International Left Handers Day: 'ఎడమ చేత్తో మంచినీళ్లు ఇస్తే తాగకుండానే వెళ్లిపోయేవారు... అది అంత అపవిత్రమా?

- రచయిత, ప్రీతీ రాజేశ్వరి,
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏదైనా కొద్దిగా అటూఇటుగా జరిగినా, లేదంటే రెండూ సమానమేనని చెప్పాల్సి వచ్చినా కుడి ఎడమైతే ఫర్వాలేదనే ఉపమానం వాడుతుంటారు.
అయితే, నిజంగా కుడి, ఎడమ సమానమేనా? అటు ఇటైనా ఫర్వాలేదా? అంటే మాత్రం కొద్దిగా లోతుగా ఆలోచించాల్సిందే.
మంచినీ, చెడునీ.. శుద్ధాన్నీ, అశుద్ధాన్నీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే లెక్కగట్టేస్తుంటారు. అలాంటప్పుడు కుడి, ఎడమైతే పెద్ద పొరపాటేనని అనిపిస్తుంటుంది.
నేను బీబీసీ తెలుగులో న్యూస్ ప్రెజెంటర్‌గా పని చేస్తున్నాను. యూట్యూబ్‌లో నేను ప్రెజెంట్ చేసిన బులెటిన్ వీడియోల కింద ఎక్కువగా ఒక కామెంట్ కనిపిస్తూ ఉంటుంది.
‘‘మీరు కుడి చేతికి వాచీ ఎందుకు పెట్టుకుంటారు..?’’
ఎందుకంటే నాది ఎడమ చేతి వాటం. అందుకే కుడి చేతికి వాచీ కట్టుకుంటాను. కుడి చేతి వాటం గల వాళ్లు మెజారిటీ ఉన్న సమాజంలో ఎడమ చేతి వాటం వారు చేసే పనులను చిత్రంగా చూడటం మామూలే. కుడి చేతి వాటం గల వారు ఎడమ చేతికి వాచీలు పెట్టుకుంటారు కాబట్టి, కుడి చేతికి పెట్టుకోవడం అదొక వింత అయింది.
ఎడమ చేతి వాటం వల్ల నాకు ఇలాంటి ప్రశ్నలే కాదు కొన్ని చిక్కులు, సమస్యలు కూడా తరచూ ఎదురవుతూ ఉంటాయి. కొన్ని నవ్విస్తే మరికొన్ని బాధపెడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నప్పుడు పుస్తకంలో రాసిన ప్రతిసారీ చిటికెన వేలు నుంచి మణికట్టు వరకూ మొత్తం సిరామరకలే ఉంటాయి. కొన్నిసార్లు అక్షరాలను తిరగేసి రాసేదాన్ని. అంటే వాటిని చదవాలంటే మీకు అద్దం కావాలి. దాన్నే మిర్రర్ రైటింగ్ అని అంటారట.
కానీ స్కూల్లో మా టీచర్లు, నేను రాసింది చదవడానికి అద్దాలు తెచ్చుకోలేరు కదా! అందుకే పట్టుపట్టి మరీ నా చేత ఆ మిర్రర్ రైటింగ్‌ను మాన్పించారు. లేదంటే ఇవాళ నేను గిన్నిస్ బుక్ రికార్డులు సాధించేదాన్ని.
ఇప్పటికీ అప్పుడప్పుడు ‘p’ని ‘q’ అని ‘q’ని ‘p’ అని రాస్తుంటాను. ఇదంతా ఎడమ చేతి వాటం మహిమ.
నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి మాకు షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తున్నారు. మేమంతా లైన్లో నిలబడ్డాం. టీచర్ వచ్చి ఒక్కో స్టూడెంట్‌కు హ్యాండ్ షేక్ ఇస్తున్నారు.
నా వంతుకోసం చాలా ఆత్రుతగా నేను ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వచ్చింది. మా టీచర్ వచ్చి నా ఎదురుగా నిలబడ్డారు. ఆయన తన కుడిచేతిని నా వైపు చాచే లోపు, నేను అలవాటుగా నా ఎడమచేతిని ముందుకు చాచాను. ఆయన అవాక్కయ్యి, తన ఎడమ చేతిని ముందుకు చాచారు. ఇంతలో నేను నా కుడి చేతిని ముందుకు చాచాను. అలా కుడి ఎడమల తికమకలతో హ్యాండ్ షేక్ కార్యక్రమం కాస్త గందరగోళంలో పడి పోయింది.
