'ప్రోటీన్'పై వ్యామోహం మితిమీరుతోందా, దీనివల్ల కలిగే నష్టాలేంటి?

ప్రోటీన్ పౌడర్లు, ఆహారంలో ప్రధాన భాగంగా మారాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలామంది ఆహారంలో ప్రోటీన్ పౌడర్లు ప్రధాన భాగంగా మారాయి

'ప్రోటీన్' ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. షేక్స్, బార్స్, పౌడర్లు, టీ, కాఫీ... ఇలా పలు రూపాల్లో అందుబాటులోకి వచ్చింది.

అలా సూపర్ మార్కెట్‌కు వెళ్లి షెల్ప్‌లను చూడండి, మనం ప్రతిరోజూ వినియోగించే ఆహారపదార్థాల్లో కొన్ని 'హై-ప్రోటీన్' అని పేర్కొన్నవీ కనిపిస్తాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఎక్కువ ప్రోటీన్ పొందడానికి చిట్కాలు, ఉపాయాలను షేర్ చేస్తున్నారు.

ప్రోటీన్ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది కండరాలను బలంగా తయారుచేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గడానికీ సహాయపడుతుంది.

కానీ, ప్రోటీన్ పట్ల మనకున్న ఆసక్తి చాలాదూరం వెళ్లిపోయిందా? దీనిపై వ్యామోహంతో మనం మరో ముఖ్యమైన ఫైబర్ (పీచు పదార్థం)ను మరిచిపోయేలా చేస్తోందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తక్కువ కొవ్వు ఉన్న మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు... ఇవన్నీ 'ప్రోటీన్' పుష్కలంగా అందించే వనరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తక్కువ కొవ్వు ఉన్న మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు... ఇవన్నీ 'ప్రోటీన్' పుష్కలంగా అందించే వనరులు

'ప్రోటీన్' అంటే ఏమిటి?

''ప్రోటీన్ ఒక స్థూల పోషకం, శరీరానికి చాలా ముఖ్యమైంది. శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది'' అని సౌత్ వేల్స్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్మా బెకెట్ చెప్పారు.

మనం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తిన్నప్పుడు, మన జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌లు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి అమైనో ఆమ్లాలుగా మార్చుతాయి. శరీరంలో ఈ అమైనో ఆమ్లాలు మళ్లీ కలిసి స్పెషల్ ప్రోటీన్లను ఏర్పరుస్తాయి. ఇవి కండరాలను మరమ్మతు చేయడానికి, కొత్త కణజాలాన్ని నిర్మించడానికి సహాయపడతాయి.

మానవ శరీరంలో ప్రోటీన్లు 20,000 కంటే ఎక్కువగానే ఉంటాయి. అవి వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి. శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను ఏర్పరుస్తాయి. రసాయనిక ప్రతిచర్యలను వేగవంతం చేయడానికి, కండరాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి, మన చర్మం, జుట్టులో కనిపించే కెరాటిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి ఎంజైమ్‌లుగా కూడా పనిచేస్తాయి.

తక్కువ కొవ్వు ఉండే మాంసం, గుడ్లు, బీన్స్, బఠానీలు, పప్పుధాన్యాలు, నట్స్, పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తుల వంటి వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి మనకు ప్రోటీన్ లభిస్తుంది.

ఎంత ‘ప్రోటీన్’ అవసరం...

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సిఫారసు ప్రకారం, రోజుకు యువత తమ శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 0.75 గ్రాములు చొప్పున ప్రోటీన్ తీసుకోవాలి. సగటున ఇది మహిళలకు 45 గ్రాములు, పురుషులకు 55 గ్రాములు అవుతుంది.

అయితే, ప్రోటీన్‌తో పాటు తీసుకోవాల్సిన ఇతర ముఖ్యమైన పోషకాలను విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విస్మరిస్తే ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.

ఫైబర్‌ను ప్రజలు తరచుగా విస్మరిస్తారని నిపుణులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైబర్‌ను ప్రజలు తరచుగా విస్మరిస్తారని నిపుణులు చెబుతున్నారు

ఫైబర్ ఎంత ముఖ్యమైనదంటే...

మన శరీరానికి ఫైబర్ (పీచు పదార్థం) చాలా ముఖ్యమైందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యం, ఆహార సలహాలను సోషల్ మీడియాలో ఇచ్చే బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసులో సర్జన్ డాక్టర్ కరణ్ రాజన్ ఏమంటారంటే, ''విరోచనకారిగా పనిచేయడం ఫైబర్ విధుల్లో ఒకటి. ఇది పేగులను శుభ్రం చేయడానికి పనిచేస్తుంది.''

