బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: రెండేళ్ల యుద్ధం, విధ్వంసం తర్వాత గాజా నగరం ఎలా ఉందంటే..

- రచయిత, లూసీ విలియమ్సన్
- హోదా, మిడిల్ ఈస్ట్ కరెస్పాండెంట్, గాజా
ఎదురుగా ఉన్న ఈ కొండపై నుంచి గాజా నగరాన్ని చూస్తే, ఈ యుద్ధం ఎంత విధ్వంసం సృష్టించిందో స్పష్టంగా కనిపిస్తుంది.
మనం మ్యాప్స్‌లో చూసిన, మన జ్ఞాపకాల్లో ఉన్న గాజా ఇక లేదు. బైట్ హనూన్ నుంచి గాజా సిటీ వరకు 180 డిగ్రీలలో ఎటు చూసినా బూడిదరంగులో ఉన్న శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
గాజా నగరంలో కొన్ని భవనాలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ ధ్వంసమైపోయాయి. ఇక్కడ దారి కనుక్కోవడం లేదా ఒకప్పుడు లక్షల మంది నివాసం ఉన్న ప్రాంతాలను గుర్తించడం కూడా కష్టమే.
యుద్ధ ప్రారంభ వారాల్లో ఇజ్రాయెలీ సైనికులు ప్రవేశించిన తొలి ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.
గాజా నుంచి స్వతంత్రంగా వార్తలు ప్రసారం చేసుకోవడానికి ఇజ్రాయెల్ అనుమతించదు. కానీ, ఇప్పుడు బీబీసీతోపాటు మరికొంతమంది జర్నలిస్టుల బృందాన్ని ఇజ్రాయెల్ దళాలు ఆమ ఆక్రమణలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాయి.

అనేక ఆంక్షల మధ్య ఇది జరిగింది. పాలస్తీనియన్లను కలవడానికి, గాజాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతించలేదు.
ఇజ్రాయెల్‌లోని సైనిక సెన్సార్‌షిప్ చట్టాల ప్రకారం, ప్రచురణకు ముందే.. మేం ఏం ప్రచురించబోతున్నామనే సమాచారాన్ని తనిఖీ చేశారు. ఈ రిపోర్ట్‌పై బీబీసీ ఎడిటోరియల్ పరంగా పూర్తి నియంత్రణ కొనసాగించింది.
మేం సందర్శించిన ప్రాంతంలో భారీ స్థాయిలో జరిగిన విధ్వంసం గురించి అడిగినప్పుడు, "అది తమ లక్ష్యం కాదు" అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నడావ్ షోషానీ చెప్పారు.
"మా లక్ష్యం టెర్రరిస్టులను ఎదుర్కోవడం. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ టన్నెల్ షాఫ్ట్, లేదా ఆర్పీజీ (రాకెట్ ప్రొపెల్ల్‌డ్ గ్రెనేడ్) లేదా స్నైపర్ స్టేషన్ ఉండేది" అని ఆయన అన్నారు.
"మీరు వేగంగా కారు నడిపితే, ఒక నిమిషంలోపే ఇజ్రాయెల్‌లో పెద్దవారు, లేదా పిల్లలు ఉండే లివింగ్ రూంలోకి నేరుగా వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 7న అదే జరిగింది."
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో 1,100 మందికి పైగా మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
అప్పటి నుంచి, 68,000 మందికి పైగా గాజా వాసులు చనిపోయినట్లు అక్కడి హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ప్రాంతంలో కొంతమంది బందీల మృతదేహాలు లభించినట్లు లెఫ్టినెంట్ కల్నల్ షోషానీ తెలిపారు. వారిలో ఈ వారం హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించిన ఇటాయ్ చెన్ మృతదేహం కూడా ఉంది. మరో ఏడుగురు బందీల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.
మేం వెళ్లిన ఇజ్రాయెల్ సైనిక స్థావరం ఎల్లో లైన్ (పసుపు రేఖ)కు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది. ఇది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన తాత్కాలిక సరిహద్దు. ఇది ఇజ్రాయెల్ దళాలు, హమాస్ నియంత్రణలో ఉన్న గాజా ప్రాంతాలను వేరుచేస్తుంది.
హమాస్ సాయుధులు, గాజా పౌరులు ఇటువైపు రాకుండా ఇజ్రాయెల్ సైన్యం కొన్ని బ్లాక్‌లను గుర్తించి, వాటినే ఎల్లో లైన్ హద్దులుగా పేర్కొంటోంది.
ఇక్కడ లైన్ సూచిస్తూ స్పష్టమైన సరిహద్దులు ఏవీ లేవు. సైనికుడొకరు శిథిలాల మధ్య ఉన్న చిన్న చిన్న కుప్పలను చూపిస్తూ ఎల్లో లైన్‌గా సూచించారు.

