ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా భయమేస్తోందా? అయితే అది ఇదే..

ఫోబియా

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, డాక్టర్ రాజేంద్ర బర్వే, సైకాలజిస్ట్
    • హోదా, సుగత ఆచార్య, పూర్ణభాన్ ట్రైనర్

సుధీర్ చాలా తెలివైన వ్యాపారి. 32 ఏళ్ల వయసులోనే మంచి పెట్టుబడి, పలుకుబడి, లాభాలు సంపాదించేశాడు. అతనికి ఎన్నోపెద్దపెద్ద కలలు ఉన్నాయి. తన ఉత్పత్తులను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని అనుకుంటున్నాడు.

అయితే, అందులో ఒకటే సమస్య. అన్నింటి గురించీ ఎక్కువగా ఆలోచించడం. అతని ఆలోచనలను మీటింగ్‌లో చెప్పాలంటే చాలా భయం. ఆ సమయంలో అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చేతులు వణికిపోతుంటాయి. గొంతు తడారిపోతుంది. మెడ వాలిపోతుంటుంది.

దీనివల్ల సుధీర్ పురోగతి మందగించింది. క్రమంగా అతని ధైర్యం సన్నగిల్లింది. తన స్వభావం వల్లే తన కలలు సాకారం కాలేదని బాధపడ్డాడు. ఎప్పుడూ చిరాకుగా ఉండడంతోపాటు పనిలో పరధ్యానం పెరిగింది. తన మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయాడు.

సుధీర్ తరహాలోనే మరొకరు మీనా. ఆమె మంచి గృహిణి. ఏదైనా వ్యాపారం బదులుగా ఆమె వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆ నిర్ణయంతో ఆమె సంతోషంగానే ఉన్నారు. ఆమె పొరుగింటామె కూడా ఆమెలాగే గృహిణి.

ఇద్దరూ కలిసే షాపింగ్‌‌కు వెళ్లేవారు. తాను లేకపోతే మీనా బయటకు వెళ్లలేదని, తనపైనే ఆధారపడిందని పక్కింటామెకు అర్థమైంది. మీనా ప్రతిదానికీ తనపై ఆధారపడుతుండడంతో పక్కింటామె నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. అదే విషయం మీనాకు ఒకసారి చెప్పేసింది కూడా.

అది విని మీనాకు కోపం వచ్చింది. బాధ కలిగింది. అప్పటి నుంచీ ఇంట్లోనే ఉండేది. ఇతర స్నేహితులు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, తను ఎందుకు అలా ఉంటున్నానో ఆమెకే తెలియని పరిస్థితి.

ఫోబియా

ఫొటో సోర్స్, Getty Images

మూడో కథ సుజిత్‌ది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి సుజిత్ ఏదో విషయం గురించి ఆందోళన పడుతుండడాన్ని భార్య గమనించింది. రోజూ అతనికి ఒకటే ఆలోచన. ఈ రోజు భారీ వర్షం పడుతుందా? పడితే బయటికి వెళ్లలేను.. అని.

ఆఫీస్‌లో, ఇంట్లో అలానే కూర్చుని ఉండేవాడు. ఆకాశంలోని మేఘాల వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయేవాడు. సుజిత్‌కు ఏమైందో భార్యకు అర్థం కావడం లేదు.

ఇక నాలుగో ఉదాహరణ శ్రీనివాస్‌ది. రోజూ ఆఫీస్‌‌కు బస్సు లేదంటే రైల్లో వెళ్లేవాడు. ఉన్నట్టుండి ఆరు నెలలుగా ప్రజా రవాణాను ఉపయోగించడం మానేశాడు. 50 ఏళ్ల వరకూ బస్సుల్లోనే ప్రయాణించిన శ్రీనివాస్ అకస్మాత్తుగా ప్రైవేట్ వాహనం వాడడం మొదలుపెట్టాడు. అది చూసిన శ్రీనివాస్ కుటుంబానికి, స్నేహితులకు ఏమైందో అంతుచిక్కడం లేదు.

ఈ నాలుగు ఏం చెబుతున్నాయి?

మీ మైండ్‌లో వచ్చిన ఈ సులభమైన ప్రశ్నకు జవాబు కూడా సులభమే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఫోబియా ఉంటుందని!

ఫోబియా అనే పదం గ్రీకు పదం ఫోబోస్ నుంచి వచ్చింది.

ఫోబియాలలో ఎక్కువగా కనిపించేది అగొరాఫోబియా. క్లుప్తంగా చెప్పాలంటే చుట్టూ ఉన్నవాటి గురించి ఎక్కువగా ఊహించుకొని, భయపడిపోవడం.

