ఎలా పడుకుంటే మంచిది? ఛాతీలో మంట, మెడ నొప్పి, నడుం నొప్పి తగ్గాలంటే ఏ భంగిమలో పడుకోవాలి?

నిద్రపోతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్లౌడియా హామండ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

నిద్ర పోయే ముందు ఏ భంగిమలో పడుకున్నప్పటికీ నిద్రలో కొందరు ఒక పక్కకు తిరుగుతారు. మరికొందరు వెల్లకిలా పడుకుంటారు.

మీరు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ రాత్రిళ్లు నిద్ర పోయేందుకు అటూ ఇటూ తిరగడం మాత్రం మామూలే. సౌకర్యవంతంగా నిద్రపోయేందుకు వివిధ భంగిమలను కూడా ప్రయత్నించి ఉండవచ్చు.

మరి, ఏ భంగిమలో పడుకోవడం ఉత్తమం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

నైజీరియా కంటైనర్ షిప్‌లలో ప్రయాణించే నావికులు, వెల్డర్లపై చేసిన అధ్యయనాలు నిద్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.

మనకు నిద్రకు ఎంత ముఖ్యమో తెలిసినా, నిద్రకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, విస్తృత స్థాయిలో నిర్వహించిన అధ్యయనాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ముందుగా మీరు ఏ భంగిమలో పడుకుని నిద్రపోతున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. అది తెలుసుకునేందుకు మీరు అవతలి వ్యక్తిని అడగొచ్చు. అయితే, పడుకునే ముందు ఏ భంగిమలో పడుకున్నారు, నిద్ర లేచేటప్పుడు ఏ భంగిమలో ఉన్నారో గుర్తుంచుకోవడం అవసరం.

దీని గురించి మరింత తెలుసుకునేందుకు పరిశోధకులు చాలా టెక్నిక్స్ ఉపయోగించారు. నిద్రపోతున్నప్పుడు చిత్రీకరించడంతో పాటు, నిద్రపోయే సమయంలో వారి కదలికలను గుర్తించేందుకు కొన్ని పరికరాలను కూడా అమర్చి పరిశీలించారు.

హాంగ్‌కాంగ్‌‌ పరిశోధకులు ''బ్లాంకెట్ అకామడేటివ్ స్లీప్ పోస్టర్ క్లాసిఫికేషన్ సిస్టమ్'' అనే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందులో అమర్చిన ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఒక వ్యక్తి నిద్రపోతున్న సమయంలో శరీర కదలికలను నమోదు చేస్తాయి. దుప్పటి కప్పుకున్నప్పటికీ పనిచేసేలా వాటిని రూపొందించారు.

డెన్మార్క్‌ పరిశోధకులు నిద్రపోయే ముందు సదరు వాలంటీర్ల తొడ భాగం, పిరుదుల పైభాగం, భుజాలపై మోషన్ సెన్సర్లను అమర్చారు.

వారు నిద్రపోయిన పూర్తి సమయంలో సగం సమయం ఒక పక్కకు తిరిగి పడుకున్నారు.

సుమారు 38 శాతం మంది వెల్లకిలా పడుకోగా, 7 శాతం మంది బోర్లా పడుకున్నారు.

వయసు పైబడే కొద్దీ ఎక్కువ మంది ఒక పక్కకు తిరిగి పడుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పక్కకు పడుకోవడం అనేది వయసు పెరుగుతున్నకొద్దీ అలవాటు అవుతోంది. ఎందుకంటే, మూడేళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలను పరిశీలిస్తే, వారు నిద్రపోతున్న సమయంలో పక్కకు తిరిగి పడుకోవడం, వెల్లకిలా, బోర్లా పడుకునే సగటు సమయం దాదాపుగా ఒకేలా ఉంటున్నట్లు గుర్తించారు.

మూడేళ్ల కంటే చిన్నపిల్లలు వెల్లకిలా పడుకునే ఎక్కువగా నిద్రపోతారు. ఎందుకంటే, భద్రతా కారణాల వల్ల(బోర్లపడటం, కింద పడిపోవడం వంటివి) వారిని మంచంపై అలాగే పడుకోబెడుతున్నారు.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఒక పక్కకు పడుకోవడం అనేది అత్యంత సాధారణ విషయం. అలా పడుకోవడం వల్ల మంచిగా నిద్రపోయే అవకాశం ఉందని అనుకుంటారు. కానీ, డేటా ఏం చెబుతోంది?

