‘వశిష్ఠ 360’ వంశీకృష్ణ ఇంటర్వ్యూ: ఒకప్పుడు స్కూల్ డ్రాపవుట్.. ఇప్పుడు లక్షల మందికి ఇంగ్లిష్ పాఠాలు

వశిష్ఠ 360 వంశీకృష్ణ
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘వశిష్ఠ 360’ పేరుతో స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్‌ కథ ఇది.

ఆయన అసలు పేరు దిడ్డి వంశీకృష్ణ. ఆయన వయసు 37 ఏళ్లు.

వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల మందికి ఉచితంగా ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు వంశీకృష్ణ.

ఒకప్పుడు స్కూల్ బస్‌పాస్‌కు డబ్బుల్లేక బడి మానేసిన పరిస్థితి నుంచి నెలకు రూ.లక్షల్లో సంపాదించే స్థాయికి ఎదిగారు వంశీకృష్ణ. అంతేకాదు ఆయన పుస్తక రచయిత, విక్రయదారు కూడా.

తన జీవితంలో కుల వివక్షనూ ఎదుర్కొన్నట్లు చెప్పారు వంశీకృష్ణ.

సైన్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే యూట్యూబర్‌గా మారడం, విజయం సాధించడం గురించి బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డతో వంశీకృష్ణ పంచుకున్న విషయాలు ఇవీ...

బీబీసీ: వశిష్ఠగా ఎలా మారారు?

వశిష్ఠ: సివిల్స్ కోచింగ్ తీసుకోవడానికి దిల్లీ వెళ్లినపుడు, అక్కడ నలుగురైదుగురు వంశీకృష్ణ పేరుతో ఉండేవారు.

అక్కడ ఒక సార్ నన్ను వంశీకృష్ణ అని పిలవకుండా వశిష్ఠ అని పిలిచేవారు.

ఎందుకలా పిలుస్తున్నారని నేను అడిగా. ‘వశిష్ఠ భార్గవుడు అనే వ్యక్తి పెద్ద మహర్షి, శ్రీరాముడికి గురువులాంటివారు. అందుకే ఆ పేరుతో నిన్ను పిలుస్తున్నా’ అని ఆయన చెప్పారు.

వంశీకృష్ణ పాఠాలు

ఫొటో సోర్స్, Facebook/Vashista360

ఫొటో క్యాప్షన్, వశిష్ఠ 360 యూట్యూబ్‌ ఛానెల్‌లో వంశీకృష్ణ పాఠాలు చెబుతారు.

'స్పోకెన్ ఇంగ్లిష్ ట్రైనర్‌' ఆలోచన ఎలా వచ్చింది?

చదువు పూర్తయ్యాక కొన్నిరోజులు ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ఇంటర్ పర్సనల్ స్కిల్స్’‌పై క్లాసులు చెప్పాను. తర్వాత ఐఏఎస్ అవ్వాలనే కలతో దిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుని, నాలుగుసార్లు ప్రయత్నం చేశా. కానీ, సాధించలేకపోయా. అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులను కలిశాను. వారి లక్ష్యాలు చూశాక, నాకు ఏదైనా పెద్ద ప్రయత్నం చేయాలనిపించింది. ముందుగా కోచింగ్ సెంటర్లో ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు చెప్పేవాణ్ని.

తర్వాత ఇంగ్లిష్‌కు ఉన్న డిమాండ్‌తో ఇటు వైపు మారాను.

వీడియో క్యాప్షన్, యూట్యూబర్ వశిష్ట 360: వంశీకృష్ణ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తారు?

ఇంగ్లిష్‌పై పట్టు ఎలా సాధించారు?

చిన్నప్పుడు నాకు ఇంగ్లిష్ వచ్చేది కాదు. ఎవరైనా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే గొప్పగా చూసేవాడిని. పాఠశాలలో ఉన్నప్పుడు ఓ డిబేట్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడలేకపోయా. అందరూ నవ్వారు. చాలా రోజులు బాధపడ్డా, ఏడ్చాను కూడా.

తర్వాత ఎక్కువగా ఇంగ్లిష్ వింటూ, ఇంగ్లిష్ కంటెంట్ చూస్తూ బ్రిటిష్, అమెరికన్ శైలి నేర్చుకున్నా. ఏదైనా వింటే, దాన్ని అదే విధంగా చెప్పడానికి ప్రయత్నించేవాడిని.

గ్రామర్ పరంగా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలిసేది కాదు.

తప్పు లేదా ఒప్పు అన్న దానితో సంబంధం లేకుండా అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకున్నా. దానివల్ల హైదరాబాద్ వచ్చాక స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ సంస్థల్లో మెంటార్‌గా చేరి, ఎక్కువగా సాధన చేస్తూ నేర్చుకున్నాను.

వంశీకృష్ణ

యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి ప్రేరణ?

నాకు ముందు నుంచి గొప్పగా ఎదగాలనే లక్ష్యం ఉండేది.

నేను చదువుకునే రోజుల్లో రేవు ముత్యాలరాజు చిన్న కుగ్రామం నుంచి వచ్చి ఐఏఎస్ అయ్యారని తెలిసింది. ఐఏఎస్ అవుదామని లక్ష్యం పెట్టుకుని ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి.

ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

అన్‌అకాడమీ వంటి సంస్థల వ్యవస్థాపకుల విజయాలు తెలిశాక ఎంట్రపెన్యూర్ గా మారాలనే ఆలోచన వచ్చింది. నాకున్న బోధనా నైపుణ్యంతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఎదగొచ్చనుకున్నా.

అలా 2019 మే నెలలో రూపాయి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ప్రారంభించా.

‘వశిష్ఠ 360’ అనే పేరే ఎందుకు?

360 అంటే ఒక సర్కిల్. అన్ని సబ్జెక్టులను అందరికీ అర్థమయ్యేలా 360 డిగ్రీల కోణంలో చెప్పాలన్నది నా లక్ష్యం. స్నేహితుడితో మాట్లాడి అలా పేరు పెట్టా.

చానల్ ప్రారంభంలో కొన్ని ఇతర సబ్జెక్టుల వీడియోలు కూడా చేశాను. వాటికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ వచ్చాయి కానీ, యూ‌ట్యూబ్‌లో రాలేదు.

ఇంగ్లిష్ వీడియోలకు మాత్రం మంచి వ్యూస్ వచ్చాయి.

దీంతో అన్ని సబ్జెక్టులు కాదు, ఇంగ్లిష్ సబ్జెక్టునే 360 డిగ్రీల కోణంలో అన్ని రకాలుగా చెప్పాలనుకున్నా.

ఇంగ్లిష్ ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్. పొద్దున లేచినప్పట్నుంచి రాత్రి వరకు అవసరం ఉంటుంది. గతంలో మూడేళ్లపాటు స్పోకెన్ ఇంగ్లిష్ ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ సబ్జెక్టును ఎంచుకున్నా.

సక్సెస్ అవుతుందా, కాదా అనే సందేహంతోనే మొదలుపెట్టా. ఒకప్పుడు రోజుకు 12-14 గంటలు బాగా కష్టపడి చదివినా ఐఏఎస్ కాలేదు. అదే ఏడాదిలో ఐదు, పది క్లాసులు చెబితే పెద్ద సక్సెస్ వచ్చింది.

యూట్యూబ్ చానల్ పేరులో నంబర్లు ఏంటని చాలా మంది నవ్వారు. కానీ 28 రోజుల్లోనే 1.25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు.

కుటుంబ నేపథ్యం?

మాది వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం నారాయణగిరి అనే గ్రామం.

మాది రైతు కుటుంబమే. వ్యవసాయం లాభసాటిగా లేదని చెప్పి చెప్పుల బండి పెట్టుకున్నారు మా నాన్న. అదే మా కుటుంబానికి జీవనాధారంగా ఉండేది.

నేను ఊళ్లోనే పదో తరగతి వరకు చదివా. హన్మకొండలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశా.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశా. చదువు పూర్తయ్యాక జాబ్ కోసం ప్రయత్నిస్తే, ఏదైనా అనుభవం ఉంటేనే ఇస్తామని చెప్పేవారు.

నేను అమ్మమ్మ ఇంటి దగ్గరే చదువుకున్నా. ఖిల్లా వరంగల్ నుంచి మా స్కూల్ వరకు ఏడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఆర్థిక సమస్యలతో బస్ పాస్ కూడా తీసుకోలేదు.

చదువుకునే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు?

