అమెరికా జోక్యం చేసుకుంటే దాని సైనిక స్థావరాలపై దాడి చేస్తాం: హెచ్చరించిన ఇరాన్, అప్రమత్తతలో ఇజ్రాయెల్

భారత్, ఇరాన్, డోనల్డ్ ట్రంప్, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న నేపథ్యంలో తమదేశంలో అమెరికా సైనిక జోక్యం గురించి అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలకు స్పందించింది ఇరాన్.

తమపై సైనిక దాడికి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఆదివారం నాడు ఇరాన్ పార్లమెంట్‌లో స్పీకర్ బాఘెర్ ఘాలిబాఫ్ ఈ మేరకు ప్రకటన చేశారు. దీనిని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ముఖ్యంగా బాసిజ్ వాలంటీర్ ఫోర్సెస్ చూపించిన దృఢత్వాన్ని బాఘెర్ ఘాలిబాఫ్ ప్రశంసించారు.

ఈ నిరసనలను ప్రభుత్వ బలగాలు గట్టిగా ఎదుర్కొంటాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న వారిని అరెస్టు చేస్తామని, వారికి శిక్ష తప్పదని ఆయన అన్నారు.

అమెరికా దళాలపైనా, ఇజ్రాయెల్‌పైనా దాడి ఉంటుందంటూ ఇరాన్ పార్లమెంటు నుంచి స్పీకర్ నేరుగా హెచ్చరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ పార్లమెంట్ అధ్యక్షుడు మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్.

''ఇరాన్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాలు, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు మా లక్ష్యాలుగా ఉంటాయి. అమెరికా సైనిక జోక్యానికి బదులు తీర్చుకోవడమే కాకుండా, ఇంకా ఏదైనా నిర్దిష్టమైన ముప్పు ఉందని భావిస్తే మా చర్యలు కొనసాగుతాయి" అని ఘాలిబాఫ్ అన్నారు.

ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా ఇరాన్ గుర్తించదు. ఆ ప్రాంతాన్ని పాలస్తీనా నుంచి ఆక్రమించుకున్న భూభాగంగా పరిగణిస్తుంది ఇరాన్.

ఇరాన్ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి నాలుగు రూపాలలో అంటే ఆర్థిక, మేధో, సైనిక, ఉగ్రవాద రూపాలలో పోరాడుతోందని ఘాలిబాఫ్ చెప్పినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా ప్రభుత్వం తదుపరి చర్యలపై పరిశీలిస్తోందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అన్నారు.

అమెరికా హెచ్చరికలో ఏముంది?

"ఇరానియన్ ప్రజలారా- మీ దీర్ఘకాల పీడకల ఇక ముగియబోతోంది" అంటూ నిరసనలకు మద్దతుగా అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు చేశారు.

"అణచివేతను అంతం చేయడానికి వారు చూపిస్తున్న ధైర్యం, దృఢ సంకల్పాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించారు" అని ఆయన అన్నారు.

అదేపోస్టులో '' మీకు సహాయం అందబోతోంది" అని కూడా రాశారు.

అంతకుముందు ఆయన ‘‘ ప్రజలపై జరిగిన అకృత్యాలకు ప్రస్తుత పాలకులు బాధ్యత వహించించాల్సిందే’’ అని అన్నారు.

మరోవైపు ఇరాన్ నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల కిందట ఆయన ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ‘‘ ఇరాన్ మునుపెన్నడూ లేని విధంగా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. అమెరికా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని రాశారు.

ఇరాన్‌పై దాడి చేయడానికి గల ఆప్షన్లను సైన్యం ఇప్పటికే ట్రంప్‌కు వివరించిందనీ, అయితే ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికా అధికారులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ మేగజీన్లు శనివారం సాయంత్రం పేర్కొన్నాయి.

మరోవైపు ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఊహిస్తున్న ఇజ్రాయెల్, ఇరాన్ చేయబోయే ప్రతిదాడుల గురించి అత్యంత అప్రమత్తంగా ఉందని ఆ దేశ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

శనివారం నాటి ఫోన్ సంభాషణలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలు ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం గురించి చర్చించారని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.

శుక్రవారం ప్రచురితమైన 'ది ఎకనామిస్ట్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు.

