చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సికా బ్రాడ్లీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
చాక్లెట్లు తినడం వల్ల ముఖంపై మచ్చలు లేదా మొటిమలు వస్తాయనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే, ఇందులో వాస్తవం ఉందా? లేదా పిల్లలు సూపర్ మార్కెట్లలో చాక్లెట్లు కొనకుండా ఉండేందుకు తల్లిదండ్రులు చెబుతున్న అబద్ధమా?
చాక్లెట్లు, మొటిమలకు మధ్య ఉన్న సంబంధంపై 1960ల్లో అనేక అధ్యయనాలు చేశారు. అప్పుడు చాక్లెట్లు తినడం వల్ల మొటిమలు వస్తాయనడానికి ఆధారాలు లేవని ఓ సర్వేలో తేలింది. అప్పట్లో నిర్వహించిన అతిపెద్ద సర్వే అదేనని చెబుతారు. ఆ సర్వే కోసం 65 మంది వలంటీర్లపై మాత్రమే పరిశోధనలు జరపడంతో ఆ పరిశోధన ఫలితాలపై చాలా విమర్శలు వచ్చాయి.

మొటిమలకు చాక్లెట్లు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు కానీ, ప్రధానంగా మనం తీసుకునే డైట్ వల్లే మొటిమలు వస్తున్నాయని ఇటీవలి కాలంలో నిర్వహించిన అనేక సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా కొవ్వులు, పాల ఉత్పత్తులు, చక్కెర శాతం స్థాయి ఎక్కువగా ఉండే పాశ్చాత్య డైట్ కారణంగా చెబుతున్నారు.
చర్మంపై ఉండే వెంట్రుక పొరలు ఆయిల్ కారణంగా లేదా మృతకణాల వల్ల మూసుకుపోతాయి. తద్వారా ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి. యుక్తవయసులో లేదా పెద్దవారిలో నిత్యం మొటిమలు రావడానికి గల ప్రధాన కారణం జన్యువులు అని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన క్లినికల్ లెక్చరర్, చర్మవ్యాధుల నిపుణులు బీబీ డు-హర్పూర్ చెప్పారు. చర్మం పొడిగా మారకుండా ఆయిల్‌ను ఉత్పత్తి చేసే గ్రంథుల పరిమాణం మన జన్యువులపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి కాలంలో మొటిమల సమస్యల గురించి ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొటిమలు రావడానికి కారణం ఫలానాది అని కచ్చితంగా చెప్పలేమని డు-హర్పూర్ చెప్పారు. మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా దానికి దోహదం చేస్తాయని ఆమె అన్నారు.
‘‘ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవనశైలి మానవ శరీరానికి అంత మంచిది కాదు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మన శరీరం ఇస్తున్న సంకేతమే మొటిమలు’’ అని ఆమె అన్నారు.
ఆధునిక జీవన శైలి, చక్కెరలు-కొవ్వులు ఎక్కవగా ఉండే పాశ్చాత్య డైట్ వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయని చాలా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, డైట్, ఒత్తిడి వంటి వాటిపై కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఒత్తిడి, పీఎమ్ఎస్, ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడటం వంటివి కూడా మొటిమలకు ఓ కారణమని లండన్‌లోని గైస్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్‌లో పని చేస్తున్న కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ జైనాబ్ లాఫ్తా చెప్పారు. ఈమె బ్రిటీష్ స్కిన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి కూడా.

ఫొటో సోర్స్, Getty Images
నిజమా.. అపోహా..?
మొటిమలు రావడానికి చాక్లెట్లు ఓ కారణమనే ప్రచారం మొదటిసారిగా 60 ఏళ్ల క్రితం వచ్చింది. 60 ఏళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ చాలా మంది చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయని నమ్ముతున్నారు. “మొటిమలు రాకుండా ఉండాలంటే ప్రధానంగా చాక్లెట్లు మానేయాలి కదా?” అనే ప్రశ్నను లాఫ్తా దగ్గరికి వచ్చే పది మంది రోగుల్లో 9 మంది అడుగుతున్నారట.
ఈ వాదనల్లో కొంచెం నిజం ఉంది, అలాగే కొంచెం అపోహా కూడా ఉందని ఆమె అన్నారు.
చర్మంపై మచ్చలకు జన్యుపరంగా, తీసుకునే డైట్‌లోని కొన్ని పదార్థాలు ప్రధాన కారణాలని లాఫ్తా చెప్పారు. చాలా మంది పాల ఉత్పత్తులు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారిలోనూ ఈ మొటిమలు అరుదుగా వస్తుంటాయని ఆమె చెప్పారు.
మొటిమలపై చాక్లెట్లలోని వివిధ పదార్థాల ప్రభావం ఏ మేరకు ఉందో చూడటానికి కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. కానీ, అవి కచ్చితమైన నిర్ధరణలు ఇవ్వలేకపోయాయి. అయితే, 100 శాతం ప్యూర్ డార్క్ చాక్లెట్ ప్రభావం మొటిమలపై ఎలా ఉంటుందోనని 2011లో ఓ అధ్యయనం చేశారు. చాక్లెట్‌లోని ప్రతి పదార్థం మొటిమలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశోధించారు. అందులో భాగంగా తీవ్రమైన మొటిమలు రావడానికి చాక్లెట్లు ఓ కారణమని తేలింది. అయితే, ఆ పరిశోధనల్లో భాగంగా కేవలం 10 మంది పైనే పరిశోధనలు చేశారు. ఓ పెద్ద గ్రూప్‌పై పరిశోధనలు చేయకపోవడంతో ఆ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మనం తీసుకున్న ఆహారం ఎంత త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందన్న దాని గురించి గ్లైసెమిక్ ఇండెక్స్- జీఐ సూచిస్తుంది. అధిక జీఐ ఉండే ఫుడ్స్ అంటే పండ్లు, బ్రెడ్, పాస్తా వంటివి మొటిమలకు కారణమవుతున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెంచే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చర్మంపై వాపులాగా ఏర్పడి, మొటిమలు వస్తాయని లాఫ్తా చెప్పారు. ఇలా చూస్తే మాత్రం చాక్లెట్లు అనేవి తక్కువ జీఐ కలిగిన ఫుడ్స్.
అధిక కొవ్వులు, చెక్కర నిల్వలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడుతున్నాయని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగా 2020లో సాధారణంగా తీసుకునే డైట్ మొటిమలకు ఎలా కారణం అవుతున్నాయన్న అంశంపై దాదాపు 24 వేల మందిపై పరిశోధనలు జరిపారు. అందులో భాగంగా పాశ్చాత్య ఆహారశైలి వల్ల మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పపువా న్యూ గినియాలోని కిటవాన్ ద్వీపంలో ఉంటున్న ప్రజల్లో మొటిమలు వచ్చిన సందర్భాలు లేవని ఓ సర్వేలో తేలింది. దాని కారణం వారు తక్కువ జీఐ కలిగిన ఫుడ్స్ తీసుకోవడమేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
జీవక్రియ సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది తెలియడానికి చర్మంపై వచ్చే మొటిమలు ఓ సంకేతమని జర్మనీలోని ఓస్నాబ్రక్ యూనివర్సిటీకి చెందిన చర్మవ్యాధుల ప్రొఫెసర్ బోడో మెల్నిక్ చెప్పారు. అంతేకాదు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు కూడా మొటిమలకు కారణమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మొటిమలు రావడానికి చాక్లెట్లతో సంబంధం లేదా..?
చాక్లెట్లలో చక్కెర అధికంగా ఉంటుంది గానీ అధిక కొవ్వులు ఉండవు. అలా అని, ఏ చాక్లెట్ తిన్నా ఏమి కాదనుకోవడానికి వీలులేదు. మనం ఏ రకమైన చాక్లెట్స్ తింటున్నామన్న దానిపై కూడా ఈ అంశంపై ఆధారపడి ఉంటుంది.
చర్మంపై వాపును కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని డార్క్ చాక్లెట్లు తగ్గిస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది.
అయితే, మొటిమలు తీవ్రతను తగ్గించుకునేందుకు కంటే వయసు కనపడకుండా ఉండేందుకు డార్క్ చాక్లెట్లు తినడం ఉత్తమం.
కొన్ని రకాల సహజ ఉత్పత్తులు డార్క్ చాక్లెట్లలో ఉండటం వల్ల దీనిని తినడం ద్వారా చర్మానికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని లాఫ్తాన్ చెప్పారు. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు. ఇవి చర్మంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా చర్మంలో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయని లాఫ్తాన్ చెప్పారు.
తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలు, తక్కువ పోషక విలువలు ఉంటే చర్మంపైనే కాదు మొత్తం శరీరంపై అక్కడక్కడ వాపు ఏర్పడుతుంది. ఈ రకమైన మొటిమలు ఇదివరకే జన్యుపరంగా ఇబ్బందిపడుతున్నవారిలో కనిపించవచ్చని డు-హర్పూర్ అన్నారు.
ఆహారంలో అధికంగా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి తీసుకుంటే మన చర్మం ఒక్కటే అని కాదు గుండె, మెదడు వంటి అవయవాలకు మంచిదని డు-హర్పూర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














