టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టైటానిక్ మునిగిపోతోంది. తొలుత మహిళలు, పిల్లలందరినీ లైఫ్ బోట్లలో ఎక్కించి రక్షిస్తున్నారు. అలాంటి ఒక బోటులో మహిళ, చిన్న పాప, ఒక బాబు కూర్చున్నారు.
ఆ లైఫ్ బోటును నీళ్లలోకి వదిలే ముందు, ‘‘నౌక పైభాగంలో ఇంకెవరైనా మహిళా ప్రయాణికులు ఉన్నారా?’’ అని అధికారి గట్టిగా అరిచారు.
ఎవరూ కూడా ముందుకు రాలేదు.
‘‘ఎవరైనా మహిళలున్నారా?’’ అంటూ మరో అధికారి అరిచారు.
ఒక మహిళ నౌక పైభాగం నుంచి ముందుకు వచ్చి, ‘‘నేను ఈ నౌకలో ప్రయాణికురాలిని కాదు. నేను ఇందులో పనిచేస్తున్నాను’’ అని చెప్పారు.
ఆ అధికారి ఆమెను ఒక క్షణం పాటు అలాగే చూసి, ‘‘ఏం ఫర్వాలేదు, మీరు మహిళనే కదా, మీకోసం బోటులో చోటు ఉంది రండి’’ అని పిలిచారు.
ఆ మహిళ పేరు వయోలెట్, చివరి క్షణాల్లో ఆమెను అదృష్టం వరించింది.
లైఫ్ బోటులో ఆమెకు చోటు దొరకడంతో, టైటానిక్ నౌక ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
నౌక ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడటం ఆమెకు అదే తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు.
టైటానిక్ ప్రమాదం 1912 ఏప్రిల్‌లో జరిగింది.
టైటానిక్ నౌక ప్రమాదం జరిగిన ఏడాదికి ‘ది ట్రూత్ అబౌట్ టైటానిక్’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.
లైఫ్ బోటులో నర్సు వయోలెట్‌కి కూడా చోటు ఇవ్వాలని నౌక అధికారులను టైటానిక్‌లోని నల్లజాతీయులు కోరారని ఈ పుస్తకంలో కొన్ని చోట్ల ప్రస్తావించారు.
వయోలెట్‌ను చరిత్రలో మిస్ ఇన్‌సింకబుల్(మునిగిపోని మహిళ)గా లేదా ముగినిపోయే నౌకల రాణి (క్వీన్ ఆఫ్ సింకింగ్ షిప్స్) గా పిలుస్తుంటారు.
వయోలెట్ వృత్తిరీత్యా నర్సు. ఆ సమయంలో ఆమె భారీ నౌకలలో ప్రయాణించేవారు.
నౌకలు మునిగిపోతున్నా, వయోలెట్ ఏదో ఒక రూపంలో బయటపడేవారు. ఇదే వయోలెట్ జోసెఫ్ మిరకిల్ స్టోరీ.

ఫొటో సోర్స్, Getty Images
వయోలెట్ జోసెఫ్ ఎవరు?
జాన్ మైకిస్టన్ గ్రాహం రాసిన వయోలెట్ బయోగ్రఫీని 1998లో ప్రచురించారు.
ఈ బయోగ్రఫీ తర్వాత, టైటానిక్ ప్రమాదం నుంచి మాత్రమే కాకుండా, మూడు అతిపెద్ద నౌకా ప్రమాదాల నుంచి వయోలెట్ ప్రాణాలతో బయటపడ్డారని ప్రపంచానికి తెలిసింది.
అర్జెంటీనాలో స్థిరపడిన ఐరిష్ కుటుంబంలో వయోలెట్ పుట్టారు.
ఇంట్లో పెద్ద కూతురు ఆమె. వయోలెట్ చిన్న వయసులోనే తన ఆరుగురు తోబుట్టువులను పెంచే బాధ్యతలను తీసుకున్నారు.
వయోలెట్ చిన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు.
ఆ సమయంలో వయోలెట్ అమ్మ నౌకలలో నర్సుగా పనిచేసేవారు.
కొంతకాలానికి ఆమె తల్లి కూడా అనారోగ్యం బారిన పడి, మరణించారు.
వయోలెట్ 21 ఏళ్ల వయసులో నౌకలలో పనిచేయడం ప్రారంభించారు.
నౌకలలో ప్రయాణించే వారికి ఆహారం, నీళ్లు అందివ్వడం, వారికి వినోదం కల్పించడం వంటివి చేస్తూ ఉంటారు.
అంతేకాక, నౌకలోని ప్రయాణికులుండే గదులను శుభ్రం చేసే వారు.
తన జీవితంలో నలబై ఏళ్లు నౌకలలోనే ఆమె పనిచేశారు. ఈ సమయంలో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టైటానిక్ మునిగిపోయిన రాత్రి...
దాదాపు 111 ఏళ్ల క్రితం రాత్రి పూట టైటానిక్ ఓడ ఒక మంచుకొండను ఢీకొట్టింది. ఆ సమయంలో ఓడలోని ప్రయాణికుల్లో ఎక్కువమంది గాఢ నిద్రలో ఉన్నారు.
ప్రమాద సమయంలో టైటానిక్ ఓడ గంటకు 41 కిలోమీటర్ల వేగంతో ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు ప్రయాణిస్తోంది. ప్రమాదం జరిగిన మూడు గంటల్లో అట్లాంటిక్ మహాసాగరంలో టైటానిక్ పూర్తిగా మునిగింది. ఈ ఘటన 1912 ఏప్రిల్ 14, 15 తేదీల్లో జరిగింది.
అసలు ఎప్పుడూ మునిగిపోదని చెప్పిన ఈ ఓడ కేవలం గంటల వ్యవధిలో సముద్రంలో మునిగిపోవడమే కాకుండా, ఈ దుర్ఘటనలో దాదాపు 1500 మంది నీటిలో మునిగిపోయారు.
టైటానిక్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ, లైఫ్ బోట్లు తక్కువ సంఖ్యలో ఉండటమే ఈ దుర్ఘటనలో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు మరణించడానికి ఒక కారణంగా పేర్కొంటారు.
ప్రమాదం జరిగిన రాత్రికి సంబంధించిన వివరణాత్మక కథనం ‘‘టైటానిక్ సర్వైవర్స్: న్యూలీ డిస్కవర్డ్ మెమెరీస్ ఆఫ్ వయోలెట్ జోసెఫ్’’లో ప్రచురించారు.
ఆ ఘటన గురించి వయోలెట్ ఇలా చెప్పారు. ‘‘ఒక్క క్షణం పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. చుట్టూ నల్లటి చీకటి అలముకుంది. అకస్మాత్తుగా ఒక భారీ శబ్ధం వినిపించింది. దాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. మా ఓడ సముద్రంలో మునిగిపోవడం మొదలైంది.
ఒక ఆఫీసర్ నా చేతికి ఒక చిన్నారిని ఇచ్చి లైఫ్ బోట్‌లోకి ఎక్కాలని చెప్పారు. అప్పుడు నేను ఓడలో ఉన్న పర్యాటకులకు లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలో? లైఫ్ బోట్‌లో ఎలా ప్రయాణించాలో చెబుతున్నా. నా చేతికి ఇచ్చిన చిన్నారితో కలిసి నేను లైఫ్ బోట్‌లో ఎక్కాను.
ఓడంతా గందరగోళంగా మారింది. అందుకే ఆ చిన్నారి తల్లి ఎవరో గుర్తించలేకపోయాం’’ అని ఆమె వివరించారు.
ప్రమాదం తర్వాత లైఫ్ బోట్‌లలో ఉన్న వారిని రక్షించిన మరో ఓడ వారిని న్యూయార్క్‌కు చేర్చిందని వయోలెట్ రాశారు. న్యూయార్క్ చేరుకున్నాక ఒక మహిళ తన చేతిలో ఉన్న చిన్నారిని లాక్కొని ఏమీ మాట్లాడకుండా పెద్దగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు.
ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్న వారెవరైనా ఆ తర్వాత ఓడలో ప్రయాణాలను పూర్తిగా మానేస్తారు. కానీ, వయోలెట్ అలా చేయలేదు.
టైటానిక్ ఓడ ప్రమాదానికి ఒక ఏడాది ముందు మరో ఓడ ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా వయోలెట్ ఆ ఓడలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్ దుర్ఘటన
టైటానిక్ నౌకను వైట్ స్టార్‌లైన్ కంపెనీ నిర్వహించేది. 20 శతాబ్ధంలో మూడు ఓడలను తయారు చేయాలని బెల్‌ఫాస్ట్‌లోని హార్లాండ్ అండ్ వోల్ఫ్ షిప్‌యార్డ్‌కు వైట్ స్టార్‌లైన్ కంపెనీ ఆర్డర్ ఇచ్చింది.
ఒలంపిక్ కూడా ఇదే కంపెనీకి చెందిన నౌక. టైటానిక్ కంటే ముందు ప్రపంచంలోని అతిపెద్ద, అద్భుతమైన ప్రయాణికుల నౌక ఇదే.
1911 సెప్టెంబర్ 30వ తేదీన బ్రిటన్‌లోని సౌథాంప్టన్ తీరం నుంచి ఒలంపిక్ నౌక బయల్దేరింది. తర్వాత కాసేపటికే బ్రిటిష్ యుద్ధనౌక హెచ్‌ఎంఎస్ హావ్‌కేను ఒలంపిక్ ఢీకొట్టింది.
అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కానీ, ఒలంపిక్ నౌక తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ ఎలాగోలా మునిగిపోకుండా బయటపడగలిగింది.
ప్రమాదం తర్వాత ఒలంపిక్ నౌకను ఒడ్డుకు తీసుకొచ్చారు.
కొన్ని రోజుల మరమ్మతుల అనంతరం తిరిగి ఒలంపిక్ తన విధులు మొదలుపెట్టింది.
వయోలెట్ 8 నెలల పాటు ఒలంపిక్ నౌకలో పనిచేశారు. తర్వాత టైటానిక్ నౌకకు మారారు.
టైటానిక్ ప్రమాదం తర్వాత వయోలెట్ తన జీవితంలో వీలైనంత ఎక్కువ మందిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంతోనే నర్సుగా శిక్షణ పొందారు.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
బ్రిటానిక్ నౌక ధ్వంసం
టైటానిక్ మునిగిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 1916లో వయోలెట్, బ్రిటన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నర్సుగా పనిచేయడం ప్రారంభించారు.
ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. సైనికుల రవాణాకు, గాయపడిన సైనికుల చికిత్స కోసం మొబైల్ ఆసుపత్రులుగా అనేక ప్రయాణికుల విమానాలను ఉపయోగించారు.
వైట్ స్టార్ కంపెనీకి చెందిన బ్రిటానిక్ నౌకను కూడా మొబైల్ హాస్పిటల్‌గా మార్చారు.
యుద్ధం కారణంగా సముద్రంలో చాలా చోట్ల నావల్ మైన్స్ ఉంచారు. అలాంటి ఒక మైన్‌ని తాకడంతో అది పేలి బ్రిటానిక్ మునిగిపోయింది.
వయోలెట్‌కు ఈ అనుభవం మరింత భయంకరమైనది.
ఆ అనుభవం గురించి వయోలెట్ వివరించారు. ‘‘నన్ను ఎవరో గుంటలోకి విసిరేసినట్లు అనిపించింది. నేను ఏమీ చూడలేకపోయాను. ఎలాగోలా నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించాను. నా ముక్కు, నోటి లోకి నీరు వెళ్లిపోయింది’’ అని ఆమె తెలిపారు.
ఈ నౌకలోని వెయ్యి మందికి పైగా ప్రయాణికుల్లో 32 మంది మరణించారు.
ఢీకొట్టిన తర్వాత కూడా ఓడను నడిపే ప్రొపెల్లర్లు ఆగిపోలేదు. పైగా ఓడలోని వ్యక్తులను తమ వైపుకు లాక్కోవడంతో, వాటిని ఢీకొని ప్రజలు ముక్కలయ్యారు.
టైటానిక్ ప్రమాదం తర్వాత, ప్రతి ఓడలో సరిపడా లైఫ్‌బోట్‌లు ఉండాలనే నియమాన్ని తీసుకొచ్చారు.
బ్రిటానిక్‌లో ఉన్న రెండు లైఫ్‌బోట్‌లు పనిని మొదలుపెట్టాయి.
బ్రిటానిక్ లైఫ్ బోట్‌లో ముగ్గురు కూర్చున్నారు. యాదృచ్ఛికంగా ఆ ముగ్గురూ టైటానిక్ ప్రమాదం బారిన పడి ప్రాణాలతో బయటపడ్డవారే.
ఆ లైఫ్ బోట్‌లో ఉన్న వయోలెట్, ఆర్చీ జువల్, జాన్ ప్రీస్ట్ ఈసారి కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
లైఫ్ బోట్‌ను ప్రొపెల్లర్లు తమ వైపుకు లాక్కుంటున్న క్షణాల్లో తమ అనుభవం గురించి తన సోదరికి రాసిన లేఖలో ఆర్చీ జువల్ వివరించారు.
"మాలో చాలా మంది నీటిలోకి దూకారు. కానీ, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నీటి అడుగున పనిచేస్తున్న ప్రొపెల్లర్లు చాలా శక్తివంతమైనవి. అవి నీటిని అంతటినీ తమ వైపుకు లాక్కున్నాయి.
నేను కళ్ళు మూసుకుని అదే ఆఖరి క్షణంగా భావించి ప్రపంచానికి వీడ్కోలు చెప్పాను. కానీ, అప్పుడే ఓడ శిథిలాలు నన్ను ఢీకొన్నాయి. నేను ఓవర్‌బోర్డ్ మీదకు ఎగిరి పడ్డాను. నీటిలో నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డాను. కానీ, ఓడలోని ఇతర భాగాలు పడిపోయాయి. వాటిని పక్కకు నెట్టడంసాధ్యం కాలేదు.
చీకటి పడుతోంది. అకస్మాత్తుగా పైనుంచి ఎవరో శిథిలాలను పక్కకు నెట్టారు. దీంతో నాకు నీటిపైకి వెళ్ళే అవకాశం ఏర్పడింది. కానీ, కింద నుంచి ఎవరో నా కాలు పట్టుకున్నారు. ఆ వ్యక్తి కూడా మునిగిపోతున్నారు. నేను నా కాలును పైకి లాక్కోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తి మునిగిపోయారు" అని ఆయన లేఖలో వివరించారు.
బ్రిటానిక్ నౌక కేవలం 55 నిమిషాల్లోనే మునిగిపోయింది. ఆ లేఖను చదివితే ఆ 55 నిమిషాల్లో ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు.
లైఫ్ బోట్‌లో వయోలెట్ కూడా ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె వెంటనే లైఫ్ బోట్ నుంచి నీటిలోకి దూకారు.
దీంతో ఆమె ఓడ ప్రొపెల్లర్ల రెక్కలలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగారు. అదే సమయంలో ఒక పెద్ద చెక్క ఆమె తలకు బలంగా తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
ఈసారి కూడా ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది. సమయానికి వచ్చిన మరో లైఫ్‌బోట్ ఆమెను నీటిలో నుంచి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
తన ప్రాణాలు పోతున్నట్లు మూడు సార్లు వయోలెట్ అనుకున్నారు. కానీ, ఆమెకు మరణం రాలేదు.
1920లో ఆమె మళ్లీ వైట్ స్టార్‌లైన్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన సంఘటనలు జరిగినా ఆమె సముద్ర ప్రయణాన్ని విడిచిపెట్టలేదు.
40 ఏళ్ల పాటు సముద్ర నౌకల్లో సేవలందించి 62 ఏళ్ల వయసులో ఆమె పదవీ విరమణ చేశారు. 1971లో 83 ఏళ్ల వయసులో మరణించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














