ఓడ కింద రడ్డర్ బ్లేడ్ మీద దాక్కుని నడి సముద్రంలో 14 రోజుల ప్రమాదకర ప్రయాణం... చివరికి ఏమైంది?

నైజీరియా

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, జోయెల్ గంతర్
    • హోదా, బీబీసీ న్యూస్

నలుగురు నైజీరియన్లు ఓ చమురు మోసుకెళ్తున్న ఓడ కింద దాక్కుని యూరప్ వెళ్లాలనుకున్నారు. అయితే, అది బ్రెజిల్ వెళ్తుందని వారికి తెలియదు. రెండు వారాల ఆ ప్రయాణంలో దాదాపు వారి ప్రాణాలు పోయినంత పనైంది.

జూన్ 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, రోమన్ ఎబిమెర్ ఫ్రైడే ఆహారం సిద్ధం చేసుకున్నాడు. చీకట్లోనే పోర్ట్ సిటీ లాగోస్‌కి బయలుదేరాడు. అదే రోజు 190 మీటర్ల పొడవైన భారీ ఆయిల్ ట్యాంకర్ షిప్ డాక్‌యార్డులో సిద్ధంగా ఉంది. అది తనను యూరప్ తీసుకెళ్తుందని భావించాడు.

ఎలాగైనా ఓడ రడ్డర్ బ్లేడ్ (చుక్కాని) వద్దకు చేరుకోవడమే ఆ రోజుకి అతని లక్ష్యం. ఓడలో రహస్యంగా దాక్కుని ప్రయాణం చేసేందుకు అందుబాటులో ఉండే ఒకే ఒక్క చోటు అదే.

అయితే, పడవలో అక్కడికి తీసుకెళ్లేందుకు మత్స్యకారుడిని ఒప్పించడమే తప్ప వేరే మార్గం లేదు. ''ఆ మత్స్యకారుడు మంచివాడు'' అని గుర్తు చేసుకున్నాడు. ''అతను నన్ను డబ్బు అడగలేదు. అతను నన్ను అక్కడ వదిలిపెట్టాలని అనుకున్నట్లు అనిపించింది''.

మత్స్యకారుడు రడ్డర్ బ్లేడ్ వద్దకు చేర్చాడు. ఓడ కింద భాగం నుంచి రడ్డర్ బ్లేడ్ పైకి ఎక్కాడు 35 ఏళ్ల ఎబిమెర్. తాడు సాయంతో ఆహారం ఉన్న బ్యాగును పైకి లాగాడు. కొద్దిగా కుదురుకున్నాక, చీకట్లో మరో మూడు ముఖాలను చూసి ఆశ్చర్యపోయాడు. అదే ఉపాయంతో, ఓడ ఎక్కిన నాలుగో వ్యక్తి ఎబిమెర్. '' మొదట భయపడ్డాను. కానీ వాళ్లు ఆఫ్రికన్ నల్లజాతీయులు. నా సహోదరులు'' అని ఆయన చెప్పారు.

ఆ తర్వాత 15 గంటల పాటు రడ్డర్ బ్లేడ్ పక్కనే నిశ్శబ్దంగా తలదాచుకున్నారు. మరుసటి రోజు జులై 28న సాయంత్రం 5 గంటలకు ఓడ భారీ మోటార్లు స్టార్ట్ అయినట్లు గుర్తించారు. తామంతా యూరప్‌ వెళ్తున్నామని, వారం రోజులు వారితో కలిసే ప్రయాణం చేయాలని వారు అనుకున్నారు.

ఆయిల్ ట్యాంకర్ 'కెన్ వేవ్' ఓడరేవు నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణం ప్రారంభించింది. ప్రమాదకర ఈ రెండు వారాల ప్రయాణంలో వారు మృత్యువు అంచుల్లోనే గడిపారు.

