శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే విజయం

ఫొటో సోర్స్, x.com/anuradisanayake
- రచయిత, జోయెల్ గుంటో
- హోదా, బీబీసీ న్యూస్
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ అధ్యక్షుడైన అనుర కుమార, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి శ్రీలంక అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అనుర కుమార దిసనాయకే సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
‘‘శతాబ్దాలుగా మనం కన్న కల ఇప్పుడు సాకారమవుతోంది. ఇది ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. లక్షల మంది సమిష్టి కృషి ఫలితం. మీ నిబద్ధతే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మీకు చాలా రుణపడి ఉంటాను. ఈ గెలుపు మీ అందరిదీ.
ఈ గెలుపు కోసం ఎంతో మంది తమ రక్తాన్ని, కన్నీళ్లను, ప్రాణాలను త్యాగం చేశారు. లక్షల మంది తమలో నింపుకున్న ఆశలను, అంచనాలను మేం ముందుకు తీసుకెళ్తాం. మనమందరం కలిసి శ్రీలంక చరిత్రను తిరగరాద్దాం. రండి, అందరం చేతులు కలిపి మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుందాం..!’’ అంటూ అనుర కుమార దిసనాయకే సోషల్ మీడియాలో రాశారు.

ఫొటో సోర్స్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ ఒక్క అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి రావడం ఇదే మొదటిసారి.
శనివారం 1.7 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు శ్రీలంక ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. దేశ చరిత్రలోనే ఇవి అత్యంత శాంతియుత ఎన్నికలని అభివర్ణించింది. ఆదివారం ఓట్లను లెక్కించారు.
గత కొన్నేళ్లుగా శ్రీలంక అత్యంత దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2022లో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. దీంతో అప్పటి దేశాధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశాన్ని విడిచి పారిపోయారు.
అప్పటినుంచి దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే.
కఠినమైన అవినీతి నిరోధక ప్రమాణాలను పాటిస్తామని, మంచి పాలనను అందిస్తామని ప్రజలకు అనుర కుమార హామీ ఇచ్చారు. దేశంలో సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి వ్యవస్థాగత మార్పుల కోసం డిమాండ్ చేస్తోన్న ఓటర్లలోకి ఆయన హామీలు బలంగా చొచ్చుకెళ్లాయి.

ఫొటో సోర్స్, EPA
ఫలితం రాకముందు నుంచే అభినందనలు..
విజయానికి సరిపడా ఓట్లు రాకముందే దిసనాయకేకు అభినందన సందేశాలు వచ్చాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థులైన విక్రమసింఘే, ప్రేమదాస మద్దతుదారులు ఈ అభినందన సందేశాలు పంపించారు.
ప్రారంభ ఫలితాలు స్పష్టంగా దిసనాయకే విజయాన్ని సూచిస్తున్నాయని విదేశాంగ మంత్రి అలీ సాబ్రీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోసం నేను భారీగా ప్రచారం చేశాను. కానీ, శ్రీలంక ప్రజలు ఎవరిని గెలిపించాలో నిర్ణయించుకున్నారు. అనుర కుమార దిసనాయకే పట్ల వారి నిర్ణయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అభినందనలు తెలపడానికి దిసనాయకేకు ఫోన్ చేశానని ప్రేమదాసకు మద్దతుగా నిలిచిన ఎంపీ హర్ష డిసిల్వా చెప్పారు.
‘‘ప్రేమదాస కోసం తీవ్రంగా ప్రచారం చేశాం. కానీ, మేం అనుకున్నట్లు జరగలేదు. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరో స్పష్టంగా తేలింది. శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే’’ అని డిసిల్వా ట్వీట్ చేశారు.
జాతి, మతం వంటి అంశాలపై ఆధారపడకుండా దిసనాయకే మంచి విజయాన్ని సాధించారని ప్రేమదాస మరో మద్దతుదారు, తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) అధికార ప్రతినిధి ఎంఏ సుమంథిరన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మాంద్యం
కొత్త దేశాధ్యక్షుడి ముందు దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయడం అనే సవాళ్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
దేశంలో పెచ్చరిల్లిన ఆర్థిక మాంద్యం తిరుగుబాటుకు దారి తీసింది. ఆ సమయంలో శ్రీలంక విదేశీ నిల్వలు అడుగంటాయి. ఫలితంగా చమురు వంటి నిత్యావసరాలను కూడా దేశం దిగుమతి చేసుకోలేకపోయింది. ద్రవ్యోల్బణం 70 శాతం పెరిగింది.
ఆహారం, ఔషధాలు వంటి ప్రాథమిక వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
కీలక విధాన లోపాలు, ఎగుమతులు లేకపోవడం, ఏళ్ల తరబడి తక్కువ పన్నులు విధింపు వంటివి దేశ దుస్థితికి కారణాలుగా నిలిచాయి.
కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన టూరిజం దెబ్బతిన్నది.
అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ఈ పరిస్థితికి కారణమంటూ చాలామంది ఆరోపించారు. ఇదే ప్రజల్లో రాజపక్ష, ఆయన కుటుంబంపై ఆగ్రహాన్ని పెంచింది. రాజపక్ష కుటుంబీకులు 10 ఏళ్లకు పైగా శ్రీలంకను పాలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














