తిరుమల లడ్డూ: కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ ఎవరిది? టీటీడీకి ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేస్తోంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రక్రియ చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
ఈ విషయాన్ని సెప్టెంబరు 20వ తేదీన ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో ‘జంతువుల కొవ్వు’ కలిసిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో కుదిపేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు.
‘‘టీటీడీకి నెయ్యి సరఫరాదారులు అయిదుగురు (సంస్థలు) ఉన్నారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్, కృపరామ్ డెయిరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డెయిరీ.
వారు కిలో నెయ్యి రూ. 320 నుంచి రూ. 411 ధరకు సరఫరా చేస్తున్నారు. ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు’’ అని ఆయన చెప్పారు.
ఇందులో తక్కువ రేటుకు అంటే కిలో నెయ్యి రూ.320 చొప్పున సరఫరా చేసేందుకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ టెండరు దక్కించుకుంది.
ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడంపై అనుమానాలు వచ్చాయని, దాంతో ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ పంపిన నెయ్యి శాంపిల్స్ టెస్టులు చేయించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.
ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి రాగా, అందులో ఆరు ఉపయోగించామని, నాలుగు ట్యాంకర్ల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించగా అందులో కల్తీ జరిగినట్లు రిపోర్టు వచ్చిందని శ్యామలరావు అన్నారు.

ఫొటో సోర్స్, RAJESH
‘‘జులై 6, జులై 12 తేదీల్లో రెండేసి ట్యాంకర్లకు సంబంధించిన నాలుగు శాంపిల్స్ పంపించాం. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయించాం.
ఎన్‌డీడీబీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ల్యాబ్‌కు మంచి పేరుంది. వేరే దేశాలకు ఎగుమతి విషయంలోనూ ఈ ల్యాబ్ నుంచే నిర్ధరణ సర్టిఫికెట్లు తీసుకుంటారు.
ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. స్వచ్ఛమైన నెయ్యిలో మిల్క్ ఫ్యాట్ అనేది ఓవరాల్‌గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. కానీ 20.32 మాత్రమే ఉంది.దీన్నిబట్టి ఇది పూర్తిగా కల్తీ మయమైంది. మిగిలిన ‘ఎస్’ విలువల్లో కూడా నిర్దేశిత స్థాయిలో కాకుండా వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. దీని ప్రకారం వెజిటేబుల్ ఆయిల్స్, జంతువుల కొవ్వు కలిసినట్లు అర్థమవుతోంది" అని శ్యామలరావు చెప్పారు.
వెంటనే సరఫరా నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టే విధానం ప్రారంభించామని, అపరాధ రుసుము విధించే ప్రక్రియ ప్రారంభించామని ఈవో చెప్పారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు.
అయితే, తమ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు టీటీడీ నుంచి తమకు సమాచారం రాలేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ వార్తా సంస్థ పీటీఐతో చెప్పింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా విషయంపై 2024 మార్చి 12న పిలిచిన టెండర్‌లో ఈ సంస్థ పాల్గొంది. మే 8న టెండరు ఖరారు అయ్యింది.
మే 15న నెయ్యి సరఫరా ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, raajmilk.com
ఏఆర్ డెయిరీ ఎక్కడిది?
ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమిళనాడుకు చెందినది.
దీని వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇది 1995లో ఏర్పాటైంది.
దిండిగల్ ప్రాంతంలో ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజ్ మిల్క్ బ్రాండ్ పేరిట ఉత్పత్తులను విక్రయిస్తోంది. కేరళలో మాత్రం మలబార్ పేరిట తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈ కంపెనీ కార్పొరేట్ స్టోర్స్ ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మంలో శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టోర్ ఉన్నట్లు ఏఆర్ డెయిరీ కంపెనీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
తమిళనాడులోని చెన్నైలో శరవణ స్టోర్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరళ కంచిరప్పల్లలో మలనాడు డెయిరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్, తిరువనంతపురంలో తిరువనంతపురం డెయిరీ, త్రిసూర్‌లో కేఎస్ఈ లిమిటెడ్, పుదుచ్చేరిలో పుదుచ్చేరి కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్‌తో కలిసి తన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతోంది ఈ కంపెనీ.

