ఎవరీ అనుర కుమార దిసనాయకే? 3 శాతం ఓట్ల నుంచి శ్రీలంక అధ్యక్ష పీఠం వరకు

Anura Kumara Dissanayake

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అనుర కుమార దిసనాయకే అందరి దృష్టినీ ఆకర్షించారు.

గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లకే పరిమితమైన ఈయన, ఈసారి ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

అసలు ఎవరీ అనుర కుమార దిసనాయకే? ఏమిటి ఈయన నేపథ్యం?

అనుర కుమార దిసనాయకే 1968 నవంబర్ 24న అనురాధపురం జిల్లాలోని తంబుతెగామ ప్రాంతంలో జన్మించారు.

తంబుతెగామ కామినీ మహా విద్యాలయం, తంబుతెగామ సెంట్రల్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత పెరదేనియా యూనివర్సిటీలో చేరారు.

అనుర కుమారకు చదువుకునే రోజుల నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది.

ఈయన 19 ఏళ్ల వయసులో, శ్రీలంకలోని వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమునె(జేవీపీ)లో చేరారు.

అనంతరం పెరదేనియా యూనివర్సిటీ నుంచి బయటికొచ్చేసి, కెళని యూనివర్సిటీలో చేరారు.

1995లో, జేవీపీ ఈయన్ను సోషలిస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజర్‌‌గా నియమించింది. ఆ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పించింది.

2000లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు
అనుర కుమార దిసనాయకే

ఫొటో సోర్స్, Getty Images

2004 పార్లమెంట్ ఎన్నికల్లో జేవీపీ, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ కలిసి పోటీ చేశాయి.

ఆ ఎన్నికల్లో పార్టీకి 39 సీట్లు వచ్చాయి. కురునాగల జిల్లా నుంచి అనుర కుమార దిసనాయకే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల అనంతరం శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, జేవీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం, పశుసంవర్థక, భూములు, నీటిపారుదల శాఖలకు మంత్రిగా అనుర కుమార బాధ్యతలు చేపట్టారు.

అయితే, సునామీ తర్వాత శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఎల్టీటీఈతో కలిసి సహాయ చర్యలు చేపట్టాలని చంద్రిక కుమారతుంగ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జేవీపీ వ్యతిరేకించింది.

మంత్రులంతా రాజీనామా చేశారు. ఆ సమయంలో అనుర కుమార కూడా రాజీనామా చేశారు.

అనుర

ఫొటో సోర్స్, Getty Images

గత ఎన్నికల్లో మూడో స్థానం

2014లో జరిగిన జాతీయ సదస్సులో జేవీపీ కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార ఎన్నికయ్యారు.

అనంతరం, 2019లో జనతా విముక్తి పెరమునె నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) కూటమి ఏర్పాటైంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్‌పీపీ కూటమి అభ్యర్థిగా అనుర కుమార దిసనాయకే తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కేవలం 3 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

2019 అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స ఎన్నికైన తర్వాత, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అనుర కుమార గళం విప్పారు. దీంతో ఆయనకు క్రమంగా మద్దతు పెరుగుతూ వచ్చింది. ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన నిరసనల్లో అనుర కుమార ముందువరసలో ఉన్నారు.

అదే సమయంలో, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుర కుమార దిసనాయకే ప్రకటించారు. ఆయనకు యూనివర్సిటీల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి.

హింసాత్మక చరిత్రకు క్షమాపణ

గతంతో పోలిస్తే అనుర కుమార దిసనాయకే ఎన్నికల ప్రచార సభలు కిక్కిరిసిపోయాయి. గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లు సాధించిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించగలిగారు.

ప్రస్తుతం ఆయన ఎన్‌పీపీ కూటమి తరఫున పోటీ చేసినప్పటికీ, ఆయన సారథ్యం వహిస్తున్న జేవీపీకి హింసాత్మక చరిత్ర ఉంది.

1971లో బండారునాయకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేవీపీ చేసిన తిరుగుబాటులో వేలాది మంది చనిపోయారు.

1987 - 89 మధ్య జరిగిన భారత్ - శ్రీలంక శాంతి ఒప్పందాన్ని జేవీపీ వ్యతిరేకించింది. అప్పుడు జరిగిన అల్లర్లలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, 2014లో జేవీపీ అధ్యక్షుడైన తర్వాత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన హింసకు అనుర కుమార క్షమాపణలు చెప్పారు. శ్రీలంకలో జరిగిన హింసకు ఓ పార్టీ క్షమాపణలు చెప్పడం అదే తొలిసారి, చివరిసారి కూడా.

2019లో అనుర కుమార దిసనాయకే అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

తమిళుల సమస్యపై దిసనాయకే వైఖరి ఏమిటి?

భారత్ - శ్రీలంక ఒప్పందాన్ని అనుసరిస్తూ, ప్రావిన్సులకు అదనపు అధికారాలు కల్పించేందుకు వీలుగా శ్రీలంక రాజ్యాంగానికి సవరణ చేశారు.

ఈ సవరణతో భూమి, పోలీస్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రావిన్షియల్ కౌన్సిల్స్‌కు అదనపు అధికారాలు వస్తాయి. కానీ, ఇప్పటి వరకూ ప్రావిన్షియల్ కౌన్సిల్స్‌కు అలాంటి అదనపు అధికారాలేవీ ఇవ్వలేదు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించిన అనుర కుమార జాఫ్నాలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ''13వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తా. నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడకు రాలేదు. సమాఖ్య విధానం అందిస్తా. నాకు ఓటేయమని అడగడానికి ఇక్కడకు రాలేదు'' అన్నారు. ఇది తమిళ వర్గాల్లో నిరాశ కలిగించింది.

అయితే, ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ అనుర కుమార తన పంథా కాస్త మార్చుకున్నారు.

జూన్‌లో మరోసారి జాఫ్నా వెళ్లిన అనుర తమిళ రాజకీయ నేతలను కలిశారు. వారితో సమావేశం అనంతరం మాట్లాడుతూ, ప్రావిన్షియల్ కౌన్సిల్స్ యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు.

అయితే, ప్రావిన్షియల్ కౌన్సిల్స్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వడం గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇక జేవీపీ విషయానికొస్తే, అధికార విభజనను ఆ పార్టీ చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది.

మరి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.

ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

అదానీ ప్రాజెక్టుపై వ్యతిరేకత

ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూస్తే భారత్, చైనా రెండూ శ్రీలంకకు కీలకం.

ఈ రెండు దేశాలూ శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి. వామపక్ష భావజాల పార్టీ కావడంతో సహజంగానే జేవీపీ చైనాకు సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ప్రావిన్సులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా - శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఇప్పటికే వ్యతిరేకిస్తోంది.

సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చలో అనుర మాట్లాడుతూ, అదానీ గ్రూప్ విండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామన్నారు.

శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని అనుర చెప్పారు.

అలాగే, ఈ ప్రాంతంలోని ఏ వ్యవస్థతోనూ విరోధం ఉండదని కూడా ఆ పార్టీ చెబుతూ వస్తోంది. అనుర భారత్‌లోనూ పర్యటించారు. అయితే రానున్న రోజుల్లో భారత్‌ విషయంలో ఈయన వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)