కొంత మందిపై జరిపిన అధ్యయనంలో ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు కంటే కుడి వైపు తిరిగి పడుకున్నప్పుడు మంచిగా నిద్రపోయినట్లు అనిపించిందని చెప్పారు.

వెల్లకిలా పడుకున్నప్పుడు కంటే కూడా కుడి వైపు పడుకోవడమే బెటర్‌గా అనిపించినట్లు ఆ అధ్యయనంలో గుర్తించారు.

పక్కకు పడుకుంటే త్వరగా నిద్రపడుతుందని మీరు అనుకుంటే, మీకు సమీపంలో నిద్రపోయేవారికి కూడా అదే ఉత్తమం.

ఒకసారి ఓ రేడియో ప్రోగ్రామ్ కోసం సబ్‌మెరైన్‌లో ప్రయాణించినప్పుడు వారు పడుకునే క్వార్టర్స్‌ చూశాను. అక్కడ బెడ్లు ఒకదానిపై ఒకటి చాలా దగ్గరగా అమర్చి ఉన్నాయి. వాటిపై పక్కకు తిరిగి పడుకోవడం చాలా కష్టం. అంటే, వాళ్లు వెల్లికిలా పడుకుని నిద్రపోవాల్సిందే.

దాని గురించి వాళ్లేం చెప్పారంటే, ''ఇక్కడ నిద్ర కోసం రేస్ జరిగినట్టు ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ గురకపెట్టేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల కంటే ముందే మనం నిద్రపోవాల్సి ఉంటుంది''.

మర్చంట్ కంటైనర్ షిప్పుల్లోని నావికులపై జరిపిన అధ్యయనంలో గురక చాలా సాధారణమని తేలింది. అయితే, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు.

షిప్పుల్లో ఎక్కువగా వెల్లకిలా పడుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.

తీవ్రమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల కొన్ని గురకలు వస్తాయి. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం ఆగిపోవడాన్ని స్లీప్ అప్నియాగా వ్యవహరిస్తారు.వెల్లకిలా పడుకుని నిద్రపోయేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

పక్కకు తిరిగి పడుకోవడం దానికి విరుద్ధం. నాలుక, గొంతును అడ్డుకోకుండా చేసి శ్వాస తీసుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది. దాని వల్ల గురక కూడా తక్కువగా వస్తుంది. వెల్లకిలా పడుకోవడం వల్ల వచ్చే స్లీప్ అప్నియా సమస్య పక్కకు తిరిగి పడుకోవడం వల్ల పూర్తిగా నయమవుతుందని గుర్తించారు.

పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలగొచ్చు.

పక్కకు తిరిగి పడుకునే వారితో పోలిస్తే, వెల్లకిలా పడుకునే వారిలో వెన్నునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నైజీరియాలోని కంటైనర్ షిప్‌లో వెల్డర్లపై చేసిన పరిశోధనలో తేలింది.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

మెడ నొప్పి ఉంటే ఎలా? నడుం నొప్పి ఉంటే ఎలా?

పక్కకు తిరిగి నిటారుగా పడుకునే వారిలో మెడ నొప్పి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అయితే, ఇది అందరికీ వర్తిస్తుందని కాదు. అన్ని నొప్పులనూ తగ్గించే దివ్యఔషధం కూడా కాదు. ఇది మీ అనారోగ్య పరిస్థితులు, నిద్రపోయేటప్పుడు మీరు ఏ భంగిమలో పడుకుంటారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

పక్కకు తిరిగి పడుకుని నిద్రపోయే వారిలో మెడ నొప్పులు తక్కువగా ఉంటాయని వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. వారు వాలంటీర్లు నిద్రపోతున్న సమయంలో కెమెరాలను ఉపయోగించి 12 గంటల పాటు వారి కదలికలను నమోదు చేసి విశ్లేషించారు.

అంటే, నిద్రలో ఒక తొడ మీద మరో తొడ వేసి పడుకుంటే వెన్నుపూసపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అదే నిటారుగా పడుకునే వారిలో ఆ రిస్క్ తక్కువ. అందువల్ల మెడనొప్పి వచ్చే అవకాశం కూడా తక్కువ.

అయితే, ఈ భంగిమలో నిద్రపోవడం వల్ల మెడనొప్పి వస్తుందా? లేక మెడనొప్పి కారణంగా వారు ఇలా పడుకుంటున్నారా? అనే విషయాన్ని నిర్ధరించలేకపోయారు.