క్లాసు అంతా గొల్లుమంది. ఒకటే నవ్వులు. ఆ హ్యాండ్ షేక్ ప్రోగ్రాం ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు నవ్వు వస్తుంది. చివరకు అందరిలా కుడి చేతిని వాడమని మా టీచర్ నాకు సలహా ఇచ్చారు.
4వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా, పరీక్షల టైంలో జరిగిన ఒక విషయం బాగా గుర్తుంది. సంవత్సరాంతం పరీక్షలు రాస్తున్నాను. తలెత్తకుండా పరీక్ష రాసుకుంటూ పోతున్నాను. కాసేపటి తరువాత నా ఎడమవైపు తిరిగి చూశా. పక్కనే ఉన్న ఒకబ్బాయి నేను రాసే ప్రతి అక్షరాన్ని చాలా చక్కగా కాపీ కొడుతున్నాడు.
నా ఎడమ చేతి వాటం కావడం వల్ల నాకు ఎడమ వైపు కూర్చొనే వాళ్లకు నా పేపర్ చాలా బాగా కనిపిస్తుంది.
నా 10వ తరగతిలోను, 12వ తరగతిలోనూ ఇన్విజిలేటర్లు అప్పుడప్పుడు నా పక్కనే వచ్చి కూర్చొనేవారు. నా మీద ప్రత్యేక అభిమానం అనుకునేరు. నా పేపర్ అయితే వారికి చదుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి. అదీ సంగతి.

ఫొటో సోర్స్, Getty Images
నేను మొదటి సారి పోటీ పరీక్షలు రాసినప్పుడు, ఎగ్జామ్ సెంటర్‌లో చూస్తే సీట్లన్నీ ప్యాడ్స్ కుడి వైపున ఉన్నవే కనిపించాయి. కానీ నేను ఎడమ చేత్తో రాస్తాను కదా! అందుకే కింద కూర్చుని ఎగ్జామ్ రాశాను. ప్యాడ్ లేకపోవడంతో బుక్‌లెట్‌ను నేలమీద పెట్టుకుని రాయాల్సి వచ్చింది. వంగి వంగి 2-3 గంటలు రాయడం వల్ల తర్వాత రోజు మెడ పట్టేసి నడుం నొప్పి వచ్చింది.
ఒకసారి నేను ఏదో వ్యాపారం ప్రారంభ సమయంలో కొబ్బరికాయ కొట్టాల్సి వచ్చింది. నా వంతు రానే వచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. నేను ఎడమచేతి వాటం గలదాన్ని కాబట్టి కుడిచేతితో కొబ్బరి కాయను కొట్టాలంటే చాలా కష్టం. ఎడమ చేతితో కొట్టాలంటే సంప్రదాయాలు ఒప్పుకోవు కదా!
కుడి చేతితో రెండు మూడు సార్లు కొబ్బరి కాయను కొట్టి చూశాను. కానీ కుడి చేతి బలం సరిపోలేదు. దానికి అదనంగా ఎక్కువగా బలం కావాల్సి వచ్చింది. దాంతో కుడి చేయిని బాగా ఎత్తి, క్షణం పాట కళ్లు మూసుకొని గట్టిగా కొట్టాను.
మంత్రాలు వినిపించడం ఆగిపోయాక కానీ తెలియలేదు, ఆ కొబ్బరి కాయ పురోహితుని ముఖానికి తగిలిందని. చదువుతుంటే నవ్వు రావొచ్చు. కానీ ఆచారం, కట్టుబాట్లు అనే వాటి వల్ల ఎడమ చేతి వాటం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఎడమ చేతి వాటం వారిని ఇబ్బంది పెట్టాలంటే వారి చేతికి ఒక కత్తెర ఇస్తే చాలు. ఎందుకంటే కత్తెరలు వంటి వాటిని సాధారణంగా కుడిచేతితో వాడడానికి వీలుగా తయారు చేస్తారు. వాటిని ఎడమ చేత్తో వాడటం చాలా కష్టం.