‘‘ఇరాన్ లోపల ఏం జరుగుతుందో మనం గమనిస్తూ ఉండాలని నేను భావిస్తున్నా’’ అని నిరసనలను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 15 రోజులుగా ఇరాన్ రాజధాని తెహ్రాన్‌ సహా అనేక నగరాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి.

హింసాత్మక ఘర్షణల వీడియోలు

రెండు వారాలుగా కొనసాగుతున్న దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఇరాన్ నేషనల్ పోలీసు చీఫ్ అహ్మద్ రెజా రదాన్ ఆదివారం ప్రకటించారు.

"శనివారం సాయంత్రం అల్లర్లలో పాల్గొన్న అనేకమంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి శిక్ష విధిస్తారు" అని ప్రభుత్వ మీడియాలో చెప్పారు రదాన్.

అయితే, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు వంటి వివరాలను ఆయన వెల్లడించలేదు.

గత మూడు రోజులుగా భద్రతా దళాల చర్యలలో వందలమంది మరణించారని లేదా గాయపడ్డారని రిపోర్టులు వెలువడినప్పటికీ, ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా నిరసనకారులు శనివారం సాయంత్రం రోడ్లపైకి వచ్చారు.

మరణాల సంఖ్య 116 అని అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల సంస్థ హెచ్‌ఆర్ఏఎన్ఏ పేర్కొంది.

ఇంటర్నెట్ ఆంక్షలు కొనసాగుతున్నందున ప్రభుత్వం అణచివేతను తీవ్రతరం చేసిందని వెల్లడించే డాక్యుమెంటరీ వీడియో ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బీబీసీ పరిశీలించింది.

శనివారం సాయంత్రం తీసిన ఒక వీడియోలో, తెహ్రాన్‌లోని గీషా ప్రాంతంలోని వీధుల్లో నిరసనకారులు ఆందోళన చేస్తున్నట్లు కనిపించింది.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, MAHSA / Middle East Images / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు మొదలయ్యాయి.

ఇరాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మషద్‌లోని వకీలాబాద్ వీధిలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య భీకర ఘర్షణలను చూపించే అనేక వీడియోలను బీబీసీ ఫ్యాక్ట్-చెకింగ్ ధృవీకరించింది.

ఆ ఫుటేజ్‌లో ముఖాలు కప్పుకున్న నిరసనకారులు చెత్తకుండీల వెనుక దాక్కొని, వాటికి నిప్పు పెట్టినట్లు కనిపించింది. దూరంగా భద్రతా బలగాల దళం కూడా కనిపించింది. అలాగే ఒక వాహనం కాలిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. అది బస్సు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ క్లిప్‌లలో, భారీ కాల్పుల శబ్దాలు, అలాగే పాత్రలను ఢీ కొట్టుకున్నట్టుగా వచ్చే శబ్దాలు వినిపించాయి. అలాగే ఆకుపచ్చ లేజర్ లైట్ కనిపించింది.

ఈ వారం నిరసనలకు ప్రధాన కేంద్రాలలో ఒకటైన పశ్చిమ తెహ్రాన్‌లోని పునాక్ స్క్వేర్‌కు పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుకోవడం, కుండలు, పాన్‌లు కొట్టుకునే శబ్దాన్ని రాజధాని తెహ్రాన్ నుంచి బీబీసీ ధృవీకరించిన ఇతర వీడియోల్లో కనిపించింది.

తెహ్రాన్‌కు ఈశాన్యంలో ఉన్న హేరావీ ప్రాంతంలో చిత్రీకరించిన మరో వీడియో క్లిప్‌ను బీబీసీ పర్షియన్, బీబీసీ వెరిఫై ధృవీకరించాయి.

ఇందులో, మతాధికారుల హక్కులను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారుల గుంపు ఒకటి రోడ్డుపై కవాతు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

"విధ్వంసకర ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి" అని శనివారం రాత్రి ప్రభుత్వ మీడియాలో మంత్రి ఎస్కందర్ మోమెని చెప్పారు.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా,రెజా పహ్లావి

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, రెజా పహ్లావి ఇరాన్‌లోని నిరసనకారులను ప్రశంసించారు.

