ఫుడ్ సేఫ్టీ: పచ్చి గుడ్లు మంచివా? ఉడకబెట్టినవా

Raw Egg

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్క్ షియా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఆహార కల్తీ బాధితుల పక్షాన గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారు లాయర్ బిల్ మార్లర్.

ఈ.కోలీ, సాల్మొనెల్లా, లిస్టీరియా వల్ల వచ్చే సమస్యలు, ఇతర రకాలుగా ఆహారం కలుషితం కావడం వల్ల అనారోగ్యం బారినపడేవారి తరపున ఆయన వాదిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లోని కొత్త డాక్యుమెంటరీ ‘పాయిజన్డ్: ద డర్టీ ట్రూత్ అబౌట్ యువర్ ఫుడ్’‌లో ఆయన కీలక పాత్ర పోషించారు.

అనారోగ్యం బారిన పడకూడదంటే ఏం తినాలనేది ఆయన ‘బీబీసీ’తో చెప్పారు.

బిల్ మార్లర్

ఫొటో సోర్స్, Netflix

ఫొటో క్యాప్షన్, లాయర్ బిల్ మార్లర్

అమెరికాలోని సెయింట్ లూయిస్‌కు చెందిన పదిహేడేళ్ల స్టెఫానీ ఇంగ్‌బర్గ్ తన తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రకు డొమినికన్ రిపబ్లిక్ వెళ్లి అక్కడ ఓ రిసార్ట్‌లో దిగారు.

బయలుదేరడానికి ముందే కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆమె విమానం ఎక్కారు. డొమినికన్ రిపబ్లిక్‌లో దిగిన తరువాత కొంత బాగున్నట్లే అనుకున్నారు. కానీ, రాత్రయ్యేసరికి పరిస్థితి మారిపోయింది. కడుపులో బాగా ఇబ్బందవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

తరువాత రోజు ఉదయం ఆమె తన తల్లిని కూడా గుర్తుపట్టలేకపోయారు. ఆమె కిడ్నీలు పనిచేయడం మానేశాయి. మెదడులో వాపు కారణంగా శరీరంలో అనేక ఇబ్బందులు మొదలయ్యాయి.

దాంతో తల్లిదండ్రులు ఆమెను అత్యవసరంగా అక్కడి నుంచి అమెరికా తరలించారు. ఈ.కోలీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ తీవ్రస్థాయిలో సోకినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు.

రాత్రికి రాత్రి ఆమె పరిస్థితి పూర్తిగా క్షీణించి కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె చనిపోయిందని భావించి అంత్యక్రియల ప్రార్థనల కోసం మతగురువును కూడా తీసుకొచ్చారు.

‘పాయిజన్డ్: ద డర్టీ ట్రూత్ అబౌట్ యువర్ ఫుడ్’ డాక్యుమెంటరీలో స్టెఫానీది కీలక భాగస్వామ్యం.

ఫుడ్ చెయిన్‌లో ఎక్కడ పరిశుభ్రత లోపించినా చివరికి అది వినియోగదారులపై ఎంత తీవ్రమైన దుష్ఫలితాలు చూపిస్తుందనడానికి స్టెఫానీ అనుభవమే పెద్ద ఉదాహరణ.

స్టెఫానీ బతకడమైతే బతికారు కానీ, తర్వాత జీవితమంతా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి.

నీటిలో మొలకెత్తిన విత్తనాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘నా కిడ్నీలలోని ఫిల్టర్లు వదులు కాకుండా రోజూ నేను మందులు తీసుకోవాలి’’ అని స్టెఫానీ డాక్యుమెంటరీలో చెప్పారు.

‘‘ముందుముందు నాకు కిడ్నీ మార్చాల్సిన అవసరం రావొచ్చు. జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి రావొచ్చు’’ అన్నారామె.

తనకు ఈ దుస్థితి ఎందుకొచ్చిందో కూడా చెప్పారామె.

‘‘నేనొక సలాడ్ తిన్నాను. దాని ఫలితమే ఇలా జీవితాంతం ఇబ్బందిపడాల్సిన దుస్థితి’’ అని చెప్పారు స్టెఫానీ.

పాడైన ఆహారం తినడం వల్ల ఏటా అనారోగ్యం పాలవుతున్న 60 కోట్ల మందిలో స్టెఫానీ ఒకరు. అయితే, చివరి నిమిషంలో ఆమె ప్రాణాలు దక్కించుకున్నారు.

కలుషితాహారం కారణంగా ఏటా 4.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏం తింటున్నామో గమనించే అలవాటు చేసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పుతుంది అంటారు బిల్ మార్లర్.

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో మానేయాల్సిన కొన్నింటి గురించి మార్లర్ వివరించారు.

లెట్యూస్ సాగు చేస్తున్న పొలం

ఫొటో సోర్స్, Netflix

‘పాశ్చరైజ్ చేయని పాలు వద్దు’

అనేక కేసులలో తాను చూసిన అనుభవాల నేపథ్యంలో బిల్ మార్లర్, పాశ్చరైజ్ చేయని పాలు, జ్యూస్‌లను, పచ్చి పాలను తిరస్కరిస్తారు.

స్టెఫానీ జబ్బు పడడానికి కారణమైన ఈ.కోలీ బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంటుందనే ఆయన అలాంటి ఆహారాలను తీసుకోరు.

‘‘పాశ్చరైజ్ చేయని పాల వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయని భావించినా కూడా దానివల్ల ఉన్న రిస్క్‌తో పోల్చితే అది తక్కువే. 19వ శతాబ్దం నాటి వ్యాధులను ప్రజలు మర్చిపోయారు’’ అంటారు బిల్ మార్లర్.

ఆహారం

ఫొటో సోర్స్, Netflix

మొలకెత్తిన గింజలు పచ్చివి తింటే...

పెసలు, శనగలు, ఇతర గింజలను మొలకెత్తించి పచ్చివి తింటుంటారు. కానీ, అలా చేయొద్దంటున్నారు బిల్.

ప్రపంచంలో ఆహారం వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తికి ఇవీ కారణమే.

2011లో జర్మనీలో కలుషితమైన మెంతులను తినడం వల్ల 900 మందికి కిడ్నీలు విఫలమయ్యాయి. వారిలో 50 మందికిపైగా చనిపోయారు.

‘‘విత్తనాలు, గింజలు బయట పెరిగినందున అవి కలుషితమవుతాయి. వాటిని ఇంటికి తీసుకొచ్చి నీటిలో నానబెట్టి మొలకెత్తించినప్పుడు అప్పటికే వాటిలో ఉన్న బ్యాక్టీరియాకు ప్రాణం పోసినట్లవుతుంది’’ అన్నారు బిల్.

ఫుడ్ సేఫ్టీ ఇండస్ట్రీలో పనిచేసేవారు ఎవరూ పచ్చి మొలకలు తింటారని తాను అనుకోనని ఆయన చెబుతారు.

మాంసం కీమా

ఫొటో సోర్స్, Getty Images

మాంసం కోసేటప్పుడు..

మాంసం బాగా చిన్నగా ముక్కలు చేయడం, ముద్దగా చేయడం(కీమా అంటుంటారు) కోసం చెక్కపై ఉంచి కత్తితో అదేపనిగా కొడతారు. అలాంటప్పుడు చెక్కపై ఉండే బ్యాక్టీరియా మాంసంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే హాంబర్గర్‌లను బాగా ఉడికించడం చాలా అవసరం.

‘‘సూది మొన అంత సూక్ష్మ స్థలంలో లక్ష ఈ.కోలీ ఉండగలవు. మనిషిని చంపడానికి అందులో 50 ఈ.కోలీ చాలు. ఆహారంలో అవి ఉన్నా వాటి రుచి కానీ, వాసన కానీ ఏమీ తెలియదు. అవి కంటికి కూడా కనిపించవు. ఏ ఆహార పదార్థాన్నైనా పూర్తిగా వండాకే తినడం ఒక్కటే వాటి నుంచి కాపాడుకునే మార్గం’’ అంటారు బిల్.

వ్యాధికారక క్రిములు ఉండకూదంటే బర్గర్లను కనీసం 69 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు.

ముందే కడిగేసి ఉంచిన పండ్లు, కూరగాయలతో..

బర్గర్ తినేటప్పుడు అత్యంత ప్రమాదకర భాగాలు అందులోని పచ్చి ఉల్లి, క్యాబేజీ ఆకులు, టమోటాలే అని ఫుడ్ సేఫ్టీ కన్సల్టెంట్ మన్సూర్ సమద్‌పుర్ చెప్పారు.

2006లో బచ్చలికూరలో ఉన్న ఈ.కోలీ కారణంగా అమెరికాలో 200 మందికి పైనే అస్వస్థత పాలయ్యారు. అందులో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధితులలో చాలా మంది కేసులను బిల్ వాదించారు.

కాలిఫోర్నియాలోని ఒక పొలంలోని బచ్చలికూర కారణంగా ఇదంతా జరిగింది. ఆ పొలంలోకి వచ్చిన పశువులు వేసిన పేడ కారణంగా ఈ.కోలీ బ్యాక్టీరియా బచ్చలికూరకూ సోకినట్లు తేలింది.

ఆ పొలంలోని బచ్చలికూరను కోసి ఓ కేంద్రానికి పంపించగా, అక్కడ దాన్ని శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా మూడుసార్లు కడిగారు. దాంతో మొత్తం బచ్చలికూర అంతా ఈ.కోలీ వ్యాపించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా అయిన సరకుతోపాటు వ్యాప్తి చెందింది. ఫలితంగా దాన్ని తిన్న వందల మంది అనారోగ్యం బారినపడ్డారు.

బచ్చలకూర కానీ, ఇంకేదైనా కానీ ఎక్కువ చేతులు మారినప్పుడు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు బిల్.

గుడ్లు

ఫొటో సోర్స్, Getty Images

పచ్చివి, సరిగా ఉడికించని గుడ్లు

గుడ్లలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రమాదకరం. ఇది అతిసారం, జ్వరం, వాంతులు, కడుపు బిగుసుకోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. పిల్లలు, వృద్ధులకు ఈ బ్యాక్టీరియా సోకితే చనిపోతుంటారు కూడా.

1988లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా బ్రిటన్ ప్రభుత్వం 20 లక్షల కోళ్లను చంపాలని ఆదేశించింది. 2010లో ఇదే కారణంతో అమెరికాలో 50 కోట్ల గుడ్లను మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకున్నారు.

గతంతో పోలిస్తే గుడ్లు ఇప్పుడు కొంత సురక్షితంగా ఉన్నాయని, అయినా పచ్చి గుడ్లు తినడం ప్రమాదమని, బాగా ఉడికించిన తరువాతే తినాలని బిల్ సూచించారు.

‘‘సుమారు 10 వేల గుడ్లలో ఒక దాంట్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండొచ్చు. కోడి అండాశయంలో సాల్మొనెల్లా వృద్ధి చెంది, అది గుడ్డులోకి చేరుతుంది. అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడమో, వండడమో చేస్తే తప్ప అది నాశనం కాదు’’ అని చెప్పారు బిల్.

నత్తలు, ఆల్చిప్పలు, పీతలు వంటివి పచ్చివి తింటే..

నత్తలు, ఆల్చిప్పలు, పీతలు వంటి పైన పెంకు ఉండే జీవులు సాధారణంగా ఫిల్డర్ ఫీడర్‌లు.

అంటే.. ఇవి తాము తినాల్సిన జీవులను నీటిలో బాగా చెదరగొట్టి ఆ చిన్నచిన్న రేణువులను తింటాయి. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది సులభంగా ఆహార గొలుసులో ప్రవేశిస్తుంది.

కాబట్టి వీటిని సరిగా వండకుండా తింటే ప్రమాదమే.

sandwich

ఫొటో సోర్స్, Getty Images

ప్యాక్ చేసిన శాండ్‌విచ్

‘‘శాండ్‌విచ్ తినేటప్పుడు దానిపై తేదీలు జాగ్రత్తగా చూడాలి. వీలైనంత వరకు మీరు తయారుచేసుకునే శాండ్‌విచ్‌లు తినడం మంచిది. లేదంటే మీ కళ్లెదురుగా తయారుచేసిందైతేనే తినడం మంచిది"" అని బిల్ చెప్పారు.

శాండ్‌విచ్ తయారుచేసి ఎన్నిరోజులైందనేది చాలా ముఖ్యమని, ఎక్కువ కాలమైతే పాడవుతుందని, లిస్టీరియా మాంటోసైటోజీన్స్ బాక్టీరియా చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని బిల్ చెప్పారు.

అమెరికా, ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు ఇది కారణమని, ఆహారంలోంచి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే ఆసుపత్రి పాలవుతారని బిల్ చెప్పారు.

‘‘రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతల వద్ద లిస్టీరియా బాగా పెరుగుతుంది. కాబట్టి శాండ్‌విచ్‌లను వెంటనే తింటే ప్రమాదమేమీ ఉండదు. కానీ, వారంపాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచింది తింటే మాత్రం ప్రమాదం’’ అంటారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)