అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?

తాలిబాన్లు
    • రచయిత, నూర్ గిల్ షఫాఖ్
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలు ఉన్నాయి.

‘‘ఫుట్‌బాల్ స్టేడియంలో కొందరిని తాలిబాన్ అధికారులు కొరడాతో కొట్టడాన్ని చూసినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. గుండె కొట్టుకునే ఆ శబ్దం నా చెవులకు కూడా వినిపించింది. ఇలాంటి దృశ్యాన్ని నిజంగా చూస్తానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు.’’

ఇవి 21 ఏళ్ల జుమ్మా ఖాన్ మాటలు. గోప్యత కోసం ఆయన పేరును మార్చాం.

2022 డిసెంబరు 22న సెంట్రల్ అఫ్గాన్‌లోని తరిన్‌కోట్ పట్టణంలో ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని అందరూ చూస్తుండగానే తాలిబాన్ అధికారులు కొరడాతో కొట్టారు. ఆ 22 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివిధ ‘నేరాల’కు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు మోపారు.

వీరికి శిక్షలు అమలు చేయబోతున్నట్లు ఒక రోజు ముందే మసీదుల్లో, రేడియోలో చెప్పారు. కొరడాతో కొట్టడాన్ని చూసేందుకు అందరూ రావాలని, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రజలకు వారు సూచించారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

శిక్షలు ఎక్కడ అమలు చేస్తున్నారు?

సాధారణంగా బహిరంగ శిక్షలను అమలు చేసేందుకు భారీ స్టేడియాలను ఎంచుకుంటున్నారు. ఇలా బహిరంగంగా శిక్షలు అమలు చేసే పద్ధతి 1990ల్లో మొదటిసారి తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడే ఇక్కడ మొదలైంది.

తరిన్‌కోట్ స్టేడియంలో ఒకేసారి 18,000 మంది కూర్చోవచ్చు. అయితే, ఆ రోజు దీని కంటే చాలా ఎక్కువ మందే అక్కడకు వచ్చారని ఖాన్ చెప్పారు.

‘‘స్టేడియం మధ్యలో గడ్డిపై ఆ నిందితులను కూర్చోబెట్టారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. వారిని కాపాడాలని చాలా మంది స్టేడియంలోనే దేవుడికి ప్రార్థనలు చేశారు’’ అని బీబీసీతో ఖాన్ చెప్పారు.

నిందితులను కొరడాతో కొట్టినట్లు తాలిబాన్‌ల సుప్రీం కోర్టు ట్విటర్ వేదికగా స్పష్టంచేసింది. ఎంత మందికి శిక్షలు విధించారో కూడా వెల్లడించింది.

ఈ అంశంపై తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ బీబీసీతో మాట్లాడారు.

‘‘షరియా చట్టం ప్రకారం ఇలాంటి శిక్షలను మా నాయకుడు అమలు చేస్తారు. వీటిని ప్రజలందరూ చూడాలని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఖురాన్ కూడా చెబుతోంది. షరియాను అనుసరించి మేం శిక్షలను అమలు చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

18 నుంచి 37 ఏళ్ల మధ్య వయసున్న మగవారికి 25 నుంచి 39 కొరడా దెబ్బలు కొట్టినట్లు ఖాన్ చెప్పారు.

‘‘కొంతమంది చాలా గట్టిగా అరిచారు, ఏడ్చారు. మరికొంతమంది దెబ్బలను మౌనంగా తట్టుకున్నారు. దెబ్బలు తిన్నవారిలో మా బంధువు ఒకరు ఉన్నారు. దొంగతనం చేసినందుకు ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. 20 దెబ్బల తర్వాత తన శరీరం మొద్దుబారిపోయిందని, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియలేదని ఆయన చెప్పారు’’ అని ఖాన్ వివరించారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

9/11 దాడులకు రెండేళ్ల తర్వాత ఖాన్ జన్మించారు. ఆ దాడుల తర్వాతే అమెరికా, నాటో సేనలు అఫ్గాన్‌పై దండెత్తి తాలిబాన్ల పాలనకు ముగింపు పలికాయి.

బహిరంగ ప్రాంతాల్లో ప్రజలను ఎలా కొరడాతో కొట్టేవారో ఇంట్లోని పెద్దలు ఖాన్‌కు చెప్పేవారు. 1990ల్లో కొందరికి శిక్షల్లో భాగంగా కాళ్లూ, చేతులూ నరికారు. బహిరంగ ఉరి శిక్షలు కూడా అమలు చేశారు. అయితే, శిక్షను అమలు చేయడాన్ని తన కళ్లతో చూడటం ఖాన్‌కు ఇదే మొదటిసారి.

చూడటానికి వచ్చినవారిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నించారని ఖాన్ చెప్పారు.

‘‘అక్కడకు వచ్చినవారిలో చాలా మంది నా లాంటి యువకులే ఉన్నారు. అయితే, వారిని మధ్యలో వెళ్లిపోవడానికి తాలిబాన్లు అనుమతించలేదు. దీంతో కొందరు గోడలు, కంచెలు ఎక్కి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు’’ అని ఆయన వివరించారు.

తమను తాము చట్టబద్ధమైన పాలకులుగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న తాలిబాన్లు ఈ శిక్షలపై విదేశాల నుంచి వచ్చే ప్రతికూల స్పందనల విషయంలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈ శిక్షలపై ఎలాంటి వార్తలూ రాయకుండా, వీటిని రికార్డు చేయకుండా తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీచేశారు.

అయితే, ఈ ఘటనలను రహస్యంగా తన ఫోన్‌లో ఖాన్ రికార్డు చేశారు. దాన్ని ఆయన బీబీసీకి పంపించారు. మరోవైపు మరో యువకుడు కూడా వీడియో తీసి దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

ఆ రోజు చూసిన ఘటనలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని, తనకు కూడా ఇలాంటి శిక్ష విధిస్తారేమోననే భయం వెంటాడుతోందని ఖాన్ చెప్పారు.

‘‘ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకుంటున్నాను. గెడ్డం కూడా బాగా పెంచుకున్నాను’’ అని ఆయన చెప్పారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

ఎంత మందికి శిక్షలు విధించారు?

2022 నవంబరు నుంచి తాలిబాన్ ప్రభుత్వం ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలుచేస్తోంది. మరోవైపు అప్పటి నుంచే సుప్రీం కోర్టు కూడా దీనిపై ప్రకటనలు విడుదల చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఇలాంటి శిక్షలను 50 సార్లకుపైనే అమలుచేశారు. మొత్తంగా 346 మందికి శిక్షలు విధించారు.

సాధారణంగా వీరిలో ఎంత మంది మహిళలు ఉన్నారో సుప్రీం కోర్టు వెల్లడించదు. అయితే, వీరిలో 51 మంది మహిళలు ఉన్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. 233 మంది పురుషులు కాగా, మిగతా 60 మంది జెండర్ తెలియరాలేదు.

దాదాపు వీరందరికీ కొరడాలతో కొట్టారు. కొందరికి జైలు శిక్ష కూడా విధించారు.

ఉరి శిక్ష విధించిన వారిలో ఇద్దరూ పురుషులే ఉన్నారు. ఒకరికి నైరుతి అఫ్గాన్‌లోని ఫరాలో, మరొకరికి తూర్పు లగ్‌మన్ ప్రావిన్స్‌లో ఈ శిక్షను అమలుచేశారు.

గత నవంబరు 13 తర్వాత నుంచి బహిరంగంగా కొరడాలతో కొట్టే ఘటనల సంఖ్య పెరుగుతోంది. ఆనాడు భిన్న నేరాలకు సంబంధించిన శిక్షలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తాలిబాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు జారీచేశారు.

వీడియో క్యాప్షన్, మహిళలకు ఇప్పటికీ అందని విద్య, ఉద్యోగ అవకాశాలు

ఏ నేరాలకు శిక్షలు విధిస్తున్నారు?

అఫ్గాన్‌లోని ఇస్లామిక్ షరియా చట్టాలకు అనుగుణంగా తాము శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది.

ఇక్కడ దొంగతనం, హత్య, వివాహేతర సంబంధం, స్వలింగ సంపర్కం, అవినీతి, అనైతికత లాంటి 19 వర్గాలుగా నేరాలను విభజించారు.

అయితే, ఈ నేరాలను ఎలా నిర్వచిస్తున్నారో స్పష్టంగా వెల్లడించడం లేదు. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా వీటిని నిర్వచిస్తున్నారు.