ఇరాన్ నుంచి బహిష్కృతుడైన మాజీ రాజు షా కుమారుడు రెజా పహ్లవి ఆదివారం ఉదయం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

‘‘మీరు ఒంటరివారు కాదని తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ పౌరులంతా గర్వంతో మీ పేరును నినదిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా స్వేచ్ఛాయుత ప్రపంచ నాయకుడిగా అధ్యక్షుడు ట్రంప్ మీ ధైర్యాన్ని దగ్గరనుంచి చూశారు. మీకు సహాయం చేయాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు’’ అని ఆ పోస్ట్‌లో రాశారు.

"మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గుంపులుగా నగరాల ప్రధాన రహదారులపైకి రావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. దారిలో మీ గుంపునుంచి వేరుపడకుండా చూసుకోండి. అలాగే మీ ప్రాణాలకు ప్రమాదం ఉన్న వీధుల్లోకి వెళ్లకండి" అని ఆయన రాశారు.

ప్రజలను వీధుల్లోకి రావాలని పిలుపునిస్తూ, ‘‘నేను దేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నా, త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’’ అని అమెరికాలో నివసిస్తున్న పహ్లవి చెప్పారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ తీవ్రమైన సైనిక లోటును ఎదుర్కొంటోందని, "సాయుధ, భద్రతా బలగాలకు చెందిన అనేకమంది పదవులకు రాజీనామా చేశారని, లేదా అణచివేత ఆదేశాలను పాటించడానికి నిరాకరించారు’’ అని ఆయన చెప్పారు.

అయితే, ఈ వాదనలను బీబీసీ నిర్ధరించలేకపోయింది.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా,తెహ్రాన్‌

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, గత శుక్రవారం తెహ్రాన్‌లో తీసిన ఫోటో ఇది. అక్కడ వీధిలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఇంటర్నెట్ షట్‌డౌన్

ఇరాన్ అంతటా 60 గంటలకు పైగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ ఆదివారం తెలిపింది.

"దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ సమయంలో విధించిన ఈ సెన్సార్‌షిప్ ఇరానీయుల భద్రతకు, సంక్షేమానికి ముప్పు కలిగిస్తోంది" అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్ మూడు సంవత్సరాల కిందట జరిగిన మహిళా స్వేచ్ఛా ఉద్యమ సమయంలో విధించిన బంద్‌తో పోలిస్తే చాలా తీవ్రమైనదని ఒక నిపుణుడు బీబీసీతో అన్నారు.

ఇరాన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ ఇప్పుడు దాదాపు పూర్తిగా నిలిచిపోయిందని ఇంటర్నెట్ పరిశోధకులు అలీ రెజా మనాఫీ అన్నారు.

బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఏకైక మార్గం స్టార్‌లింక్ సేవ అని, అయితే ప్రభుత్వం దీనిపై నిఘా ఉంచినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

బీబీసీతో పాటు ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలలో చాలా వరకు కూడా ఇరాన్ లోపల నుంచి వార్తలను సేకరించి ప్రసారం చేసే పరిస్థితి లేదు. దీని వల్ల సమాచారాన్ని పొందడం, నిజానిజాలను ధృవీకరించడం కష్టంగా మారుతోంది.

ట్రంప్‌, అయతుల్లా అలీ ఖమేనీ, నిరసనలు, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకారులపై అయతుల్లా అలీ ఖమేనీ విమర్శలు చేశారు.

'నిరసనకారులు దేవుని శత్రువులు'

‘‘నిరసన తెలిపే ప్రతి వ్యక్తినీ దేవుని శత్రువుగా పరిగణిస్తాం. ఇది మరణ శిక్షకు కారణమయ్యే నేరం’’ అని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది ఆజాద్ శనివారంనాడు అన్నారు.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా చెలరేగిన నిరసనలను ఇరాన్‌లోని అన్ని ప్రావిన్సులలో 100 కి పైగా నగరాలు, పట్టణాలకు వ్యాపించాయి.

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మతపరమైన పాలనను అంతం చేయాలని నిరసనకారులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న ‘‘సమస్యలు సృష్టించే సమూహం’’గా నిరసనకారులను అయతుల్లా అలీ ఖమేనీ అభివర్ణించారు.

2022లో మహసా అమినీ మరణానంతరం చెలరేగిన తిరుగుబాటు తర్వాత నిరసనలు అత్యంత విస్తృతంగా జరుగుతున్నాయి.

మహ్సా అమీని ఒక యువ కుర్దీ మహిళ. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా ఇరాన్ మోరల్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. వారి కస్టడీలోనే ఆమె చనిపోయారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)