చెప్పుల బండితో ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో నాన్న సైకిల్ షాపు పెట్టారు. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు బస్సు ఛార్జీలకు డబ్బుల్లేక స్కూల్‌‌కు వెళ్లడం మానేశాను. కేవలం చివర్లో వెళ్లి పరీక్షలు రాసేవాడిని. సైకిల్ షాపులో కూర్చుని చిన్నపాటి మెకానిక్ పనులు చేసేవాడిని. పదో తరగతి వరకు అలాగే గడిచిపోయింది.

కుల వివక్ష ను ఎదుర్కొన్నట్లు చెప్పారు.. ఎలా?

అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఒక పెళ్లికి వెళ్లినప్పుడు మేం అందరం ఒకే వరుసలో నిల్చుంటే నలుగురితో కరచాలనం చేసిన ఓ మనిషి.. నాకు, మరో స్నేహితుడికి మాత్రం హ్యాండ్‌షేక్ ఇవ్వలేదు.

అప్పుడు అర్థం కాలేదు కానీ, తర్వాత తెలిసింది. అంతేకాదు ప్రేమ విషయంలోనూ కుల వివక్షను ఎదుర్కొన్నా.

కోదండరాంతో వంశీకృష్ణ

ఫొటో సోర్స్, Facebook/Vashista360

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ కోదండరాంతో వంశీకృష్ణ

పుస్తకాలు చదవడం తగ్గిపోతున్న రోజుల్లో మీరు పుస్తకం రాయడానికి కారణం?

నేను యూట్యూబ్ చానల్ ప్రారంభించినప్పుడు ఎలాంటి సదుపాయాలు లేవు. కేవలం స్మార్ట్ ఫోన్ ఉండేది. దాని ద్వారానే 45 క్లాసుల వరకు చెప్పా. అది పూర్తయ్యేసరికి ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు.

ఆ తరగతులన్నీ బుక్ రూపంలో తీసుకురావాలని కామెంట్లు బాగా వచ్చాయి. అందుకే వాటన్నింటితో నోట్స్ రాసుకుని ‘వశిష్ఠ 360’ బుక్ తీసుకువచ్చాను.

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో అది ఒకటిగా నిలిచింది. పది లక్షల కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి.

ఇంగ్లిష్ బుక్‌తోపాటు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కూడా పుస్తకం రాశాను.

యూట్యూబర్‌గా ఆదాయం ఎలా ఉంది? ఎంత మంది ఉపాధి పొందుతున్నారు?

నేను యూట్యూబ్ చానల్ మొదలుపెట్టినప్పుడు చిన్న గదిలోనే స్మార్ట్ ఫోన్ సాయంతో రికార్డు చేశాను.

ఛానల్‌కు ఆదరణ పెరిగాక ఒక వ్యక్తిని పెట్టుకున్నా. తర్వాత బుక్స్ బిజినెస్‌లోకి వచ్చాక డీటీపీ అవసరాలు, డిస్ట్రిబ్యూషన్.. ఇలా పది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నా. పరోక్షంగా 20 నుంచి 30 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.

యూట్యూబ్ నుంచి నెలకు రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.

నా వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకంతోపాటు ఇతర రచయితలు రాసిన వెయ్యి రకాల పుస్తకాలను మేం ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం. ఈ రూపంలో నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది.

డబ్బు సంపాదనకు యూ‌ట్యూబ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?

కష్టపడితేనే సక్సెస్ సాధిస్తారని అందరూ అంటారు. కేవలం కష్టపడితేనే విజయం వచ్చేస్తుందంటే నేను నమ్మను.

నేను ఎక్కడైనా బయట క్లాస్ చెబితే ఆ సెషన్ వరకే డబ్బులు వస్తాయి. అదే నేను యూట్యూబ్‌లో క్లాస్ చెబితే 50 ఏళ్ల తర్వాత కూడా నాకు డబ్బులు వస్తుంటాయి. నాకు యూట్యూబ్‌లో 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

యూట్యూబ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ చానళ్లు వందల్లో ఉన్నాయి. నేను ప్రాథమిక స్థాయిలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని క్లాసులు చెబుతుంటాను. యూట్యూబ్‌లో విషయం చెప్పేటప్పుడు సుత్తి లేకుండా సూటిగా చెబుతా.

అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయడానికి ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. ప్రతిభగల నిరుద్యోగులు ఎవరైనా క్లాసులు చెబుతానంటే, నా వంతుగా అవకాశాలిస్తాను.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)