాంతి నెలకొన్న ప్రాంతం)గా ప్రకటించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలిపించారు. అదే రోజున కొంత సైన్యాన్ని ఆ ప్రాంతంలో దించారు. మార్చి 3 నుంచి హెలికాప్టర్లలో భారత సైనికులను ఐజ్వాల్‌లో దించడం మొదలుపెట్టారు.
- మార్చి 4న, ఐజ్వాల్ నుంచి ప్రజలను తరలించడం ప్రారంభించారు. అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం మినహాయించి మిగతా నగరం మొత్తం మిజో నేషనల్ ఫ్రంట్ ఆధీనంలో ఉంది.
ఇరవై ఏళ్ల తర్వాత శాంతి
ఆ సమయంలో మిజో తిరుగుబాటును ఈ బాంబుదాడి అణిచివేసి ఉండవచ్చు. కానీ, ఆ తర్వాత 20 ఏళ్ల పాటు మిజోరంలో అశాంతి నెలకొంది.
1986లో కొత్త రాష్ట్రం ఏర్పాటుతో మిజోరంలో అశాంతికి తెరపడింది.
రాజీవ్ గాంధీతో ఒప్పందం తర్వాత, ఎంఎన్‌ఎఫ్ అధినేతగా ఉన్న లాల్‌డెంగా కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
20 ఏళ్ల క్రితం ఎంఎన్‌ఎఫ్ జెండాను ఎగురవేసిన స్థలంలోనే ఆయన భారత జెండాను ఎగురవేశారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















