యుక్రెయిన్: యుద్ధంలో గాయపడ్డ సైనికులకు మెరుగైన సెక్స్ జీవితం కోసం ఎవరు సహకరిస్తున్నారు?

రీసెక్స్

ఫొటో సోర్స్, RESEX

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైనికులకు వారి సెక్స్ జీవితాలలో సాయం చేస్తోన్న రీసెక్స్
    • రచయిత, టోబి లక్‌హర్స్ట్
    • హోదా, బీబీసీ న్యూస్, కీయెవ్

సెంట్రల్ కీయెవ్‌లోని మోడ్రన్ ఆఫీసులో ఒక 26 ఏళ్ల యుక్రెయిన్ సైనికుడు ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో గేమ్‌ కిచెన్‌లో ఉన్న ఒక యువతిని గాఢంగా ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తుంది.

రీసెక్స్‌ అనే చారిటీ సంస్థకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్ ఇది. యుద్ధంలో గాయపడి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతూ తమ సెక్స్ జీవితాలను అనుభవించని మాజీ సైనికులకు సాయం చేసేందుకు రీసెక్స్ సంస్థ సాయపడుతోంది.

గత ఏడాది మార్చిలో యుక్రెయిన్‌లోని మారియుపోల్‌పై రష్యన్ బలగాలు దాడికి పాల్పడి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. ఈ నగరం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. హ్లిబ్ స్ట్రిజ్కో ఆ నగరాన్ని రక్షించడానికి ప్రయత్నించిన సైనికుల్లో ఒకరు.

రష్యా సైనికులు వేసిన బాంబు కారణంగా ఆయన బిల్డింగ్‌లోని మూడవ అంతస్తు నుంచి కింద పడిపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయారు.

హ్లిబ్ చాలా తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముక చివరి భాగం, దవడ ఎముక, ముక్కు దెబ్బతిన్నాయి. బాంబు వేడి వల్ల ఆయన ముఖంపై ఉన్న గాగుల్స్‌ కూడా కరిగిపోయాయి.

ఆ సమయంలో రష్యన్ బలగాలు హ్లిబ్‌ను అదుపులోకి తీసుకుని, యుద్ధ ఖైదీగా బంధించాయి. ఆ తర్వాత నెలకు ఖైదీల బదిలీ కింద హ్లిబ్ రష్యన్ల నుంచి విడుదలై యుక్రెయిన్‌కు వచ్చేశారు.

కానీ, బందీగా ఉన్నప్పుడు తనకు సరైన వైద్యం అందలేదని హ్లిబ్ చెప్పారు.

ఆయన విడుదలైన తర్వాత కొన్ని వారాలకి బీబీసీ ఆయనతో మాట్లాడింది. ఆ తర్వాత ఆయన పశ్చిమ నగరమైన ఎల్వివ్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

రీసెక్స్ సంప్రదించిన తర్వాత హ్లిబ్ కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

‘‘నా వెన్నెముకకు అయిన గాయాల నుంచి కోలుకునేందుకు కొంత సమయం పట్టింది. దాని(సెక్స్ సమస్యల) గురించి ఆలోచించ లేదు. నాలాగా ఇతరులకు జరగకూడదని నేను అనుకుంటున్నాను’’ అని ఆయన చెప్పారు.

మరియుపోల్‌పై రష్యన్ బలగాల దాడికి గాయాలు పాలైన హ్లిబ్ స్ట్రిజ్కో

2018లోనే ఈ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది

రీసెక్స్ ప్రాజెక్ట్‌ను నడిపే వెటరన్ హబ్ గ్రూప్ ఫౌండర్లలో ఐవోనా కోస్టినా కూడా ఒకరు.

అమెరికా సైనికుల సమస్య గురించి విన్న తర్వాత 2018లోనే తొలుత తమకు ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఆలోచన వచ్చిందని ఐవోనా కోస్టినా అన్నారు.

రష్యా పూర్తి తరహా దండయాత్ర ప్రారంభించిన తర్వాత తమకు నిధుల సహకారం అందిందని, యుక్రెయిన్ సైనికులు, నిపుణులతో మాట్లాడినట్లు కోస్టినా చెప్పారు.

అవసరమైన వారికి ముఖ్యంగా మహిళలకు, పురుషులకు సాయం చేసేలా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దీని గురించి విన్న చాలామంది దీన్ని విమర్శించారు.

సైనికులను ఆన్‌లైన్‌లో దీనిపై ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు, ‘‘ అక్కడ జనం చచ్చిపోతున్నారు. నువ్వు సెక్స్ గురించి ఆలోచిస్తున్నావు!’’ అని అన్నారని ఐవోనా చెప్పారు.

‘‘ఇంట్లో, ఆస్పత్రిలో సెక్స్ ఉంది. ప్రొసీజర్స్‌కి ముందు, ఆ తర్వాత సెక్స్ ఉంది. చాలా మంచి సెక్స్ జరుగుతూనే ఉంది’’ ఐవోనా అన్నారు.

