రోజూ 4 వేల అడుగులు నడిచినా అకాల మరణాన్ని తప్పించుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే రోజుకు 10 వేల అడుగులు నడవాలనేది చాలా కాలంగా చెబుతున్నదే. అయితే, కొత్త అధ్యయనం ప్రకారం 5 వేల అడుగుల కంటే తక్కువే నడిచినా ఒక గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 2,26,000 మందిపై చేసిన ఒక విశ్లేషణలో రోజుకు 4,000 అడుగులు నడిస్తే ఏ కారణంగానైనా సంభవించే అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది.
గుండెకు, రక్తనాళాలకు మేలు కలగడం కోసం రోజుకు 2,300 అడుగులు నడిస్తే సరిపోతుంది.
ఎంత ఎక్కువగా నడిస్తే, అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు.
నాలుగు వేలు దాటిన తర్వాత 20 వేల అడుగుల వరకు జోడించే ప్రతీ వెయ్యి అడుగులు అకాల మరణం ముప్పును 15 శాతం తగ్గించాయి.

ఫొటో సోర్స్, Getty Images
నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా అందరికీ, అన్ని వయస్సుల వారికీ వర్తిస్తాయని పోలాండ్‌లోని మెడికల్ యూనివర్సిటీ, అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందాలు కనుగొన్నాయి.
60 ఏళ్లలోపు వారిలో దీనివల్ల గొప్ప ఫలితాలు కనిపించాయి.
వ్యాధి చికిత్సల కోసం అధునాతన ఔషధాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యాధుల నుంచి రక్షణకు ఇదొక్కటే సమాధానం కాదని లోడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మసీజ్ బనాచ్ అన్నారు.
‘‘డైట్, వ్యాయామం సహా జీవనశైలిలో మార్పులపై దృష్టి పెట్టాలి. విశ్లేషణలో కూడా ఇదే మా ప్రధాన అంశం. గుండె సంబంధిత ముప్పులను తగ్గించుకోవడానికి, జీవిత కాలాన్ని పెంచుకోవడానికి మెరుగైన జీవనశైలిని అనుసరించాలి’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్లే ప్రతీ ఏడాది 32 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది నాల్గవ అత్యంత సాధారణ కారణం.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్లోబల్ ఫిట్‌నెస్ కంపెనీ ‘బరీస్’ ఇన్‌స్ట్రక్టర్, వ్యక్తిగత శిక్షకురాలు హనీ ఫైన్ హెచ్చరించారు.
‘‘ఇది జీవక్రియ వేగాన్ని తగ్గించవచ్చు. కండరాల వృద్ధి, సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కండరాల నొప్పులు కలుగుతాయి’’ అని బీబీసీతో హనీ ఫైన్ అన్నారు.
‘‘ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు వస్తాయి. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్యలను ఎక్కువగా చూస్తుంటాం. వారి వెన్నెముక నిరంతరం కుంచించుకుపోయిన స్థితిలో (కంప్రెస్డ్), ఒత్తిడిలో ఉంటుంది. ఇది తర్వాత చాలా సమస్యలకు దారి తీస్తుంది’’ అని హనీ ఫైన్ వివరించారు.
వ్యాయామంతో నేరుగా సంబంధం లేని, అంటే చూడటానికి వ్యాయామం చేస్తున్నట్లుగా కనిపించని పనుల ప్రాధాన్యాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను ‘థర్మోజెనెసిస్’ అని పిలుస్తారు.
థర్మోజెనెసిస్ అంటే మన శక్తిని, కేలరీను ఖర్చు చేసేందుకు చేసే ప్రతీ పని.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నిల్చోవడం, సరుకులను మోసుకురావడం, నేలను శుభ్రం చేయడం, ఊడ్చటం, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ తిరగడం వంటి చిన్న చిన్న పనులన్నీ మన కేలరీలను ఖర్చు చేయడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి’’ అని హనీ ఫైన్ వివరించారు.
రోజు నడవడాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని ఆమె తెలిపారు.
‘‘నడక వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఎముకలకు రక్షణగా ఉండే కండరాలు శక్తిమంతం అవుతాయి. ఎనర్జీ స్థాయులు పెరుగుతాయి. ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది’’ అని చెప్పారు.
నడక వల్ల ఇతర ప్రయోజనాలు ఏంటంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పరధ్యాస, స్క్రీన్ల వినియోగం నుంచి దూరంగా ఉండొచ్చు.
నడక అత్యధికులకు అనుకూలమైన వ్యాయామని ఆమె చెప్పారు.
నడకకు చిట్కాలు
- సమీపంలోని మెట్రో స్టేషన్ లేదా బస్టాండ్‌కు వాహనాన్ని వాడకుండా, నడవండి.
- ఒకవేళ మీరు డెస్క్‌లో పని చేస్తుంటే లేచి కదలడానికి గంటకోసారి రిమైండర్లు పెట్టుకోండి
- గర్భిణులకు నడక చాలా ఉత్తమమైన వ్యాయామం
- సంగీతం లేదా ఒక పాడ్‌కాస్ట్ వింటూ రోజూ 30 నిమిషాలు నడవండి
- స్నేహితులతో పార్క్‌లో నడవండి. మీకు పెంపుడు కుక్క ఉంటే దానితో వాకింగ్‌కు వెళ్లండి
మెల్లిగా ప్రారంభించండి: మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసుకు రోజూ వారీ 10 నిమిషాల నడక, నెమ్మదిగా పార్క్‌లో 20 నిమిషాల నడకగా మారుతుంది. తర్వాత సులభంగా 30 నిమిషాల నడక లక్ష్యాన్ని అందుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- చిరంజీవి: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు కారణమేంటి? భీమ్లా నాయక్, బ్రో సినిమాల తరువాత వివాదాలు ఎందుకు రాజుకున్నాయి
- ప్రతిద్రవ్యోల్బణం: చైనాలో తగ్గుతున్న వస్తువుల ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా
- లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?
- అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: సమ్మె విరమించుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