ఇక వంటిట్లో వాడే చాకులు కూడా అంతే. సిప్పర్ కాఫీ మగ్గులైతే కుడి చేత్తో స్టైల్‌గా పట్టుకుని తాగడానికి బాగా ఉంటాయి.
ఇక కంప్యూటర్ మౌస్‌తో మరొక సమస్య. కుడి చేతితో వాడే వారికి అనువుగా అవి ఉంటాయి. దాంతో గత్యంతరం లేక కుడి చేతితో మౌస్‌ను వాడటం నేర్చుకున్నాను.
సమాజంలో అన్ని రకాల వస్తువులు కుడి చేతితో వాడేందుకు వీలుగా రూపొందించారు. ఎడమ చేతి వాటం గల వారికోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా వస్తువులను తయారు చేస్తున్నా అది ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎడమ చేతితో మంచి నీళ్లు తెచ్చిస్తానని చాలా మంది మా ఇంటి కొచ్చిన పెద్దవాళ్లు, బంధువులు నీళ్లు తాగకుండా వెళ్లిపోయేవారు. అది చూసి అమ్మానాన్న కూడా బాధపడేవారు.
ఇల్లు ఊడవడం, వంట వండడం, వడ్డించడం వంటివి ఎడమ చేతితో చేస్తానని నన్ను చీదరించుకున్న వారూ లేకపోలేదు. ఇక పూజలు పునస్కారాలైతే చాలు కుడి చేతి మేళం కావాలి. నేను ఎడమచేతి వాటం దాన్ని కాబట్టి ఆ దరిదాపుల్లో కనిపించినా ఏదో ఒక దాంట్లో చేయి పెట్టి ఉంటానని, అది ఎక్కడ అపవిత్రం అయిపోయి ఉంటుందో అని చాలా మంది కంగారు పడుతూ ఉండేవారు.
అందుకే మా ఇంట్లో ఏ పేరంటం అయినా నాకు తెలిసి వచ్చిన వయసు నుంచి దూరంగానే ఉంటున్నాను. ఎవరికైనా డబ్బులు లేదా ఏదైనా వస్తువు కుడిచేతితో ఇవ్వకపోతే చాలానే తిట్టుకుంటారు. అలవాటు వల్ల పొరపాటున ఎడమ చేతితో పట్టుకుంటే అదేదో వారిని తక్కువ చూస్తున్నట్టు కొందరు భావిస్తారు.
ఒక్క నాకే కాదు, చాలామంది ఎడమచేతి వాటం వారికి ఎదురయ్యే సమస్యలివి. సమాజంలో సున్నితంగా భావించే కులం, మతం, ఆచారాలు, కట్టుబాట్లు పేరుతో పుట్టుకతో వచ్చిన ఎడమ చేతి అలవాటుని బలవంతంగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు.
ఒక వైపు అనువైన వస్తువులు లేక చిన్నచిన్న పనులు చేసుకోవడానికి ఒకోసారి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరోవైపు సమాజం చూసే చిన్న చూపు, చూపించే వివక్షను తట్టుకుని జీవితంలో ముందుకు పోవాల్సి ఉంటుంది.
అందుకే కుడి ఎడమైతే చాలా పొరపాటు ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా విషయాల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి:
- రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
- ప్రతిద్రవ్యోల్బణం: చైనాలో తగ్గుతున్న వస్తువుల ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా
- రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- స్పిరిచ్యువల్ హీలర్స్: 'ఆధ్యాత్మిక స్వస్థత' పేరుతో రహస్యంగా సాగుతున్న లైంగిక దోపిడీ... బీబీసీ పరిశోధనలో బయటపడిన అక్రమాలు
- ఆంధ్రప్రదేశ్: నంద్యాల అమ్మాయి దౌలత్, పాకిస్తానీ అబ్బాయి గుల్జార్... రాంగ్ కాల్‌తో మొదలైన లవ్ స్టోరీ














