ఒకప్పుడు ఒంటెలు కాసుకుని జీవించేవాడు, ఇప్పుడు సగం దేశాన్ని శాసిస్తున్నాడు...

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
- రచయిత, అలెక్స్ డి వాల్
- హోదా, ఆఫ్రికా విశ్లేషకుడు
‘హెమెద్తీ’గా గుర్తింపు పొందిన మొహమద్ హమ్దాన్ దగోలో అనే వ్యక్తి సూడాన్‌లో రాజకీయ ప్రముఖుడు. తన పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌తో ఆయనిప్పుడు దేశంలో సగభాగాన్ని నియంత్రిస్తున్నారు.
సూడాన్ సైన్యానికి పట్టున్న అల్ ఫాషర్‌లోకి అడుగు పెట్టడం ద్వారా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
ప్రత్యర్థులకు ఆయనంటే భయం, అసహ్యం కూడా. కానీ, అనుచరులకు మాత్రం ఆయనొక దేవుడు. ప్రజల మద్దతు కోల్పోయిన సూడాన్ ప్రభుత్వాన్ని దించి వేస్తాననే హామీతోపాటు క్రూరమైన, దృఢమైన ఆయన వైఖరి వాళ్లకు ఇష్టం.
హెమెద్తీ మంచి కుటుంబంలో పుట్టారు. ఒంటెలు కాసుకుని జీవించే మహరియా కమ్యూనిటీకి చెందిన కుటుంబంలో పుట్టారాయన. అరబిక్ మాట్లాడే ఈ కమ్యూనిటీ డార్ఫర్, చాడ్ అంతటా విస్తరించింది.
హెమెద్తీ 1974, 75 ప్రాంతంలో జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది మాదిరిగానే ఆయన పుట్టిన తేదీ, ప్రాంతంలాంటివేవీ నమోదు చేయలేదు.

యుద్ధం నుంచి తప్పించుకోవడంతో పాటు మెరుగైన జీవితం కోసం మహరియా తెగ మొత్తం ఆయన మామ జుమా దగోలో నాయకత్వంలో 1970, 80ల్లో డార్ఫర్ వెళ్లింది.
కుర్రాడిగా ఉండగానే స్కూల్ మానేసిన హెమెద్తీ, లిబియా, ఈజిప్టులో ఒంటెలను అమ్మే వ్యాపారం చేయడం ద్వారా బాగా డబ్బులు సంపాదించారు.
ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో డార్ఫర్ అంతర్యుద్ధానికి, అరాచకత్వానికి, పేదరికానికి కేంద్రంగా ఉండేది.
హెమెద్తీ మామ జుమా దగోలో నాయకత్వంలోని దళాలతో పాటు జంజావీడ్ అని పిలిచే అరబ్ తిరుగుబాటుదారులు ఫర్ వర్గానికి చెందినవారి గ్రామాలపై దాడి చేస్తూ ఉండేవారు.
2003లో ఫర్ వర్గానికి చెందిన ఫైటర్లు మసాలిత్, ఝగ్‌హవా, ఇతర గ్రూపులతో కలవడంతో ఇది పూర్తి స్థాయి తిరుగుబాటుగా మారింది.
దేశంలోని సంపన్నులైన అరబ్బులు తమను నిర్లక్ష్యం చేశారని ఫర్ వర్గంతో పాటు వారితో కలిసిన ఇతర గ్రూపులు ఆరోపించేవి.
దేశంలో తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో భాగంగా జంజావీడ్ దళాలను మరింత విస్తరించారు బషీర్. దీంతో ఈ గ్రూప్ రెచ్చి పోయింది. ఇళ్లను తగలబెట్టడం, దోపిడీ, అత్యాచారాలు, హత్యలకు పాల్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ సైన్యంలో భాగంగా మారిన ఆర్ఎస్ఎఫ్
జంజావీడ్‌లో హెమెద్తీ గ్రూపు భాగంగా ఉండేది. ఈ గ్రూపు 2004 నవంబర్‌లో అద్వా అనే గ్రామంపై దాడి చేసి ఊరిని నాశనం చేయడంతో పాటు126 మందిని చంపిందని, అందులో 36 మంది పిల్లలు ఉన్నారని ఆఫ్రికా యూనియన్ పీస్ కీపర్స్ నివేదిక వెల్లడించింది.