ప్రస్తుతం శిక్షను అనుభవించిన వారిలో ఎక్కువ మంది దొంగతనానికి పాల్పడిన వారే ఉన్నారు. ఈ నేరానికి 39 కొరడా దెబ్బలను విధిస్తున్నారు. కొందరికి అదనంగా మూడు నెలల నుంచి ఒక ఏడాది వరకూ జైలు శిక్షను కూడా విధిస్తున్నారు.

లైంగిక నేరాలను ‘జీనా (వివాహేతర సంబంధాలు)’గా తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది. దీనికి శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.

ముఖ్యంగా ఇంటి నుంచి పారిపోవడానికి విధించే శిక్షలు మానవ హక్కుల ఉద్యమకారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గృహహింస, బలవంతపు పెళ్లిళ్ల బారినపడుతున్న మహిళలకు ఇవి మరింత చేటు చేస్తాయని వారు చెబుతున్నారు.

సుప్రీం కోర్టు ప్రకటనల్లో ఆరుసార్లు ‘లివాతత్’ను కూడా ప్రస్తావించారు. అంటే మగవారి మధ్య లైంగిక సంబంధం.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఏ ప్రావిన్స్‌లలో శిక్షలు ఎక్కువ?

అఫ్గాన్‌లోని 34 ప్రావిన్స్‌లలో 21 ప్రావిన్స్‌లు బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. కొన్ని ప్రావిన్స్‌లలో శిక్షలు మరింత ఎక్కువగా అమలు చేస్తున్నట్లు వెల్లడైంది.

తూర్పు లగ్‌మన్ ప్రావిన్స్‌లో ఏడుసార్లు అత్యధికంగా ఇలాంటి శిక్షలు విధించారు. పక్తియా, ఘోర్, పర్వాన్, కాందహార్ ప్రావిన్స్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దోషుల సంఖ్య ప్రకారం చూస్తే, 48 మందితో హెల్మాంద్ మొదటి స్థానంలో ఉంది. బదఖ్షాన్ (32), పార్వాన్ (31), ఘోర్ (24), కాందహార్ (22), రోజ్గాన్ (22), కాబూల్ (21) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కేవలం తాలిబాన్ సుప్రీం కోర్టు విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో వివరాలు మాత్రమే. రికార్డుల్లో ప్రస్తావించని శిక్షలు కలిపితే ఈ సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది.

ఇలాంటి శిక్షలను విధించడాలను ఆపాలని ఐక్యరాస్యసమితితోపాటు మానవ హక్కుల సంస్థలు, చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, వీటిని విడిచిపెట్టే దిశగా తాలిబాన్లు ఎలాంటి సంకేతాలూ ఇవ్వడం లేదు.

ఇలాంటి బహిరంగ శిక్షల ద్వారా ప్రజలకు గుణపాఠాలు చెప్పొచ్చని, నేరాల సంఖ్య కూడా దీనితో తగ్గుతుందని తాలిబాన్లు చెబుతున్నారు.

ఇలాంటి శిక్షలను ప్రత్యక్షంగా చూడటంతో మానసికంగా చాలా ప్రతికూల ప్రభావం పడుతోందని జుమ్మా ఖాన్ లాంటివారు చెబుతున్నారు. మరోవైపు శిక్షను అనుభవించే వారు కూడా అవమానంతో ఇంటి నుంచి బయటకు రావడంలేదని ఆయన చెప్పారు.

దీనిపై తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా మాట్లాడుతూ.. ‘‘ప్రజల మానసిక ఆరోగ్యాన్ని అల్లా చూసుకుంటారు. మేం షరియా చట్టాలకు వ్యతిరేకంగా వెళ్లలేం’’ అని అన్నారు.

(ఈ కథనం కోసం తాలిబాన్ ప్రభుత్వ సుప్రీం కోర్టు విడుదలచేసిన ప్రకటనల్లో వివరాలను బీబీసీ పష్తో విశ్లేషించింది. నవంబరు 2022 నుంచి 5 ఆగస్టు 2023 మధ్య ఎనిమిది నెలల డేటాను పరిశీలించింది. మరోవైపు యూఎన్ఏఎంఏ అఫ్గాన్ రిపోర్టులోని నేరాల వివరాలను విశ్లేషించింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)