అఫ్గానిస్తాన్: ‘తిండి కోసం పాప ఉయ్యాల అమ్మేశా. ఏ దారి లేకపోతే నా పిల్లల్నీ అమ్ముకోవాల్సిందే’

- రచయిత, లీస్ డుసెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలన మొదలై రెండేళ్లయింది. ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం అఫ్గానిస్తాన్ అని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది.
నిధుల కొరత వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతోందని హెచ్చరించింది.
తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై, బాలికలపై ఆంక్షలు తీవ్రమయ్యాయి.
ఎస్మతుల్లాకు 13 ఏళ్లు. అతని తమ్ముడు ఆసిఫ్‌కు 12 ఏళ్లు. కాబూల్‌లోని ఓ షెడ్డులో రోజుకు 14 గంటలు పని చేస్తే వారికి దక్కేది 80 రూపాయల కంటే తక్కువ. రోజంతా పని.
‘‘ఇది చాలా కఠినమైన పని. నాకు ఈ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వేరే దారి లేదు. కుటుంబం గడవాలంటే నేను ఈ పనిచేయాల్సిందే’’ అని ఎస్మతుల్లా అన్నారు.
పిల్లలంతా బయట ఆడుకోవడం చూస్తుంటే తనకు కూడా ఆడుకోవాలని అనిపిస్తుందని ఆసిఫ్ చెప్పారు.
‘‘బయట పిల్లలంతా ఆడుకుంటారు. నాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. మా నాన్నకు పని దొరికి, మేం తిరిగి స్కూలుకు వెళ్లాలని దేవుడిని ప్రార్థిస్తుంటాను. తను సంపాదించి మా అప్పులు తీర్చితే మేం పనికి వచ్చే అవసరం ఉండదు’’ అని ఆసిఫ్ అన్నారు.
ఎస్మతుల్లా, ఆసిఫ్‌ల తండ్రి నేమాతుల్లా జజాయ్ ఓ విదేశీ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేసేవారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ మూత పడింది. అంతర్యుద్ధం ఆయనను గాయాలపాలు చేసింది.
కుటుంబానికి ఆహారం కొనేందుకు డబ్బు కోసం తన కుమార్తె ఉయ్యాలను అమ్మేసినట్లు నేమాతుల్లా జజాయ్ బీబీసీతో చెప్పారు.
‘‘పాప పడుకునే ఉయ్యాల కూడా పిండి కొనడానికి అమ్మేశాను. దుకాణాల్లో అప్పు పెట్టి తిండి కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్లకు ఇప్పట్లో ఆ అప్పు తీర్చలేను కూడా. బతకడానికి ఏ దారి లేకపోతే నా బిడ్డల్ని కూడా అమ్ముకోక తప్పదు’’ అని ఆయన అన్నారు.
యూఎన్ లెక్కల ప్రకారం 84 శాతం మంది అఫ్గాన్లు తిండి కొనుక్కోవడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి.

ఫొటో సోర్స్, Getty Images
అలా చేస్తే నా కలలు చెదిరిపోతాయి: 12 ఏళ్ల బాలిక
తాలిబాన్ల పాలనలో పిల్లల జీవితాలు కూడా దుర్భరంగా మారాయి.
డాక్టర్ అవ్వాలనేది అయిదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల హదియా కల.
బాలికలకు సెకండరీ విద్యపై తాలిబాన్లు నిషేధం ఎత్తివేయకపోతే ఆమెకు స్కూల్లో ఇదే చివరి ఏడాది.
‘‘బాలికలకు హై స్కూల్ విద్యను దూరం చేస్తే నా ఆశలు, కలలు చెదిరిపోతాయి’’ అని హదియా అన్నారు.
పిల్లల హక్కులను అణిిచివేయడంతోపాటు బాలికల విద్యను సమర్థించే వారిని తాలిబాన్లు అరెస్ట్ చేస్తున్న ఘటనలు కూడా గతంలో జరిగాయి.

బాలికల విద్యను సమర్థించిన ప్రొఫెసర్ అరెస్ట్
అఫ్గానిస్తాన్‌లో బాలికల విద్యను సమర్థించిన ఒక ప్రొఫెసర్‌ను తాలిబాన్లు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.
కాబూల్‌లోని ఒక యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఇస్మాయిల్ మషాల్, తాలిబాన్ల విధానాలను బహిరంగంగా విమర్శించారు. మహిళ, బాలికల విద్యపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు.
ప్రొఫెసర్ మషాల్ ఉచితంగా పుస్తకాలు పంచుతుండగా తాలిబాన్లు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
మహిళలు, బాలికల యూనివర్సిటీ, మాధ్యమిక విద్యపై తాలిబాన్లు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఒక టీవీ ప్రోగ్రాంలో తన అకడమిక్ సర్టిఫికెట్లను ఆయన చించివేశారు. దీంతో ఆయన పేరు వార్తల్లోకెక్కింది.
37 ఏళ్ల ప్రొఫెసర్ మషాల్ "రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు" అని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