నైజీరియా

ఫొటో సోర్స్, VICTOR MORIYAMA/BBC

మొదటి రోజు

లాగోస్ నుంచి బయలుదేరిన తర్వాత, రడ్డర్ బ్లేడ్ వద్ద ఉన్న వారు కాస్త సౌకర్యవంతంగా ఉండేందుకు చుట్టుపక్కల వెతికారు. అయితే, అక్కడ అంత చోటు లేదు. ఓడ దిశను మారుస్తున్న రడ్డర్ బ్లేడ్ అటూఇటూ కదులుతూనే ఉంది. వాళ్లందరూ పడుకున్న తర్వాత, సముద్రపు నీళ్లపై వేలాడుతున్న రెండు చిన్న వలలు మాత్రమే ఉన్నాయి పడుకోవడానికి.

మధ్యదరా సముద్రం దాటేందుకు, ప్రాణాలను పణంగా పెట్టి రడ్డర్ బ్లేడ్‌పై ఎందుకు ప్రయాణం చేస్తున్నారో బయటి నుంచి చూసేవారికి అర్థం కాకపోవచ్చు. కానీ, జీవితంపై ఆశ కోల్పోయిన వారికి అది అంత కష్టమైన పనేమీ కాదు.

''నైజీరియాలో ఉద్యోగావకాశాలు లేవు. డబ్బుల్లేవు. నా తల్లికి, తమ్ముళ్లకి తిండి పెట్టడానికి మరో మార్గం లేదు'' అని ఆయన చెప్పారు. ''నేను పెద్ద కొడుకుని. మా నాన్న 20 ఏళ్ల కిందట చనిపోయారు. కుటుంబాన్ని చూసుకోవాలి. కానీ నేను చేయలేకపోతున్నాను.''

ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మూడేళ్లు లాగోస్ వీధుల్లోనే గడిపారు.

''నైజీరియాలో ప్రతిరోజూ నేరానికీ, పాపానికీ మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జనం కొట్టుకుంటారు. ఒకరినొకరు చంపుకుంటారు. టెర్రరిస్టుల దాడులు, కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. నేను వాటికంటే మెరుగైన భవిష్యత్తు కోరుకుంటున్నా'' అని ఆయన వివరించారు.

రడ్డర్ బ్లేడ్ పక్కన తలదాచుకున్న వారిలో పెంటెకోస్టల్ పాస్టర్, వ్యాపారవేత్త అయిన ఒపెమిపో మాథ్యూ యెయీ ఉన్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. నిరుడు నైజీరియాను అతలాకుతలం చేసిన వరదల కారణంగా ఆయన వేసిన వేరుశనగ, పామాయిల్ పంట నాశనమైంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి వారికి మరే ఇతర ఆదాయం కానీ బీమా కానీ లేవు.

''నా వ్యాపారం నాశనమవడంతో నా కుటుంబం రోడ్డుపాలైంది. అదే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.'' అని ఆయన చెప్పారు.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల రిగ్గింగ్ వంటి ఆరోపణలు కూడా యెయీ సరైన నిర్ణయమే తీసుకున్నానని అనిపించేలా చేశాయి.

'ఎన్నికలొక్కటే మాకున్న ఆశ' అని ఆయన చెప్పారు. ''నైజీరియాలో ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది''.

అందుకే తన కుటుంబానికి కూడా చెప్పకుండా, అర్ధరాత్రి వేళ తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి పోర్టుకి వచ్చేశాను. అక్కడికి వచ్చిన తర్వాత కెన్ వేవ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.

నైజీరియా

ఆర్థిక మాంద్యం, విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగం కారణంగా యెయీ లాంటి ఎంతోమంది అధికారిక, అనధికారిక పద్దతుల్లో నైజీరియా నుంచి వెళ్లిపోతున్నారు. ఎక్కువ మంది సహారా ఎడారి, మధ్యదరా సముద్రం మీదుగా దేశం విడిచి పోతున్నారు. అలా వెళ్లిన వారిలో ఈ ఏడాది 1,200 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి.

