ఎర్రకోట సమీపంలో పేలుడు తరువాత ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్, చైనా, ఇతర ప్రపంచ దేశాలు ఏమన్నాయి?

దిల్లీ పేలుడు, ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (ఫైల్)

దిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్, చైనా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి.

బాధిత కుటుంబాలకు ఇజ్రాయెల్ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు 'ఎక్స్'లో తెలిపారు.

బుధవారం ఆయన ఒక పోస్టులో "ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి, ధైర్యవంతులైన భారత పౌరులకు, బాధిత కుటుంబాలకు నేను, ఇజ్రాయెల్ అంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీతో నిలబడుతుంది. భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఏర్పడిన పురాతన నాగరికతలు. ఉగ్రవాదం మన నగరాలను తాకవచ్చు కానీ, మన ఆత్మలను ఎప్పటికీ కదిలించదు. మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని చీల్చుతుంది" అని తెలిపారు.

దిల్లీలో పేలుడు ఘటనపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది.

"దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడులో బాధితులందరికీ మా సంతాపం తెలియజేస్తున్నాం" అని చైనా ప్రతినిధి లిన్ జియాన్ మీడియా సమావేశంలో అన్నారు.

"తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని లిన్ జియాన్ తెలిపారు.

అమీర్ ఖాన్ ముత్తాఖీ, అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించారు.

పేలుడు ఘటనను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.

ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో "దిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడును అప్గానిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ విదేశీ వ్యవహారాల శాఖ ఖండిస్తోంది. ఈ పేలుడు అనేకమంది పౌరుల ప్రాణాలను బలిగొంది, అనేక మందిని గాయపరిచింది"

"మృతుల కుటుంబాలకు, ప్రభుత్వానికి మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం" అని తెలిపింది.

ప్రమాదంలో భారత పౌరులు మరణించడం, గాయపడటంపై భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

"భారత ప్రభుత్వానికి, ప్రజలకు, మరణించినవారి కుటుంబాలకు ఇరాన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది" అని రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

ఈ పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఇరాన్ ఆకాంక్షించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎర్రకోట, దిల్లీ, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ పేలుడులో మరణించిన వారికి బంగ్లాదేశ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.

"దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో ప్రాణనష్టం, అనేక మంది గాయపడటం పట్ల నేను, బంగ్లాదేశ్ హైకమిషన్‌లోని నా సహచరులు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం" అని భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

"బాధిత కుటుంబాలకు మా సానుభూతి తెలియచేస్తున్నాం, వారికోసం ప్రార్థిస్తాం. ఈ కష్ట సమయంలో భారత్‌కు తోడుగా నిలుస్తుంది బంగ్లాదేశ్" అని ఆయన రాశారు.

ఈ సంఘటనపై భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ విచారం వ్యక్తం చేశారు.

"దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన సంఘటన వల్ల ప్రభావితమైన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి" అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

"ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని ఆయన పోస్ట్‌లో రాశారు.

భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ కూడా బాధితులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

"ఎర్రకోట పేలుడులో ఆత్మీయులను కోల్పోయిన వారికి ఫ్రెంచ్ ప్రజలు, ప్రభుత్వం తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు .

సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడులో 8 మంది మరణించారు.

తుర్కియే, దిల్లీ పేలుడు

ఫొటో సోర్స్, Arif Hudaverdi Yaman/Anadolu via Getty

ఫొటో క్యాప్షన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్దొవాన్ (ఫైల్ ఫోటో).

పేలుడు ఘటనపై తుర్కియే సంతాపం ప్రకటిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది.

"నవంబర్ 10న దిల్లీలో జరిగిన పేలుడులో పలువురు మరణించడం బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన భారతీయ కుటుంబాలకు, ప్రజలకు మా సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని ఆ ప్రకటన పేర్కొంది.

"అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఈ ప్రపంచ ముప్పుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సహకరించడానికి తుర్కియే మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తుంది" అని తుర్కియే పేర్కొంది.

కారు పేలుడు, అమెరికా రాయబార కార్యాలయం, భద్రతా హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరిక

నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరిక జారీ చేసింది.

"నవంబర్ 10, 2025న దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారు పేలింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని స్థానిక మీడియా నివేదించింది. పేలుడుకు కారణం ఇంకా తెలియనప్పటికీ, భారత ప్రభుత్వం అనేక రాష్ట్రాలను హై అలర్ట్‌లో ఉంచింది" అని యూఎస్ ఎంబసీ పేర్కొంది.

దిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దని, జనసమూహానికి దూరంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం భారత్‌లో ఉన్న తమ దేశ ప్రజలకు సూచించింది.

అలాగే స్థానిక మీడియాలో అప్‌డేట్స్ చూస్తూ ఉండాలని, దాంతోపాటు మీరు నివసించే ప్రాంతంలో పరిస్ఖితిని గమనిస్తూ ఉండాలని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)