NEET: సరైన ర్యాంక్ రావట్లేదని తండ్రీ, కొడుకుల ఆత్మహత్య - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులో నీట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడం లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల జాబితా కాస్త పెద్దదే ఉంటుంది.
అయితే, తొలిసారిగా ఇక్కడ ఒక విద్యార్థి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే ఆయన కూడా అదే విపరీత నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో జీవించే సెల్వశేఖర్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఆయన సోమవారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తును బంధువులు మిత్రులు వచ్చారు.
కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సెల్వశేఖర్‌ను ఓదార్చేందుకు వీరంతా శనివారమే వచ్చారు. ఇప్పుడు వీరు సెల్వశేఖర్ అంత్యక్రియలను చూసేందుకు మళ్లీవచ్చారు.
భార్య నుంచి విడిపోయిన సెల్వశేఖర్ కొడుకుతో విడిగా జీవించేవారు. ఆయన కొడుకు జగదీశ్వరన్ ఓ సీబీఎస్ఈ స్కూల్లో 12వ తరగతి వరకూ చదువుకున్నాడు. 12వ తరగతిలో అతడికి 500కి 424 మార్కులు వచ్చాయి.

గత రెండేళ్లుగా జగదీశ్వరన్ నీట్ రాస్తూ మెడికల్ కాలేజీలో సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు తెచ్చిపెట్టే స్కోరు అతడికి రావడం లేదు.
దీంతో తండ్రీ కొడుకులు చాలా విచారంతో ఉండేవారు. ఇటీవల మళ్లీ కోచింగ్ తీసుకునేందుకు కొడుకు కోసం సెల్వశేఖర్ పీజు కూడా కట్టారు.
అయితే, ఆ మరుసటి రోజు, అంటే 12వ తేదీన ఇంట్లో ఎవరూలేని సమయం చూసి జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సెల్వశేఖర్ షాక్‌కు గురయ్యారు.
ఆ తర్వాత మీడియాతో ఆదివారం సెల్వశేఖర్ మాట్లాడారు. రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘నీట్ రద్దు చేస్తేనే పరిస్థితులు మారతాయి. ఈ పరీక్షను రద్దు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పుడో చెప్పారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి. నా కొడుకుని నేను ఒక్కడినే పెంచాను. కానీ, అతడు నీట్‌కు బలయ్యాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు’’ అని ఆయన అన్నారు.
కొడుకు అంత్యక్రియల అనంతరం ఆయన్ను ఓదార్చేందుకు ఆయన స్నేహితులు చాలా సమయం అక్కడే ఉన్నారు. మరోవైపు ఆయన చెల్లి కూడా ఇంటికి వచ్చారు.
అయితే, సోమవారం ఎవరూలేని సమయంలో సెల్వశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటరితనం వల్లే ఆయన ఈ విపరీత నిర్ణయం తీసుకొని ఉండొచ్చని ఆయన స్నేహితులు చెప్పారు.

డాక్టర్ కావాలనే కల
జగదీశ్వరన్‌తోపాటు ఆయన స్నేహితులు చాలామంది మెడిసిన్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరంతా 12వ తరగతి తర్వాత ప్రైవేటుగా నీట్ కోచింగ్ తీసుకున్నారు.
అయితే, గత రెండేళ్లుగా జగదీశ్వరన్ నీట్‌లో పాసవుతూనే ఉన్నాడు. కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చేంత స్కోర్ రావడం లేదు.
తండ్రి ఆర్థిక పరిస్థితి గురించి జగదీశ్వరన్‌కు తెలుసు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదివించేంత లేదంటే విదేశాలకు పంపేంత స్థోమత ఆయనకు లేదు.
అందుకే మరో ఏడాది పాటు కోచింగ్ తీసుకునేందుకు జగదీశ్వరన్‌కు మళ్లీ ఫీజు కట్టారు సెల్వ శేఖర్. అయితే, అతడితోపాటు చదువుకున్న కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చేరారు. కానీ, జగదీశ్వరన్‌కు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు.
అతని ఇద్దరు స్నేహితులు మాత్రం మెడిసిన్ కలను వదలిపెట్టి ఇతర కోర్సుల్లో చేరిపోయారు. జగదీశ్వరన్ డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండొచ్చనీ, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు అన్నారు.
ఎలాగైనా డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని జగదీశ్వరన్ లక్ష్యంగా పెట్టుకున్నాడని అతడి స్నేహితుడు సంతోష్ వివరించారు.
‘‘నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేని వారిని జగదీశ్వరన్ ఓదార్చేవాడు. ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవాడు, ఎవరైనా ఫెయిలైతే మళ్లీ ట్రై చేద్దాం అనేవాడు’’ అని సంతోష్ చెప్పాడు.
చదువులో జగదీశ్వరన్ ముందుండేవాడని, అయితే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చేంత స్కోర్ అతడికి వచ్చేదికాదని మరో స్నేహితుడు ఆదిత్య చెప్పాడు.
‘‘వైద్యుడు కావాలనేది జగదీశ్వరన్ లక్ష్యం. అతడు ఇతరుల ప్రభావానికి లోనయ్యేవాడు కాదు. తన ప్రపంచం తనదే అన్నట్లుగా ఉండేవాడు’’ అని అతడికి పాఠాలు చెప్పిన వారామథి వివరించారు.
‘‘జగదీశ్వరన్‌పై ఎవరూ ఒత్తిడి చేసేవారు కాదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియడం లేదు’’ అని వారామథి చెప్పారు.

తమిళనాడులో నీట్ ఆత్మహత్యలు
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మొదట్నుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తూనే ఉంది.
2017 సెప్టెంబరులో రాష్ట్రంలోని అరియాలూర్ జిల్లాకు చెందిన అనిత 12వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ వైద్య కళాశాలలో సీటు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది.
ఆ తర్వాత రాష్ట్రంలో నీట్‌పై వ్యతిరేకత మరింత ఎక్కువైంది.
ఆ మరుసటి ఏడాది విల్లుపురం జిల్లాకు చెందిన ప్రదీప కూడా 12 తరగతిలో మంచి మార్కులు వచ్చినప్పటికీ నీట్‌లో స్కోర్ కేవలం 39 వచ్చింది. దీంతో ప్రదీప కూడా ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ తర్వాత తిరుచ్చికి చెందిన శుభశ్రీ, చెన్నైకు చెందిన ఏంజెలీన్ శ్రుతి, తిరుపూర్‌కు చెందిన రితూ శ్రీ.. ఇలా 16 మంది నీట్ వల్ల రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు.
నీట్ బిల్లు
రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. 2019లోనే అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో ఒక బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు.
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెడికల్ కాలేజీలో 7.5 శాతం రిజర్వేషన్‌ను కల్పించే ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చారు.
ఆ తర్వాత రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ కొత్త నీట్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. కానీ, ఈ బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీకి తిప్పి పంపించారు.
మళ్లీ ఈ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ, దీనిని అనుమతి కోసం రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు.
తాజా ఆత్మహత్యల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఒక లేఖ రాశారు.
(ఆత్మహత్య ఆలోచనలు వస్తే సహాయం కోసం 8978191578, 9849065971 నంబర్లకు కాల్ చేయండి)
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