మరికొందరు అనధికారికంగా, దాక్కుని ప్రయాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరుడు ఎబిమెర్, యెయీ మాదిరిగానే ముగ్గురు రడ్డర్ బ్లేడ్ వద్ద కూర్చుని 4 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్పెయిన్‌లోని క్యానరీ దీవులకు చేరుకున్నారు. అలాగే తాము కూడా వెళ్లాలని ఎబిమెర్, యెయీ కూడా అనుకున్నారు.

విలియం, జీజ్ అనే మరో ఇద్దరితో కలిసి వారు ప్రయాణించారు. ప్రయాణం ప్రారంభమైన మొదట్లో చాలా అసౌకర్యంగా, భయంగా గడిపారు. తక్కువ మాట్లాడేవారు. తరచూ దేవుడిని ప్రార్థించేవారు. ఓడ ప్రయాణించే సమయంలో మేల్కొని ఉండేందుకు ప్రయత్నించారు. అట్లాంటిక్ మహా సముద్రంలో దాదాపు 5,600 కిలోమీటర్లు ప్రయాణించారు. కానీ వారు యూరప్ చేరుకోలేకపోయారు. ఆ ఓడ బ్రెజిల్ వెళ్లింది.

ఐదో రోజు ఏం జరిగింది...

కాలినడకన సహారా ఎడారి దాటడం, లేదంటే నాసిరకం పడవల మీద మధ్యధరా సముద్రం దాటే వారి కంటే ఓడలో ప్రయాణించడం సురక్షితమే. కానీ ఐదవ రోజు నాటికి ఎబిమెర్, యెయీకి తాము ప్రయాదకర పరిస్థితుల్లో ఉన్నామని తెలిసింది.

సరైన తిండి, నిద్ర లేక అప్పటికే నీరసంగా ఉన్నారు. మూత్రానికి వెళ్లాలంటే నడుముకి తాడు కట్టుకుని రడ్డర్ బ్లేడ్ చివరి వరకూ వెళ్లాల్సి ఉంటుంది. సముద్రంలో పోటు వచ్చినప్పుడు అలలు బలంగా తాకుతాయి. ''భారీ అలలు వచ్చినప్పుడు మేమంతా చాలా భయపడ్డాం'' అని యెయీ చెప్పారు.

''నేను అంతకుముందెప్పుడూ సముద్రాన్ని చూడలేదు. కానీ తుపాను డాక్యుమెంటరీలు చూశాను. భారీ అలలు ఓడలను ముందుకు, వెనక్కు నెట్టేయడం చూశాను''

''ఆ పరిస్థితిలో నిద్ర అసాధ్యం. రడ్డర్ బ్లేడ్ 24 గంటలూ కదులుతూనే ఉంటుంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే'' అని ఎబిమెర్ చెప్పారు.

రోజులు గడుస్తున్నాయి. పగలూ, రాత్రీ వచ్చి వెళ్తున్నాయి. వాళ్లు బలహీనంగా అయిపోవడంతో కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు. ఎబిమెర్ తన గడియారంలో చూసుకుంటూ రోజులను గుర్తుచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వలలు బలంగా కట్టినప్పటికీ వదులైపోయాయి. తెచ్చుకున్న ఆహారం కూడా తగ్గిపోతోంది. మంచినీళ్లు కొద్దిగానే ఉన్నాయి. వారి గొంతులు ఎండిపోతున్నాయి. కడుపులు కాలిపోతున్నాయి. అయినా, నీళ్లలో పడిపోకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

నైజీరియా

ఫొటో సోర్స్, VICTOR MORIYAMA/BBC

పదో రోజు ప్రయాణం...

పదో రోజు వచ్చేప్పటికి ఆ నలుగురిలో భయం మొదలైంది. ఉదయం చివరిగా ఆహారం చేశారు. కొద్దిగానే ఉన్న మంచినీళ్లు కూడా అయిపోయాయి. వాళ్లు తెచ్చుకున్న ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటుండడంతో అందరూ ఆకలి బాధతో ఉన్నారు.

''అది చాలా కష్టమైన పరిస్థితి'' యెయీ చెప్పారు.