కొందరిని తీసుకుని కొత్త భంగిమలో నిద్రపోవాలని చెప్పినప్పుడు, ఆ తర్వాత కలిగే నొప్పులను వారు గుర్తించగలుగుతారా? ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా వయసు పైబడిన కొందరు వ్యక్తులపై పోర్చుగల్‌లో అధ్యయనం నిర్వహించారు. నడుం నొప్పి ఉన్నవారు పక్కకు తిరిగి పడుకోవాలని, మెడ నొప్పి ఉన్న వారు వెల్లకిలా పడుకోవాలని సూచించారు. నాలుగు వారాల తర్వాత 90 శాతం మంది నొప్పులు తగ్గిపోయినట్లు చెప్పారు.

ఇది ఆశాజనకమైన ఫలితంగా అనిపించినా, అందులో ఒక చిన్న లోటు ఉంది. ఈ అధ్యయనం కేవలం 20 మందిపైనే నిర్వహించారు. ఇంత తక్కువ మందిపై జరిపిన అధ్యయనం ఫలితాలను పూర్తిగా విశ్వసించలేం. మరింత లోతైన శాస్త్రీయ అధ్యయనాలు అవసరం.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

గ్యాస్ సమస్య వస్తే ఎలా పడుకోవాలి?

గుండెల్లో మంటగా అనిపిస్తే ఎడమ వైపు పడుకోవడం ఉపశమనం కలిగించొచ్చు.

ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మీరు ఏ వైపు తిరిగి పడుకోవాలనేది మాత్రమే కాదు, మీరు ఎలా పడుకోవాలనేది కూడా పెద్ద ప్రశ్నే. కడుపులో గ్యాస్ సమస్య తలెత్తి ఛాతీలో మంట వచ్చినప్పుడు ఆసరాగా దిండ్లు పెట్టుకుని పడుకోవడం ద్వారా దాన్ని తగ్గించవచ్చని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు.

ఛాతీలో మంట వచ్చే పరిస్థితిని గ్యాస్ట్రో-ఒసోఫాగియల్ రిఫ్లక్స్‌గా చెబుతారు. ఇది తీవ్రంగా అనిపిస్తుంది. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల కడుపుకు, అన్నవాహికకు మధ్య గ్యాస్ట్రిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుందని, కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల యాసిడ్ బయటకు వెళ్లేలా చేస్తుందనే అభిప్రాయాలున్నాయి.

ఏదేమైనా, మీరు గుండెల్లో మంటతో బాధపడుతుంటే మాత్రం ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం పొందే అవకాశం ఉంది.

బోర్లా పడుకున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

బోర్లా పడుకునే వారి సంగతేంటి?

ఇప్పటివరకూ పక్కకు తిరిగి పడుకునేవారు, లేదంటే వెల్లకిలా పడుకునే వారి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది అలాగే పడుకుంటారు. మరి బోర్లా పడుకునే వారి సంగతేంటి? బోర్లా పడుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.

దవడ నొప్పులు ఉన్నవారు బోర్లా పడుకోవడం అంత మంచిది కాదని ఓ అధ్యయనం సూచిస్తోంది.

దిండుకు ముఖాన్ని ఆనించి పడుకోవడం వల్ల ముడతలు మరింత పెరుగుతాయా అనే ప్రశ్నకు ఒక ప్లాస్టిక్ సర్జన్ల బృందం సమాధానమిస్తూ- అలా పడుకుంటే చర్మంపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని చెప్పింది.

నిద్రపోతున్నప్పుడు ముఖంపై తక్కువ ఒత్తిడి పడేలా చూసుకోవాలి.

ఈ అధ్యయనాలను బట్టి ఏం తెలుస్తోందంటే, అన్ని భంగిమలూ దాదాపు సమానమే. ఎందుకంటే, పక్కకు పడుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మెడ, వెన్నునొప్పిపై, ప్రభావం చూపించవచ్చు.

వెల్లకిలా పడుకోవడం వల్ల గురక అవకాశం ఎక్కువ. కానీ, నిద్రలో వేర్వేరు భంగిమలకు మారుతుండడం వల్ల అదే మంచిగా నిద్రపోయే భంగిమ కావొచ్చు.

ప్రస్తుతం మీరు పడుకుంటున్న భంగిమలో నాణ్యమైన నిద్ర పొందలేకపోతే, కొత్త విధానాలను పరిశీలించొచ్చు. కానీ, వేర్వేరు భంగిమల్లో ఏది ఉత్తమమైనని అనేది ఎక్కువగా ఆలోచించకూడదని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీరు ఇబ్బంది పడుతూనే నిద్ర లేవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)