ఫొటో సోర్స్, ANI
కంపెనీ డైరెక్టర్లు ఎవరు?
రోజుకు 3.50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ప్లాంటును తమిళనాడులో ఏర్పాటు చేయగా ప్రస్తుతం 2.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో నడుస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
ఈ కంపెనీకి రాజు రాజశేఖరన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజశేఖరన్ సూర్యప్రభ, శ్రీనివాసులు నాయుడు రామచంద్రన్ శ్రీనివాస్ డైరెక్టర్లుగా ఉన్నారు.
వీరిలో రాజు రాజశేఖరన్ 1995 నుంచి కంపెనీలో ఉండగా, మిగిలిన ఇద్దరిలో 2006 నుంచి రాజశేఖరన్ సూర్యప్రభ, 1996 నుంచి రామచంద్రన్ శ్రీనివాసన్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు.
రాజు రాజశేఖరన్, శ్రీనివాసులు నాయుడు రామచంద్రన్ శ్రీనివాసన్ కలిసి బాలాజీ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌లో డైరెక్టర్లుగా ఉన్నారు.
ఈ కంపెనీ మూత పడినట్లు కోయంబత్తూరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం తెలుస్తోంది.
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం కంపెనీ వివరాలు అందుబాటులో లేవు.
1999 నుంచి 2022 వరకు.. రోజుకు 1,000 లీటర్ల నుంచి 1.70 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యానికి చేరుకున్నట్లు కంపెనీ చెబుతోంది.
ఇందులో రోజుకు 1000 కేజీల నెయ్యి సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది.
దాదాపు రెండు లక్షలకుపైగా వినియోగదారులున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రాశారు.
తమిళనాడులోని 13 జిల్లాల నుంచి ఏడు వేల మందికిపైగా రైతుల నుంచి రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కల్తీ నెయ్యి ఆరోపణలపై ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ స్పందన ఏంటి?
ఈ వివాదంపై ఏఆర్ డెయిరీ ఫుడ్ నాణ్యత ప్రమాణాల తనిఖీ ఇన్‌చార్జి లెనీ, వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
‘‘మేం జూన్, జులై నెలల్లో ఏఆర్ డెయిరీ ఫుడ్ పేరుతో నిరంతరాయంగా నెయ్యి సరఫరా చేశాం. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడం లేదు. నెయ్యి ఉత్పత్తిలో మా కంపెనీకి 25 ఏళ్ల అనుభవం ఉంది. నాణ్యతకు సంబంధించి ఈ తరహా ఫిర్యాదులు ఇంతకుముందెప్పుడూ రాలేదు’’ అని లెనీ చెప్పారు.
కంపెనీ మరో ప్రతినిధి కణ్ణన్ మాట్లాడారు. ‘‘ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు నమూనాలు తీసుకుని వెళ్లారు. అలాగే మా నమూనాలను టీటీడీకి కూడా పంపించాం. ల్యాబ్‌లో పరీక్షించి ఎలాంటి అవకతవకలు లేవని గుర్తించింది. ప్రస్తుతం వచ్చిన వదంతులన్నీ జూన్, జులైలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి గురించి. ఆ సమయంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్, అగ్‌మార్క్ అధికారులు వచ్చి శాంపిల్స్ తీసుకుని ఎలాంటి సమస్య లేదని చెప్పారు. మా నెయ్యి స్వచ్ఛమైనది. ఎవరైనా వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లి తమకు నచ్చిన ల్యాబ్‌లో పరీక్షించుకోవచ్చు’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టుల్లో ఎక్కడా కూడా ఏఆర్ డెయిరీకి సంబంధించిన శాంపిల్స్ నివేదికలు అని లేదు. రిపోర్టులో కూడా తప్పుడు పాజిటివ్ నివేదికలు రావొచ్చని కూడా ఉంది. నెయ్యి సరఫరాదారులను టీటీడీ మార్చడం వల్ల, మేం జులై తర్వాత నెయ్యిని టీటీడీకి సరఫరా చేయలేదు. ఆవుకు ఇచ్చే మేత సహా ఎన్నో కారణాలతో ఫారిన్ ఫ్యాట్ (ఇతర కొవ్వు పదార్థాలు) నెయ్యిలో ఉండేందుకు అవకాశం ఉంది’’ అని ఏఆర్ డెయిరీ ఫుడ్ నాణ్యత ప్రమాణాల తనిఖీ ఇన్‌ఛార్జి చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలపై ఏఆర్ డెయిరీ ఫుడ్ కంపెనీని బీబీసీ ఈమెయిల్ ద్వారా సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సింది ఉంది.
ఏఆర్ డెయిరీ ఫుడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ రాజశేఖరన్, తమిళనాడులో మరో ప్రముఖ దేవస్థానం ట్రస్టు సభ్యుడిగా ఉన్నట్లు తమిళనాడు బీజేపీ ‘ఎక్స్’లో తెలిపింది.

పళనిలోని అరుల్ మిగు దండయుతపాణిస్వామి టెంపుల్ ట్రస్టు సభ్యుడిగా రాజశేఖరన్ ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
రాజశేఖరన్ 2022 నుంచి ఈ ట్రస్టు సభ్యుడిగా ఉన్నారని బీజేపీ తమిళనాడు ఇండస్ట్రియల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సెల్వకుమార్ ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.
పళని టెంపుల్ ప్రసాదానికి కూడా ఏఆర్ డెయిరీ ఫుడ్ నెయ్యి వాడుతున్నారని సెల్వకుమార్ ఆరోపించారు.
ఈ ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. పళని ఆలయంలో ప్రసాదం తయారీకి ఏఆర్ డెయిరీ ఫుడ్ నెయ్యి వాడటం లేదని, ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














