పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధానికి నెల రోజులు: ‘ఇది బానిసత్వం నుంచి విముక్తి’ అంటున్న కొందరు ఆస్ట్రేలియా బాలలు

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Supplied

ఫొటో క్యాప్షన్, ఆహిల్

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం అమల్లోకి వచ్చి నెల గడిచింది. ఈ మార్పు 14 ఏళ్ల ఆమీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

‘‘ఇప్పుడు నేను నా ఫోన్‌కు బానిసను కాను. నిజంగా నాకు స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని బీబీసీతో అన్నారు ఆమీ.

ఈ సోషల్ మీడియా అలవాటు ఎంత లోతుగా ఉందో నిషేధం అమలైన రెండో రోజే ఆమెకు అర్థమైంది.

"స్నాప్‌చాట్ తెరవలేనని తెలుసు. అయినా అలవాటుగా ఉదయం ఆ యాప్‌ను తెరవడానికి చెయ్యి వెళ్లింది" అని ఆమె డైరీలో రాసుకున్నారు.

నాలుగో రోజు కల్లా – ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా పది ప్లాట్‌ఫామ్‌లు 16 ఏళ్ల లోపు పిల్లలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. అప్పుడు ఆమె ‘స్నాప్‌చాట్ గురించి నాకెందుకు అంత తపన’ అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"స్ట్రీక్స్ చేయాల్సిన టెన్షన్ లేకపోవడం నాకు ఒక రకమైన విముక్తిలా అనిపించింది" అని ఆమె రాశారు.

స్నాప్‌చాట్ 'స్ట్రీక్స్' అనేది ప్రతిరోజూ ఫోటో లేదా వీడియో పంపకపోతే తెగిపోతుంది. రోజులు, నెలలు, ఏళ్ల పాటు కొనసాగించే ఈ స్ట్రీక్స్ చాలామందికి వ్యసనంలా మారాయి.

ఆమీకి మాత్రం ఆ వ్యసనం మెల్లగా తగ్గిపోయింది.

"ముందు స్కూల్ తర్వాత స్నాప్‌చాట్‌లోనే స్నేహితులతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో రన్నింగ్ అలావాటు చేసుకున్నాను" అని ఆమె డైరీలో రాశారు.

నెల గడిచేసరికి ఆమె రోజువారీ అలవాట్లు మారిపోయాయి.

"ముందు స్నాప్‌చాట్ ఓపెన్ చేయడం నా రొటీన్. అక్కడ నుంచి ఇన్‌స్టాగ్రామ్, తర్వాత టిక్‌టాక్… టైమ్ ఎలా గడిచిందో తెలియదు. ఇప్పుడు ఫోన్‌ను నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తున్నా" అంటున్నారు ఆమీ.

ఆస్ట్రేలియా, ఫోన్, సోషల్ మీడియా, బ్యాన్, వాట్సాప్, స్నాప్ చాట్, యువత, నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

'ఏమీ మారలేదు' -ఆహిల్

ఆమీ అనుభవం ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌కు నచ్చే కథే కావచ్చు. యువతను సోషల్ మీడియా వ్యసనం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిషేధాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

డిసెంబర్ 10 నుంచి వచ్చిన ఈ నిబంధనలను ఉల్లంఘించిన టెక్ కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

కానీ 13 ఏళ్ల ఆహిల్‌కు మాత్రం ఈ నిషేధం పెద్దగా తేడా తేలేదు.

"నిషేధానికి ముందు ఎంత సమయం సోషల్ మీడియాలో గడిపానో, ఇప్పుడూ అంతే" అని ఆయన అంటున్నారు. నకలీ బర్త్ డేట్‌తో యూట్యూబ్, స్నాప్‌చాట్ అకౌంట్లు ఇప్పటికీ వాడుతున్నారు. ఎక్కువ సమయం రోబ్లాక్స్, డిస్కార్డ్‌లోనే గడుస్తోందని ఆయన చెప్పారు.

కానీ ఆయన తల్లి మౌ మాత్రం మార్పు గమనించారు.

"ఇప్పుడు ఆహిల్ కొంచెం మూడీగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాతో ఎక్కువగా మాట్లాడేవాడు" అని ఆమె చెప్పారు.

కన్స్యూమర్ సైకాలజిస్ట్ క్రిస్టినా ఆంథోనీ ప్రకారం, ఇది సహజమైన మార్పే.

"సోషల్ మీడియా టీనేజర్లకు వినోదం మాత్రమే కాదు – ఒత్తిడి, ఒంటరితనం, బోర్ నుంచి బయటపడే సాధనం. అది ఒక్కసారిగా లేకపోతే చిరాకు, అసహనం కనిపించవచ్చు" అని ఆమె చెప్పారు.

ఆస్ట్రేలియా, ఫోన్, సోషల్ మీడియా, బ్యాన్, వాట్సాప్, స్నాప్ చాట్, యువత, నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

స్నాప్‌చాట్ అవుట్… వాట్సాప్ ఇన్...

15 ఏళ్ల లులు మాత్రం మరో దారి ఎంచుకున్నారు.

"టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్లు తెరిచాను. వయసు 16 పైగా చూపించాను" అని లులు అంటున్నారు.

అయితే ఆమె కూడా కొంచెం ఎక్కువగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టారని చెబుతున్నారు.

ఆమీ, ఆహిల్, లులు – ముగ్గురూ ఇప్పుడు ఎక్కువగా వాట్సాప్, మెసెంజర్ వాడుతున్నారు. ఎందుకంటే వాటిపై నిషేధం లేదు.

"సోషల్ మీడియా అసలు ఆకర్షణ స్నేహితులతో కలిసే అనుభూతి. వాళ్లు లేనిచోట ఆ ఆనందం కూడా తగ్గిపోతుంది" అని క్రిస్టినా ఆంథొనీ అంటున్నారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరిలో ఫియార్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్త యాప్‌ల వైపు పరుగులు

నిషేధం ముందు రోజుల్లో లెమన్8, యోప్, కవర్‌స్టార్ వంటి తెలియని యాప్‌లు ఒక్కసారిగా ప్రాచుర్యం పొందాయి.

దీనికి 'ఫోమో' ( ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) కారణమని నిపుణులు చెబుతున్నారు.

"ఒక అలవాటు ఆగితే, మనిషి అదే భావన ఇచ్చే మరో దారిని వెతుకుతాడు" అంటున్నారు ఆంథోని.

ఆమీ కూడా లెమన్8 డౌన్‌లోడ్ చేసింది. కానీ ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు.

"ఇప్పుడు సోషల్ మీడియాపై ఆసక్తే తగ్గిపోయింది" అంటుందామె.

ఆస్ట్రేలియా, ఫోన్, సోషల్ మీడియా, బ్యాన్, వాట్సాప్, స్నాప్ చాట్, యువత, నిషేధం

ఫొటో సోర్స్, Supplied

'కాలమే తేల్చాలి'

బోండై బీచ్‌లో జరిగిన కాల్పుల తర్వాత టిక్‌టాక్‌లో భయంకరమైన వీడియోలు చూడకపోవడం కూడా ఆమీకి ఊరటనిచ్చింది.

"అవి చూసి ఉంటే మానసికంగా చాలా ఇబ్బంది పడ్డేదాన్ని" అని ఆమె డైరీలో రాసుకుంది.

ఆమీ తల్లి యుకో మాత్రం జాగ్రత్తగా స్పందిస్తున్నారు.

"ఇది నిజంగా నిషేధం వల్లేనా, లేక సెలవుల ప్రభావమా అనేది చెప్పలేం. ఇది మంచి మార్పా? చెడు మార్పా? అనేది కాలమే తేల్చాలి" అంటున్నారు.

దేశంలో పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం వారి జీవితాల్లో నిజంగా ఎంత మార్పు తీసుకొస్తుందో తెలుసుకోవడానికి, ఇప్పుడు ఆస్ట్రేలియా మొత్తం ఎదురుచూస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)