ఫొటో సోర్స్, EPA
కాల్పుల విరమణ జరిగి దాదాపు నెల రోజులైంది, కానీ నేటికీ ఎల్లో లైన్ వెంబడి హమాస్ సాయుధులతో దాదాపు ప్రతిరోజూ పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ దళాలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ వందల సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని హమాస్ ఆరోపించింది. ఫలితంగా 240 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
అమెరికా నేతృత్వంలోని శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ దళాలు కట్టుబడి ఉన్నాయని, అయితే హమాస్ వల్ల ఇజ్రాయెల్ పౌరులకు ముప్పు కలగకుండా చూసుకుంటాయని, అవసరమైనంత కాలం అక్కడే ఉంటాయని కల్నల్ షోషానీ అన్నారు.
"హమాస్ ఆయుధాలతో గాజామీద నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తోందని అందరికీ స్పష్టంగా తెలుసు, దీనికి త్వరలోనే పరిష్కరం దొరుకుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Moose Campbell/ BBC
అమెరికా నేతృత్వంలో రూపొందించిన ప్రణాళిక తదుపరి దశలో, హమాస్ తన ఆయుధాలను వదిలి, అధ్యక్షుడు ట్రంప్‌తో సహా అంతర్జాతీయ ప్రముఖుల పర్యవేక్షణలో పాలస్తీనా కమిటీకి అధికారాన్ని అప్పగించాలి.
కానీ హమాస్ తన అధికారాన్ని, ఆయుధాలను వదలకుండా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్నల్ షోషానీ అన్నారు.
"హమాస్ ఆయుధాలు సమకూర్చుకోవడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, గాజాపై నియంత్రణకు ప్రయత్నిస్తోంది. పట్టపగలే ప్రజలను చంపుతోంది, పౌరులను భయభ్రాంతులకు గురిచేసి గాజాలో ఆధిపత్యం ఎవరిదో చూపించడానికి ప్రయత్నిస్తోంది. హమాస్ తన ఆయుధాలను వదిలిపెట్టడానికి ఈ ఒప్పందం తగినంత ఒత్తిడి తెస్తుందని మేం ఆశిస్తున్నాం" అన్నారు.
శిథిలాల కింద సైనికులకు దొరికిన సొరంగాల మ్యాప్‌ను ఇజ్రాయెల్ దళాలు మాకు చూపించాయి.
"ఇది సాలెగూడులాంటి విస్తారమైన సొరంగాల నెట్‌వర్క్" అని వారు చెప్పారు. కొన్ని ఇప్పటికే ధ్వంసమయ్యాయి, కొన్ని ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరికొన్నింటి కోసం వారు ఇంకా వెతుకుతున్నారు.
ఈ శాంతి ఒప్పందం తదుపరి దశలో ఏం జరుగుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గాజాను విదేశీ పెట్టుబడులతో ఆధునిక నగరంగా మార్చాలనుకుంటున్నారు. కానీ, గాజా ఇప్పడున్న పరిస్థితుల నుంచి ఆధునిక నగరంగా మారడానికి చాలా సమయం పట్టొచ్చు.
ఇజ్రాయెల్ కారణంగా ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ట్రంప్ పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఎవరు ఆపగలరు అన్నది మాత్రమే కాదు, గాజా ప్రజలకు తమ ఇళ్లపై, భూములపై భవిష్యత్తులో ఎంత హక్కు ఉంటుందన్నదీ ప్రశ్నార్థకమే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














