‘సులభ్’ బిందేశ్వర్ పాఠక్‌కు పద్మవిభూషణ్: భారత్‌లో టాయిలెట్లు కట్టే ఆయన్ను అమెరికా ఎందుకు సాయం కోరింది?

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్‌కు కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 25న పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
మరణానంతరం, సామాజిక సేవ విభాగంలో ఆయన్ను ఈ రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
ఆయనకు గతంలో పద్మభూషణ్ లభించింది.
బిందేశ్వర్ పాఠక్ 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బస్సు స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఈ మరుగుదొడ్లను ‘సులభ్ టాయిలెట్ల’ పేరుతో పిలుస్తున్నారు.
బిందేశ్వర్ పాఠక్ 80 ఏళ్ల వయసులో 2023 ఆగస్టు 15న దిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో తుదిశ్వాస విడిచారు.

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
‘స్మార్ట్ సిటీలు కాదు, ముందు టాయిలెట్ల గురించి మాట్లాడండి’
ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ పథకంపై బిందేశ్వర్ పాఠక్ 2014లో బీబీసీతో మాట్లాడారు.
ప్రభుత్వం ముందు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత డబ్బులుంటే స్మార్ట్ సిటీని రూపొందించాలని ఆయన అన్నారు.
‘‘అన్ని సౌకర్యాలున్న నగరంలో నివసించడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. స్మార్ట్ సిటీ ప్లాన్ చాలా మంచిది. నగరాలు అందంగా మార్చాలి. మార్చాల్సి ఉంది.
పరిశుభ్రమైన, అన్ని సౌకర్యాలతో ఉన్న పర్యావరణ హితమైన నగరాలు నిర్మించాల్సి ఉంది. దీనిలో ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా?
కానీ, దీనికి మరో వైపు నుంచి చూస్తే, దేశంలో కోట్లాది ఇళ్లలో పక్కా మరుగుదొడ్లు లేవు. తొలుత అన్ని ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని నేను చెబుతాను. ఆ తర్వాత డబ్బులు మిగిలితే స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో గ్రామాలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని బీబీసీతో జరిపిన ప్రత్యేక సంభాషణలో బిందేశ్వర్ పాఠక్ అన్నారు.
‘‘స్మార్ట్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, దానిలో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. స్మార్ట్ సిటీ ప్రణాళిక నష్టాల గురించి మాట్లాడుకుంటే, నగరాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటే, అన్ని ఎక్కువ చెట్లను కొట్టివేయాలి.
24 గంటల కరెంట్ కోసం న్యూక్లియర్ ఎనర్జీని వాడాలి. దీని వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి. నిర్మాణాలు చేసేటప్పుడు చెట్లను నరకకూడదు.
అప్పుడైతేనే పర్యావరణ సమతౌల్యం పాటించగలం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్మార్ట్ సిటీలు ఇప్పటికే ఉన్నాయి. ఒకవేళ భారత్ కూడా ఇప్పుడు వీటిని ఏర్పాటు చేస్తే, ఇది ఒక మంచి కార్యక్రమంగా పేరొందనుంది. ’’ అని బిందేశ్వర్ పాఠక్ అన్నారు.

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
భంగీ లిబరేషన్ సెల్ నుంచి ప్రారంభం
బిందేశ్వర్ పాఠక్ 1968లో కాలేజీ చదువులను పూర్తి చేశారు. కొన్నాళ్ల పాటు టీచర్‌గా పని చేశారు. మరికొన్నాళ్లు బిహార్ గాంధీ సెంటినరీ సెలబ్రేషన్ కమిటీలో కార్యకర్తగా చేరారు.
భంగీ ముక్తి (సఫాయి కార్మికులకి ఆ పని నుంచి విముక్తి కల్పించడం) సెల్‌లో ఆయన పని చేయడం ప్రారంభించారు.
ఇక్కడే ఆయన సఫాయి కార్మికుల (మాన్యువల్ స్కావెంజర్స్) సమస్యలను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించారు.
ఈ సంస్థ కింద, తక్కువ ఖర్చులో ప్రజా మరుగుదొడ్ల(పబ్లిక్ టాయిలెట్ల) ను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
సులభ్ ఇంటర్నేషనల్‌ను 1970లో స్థాపించినప్పుడే, అపరిశుభ్రమైన బహిరంగ మలమూత్ర విసర్జన స్థానంలో శుభ్రమైన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రహించారు.