ఈ మారణహోమానికి జంజావీడ్ కారణమని అమెరికన్ దర్యాప్తు సంస్థ నిర్ణయించింది.
డార్ఫర్ అంతర్యుద్ధం గురించి అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బషీర్ సహా నలుగురిపై అభియోగాలు మోపారు. అయితే జాతి హననం గురించి తమపై వచ్చిన ఆరోపణల్ని ఈ నలుగురు తిరస్కరించారు.
ఆ సమయంలో నేర విచారణ ఎదుర్కోవడానికి చాలా చిన్న వయసున్న అనేకమంది జంజావీడ్ కమాండర్లలో హెమెద్తీ ఒకరు.
ఈ కేసులో జంజావీడ్ "కల్నల్ ఆఫ్ కల్నల్స్" గా గుర్తింపు పొందిన అలీ అబ్దెల్‌ను మాత్రమే కోర్టుకు తీసుకువచ్చారు.
యుద్ధ నేరాలు, హ్యుమానిటీపై నేరాలకు గాను 27 అభియోగాల కింద కోర్టు అలీ అబ్దెల్‌ను దోషిగా తేల్చింది. ఆయనకు ఈ నెల 19న శిక్ష విధించనున్నారు.
2004లో హింస తీవ్రంగా ఉన్నప్పుడు హెమెద్తీ తన పావులను వేగంగా కదిపారు. శక్తివంతమైన పారా మిలటరీ బలగానికి, కార్పోరేట్ సామ్రాజ్యానికి, రాజకీయ యంత్రాంగానికి అధిపతిగా ఎదిగారు.
ఇది అవకాశవాదం, పెట్టుబడులకు సంబంధించిన కథ. తన సైనికులకు జీతాలు చెల్లించాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, సోదరుడికి రాజకీయ పదవి ఇవ్వాలని కోరుతూ తిరుగుబాటు చేశారు.
హెమెద్తీ డిమాండ్లలో చాలా వరకు బషీర్ ఆమోదించారు. దీంతో హెమెద్తీ ప్రభుత్వంతో జతకట్టారు.
తర్వాత ఇతర జంజావీడ్ గ్రూపులు తిరుగుబాటు చేసినప్పుడు, హెమెద్తీ ప్రభుత్వ బలగాలకు నాయకత్వం వహించి వారిని అణచివేశారు.
ఇదంతా జరుగుతున్నప్పుడే ఆయన డార్ఫర్‌లో అతి పెద్దదైన బంగారు గనిని నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ బంగారు గని జెబెల్ అమిర్ ప్రాంతంలో ఉంది.
దీని తర్వాత హెమెద్తీ కుటుంబానికి చెందిన అల్ గునైద్ కంపెనీ సూడాన్‌లోనే అతి పెద్ద బంగారం ఎగుమతిదారుగా వేగంగా ఎదిగింది.
అధ్యక్షుడు బషీర్‌కు నేరుగా రిపోర్ట్ చేసే ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్‌కు నాయకత్వం వహించాలని హెమెద్తీని బషీర్ కోరడంతో 2013లో ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నారు.
జంజావీడ్ ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్‌లో కలిసిపోయింది. వాళ్లకు కొత్త యూనిఫామ్స్, వాహనాలు, ఆయుధాలు ఇచ్చారు. శిక్షణ ఇచ్చేందుకు ఆర్మీ నుంచి అధికారులను నియమించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
వ్యాపార విస్తరణ
డార్ఫర్ తిరుగుబాటుదారులపై ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్ గణనీయమైన విజయాలు సాధించింది. దక్షిణ సూడాన్‌కు ఆనుకుని ఉన్న నుబా పర్వతాలలో తిరుగుబాటును ఎదుర్కోవడంలో ఆర్ఎస్ఎఫ్ అంతగా రాణించలేదు. లిబియా సరిహద్దును కాపాడే బాధ్యతలను తీసుకుంది.
ఆఫ్రికా నుంచి ఎడారి మీదుగా మధ్యధరా ప్రాంతానికి అక్రమ వలసలను ఆపాల్సి ఉన్నప్పటికీ, హెమెద్తీ కమాండర్లు దోపిడీ, మానవ అక్రమ రవాణాలో ఆరితేరారు.
2015లో యెమెన్‌లోని హౌతీలపై పోరాడేందుకు సూడాన్ సైన్యాన్ని పంపాలని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరాయి.
డార్ఫర్‌లో తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడిన సైనిక జనరల్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్ ఈ దళాలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం సూడాన్‌లో ఆర్ఎస్ఎఫ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సైన్యానికి ఆయనే అధిపతిగా ఉన్నారు.
హౌతీలపై పోరాడేందుకు ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్‌కు అవకాశం ఇవ్వాలని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో హెమెద్తీ ప్రైవేటుగా ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేసారు.
అబుదాబీతో సంబంధాల కోసం హెమెద్తీ చేసిన ప్రయత్నం తర్వాతి పరిణామాలకు బాటలు వేసింది. ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమెద్ బిన్ జాయెద్‌తో సన్నిహిత బంధం ఏర్పడింది.
ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్‌లో చేరేందుకు సూడాన్ యువతతో పాటు పొరుగున ఉన్న దేశాల నుంచి కూడా అనేకమంది వచ్చారు. ఒక్కొక్కరికి 6వేల డాలర్ల నగదు చెల్లింపులతో ఆర్ఎస్ ఎఫ్ సెంటర్లలో నియామకాలు జోరుగా సాగాయి.
హెమెద్తీ రష్యాలోని వాగ్నర్ గ్రూప్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. వాగ్నర్ గ్రూప్‌కు ఆర్ఎస్ఎఫ్ సాయానికి ప్రతిగా తమ దళాలకు శిక్షణ, వాణిజ్యం, బంగారం కొనుగోళ్లకు డీల్ కుదిరింది.
ఒప్పందాన్ని అధికారికంగా మార్చేందుకు హెమెద్తీ మాస్కో వెళ్లారు. యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెట్టిన రోజున ఆయన మాస్కోలోనే ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత వాగ్నర్ గ్రూప్‌కు ఆర్ఎస్‌ఎఫ్ నుంచి సాయం అందుతోందన్న ఆరోపణలను హెమెద్తీ తిరస్కరించారు.
ఆర్ఎస్ఎఫ్ ప్రధాన పోరాట బలగాలు నైపుణ్యం సాధించినప్పటికీ, ఇందులో అరబిక్ తెగల తరహాలో దళాలు కూడా ఉన్నాయి.
తన పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆందోళనలు పెరగడంతో ఆర్ఎస్ఎఫ్ బలగాలను రాజధాని ఖార్తూమ్‌కు పంపించాలని బషీర్ ఆదేశించారు.
హెమెద్తీని "నా రక్షకుడు" అని అధ్యక్షుడు బషీర్ చెప్పారు. సైన్యంలో కుట్రదారులు, జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారికి ఆర్ఎస్ఎఫ్ ద్వారా చెక్ పెట్టవచ్చని అనుకున్నారు.
అయితే ఆయన లెక్క తప్పింది. 2019 ఏప్రిల్‌లో కొంతమంది ఆందోళనకారులు ప్రజాస్యామ్యాన్ని అమలు చేయాలని కోరుతూ సైనిక ప్రధాన కార్యాలయాన్ని చుట్టు ముట్టారు.
వారిపై కాల్పులు జరపాలని బషీర్ ఆదేశించారు. అయితే ఆందోళనకారులతో సమావేశమైన మెహెద్తీ సహా కొంతమంది సైనికాధికారులు, బషీర్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కోరారు. దీంతో ప్రజాస్వామ్యవాదులు వేడుక చేసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఆర్ఎస్ఎఫ్ అరాచకాలు
ఆ తర్వాత కొంతకాలం పాటు సూడాన్ భవిష్యత్‌కు హెమెద్తీ చుక్కానిగా కనిపించారు. యువకుడు కావడం, ప్రజల్లో గుర్తింపు, వివిధ వర్గాలతో తరచుగా సమావేశాలు, బషీర్‌ను అధికారంలో నుంచి తప్పించగల శక్తిగా ప్రజల్లో తన గురించి ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయాల్ని మార్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అది కొద్ది వారాల పాటు మాత్రమే సాగింది.
ప్రజాస్వామ్యం కోసం ఆందోళన చేస్తున్న వారికి అధికారం అప్పగించేందుకు హెమెద్తీతో పాటు సైనిక మండలి అధ్యక్షుడు బుర్హాన్ నిరాకరించడంతో ఆందోళనకారులు తమ ప్రదర్శనలను తీవ్రం చేశారు.
ఈ సమయంలో ఆర్ఎస్ఎఫ్‌ను ఉపయోగించారు హెమెద్తీ. ఆర్ఎస్ఎఫ్ బలగాలు వందల మందిని హత్య చేశాయి. మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డాయి. కొంతమంది కాళ్లకు ఇటుకలు కట్టి నైలు నదిలో తోసేశాయని హ్యూమన్ రైట్స్ వాచ్ గ్రూప్ నివేదిక తెలిపింది.
ఆర్ఎస్ఎఫ్ అరాచకాలకు పాల్పడిందన్న వాదనను హెమెద్తీ తిరస్కరించారు.
సూడాన్‌లో శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పడం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించేందుకు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ ఒత్తిడితో దేశంలోని సైనిక జనరళ్లు, పౌరులు, ఆఫ్రికన్ మధ్యవర్తులు రూపొందించిన రాజీకి అంగీకరించారు హెమెద్తీ.
రెండేళ్ల పాటు సైన్యం నియంత్రణలోని సార్వభౌమ మండలితో ప్రజల మద్దతుతో ఏర్పడిన మంత్రివర్గం ఇష్టంలేని సహజీవనం చేసింది.
సైన్యం, భద్రత బలగాలు, ఆర్ఎస్ఎఫ్ దళాలు అరాచకాలు, హెమెద్తీ కార్పోరేట్ సామ్రాజ్యం వేగంగా విస్తరించడంపై మంత్రి వర్గం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రూపొందించింది.
దీంతో బుర్హాన్, హెమెద్తీ కలిసి పౌరమంత్రి వర్గాన్ని తొలగించి పూర్తిస్థాయి అధికారాన్ని దక్కించుకున్నారు.
అయితే ఆర్ఎస్ఎఫ్ సైన్యం ఆదేశాల ప్రకారం పని చేయాలని డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి.
బుర్హాన్ వైఖరిని హెమెద్తీ వ్యతిరేకించారు. వీరిద్దరు తమ మధ్య వివాదాన్ని 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అయితే అంతకు ముందే ఆర్ఎస్ఎఫ్ బలగాలు రాజధాని ఖార్తూమ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టి కీలక స్థావరాలతో పాటు ఖార్తూమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఈ తిరుగుబాటు విఫలమైంది. ఆర్ఎస్ఎఫ్ బలగాలపై సైన్యం దాడులకు దిగడంతో ఖార్తూమ్ యుద్ధ భూమిగా మారింది.
డార్ఫర్‌లోనూ హింస చెలరేగింది. దాదాపు 15 వేల మందికి పైగా సాధారణ పౌరులు మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అమెరికా దీన్ని జాతి హననంగా అభివర్ణించింది. ఈ ఆరోపణలను ఆర్ఎస్ఎఫ్ ఖండించింది.
ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్న, చంపేస్తున్న దృశ్యాలున్న వీడియోలను విస్తృతంగా సర్క్యులేట్ చేశారు. అరాచకాలను ప్రచారం చేసుకున్నారు.
తాము చట్టానికి అతీతులమని, తమకు ఎలాంటి శిక్ష పడదనే భావన కల్పించారు.
ఆర్ఎస్‌ఎఫ్‌తో పాటు వారి అనుబంధ మిలీషియాలు సూడాన్ అంతటా విధ్వంసం సృష్టించాయి. నగరాలు, మార్కెట్లు, యూనివర్సిటీలు, ఆసుపత్రులను దోచుకున్నాయి.
దోచుకున్న వస్తువుల్ని 'దగోలో మార్కెట్ల'లో అమ్మకానికి పెట్టారు. ఇవి సూడాన్ దాటి చాడ్‌తో పాటు ఇతర పొరుగు దేశాలకు చేరుకున్నాయి. తమ ఫైటర్లు ప్రజల వస్తువుల్ని దోచుకున్నారనే వాదనను ఆర్ఎస్ఎఫ్ తిరస్కరించింది.
హెమెద్తీ నేషనల్ ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఆ భవనంపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన హెమెద్తీ కొంతకాలం ప్రజా జీవితంలో కనిపించలేదు.
కొన్ని నెలల తర్వాత తిరిగి కనిపించినప్పటికీ తాను చేసిన అరాచకాల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం ప్రకటించలేదు. యుద్ధభూమిలో గెలవాలనే తపన ఆయనలో కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
హెమెద్తీ భవిష్యత్ ఆలోచన ఏంటి?
ఆర్ఎస్ఎఫ్‌కు అత్యాధునిక డ్రోన్లతో పాటు, ఆయుధాలు అందాయి. వీటితో ఆర్ఎస్ఎఫ్ బలగాలు బుర్హాన్ రాజధాని పోర్ట్ సూడాన్ మీద దాడి చేశాయి. అల్ ఫాషర్ మీద దాడుల్లోనూ ఈ ఆయుధాలు డ్రోన్లు కీలకంగా మారాయి.
చాడ్‌లో నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ ద్వారా ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్‌కు ఈ ఆయుధాలు అందాయని న్యూయార్క్ టైమ్స్ పరిశోధనాత్మక కథనంలో తెలిపింది.
ఆర్ఎస్‌ఎఫ్‌కు ఆయుధాలు ఇస్తున్నారన్న వార్తల్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది.
ఈ ఆయుధాలతో ఆర్ఎస్ఎఫ్ తన ప్రత్యర్థి సూడాన్ సైన్యం మీద వ్యూహాత్మకంగా పై చేయి సాధించింది.
ప్రజాసంఘాలు, సాయుధ ఉద్యమకారులతో కలిసి రాజకీయ సంకీర్ణం ఏర్పాటు చేయాలని హెమెద్తీ ప్రయత్నిస్తున్నారు.
గవర్నమెంట్ ఆఫ్ పీస్ అండ్ యూనిటీ పేరుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసి, దానికి తానే చైర్మన్ అని ప్రకటించుకున్నారు.
అల్ ఫాషర్‌ను దక్కించుకున్న తర్వాత పశ్చిమ నైలునది ప్రాంతాన్ని ఆర్ఎస్‌ఎఫ్ నియంత్రిస్తోంది.
అల్ ఫాషర్‌ను ఆక్రమించుకునే సమయంలో తన సైనికులు సామూహిక ఊచకోతకు పాల్పడ్డారనే ఆరోపణలను ఖండించిన హెమెద్తీ ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.
హెమెద్తీ ఆర్ఎస్ఎఫ్ ఆక్రమించుకున్న ప్రాంతానికి అధ్యక్షుడిగా ఉంటారా లేక మొత్తం సూడాన్‌ను పాలించాలని ఆయనకు కోరిక ఉందా అనే దానిపై సూడాన్ ప్రజల్లో చర్చ జరుగుతోంది.
హెమెద్తీ భవిష్యత్‌లో.. రాజకీయంగా కీలు బొమ్మగా మారడం లేదా వ్యాపారాలను నియంత్రించే కూటమికి నాయకత్వం లేదా తన సైన్యాన్ని కిరాయికి ఇస్తూ విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడం లేదా రాజకీయ పార్టీని స్థాపించడం.. ఇలా ఏదైనా జరగవచ్చు.
ఈ మార్గాల ద్వారా ఆయన సూడాన్ ప్రజల ప్రతినిధిగా ఆమోదం పొందలేకపోతే, మరికొన్ని మార్గాలను వెదికే అవకాశం ఉంది.
అల్ ఫాషర్‌లో హెమెద్తీ దళాలు ప్రజలను ఊచకోత కోస్తున్నాయి. దీని గురించి పెద్దగా పట్టించుకోని ప్రపంచంలో తనకు శిక్ష పడే అవకాశం లేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
( ఈ వ్యాసకర్త అలెక్స్ డి వాల్ అమెరికాలోని టఫ్ట్ యూనివర్సిటీలోని ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీకి చెందిన వరల్డ్ పీస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