ఫైబర్ మన పేగులను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్‌ను పేగులలో ఉండే బ్యాక్టీరియా జీర్ణం చేసి, శరీరమంతా ఉండే వేడిని తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బు, గుండెపోటు, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

''ప్రజలు ఇప్పటికీ తగినంత ఫైబర్ తీసుకోవడం లేదు. ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవడమనే అలవాటును పెంచుకోవడానికి సమయం పడుతుంది'' అని డాక్టర్ కరణ్ రాజన్ చెబుతున్నారు.

యూకే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి వ్యక్తి సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.

ప్రోటీన్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రోటీన్'కు ఎందుకంత ప్రాచుర్యం?

ప్రజల్లో ప్రోటీన్ పట్ల ఆసక్తి పెరగడానికి కారణం దాని ఫలితాలు త్వరగా, స్పష్టంగా కనిపించడమేనని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.

''సౌందర్యం కోణంలో చూస్తే, తాము కోరుకున్న రీతిలో కండరాలను నిర్మించడంలో పురుషులకు ప్రోటీన్ ఉపకరిస్తుంది'' అని అమెరికాకు చెందిన మెన్స్ హెల్త్ మ్యాగజీన్ డిప్యూటీ ఎడిటర్ పాల్ కిటా చెప్పారు.

''ఫైబర్ విషయం అలాకాదు. పురుషులు తమ హృదయాన్ని అద్దంలో చూడలేరు, ఇతరులతో పోల్చలేరు. మీ హృదయం ఎలా ఉందో పెద్ద పట్టింపు లేదు. కాబట్టి ఈ ఉత్పత్తులలో 'వానిటీ ఫ్యాక్టర్', అంటే గొప్పగా చూపించాలనే కోరిక కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను'' అని పాల్ కిటా వివరించారు.

వయసు పెరిగే కొద్దీ మహిళలు సహజంగానే కండరాల శక్తిని కోల్పోతుంటారు (సార్కోపెనియా). ఈ ప్రక్రియ మహిళలు, పురుషుల్లో కనిపిస్తుంది, కానీ మోనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ వేగంగా తగ్గిపోవడం వల్ల మహిళల్లో సార్కోపెనియా మరింత తీవ్రమవుతుంది.

హార్మోన్ల మార్పులు ఎముకల బలాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి కాబట్టి, మోనోపాజ్ తర్వాత మహిళలకు ఎముకల బలహీనత (ఆస్టియోపోరోసిస్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రోటీన్ సహాయపడవచ్చు, కానీ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల గణనీయమైన ప్రయోజనం లేదని 2019లో యూకేలోని సర్రే విశ్వవిద్యాలయం చేసిన 127 అధ్యయనాల విశ్లేషణలో తేలింది.

Super Market

ఫొటో సోర్స్, Getty Images

'హై-ప్రోటీన్' ఉత్పత్తులు తప్పు దారి పట్టిస్తున్నాయా?

అధిక ప్రోటీన్ (హై-ప్రోటీన్) ఉత్పత్తులు చాలామటుకు తప్పుదారి పట్టించేవిగా ఉంటాయని కన్జ్యూమర్ మార్కెట్ రీసర్చ్ కంపెనీ 'స్పిన్స్' (ఎస్‌పీఐఎన్‌ఎస్) సీనియర్ డైరెక్టర్ స్కాట్ డికెర్ అన్నారు.

''గతంలో అధిక కార్బోహైడ్రేట్ లేదా జంక్ ఫుడ్‌గా పరిగణించిన ఉత్పత్తులకు ఒక చెంచా ప్రోటీన్ పౌడర్ జోడించి, దాన్ని 'హెల్త్ ఫుడ్'గా ప్రదర్శించడం చాలా ఆసక్తికరంగా ఉంది'' అని డికెర్ వ్యాఖ్యానించారు.

డబ్బు కూడా దీనికొక ప్రధాన కారణం. ఇది కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉందని రుజువవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రోటీన్ పౌడర్ వినియోగం మార్కెట్ విలువ 2021లో 4.4 బిలియన్ డాలర్లు (ప్రస్తుత విలువ సుమారు రూ.38,612 కోట్లు) అని అంచనావేశారు. ఇది 2030 సంవత్సరం నాటికి 19.3 బిలియన్ డాలర్లు (ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ.1,69,357 కోట్లు)కు చేరుతుందని ఒక అంచనా.

ప్రతి పూట తీసుకునే భోజనంలో ప్రోటీన్ మొత్తాన్ని పెంచడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

'ప్రోటీన్ మాక్సింగ్' అనే సోషల్ మీడియా ట్రెండ్ కూడా ఈ చర్చకు ఆజ్యం పోస్తోంది.