''నా గొంతు పూర్తిగా ఎండిపోయింది. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం జీవితంలో ఇదే తొలిసారి. నీళ్లంటే ఏంటో నిజంగా నాకు అప్పుడే అర్థమైంది.''

దాహం తీర్చుకునేందుకు వాళ్లు సముద్రపు ఉప్పు నీళ్లు తాగారు. టూత్‌పేస్ట్ కూడా తినేశారు.

ఉప్పు నీళ్లు తాగడం వల్ల పన్నెండో రోజు తమతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వాంతులయ్యాయి. ''అతని వద్ద శక్తి లేదు. నీళ్లలో పడిపోయేలా ఉన్నాడు. కిందకు చూస్తే నీళ్లు భయంకరంగా ఉన్నాయి. నేనొక్కడినే కొద్దిగా బలంగా ఉన్నాను. అతన్ని పడిపోకుండా పట్టుకున్నాను'' అని ఎబిమెర్ చెప్పారు.

ఆకలి, దాహంతో వారు మృత్యువుకు దగ్గరవుతున్నారు. ఆ పరిస్థితి నుంచి తన దృష్టి మళ్లించేందుకు ఎబిమెర్ రడ్డర్ బ్లేడ్‌పై అటొక కాలు, ఇటొక కాలు వేసుకుని కూర్చుని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని ఎదురుచూస్తున్నాడు.

పదమూడో రోజు సముద్రంలో తిమింగలం కనిపించింది.

''అలాంటి దృశ్యం చూడడం జీవితంలో అదే మొదటిసారి'' అని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నాడు ఎబిమెర్.

''నేను తిమింగలం చూశానని మా దేశంలో ఎవరికైనా చెబితే అబద్ధం చెబుతున్నానని అనుకుంటారు. దాంతో నా ఆకలి, దాహం ఎగిరిపోయాయి.''

నైజీరియా

ఫొటో సోర్స్, REUTERS

చివరి రోజు ఏం జరిగింది?

పద్నాలుగో రోజు ఉదయం ఓడ భారీ ఇంజిన్లు వేగం తగ్గించినట్లు అనిపించింది. అప్పుడు ఎబిమెర్ రడ్డర్ బ్లేడ్ అంచున ఉన్నారు. కొంతదూరంలో మసకమసకగా భూభాగం కనిపిస్తోంది. ఆ తర్వాత భవనాలు, ఆ తర్వాత ఒక పడవ కనిపించాయి.

సిబ్బంది మారే సమయంలో, వారిని ఓడ వద్దకు తీసుకొచ్చి తీసుకెళ్తున్న బోటు రడ్డర్ బ్లేడ్ వద్ద ఉన్న వారిని గుర్తించింది. అక్కడ ఎవరో ఉన్నారు? వాళ్లెవరు? అంటూ కేకలు పెట్టారు.

ఎబిమెర్ వారికి సమాధానం చెప్పాలనుకున్నాడు కానీ గొంతు ఎండిపోవడం వల్ల మాట పెగల్లేదు. అప్పుడు బోటు వెళ్లిపోయింది. రెండు గంటల తర్వాత, మరికొంత వెలుగు వచ్చింది. పోలీసులు వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి ఎబిమెర్‌కి మంచినీళ్ల బాటిల్ ఇచ్చారు.

''మీరు బ్రెజిల్‌లో ఉన్నారు'' అని ఆయన చెప్పారు.

సురక్షితంగా భూభాగానికి చేరుకున్నారు. అక్కడున్న వారిని సాయమడిగి ఇళ్లకు ఫోన్ చేసుకున్నారు. విలియం, జెజీ తిరిగి నేరుగా నైజీరియా వెళ్లేందుకు అంగీకరించారు. కానీ, ఎబిమెర్, యెయీ మాత్రం బ్రెజిల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

''మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం. ఇది కొత్త ప్రారంభం'' అని యెయీ అన్నారు.

ఇవి కూడా చదవండి: