డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌తో సమాచార హక్కు చట్టం బలహీన పడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ న్యూస్
భారతీయుల వ్యక్తిగత డేటాను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం.. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను తీసుకొచ్చిన మరో కీలకమైన చట్టాన్ని నీరుగారుస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గత వారం వరకూ భారత్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా నిల్వ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి లాంటి విషయాల్లో ఎలాంటి చట్టమూ లేదు. ఈ కొరతను పార్లమెంటు తాజాగా ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు తీర్చింది.
అయితే, ప్రైవసీ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ చట్టం ప్రజలను నిఘా నుంచి రక్షించలేదని, పైగా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు కట్టబెడుతోందని వారు చెబుతున్నారు.
ఈ చట్టంపై వస్తున్న విమర్శల్లో సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)లో మార్పులు కూడా ఒకటి. ఏళ్లపాటు కొనసాగిన ఉద్యమాల తర్వాత 2005లో ఆర్‌టీఐను తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి సమాచారాన్ని, సమాధానాలను లక్షల మంది పౌరులు పొందగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఆర్‌టీఐలో ఒక నిబంధనను కొత్త చట్టం మారుస్తోంది. ‘‘వ్యక్తిగత సమాచారం’’ వెల్లడించకుండా దీనిలో మార్పులు చేశారు. దీంతో ప్రస్తుతం ఆర్‌టీఐ కింద ఇస్తున్న చాలా సమాచారంపై ఆంక్షలు వచ్చే అవకాశముంది.
‘‘ఆర్‌టీఐ ద్వారా అవినీతిపై పోరాటం, ప్రభుత్వ అధికారుల జవాబుదారీతనాన్ని సరిచూడటానికి వ్యక్తిగత సమాచారానికి లంకె ఉంటుంది’’ అని నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కో-కన్వీనర్ అంజలి భరద్వాజ్ చెప్పారు.
కొత్త నిబంధనలు ఆర్‌టీఐను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకుర్ కూడా వ్యాఖ్యానించారు.
ఆర్‌టీఐ చట్టానికి మొదట్నుంచీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చాలా కారణాలతో సమాచారాన్ని అధికారులు తిరస్కరిస్తూ ఉంటారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా దీన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, కొత్త సవరణలతో సమాచారం తీసుకోవడం దాదాపుగా అసాధ్యంగా మారే అవకాశముందని హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్‌టీఐ చట్టం ఏం చెబుతోంది?
రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడే సంస్థల నుంచి ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు లేదా నోటిఫికేషన్లతో ఏర్పడే సంస్థల వరకూ చాలా సంస్థలు ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సాయం పొందే సంస్థలన్నీ ఈ చట్టం కిందకు వస్తాయి.
ప్రజలు కోరినప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆర్‌టీఐ చెబుతోంది. అయితే, దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వీటిలో జాతీయ భద్రత ఒకటి.
ఈ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలు కూడా ఉన్నాయి. ఏదైనా సమాచారానికి ప్రజలతో సంబంధం లేకపోయినా లేదా దీనిలో వ్యక్తిగత సమాచారమున్నా అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించొచ్చు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ సమాచారం అవసరంలేదని అధికారులు భావించినా కూడా ఆ అభ్యర్థనను తోసిపుచొచ్చు.
2012లో ప్రైవసీ చట్టంపై ఏర్పాటుచేసిన జస్టిస్ ఏపీ షా కమిటీ ఆర్‌టీఐ కింద కోరే సమాచారం వ్యక్తుల గోప్యతా హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త చట్టంలో ఏం మార్పులు చేశారు?
కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం సరిగ్గా ఇదే నిబంధనను అమలు చేస్తోంది. ఇక్కడ కేవలం వ్యక్తిగత సమాచారమని భావిస్తే ఆ అభ్యర్థనను తిరస్కరించేలా నిబంధనలు తీసుకొచ్చారు. అది ఆ వ్యక్తి ఐడెంటిటీకి సంబంధించిన ఏ సమాచారమైనా ఆ అభ్యర్థనను తిరస్కరించొచ్చు.
ఇదివరకు ప్రజలకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉండే వ్యక్తిగత సమాచారాన్ని పొందేలా నిబంధన ఒకటి ఉండేది’’ అని మాజీ కేంద్ర సమాచార కమిషనర్ శైలేశ్ గాంధీ చెప్పారు.
చట్టాన్ని సులువుగా అమలు చేసేందుకు శాసన సభకు ఇచ్చే సమాచారం మొత్తం ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉండేది.
కానీ, ఇప్పుడు మొత్తంగా వ్యక్తిని గుర్తుపట్టేందుకు దారితీసే ఏ సమాచారాన్ని ఇవ్వకూడదనే నిబంధన తీసుకొచ్చారని, దీంతో చాలా సమాచార అభ్యర్థనలు తిరస్కరణకు గురికావొచ్చని గాంధీ చెప్పారు.
ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని అనుసరించకపోతే 250 కోట్ల రూపాయల వరకూ జరిమానా విధించొచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన డేటాను బయట పెట్టకుండా ఉండేందుకు చాలా అభ్యర్థనలను అధికారులు తిరస్కరించొచ్చు.
‘‘ఒకవేళ జరిమానా తగ్గించినప్పటికీ, ఏ అధికారి రిస్క్‌ను తీసుకుంటారు?’’ అని గాంధీ ప్రశ్నించారు.
అయితే, 2017లో ప్రైవసీపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ‘‘లీగాలిటీ, లెజిటమసీ, ప్రొపోర్షనాలిటీ’’ టెస్టును దాటుకుని వచ్చే పర్సనల్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆనాడు సుప్రీం కోర్టు చెప్పింది. ప్రస్తుత చట్టం ఆర్‌టీఐను పెద్దగా ప్రభావితం చేయదని వైష్ణవ్ అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
అవినీతికి అడ్డుకట్టవేసే వీలును, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ప్రస్తుత చట్టం హరించే అవకాశముందని సమాచార హక్కు చట్టం ఉద్యమకారులు చెబుతున్నారు.
‘‘ఉదాహరణకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం (జాతీయ ఆహార భద్రతా చట్టం- ఎన్ఎఫ్ఎస్ఏ)ను తీసుకోండి. దీనిలో ఏదైనా అవినీతి చోటుచేసుకుందా? లేదా ప్రజలకు సరిగ్గా రేషన్ అందుతుందా? లాంటి అంశాలు తెలుసుకోవాలంటే మొదట రేషన్ దుకాణాలు, వాటి సేల్ రిజిస్టర్లు, ఆ రేషన్ ఎవరు పంపిణీ చేశారు? లాంటి వివరాలు కావాలి. అయితే, వీటిలో చాలావరకు వ్యక్తిగత సమాచారం ఉంటుంది’’ అని భరద్వాజ్ చెప్పారు.
మరోవైపు తగిన మార్కులు వచ్చినప్పటికీ తమకు సీటు ఇవ్వని కళాశాలల్లో డేటాను కూడా సమాచార హక్కు చట్టంతో దళిత విద్యార్థులు కోరుతుంటారని ఆమె వివరించారు.
‘‘ఇక్కడ కూడా వ్యక్తిగత సమాచారం ఉండొచ్చు. ఇలాంటి సమాచారం లేకపోతే ఆర్‌టీఐతో అవినీతికి అడ్డుకట్ట వేయడం కష్టం అవుతుంది. పారదర్శకత కూడా కొరవడుతుంది’’ అని గాంధీ చెప్పారు.
తను పదవిలో ఉండేటప్పుడు ఒక వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించిన వైద్యుల డిగ్రీలను తెలుసుకునేందుకు అభ్యర్థన పెట్టినట్లు ఆయన వివరించారు. ‘‘ఆ డేటాను పరిశీలించిన తర్వాతే కొందరు ఫేక్ సర్టిఫికేట్లతో డాక్టర్లుగా చెలమణీ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది’’ అని ఆయన తెలిపారు.
అయితే, కొత్త చట్టంతో అలాంటి డేటా బయటకు వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సమాచారం మొత్తం వ్యక్తిగత డేటా పరిధిలోకి వస్తుందని వివరించారు.
ఇప్పటికే చాలా మంది అధికారులు ఇది ‘వ్యక్తిగత సమాచారం’ అని చెప్పి అభ్యర్థనలను తిరస్కరిస్తుంటారని, తాజా చట్టం తర్వాత ఇలాంటి తిరస్కరణలు చాలా పెరగొచ్చని ఆయన అన్నారు.
ఏవైనా మినహాయింపులు ఉన్నాయా?
అయితే, ప్రస్తుత చట్టానికి ఆర్‌టీఐలో ఒక నిబంధన నుంచి మినహాయింపు ఉంది. ‘‘అభ్యర్థి కోరిన సమాచారం వ్యక్తిగత డేటా పరిధిలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన కంటే ప్రజాప్రయోజనం ఎక్కువ ఉండేటప్పుడు దానికి అనుమతించొచ్చు.’’
అయితే, దీన్ని నిరూపించే బాధ్యత సమాచారం కోరేవారిపైనే ఉంటుంది.
‘‘అయితే, ప్రస్తుతం ఎందుకు ఆ సమాచారం కోరుతున్నారో అభ్యర్థులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ సమాచారంతో ప్రజాప్రయోజనం ఎంత ఉందో వారు చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత గోప్యత కంటే ప్రజాప్రయోజనమే ఎక్కువని నిరూపిస్తే అప్పుడు డేటా పొందొచ్చు’’ అని భరద్వాజ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