High Protein Packs

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ ప్రోటీన్ తీసుకోవచ్చా?

ప్రోటీన్ సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్‌లో ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో మనం అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకునే అవకాశం ఉంది.

ఒక వ్యక్తికి ఎంత ప్రోటీన్ అవసరమో, ఆ వ్యక్తి వయస్సు, లింగం, శరీర పరిమాణం, చేసే వ్యాయామం బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్త అధిక ప్రోటీన్ ఉత్పత్తులు దుకాణాలకు నిరంతరం వస్తున్నాయని మెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కు చెందిన పాల్ కిటా గమనించారు. వాటి గురించి తెలుసుకోవడానికి, ఆ ప్యాకేజ్డ్ ఫుడ్‌ల ఆధారంగా మూడు వారాల పాటు డైట్ అనుసరించారు. అధిక ప్రోటీన్ కలిగిన ఓట్ మీల్, అధిక ప్రోటీన్ కలిగిన పెరుగు, అధిక ప్రోటీన్ కలిగిన మాకరోని-చీజ్, అధిక ప్రోటీన్ కలిగిన నీరు కూడా ఆయన డైట్‌లో ఉన్నాయి.

''వాటి రుచి చూసి నేను ఆశ్చర్యపోయాను'' అని కిటా చెప్పారు.

ఈ ఉత్పత్తుల రుచి చూస్తే చాలా తియ్యగా ఉన్నాయి. వాస్తవానికి, ప్రోటీన్ పౌడర్‌లో ఉండే అమైనో ఆమ్లాల చేదు రుచిని తగ్గించడానికి ఈ హై-ప్రోటీన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు చక్కెర అదనంగా జోడించారు.

చాలా ప్రోటీన్ తిన్న తర్వాత, దానితో ఏదైనా 'చేయాలి' అని తనకు అనిపించిందని కీటా చెప్పారు. ఫలితంగా, తన సాధారణ దినచర్య కన్నా అధికంగా వ్యాయామం చేయడం ప్రారంభించారు.

ఈ ప్రయోగానికి ముందు, తర్వాత తీసుకున్న తన శరీర కొలతల్ని గమనించారు. బరువు పెరగలేదు, కానీ ఛాతీ పరిమాణం కొద్దిగా పెరిగింది.

''బహుశా ఇది నేను ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, భారీగా బరువులు ఎత్తడం వల్ల కావచ్చు. సైన్స్ దీన్ని సమర్థిస్తుంది'' అని కీటా అన్నారు.

కానీ అది ప్రయోజనకరమని నిరూపితమైందా? అంటే, కీటా నవ్వుతూ, ''లేదు, ఈ ప్రయోగ కాలంలో నేను దాదాపుగా అన్ని సమయాల్లో అసంతృప్తి చెందాను'' అని కీటా చెప్పారు.

సమతుల్య ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

సమతుల్య ఆహారమే అవసరం...

అవసరానికి మించి ఎక్కువగా ప్రోటీన్ జీర్ణం కావడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా, జంతు సంబంధిత ప్రోటీన్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అప్పటికే మూత్రపిండాల సమస్యలతో ఉన్నవారికైతే, వారికి మరింత ముప్పు తెస్తుంది.

అధిక ప్రోటీన్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

బ్రిటిష్ డైటేటిక్ అసోసియేషన్ ప్రకారం, అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల వికారం వంటి దుష్ప్రభావాలు కూడా వస్తాయి.

ఈ ప్రోటీన్ సహజ వనరుల నుంచి పొందుతున్నారా లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ నుంచి తీసుకుంటున్నారా? అనేదీ ప్రజలు గమనించాలని నిపుణులు చెబుతున్నారు.

''మా స్థూల పోషకాల సిఫార్సులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు అనేవి మనకెంత అవసరమనే దానిపై ఆధారపడి ఉండవు'' అని డాక్టర్ బెకెట్ చెప్పారు.

మరీ ఎక్కువగా ప్రోటీన్ మీద మాత్రమే దృష్టిపెట్టడం వల్ల ఆరోగ్యానికి 'పెను ముప్పు' ఏర్పడుతుందని డాక్టర్ బెకెట్ హెచ్చరించారు.

ఫైబర్ సహా సంపూర్ణ పోషకాహారంపై దృష్టిపెట్టాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

''ఒకే రకమైన ఇంధనంతో పనిచేయడానికి మన శరీరాలు ఇంజిన్ లాంటివి కాదు. మన ఆరోగ్యం, మనుగడ కోసం వివిధ రకాల పోషకాలు అవసరం'' అని డాక్టర్ బెకెట్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)