సుధీర్ ఫోబియా అందరి ముందూ మాట్లాడడం, అందరితో కలివిడిగా ఉండడంలో కలిగే భయం. తన చుట్టూ పరిస్థితులను బట్టి అతను భయపడుతుంటాడు.

శ్రీనివాస్ ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు భయపడతాడు.

అలాగే, చాలా మందికి రక్తం చూసినా, ఎక్కువ ఎత్తుకు వెళ్లినా, రహస్య ప్రదేశాలు, మూసేసిన గదులు, థియేటర్లు, ఎలివేటర్లు చూసినా భయం కలుగుతుంది.

కొంత మంది పబ్లిక్ టాయిలెట్లను వాడాలంటే భయపడతారు.

కొందరు పాములను చూసి, కీటకాలు, సాలె పురుగులు, బెలూన్లు, పూలు, కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఇలా భూమి మీద ఉండే దేన్ని చూసినా భయపడుతుంటారు.

అది ఎవరికీ చెప్పుకోలేక భయంకరమైనదిగా మారుతుంది. ఇక ఆ వస్తువు నుంచి, లేదా ఆ ప్రదేశం నుంచి తక్షణమే దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు.

మనం ఎంత తీవ్రమైన భయాన్ని అనుభవిస్తున్నా అది కనిపించదు. అలా భయపడకూడదని తెలిసినా దాని నుంచి బయటపడలేం. దీని వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడి, అది తీవ్రమైన డిప్రెషన్‌కు కారణమవుతుంది. అది జీవనశైలిని దెబ్బతీస్తుంది.

సాధారణంగా అలాంటి వ్యక్తులు వింతగా, చిన్నపిల్లల్లా గజిబిజిగా ప్రవర్తిస్తుంటారు. పిరికితనం కనిపిస్తుంది.

కానీ, ఫోబియా అనేది ఒక మానసిక రుగ్మత. దానికి సమర్థవంతమైన పరిష్కారం కూడా ఉంది. అయితే, దానిని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలపై మన సమాజంలో అవగాహన చాలా తక్కువ.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

గత అనుభవాల ప్రభావం

ఫోబియా అనేది ప్రధానంగా భయానికి సంబంధించినదే అయినప్పటికీ, దాని వెనక ఒక భయంకరమైన అనుభవం ఉంటుంది. లేదంటే చిన్ననాటి జ్ఞాపకం కూడా కావొచ్చు.

శ్రీనివాస్ ఒకసారి రైలులో వెళ్తున్నప్పడు అసిడిటీ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. నిజానికి అది ఒత్తిడి వల్ల కలిగిన ఆందోళన.

మీనాకు అలా జరిగినట్టు ఏమీ గుర్తులేదు.

ముంబయిలో జులై 26న బాగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి భారీగా వర్షాలు కురవడం, వరదలుగా మారడాన్ని సుజిత్ గుర్తుచేసుకుంటున్నాడు.

ఫోబియా జన్యుసంబంధమైనది కానప్పటికీ, కుటుంబంలో ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉండి ఉండొచ్చు.

ఏదైనా సంఘటన, వస్తువులు, అప్పటి పరిస్థితులతో మానసికంగా ముడిపడి ఉండే స్థితినే భయంగా చెప్పొచ్చు. అదొక మానసిక పరిస్థితి. ఎలాంటి కారణం లేకుండానే మీకు భయంగా అనిపించొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఆ సంఘటన ఆనవాళ్లు, వస్తువులు, అలాంటి పరిస్థితి మీ చుట్టూ ఉండి ఉండొచ్చు.

సైకోథెరపీ, హిప్నో థెరపీ, సెల్ఫ్ హిప్నోసిస్ వంటి ప్రక్రియలతో దీని నుంచి బయటపడొచ్చు. ఇంకా అనేక రకాల చికిత్సా మార్గాలున్నాయి. వాటితో పాటు ఫోబియాకు జీవరసాయన సంబంధాలు కూడా ఉన్నట్లు న్యూరోసైన్స్ నూతన పరిశోధనలు నిరూపించాయి.

అలాంటి అత్యాధునిక పరిశోధనల ఆధారంగా ఫోబియాలకు చికిత్స చేయవచ్చు. ఇది ఫోబియా రోగులకు మేలు చేస్తుంది.

మొత్తమ్మీద ఫోబియాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ వాటికి సమర్థవంతమైన చికిత్స విధానాలు, ఔషధాలతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించే చాలా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: