గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం...తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
''ప్రతి ఏటా వరద వస్తుంది...జనం ఊరొదిలి వెళ్లిపోతారు....వరద తగ్గాక సొంతిళ్లకు వచ్చి అన్నీ సర్దుకుంటారు. నెమ్మదిగా మామూలు జీవితానికి అలవాటు పడతారు. ఇక్కడ తరతరాలుగా ఇలాగే జరుగుతోంది.''
ఇటీవల దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురవడంతో నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడప్పుడూ వస్తున్న వరదలకే తీవ్ర అవస్థలు పడ్డారు.
కానీ, గోదావరి తీరంలోని వందల గ్రామాలకు చెందిన వేల కుటుంబాలకు వరదలు అత్యంత మామూలు విషయం. అవి వారి జీవితంలో భాగం.
ఒక్కోసారి ఉధృతంగా మారే వరదలను సైతం ఎదుర్కొంటూ గోదావరి లంక వాసులు జీవనం కొనసాగిస్తున్నారు.

ఏటా గోదావరికి జులై, ఆగస్టు మాసాల్లో వరదల సీజన్ ఉంటుంది. ఈ ఏడాది కూడా జులై నెలాఖరులో వరదలొచ్చాయి. కిందటేడాది కూడా భారీ వరదలొచ్చాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారీ పిల్లాపాపలతో సామాన్లు తీసుకుని ఒడ్డుకు చేరడం వారికి అలవాటు.
గతేడాది వరదల సమయంలో సుమారు నెల రోజుల పాటు తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకున్నారు. ఈసారి మాత్రం వారం రోజులతో ఊపిరి పీల్చుకున్నారు.
ఏటా ఇల్లు వదిలివెళ్లడం, మళ్లీ వచ్చేసరికి ఇల్లు, ఇంట్లో సామాన్లు కూడా భద్రంగా ఉంటాయన్న ధీమా లేకపోయినా వారంతా లంకల్లోనే ఎందుకుంటారు? లంక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?

పోలవరం దిగువన లంకలు..
గోదావరి నదీ ప్రవాహం పాపికొండల దిగువన భిన్నంగా ఉంటుంది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా మారుతుంది. ధవళేశ్వరం దిగున పాయలుగా ప్రవహిస్తుంది. అయినా ప్రవాహపు పరిధి విస్తృతంగా ఉంటుంది. దాంతో ఇసుక మేటలు ఏర్పడి క్రమంగా లంకలుగా పరిణామం చెందుతూ వస్తున్నాయి.
అదే సమయంలో, ప్రవాహపు వడి వేగానికి కొన్ని లంకలు కొట్టుకుపోవడం, కొత్త లంకలు ఏర్పడడం నేటికీ జరుగుతోంది.
అలా గోదావరి నదీ గర్భంలో ఏర్పడిన లంకలనే ఆవాసాలుగా చేసుకుని వేల మంది జీవనం సాగిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు దిగువన అలాంటి లంక గ్రామాలు చిన్నా, పెద్దా కలిపి సుమారుగా వందకు పైగా ఉన్నాయి.
దాదాపుగా 4 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

లంకల్లో వ్యవసాయం కోసం కొందరు, చేపల వేట ఆధారంగా చేసుకున్న మత్స్యకారులు మరికొందరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయం వృద్ధి చెందిన కోనసీమ లంకల్లో కొంత అభివృద్ధి కనిపిస్తుంది. స్థిరమైన భవనాలు, రోడ్డు, వంతెనలు వంటివి కొన్ని లంకలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని లంకలకు వరదలు లేని సమయంలో రవాణాకి అనుగుణంగా కాజ్ వేలు వంటివి ఏర్పాటు చేశారు.
మత్స్యకారులు నివసించే గ్రామాలకు మాత్రం కనీస సదుపాయాలు అందుబాటులోకి రాలేదు.
ఆయా లంక గ్రామాలు చాలా చిన్నవిగా ఉండడమే దానికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతుంటారు. వందల ఏళ్ల క్రితమే ఇలా లంకల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంటుంది.

వరద వస్తే తప్పదు..
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ఎదురుగా రెండు రైలు వంతెనల చెంత, రెండు గ్రామాలు ఉంటాయి. అందులో ఒకటి బ్రిడ్జిలంక.
ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఉండడం వల్ల, మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం రాగానే వారు తమ లంకను ఖాళీ చేయాల్సి ఉంటుంది. వరద హెచ్చరికలు రాగానే వీలైనంత మేరకు సరుకులు, పిల్లాపాపలతో పడవవలపై నది దాటి ఒడ్డుకు చేరుతారు. వరద తాకిడి తగ్గగానే తిరిగి సొంత గూటికి చేరతారు.
అలాంటి కుటుంబాల్లో మల్లాడి సత్యవతి కుటుంబం ఒకటి. ఆమె తన భర్తతో కలిసి చేపల వేటకు వెళ్తారు. వలకు చిక్కిన చేపలను ఒడ్డుకు తీసుకెళ్లి అమ్ముతుంటారు.

"తెల్లవారి నాలుగు గంటలకు వేటకు వెళ్తాం. చేపలు పడితే ఆ పడవ మీదనే వెళ్లి అమ్ముకుని వస్తాం. వస్తున్నప్పుడే మాకు కావాల్సిన కూరగాయలు, సరుకులు కొనుక్కుంటాం. మళ్లీ మధ్యాహ్నం 4 గంటల తర్వాత చేపల వేటకు వెళ్తాం.
వర్షాకాలంలో పెద్దగా చేపలు వేట సాగదు. ఎండాకాలంలో నీరు తక్కువ కాబట్టి బాగా దొరుకుతాయి. ఎండాకాలంలో నాలుగు రూపాయలు మిగుల్చుకుని వరదలు వచ్చినప్పుడు తింటాం. లేదంటే పిల్లలతో కష్టమే.
వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. అయినా మా అత్తమామల నుంచి అందరూ ఇలానే బతుకుతున్నాం. వరదలు లేనప్పుడు మాత్రం మామూలుగానే ఉంటుంది." అని బీబీసీకి వివరించారు సత్యవతి.
తమ గ్రామంలో సోలార్ పలకలు కొనుక్కుని లైట్ వెలిగించుకుంటున్నామని, వేసవిలో అయితే టీవీ, ఫ్యాన్ వంటి వాటికి కూడా సరిపడా విద్యుత్ ఉంటుందని చెప్పారు.

ప్రతి ఏటా అది మామూలే..
గోదావరి వరద హెచ్చరికల సమాచారం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. కానీ, రెండుమూడు దశాబ్దాల కిందట సమాచారం లేకపోవడంతో లంకల్లో ప్రాణనష్టం అపారంగా ఉండేది. హఠాత్తుగా వచ్చిన వరదలతో రాత్రికి రాత్రే కొన్ని లంక గ్రామాలు కనుమరుగైన అనుభవాలున్నాయి.
1986 వరదల సమయంలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద తుపాన్లు గోదావరి లంక వాసులను పెద్దగా కలవరపరచవు. కానీ, గోదావరికి వరదలు వస్తున్నాయంటే వణికిపోతుంటారు. పంట నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.
"వరదల సీజన్ మొదలుకాగానే జాగ్రత్త పడతాం. సామాన్లన్నీ సర్దుకుంటాం. గతంలో ఎంత వరద వచ్చినా ఇక్కడే ఉండి సర్దుకుపోదాం అనుకునేవారు కొందరు. అలాంటి వారు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాత్కాలిక శిబిరాలకు తీసుకెళ్తున్నారు.
అక్కడ కొన్ని సదుపాయాలుంటాయి. కానీ, సొంత ఇంటి కోసం వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసి మళ్లీ వచ్చేస్తుంటాం" అంటూ ఓలేటి విజయలక్ష్మి అన్నారు.
చేపల వేటకు అనువుగా ఉండడంతో లంకల్లో ఇల్లు ఏర్పాటు చేసుకుని నివసించడం అలవాటు చేసుకున్నామని, ప్రభుత్వం తమకు ప్రత్యమ్నాయంగా గోదావరి ఒడ్డున ఎక్కడైనా ఇంటి సదుపాయం కల్పిస్తే వెళ్లిపోతామని ఆమె బీబీసీతో అన్నారు.

కనీస సదుపాయాలు కల్పిస్తే చాలు..
గోదావరి లంక గ్రామాలు ఎక్కువగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కనిపిస్తాయి. కొన్ని గ్రామాలకు వంతెనల ఏర్పాటు, మరికొన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.
పలువురు నాయకులు హామీలు ఇచ్చినా అమలు కాకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి.
2016లో ముమ్మిడివరం మండలంలో జరిగిన అలాంటి పడవ ప్రమాదంలో కొందరి మృతదేహాలు కూడా లభించలేదు.
వరద ప్రవాహం కారణంగా ఇటీవల లంక గ్రామాల్లో తీరం కోతకు గురవుతోంది. దాని నివారణకు చర్యలు తీసుకుంటామని ఆగస్టు 9న కోనసీమ పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

"లంకల్లో నివసిస్తున్న మత్స్యకార గ్రామాల్లో విద్యుత్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే వరకూ ప్రభుత్వమే సోలార్ దీపాలు, ఇతర సదుపాయాలు కల్పించాలి. గతంలో బ్రిడ్జిలంక వాసుల కోసం ఓ బడి నడిపారు. కానీ పిల్లలు సరిపడా లేరనే కారణంతో ఉపాధ్యాయులు వెళ్లడం లేదు. పాఠశాల తెరవాలి. కనీసం నెలకు ఓసారి అలాంటి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.
చిన్న చిన్న అవసరాల కోసం పడవ మీద నది దాటాల్సి వస్తోంది. వరదల సమయంలో పాములు వంటివి ఎక్కువగా ఇళ్లల్లో చొరబడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి" అని మత్స్యకార సంఘం నాయకుడు మల్లాడి వెంకటేశ్వర రావు కోరుతున్నారు.
గోదావరి వరదల తర్వాత ఒండ్రు మట్టి కారణంగా పంటల దిగుబడి పెరగడం, చేపల వేటకు కూడా సానుకూలంగా ఉండడంతో అత్యధికులు లంకలు వీడి రాకపోవడానికి కారణమని ఆయన చెప్పారు.

పరిష్కారాలు చూపిస్తాం..
గోదావరి లంక వాసులకు వరద సాయంతో పాటు అన్ని సందర్భాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీ లత అన్నారు.
"ఈ ఏడాది వరదలు వచ్చినప్పుడు వారికి శిబిరాలు ఏర్పాటు చేశాం. సదుపాయాలు కల్పించాం. దీర్ఘకాలిక సమస్యలున్నాయి. వాటికి కూడా పరిష్కారం చూస్తాం. లంక వాసులకు కనీస అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తాం" అని ఆమె అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఉన్న లంక గ్రామాలకు వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జిల్లా అధికారులు బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి , ముంపు గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
- సర్ ఆర్థర్ కాటన్: గోదావరి ప్రజలు ఈ ‘బ్రిటిష్ దొర’కు ఇంట్లో పూజలు చేస్తారు, పూర్వీకులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు
- Engineer's day - వీణం వీరన్న: సర్ ఆర్థర్ కాటన్‌తో కలిసి గోదావరిపై ఆనకట్ట కట్టిన తొలి తరం తెలుగు ఇంజనీర్
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- చేపల వర్షం నిజమేనా? రోడ్లపైకి చేపలు ఎలా వస్తాయి?