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
1968లో డిస్పోజల్ కంపోస్ట్ టాయిలెట్
దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్లేసెస్‌లో మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యతలను ఈ సంస్థ చేపట్టింది. పర్యావరణ హితమైన ఈ మరుగుదొడ్లను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసింది.
సులభ్ విధానంలో చేపట్టిన మరుగుదొడ్లను, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో ఒక విప్లవంగా పరిగణిస్తారు.
మానవ హక్కులు, పర్యావరణం, పరిశుభ్రత, అభివృద్ధి, సంప్రదాయేతర విద్యుత్ వనరుల నిర్వాహణ, వ్యర్థాల నిర్వాహణతో పాటు సామాజిక సంస్కరణలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది.
ఈయన తొలిసారి 1968లో డిస్పోజల్ కంపోస్ట్ టాయిలెట్‌ను నెలకొల్పారు. దీన్ని, ఇంట్లో దొరికే వస్తువులతోనే తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రపంచంలో దీన్ని అత్యుత్తమ సాంకేతిక విధానాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
ఆ తర్వాత సులభ్ ఇంటర్నేషనల్ సాయంతో, దేశవ్యాప్తంగా సులభ్ టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టారు.

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికుల కోసం టాయిలెట్ల నిర్మాణం
భారత్ సహా పలు దేశాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వేతర సంస్థ సులభ్ ఇంటర్నేషనల్, అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆర్మీ కోసం 2011లో ప్రత్యేక రకమైన మరుగుదొడ్లను నెలకొల్పాలని ప్లాన్ చేసింది.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై పనిచేస్తున్న ఈ సంస్థ, కాబూల్‌లో అంతకుముందు పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.
కానీ, తొలిసారి అమెరికా ఆర్మీనే తమ కోసం మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ఇవ్వాలని బిందేశ్వర్ పాఠక్‌ను అభ్యర్థించింది. ‘బయో గ్యాస్’ అనే ప్రత్యేక విధానం ద్వారా మరుగుదొడ్లను నిర్వహించాలని అమెరికా ఆర్మీ కోరింది.
కాబూల్‌లో ప్రతి ప్రాంతంలో ఇలాంటి మెరుగైన, చౌకైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరింది.

ఫొటో సోర్స్, SULABHINTERNATIONAL.ORG
ఇథియోపియా, దక్షిణాఫ్రికా, చైనాలకు టాయిలెట్ టెక్నాలజీ
కాబూల్ మున్సిపాలిటీలో పలు రకాల మరుగుదొడ్లను సులభ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసింది.
‘‘కాబూల్ మున్సిపాలిటీ సహకారంతో కొన్నేళ్ల క్రితం కొన్ని మరుగుదొడ్లను మా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సారి అమెరికా ఆర్మీనే మా సహకారాన్ని కోరింది. మా సంస్థ వారికి పూర్తిగా మద్దతు ఇస్తోంది. సాయం చేస్తోంది’’ అని ఆ సమయంలో బిందేశ్వర్ పాఠక్ బీబీసీకి తెలిపారు.
తమ సంస్థ టెక్నాలజీని ఇతర దేశాలు కూడా వాడటం తమ సంస్థ గర్వించదగిన విషయమని పాఠక్ అన్నారు.
భారత్‌తో పాటు ఇథియోపియా, దక్షిణాఫ్రికా, చైనా, భూటాన్, నేపాల్ వంటి ఇతర 10 దేశాలకు తమ మరుగుదొడ్లకు సంబంధించిన టెక్నాలజీని సులభ్ ఇంటర్నేషనల్ అందించింది.
ఇవి కూడా చదవండి:
- ఇస్రోకు శ్రీహరికోట కంటే కులశేఖర పట్నంతోనే ఎక్కువ ఉపయోగమా, ఎందుకు?
- అసెంబ్లీలో జయలలిత చీర లాగారా? ఆ రోజు అసలేం జరిగింది?
- గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం...తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?
- అఫ్గానిస్తాన్: ‘తిండి కోసం పాప ఉయ్యాల అమ్మేశా. ఏ దారి లేకపోతే నా పిల్లల్నీ అమ్ముకోవాల్సిందే’
- విద్యా లక్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