మొత్తంగా దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు.

రీసెక్స్ చారిటీ 6 వేల బుక్‌లెట్లను ప్రింట్ చేసింది. వీటిని యుక్రెయిన్ వ్యాప్తంగా ఉన్న వైద్య కేంద్రాలకు, సైనికులకు, వారి కుటుంబాలకు పంపింది.

ఈ బుక్‌లెట్లను ఆన్‌లైన్‌లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచింది.

రీసెక్స్ వీడియోలు, గ్రాఫిక్స్, హెల్ప్‌లైన్‌తో సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.

రీసెక్స్
ఫొటో క్యాప్షన్, మహిళలు, పురుషుల కోసం ‘డూ లవ్’ పేరుతో బుక్‌లెట్లను ప్రింట్ చేసిన రీసెక్స్

సెక్స్ సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తోంది

రీసెక్స్ చారిటీ సెక్స్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని కవర్ చేస్తోంది.

మాస్ట్రుబేషన్ (హస్త ప్రయోగం) నుంచి సెక్స్ టాయ్స్, బేసిక్ బయాలజీ వరకు ప్రతిదీ వివరిస్తుంది. ‘‘అన్నింటిపై అవగాహన కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని ఐవోనా చెప్పారు.

ప్రత్యేకంగా ఈ బుక్‌లెట్‌లో ఒక సెక్షన్‌ను యువ సైనికుల కోసం ముఖ్యంగా వర్జిన్లుగా ఉండి గాయాలు పాలైన వారికి కేటాయించారు.

గాయాలు పాలైన తర్వాత జరిగే సెక్స్ వారి మొదటి సెక్స్ అవుతుందని, ఇది వారు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుందని ఆమె అన్నారు.

ప్రాజెక్ట్‌పై దృష్టి ఎక్కువగా శారీరకంగా కంటే భావోద్వేగంపై ఉందని రీసెక్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కాటెరీనా స్కోరోఖోడ్ అన్నారు.

రీసెక్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కాతేరీనా స్కోరోఖోడ్
ఫొటో క్యాప్షన్, రీసెక్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కాటెరీనా స్కోరోఖోడ్

‘‘మిమ్మల్ని మీరు ఎలా కోరుకుంటారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారు, గాయాల పాలైన తర్వాత కూడా రిలేషన్‌షిప్‌లో సెక్స్, అనోన్యతతో మీ భాగస్వామితో సంబంధాలను ఎలా అభివృద్ధి చేసుకుంటారు.’’ అనే దానిపై ఈ ప్రాజెక్ట్ ఫోకస్ చేస్తుందని కాటెరీనా చెప్పారు.

క్వశ్చనీర్లపై సైనికులు చెప్పే సమాధానాలపై ఆధారపడటమంటే.. వారి రీసెర్చ్‌లో లోపాలున్నట్లు అర్థమని ఆమె అన్నారు.

ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి రెస్పాన్స్ తీసుకునేందుకు తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

కానీ, యుక్రెయిన్ సైనికుల గురించి కూడా తాము చాలా తెలుసుకున్నామని, ముఖ్యంగా మెదడుకు అయిన గాయాలను వారు గుర్తించడం కష్టంగా ఉందని చెప్పారు.

అంతేకాక, దేశంలో వీటికి సరైన చికిత్స జరగడం లేదు. ఇవి మొత్తం వారి లైంగిక సామర్ధ్యంపై బాగా ప్రభావం చూపుతున్నట్లు కాటెరీనా తెలిపారు.

సెక్స్ గురించి మాట్లాడేందుకు ఉపయోగించే భాష కూడా చాలా ముఖ్యమైందని ఐవోనా అన్నారు.

‘‘ఇది కచ్చితంగా అర్ధంకాని భాషలో ఉండకూడదు.’’ అని ఆమె చెప్పారు.

‘ప్రతి భాగస్వామి నాకెంతో ముఖ్యం’

హ్లిబ్ తాను చేరిన ఈ ప్రాజెక్ట్ గురించి సానుకూలంగా మాట్లాడారు. మీరిలా యుద్ధంలో గాయపడ్డ తర్వాత మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా అంటే ఆయన నవ్వారు.

‘‘ఆస్పత్రి నుంచి నేను తిరిగి వచ్చిన తర్వాత, నాకొక గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ప్రాజెక్ట్ క్వశ్చనీర్ చేసేటప్పుడు మరో అమ్మాయి ఉండేది. ఇప్పుడు నాకొక పార్టనర్ ఉన్నారు.’’ అని చెప్పారు.

గత ఏడాది కాలంగా తనతో డేట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

‘‘ప్రతి భాగస్వామి నాకెంతో ముఖ్యం. నేను ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడంలో సాయపడ్డారు. వారికెంతో రుణపడి ఉంటాను’’ అని హ్లిబ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)